GHMC (Greater Hyderabad Municipal Corporation)
-
GHMCలో ఎమ్మెల్యేలు Vs కార్పొరేటర్లు
-
ఫుట్ పాత్ ఆక్రమించిన ఎంపీ సీఎం రమేష్
-
హైదరాబాద్‌లో బరితెగించిన సీఎం రమేష్ అనుచరులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనుచరులు బరితెగించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 66లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అక్రమ నిర్మాణానికి పాల్పడ్డాడు. అక్రమంగా నిర్మించిన ఇంటిని జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని సీఎం రమేష్ అనుచరులు అడ్డుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే సీఎం రమేష్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఇప్పటికే కొంత భాగాన్ని కూల్చిన జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు సాయంతో మిగిలిన అక్రమ నిర్మాణాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చదవండి: (Revenue Deficit: రూ.9,871 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం) -
మమత బదిలీ.. మరునాడే నిలిపివేత!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత బదిలీని మున్సిపల్ పరిపాలన శాఖ ఒక్కరోజులోనే నిలిపివేసింది. ఆమెను ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వకార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెతోపాటు మరో నలుగురు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్/అదనపు కమిషనర్లను కూడా బదిలీ చేశారు. అయితే విధుల్లో చేరకముందే బుధవారం సాయంత్రానికల్లా మమత బదిలీని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా బదిలీ అయిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజను తాజాగా ఎల్.బి.నగర్‌కు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న స్పెషల్, సెలక్షన్ గ్రేడ్, అదనపు డైరెక్టర్, అదనపు కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నగర శివారు జోన్ల కమిషనర్లను తొలుత బదిలీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను ఖైరతాబాద్‌కు, ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకను శేరిలింగంపల్లికి బదిలీ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీచేశారు. త్వరలోనే మరిన్ని బదిలీలు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, ఏ గ్రేడ్ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్ల పనితీరు ఆధారంగా త్వరలో బదిలీల ప్రక్రియ సాగనుందని సమాచారం. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సత్సంబంధాలు కొనసాగించనివారిపై కూడా బదిలీ వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు శివార్లలో కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా స్థానభ్రంశం చెందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం సర్కారుకు ఫైల్ పంపించినట్లు సమాచారం. -
జీహెచ్ఎంసీకి పీఆర్సీ కష్టాలు, ప్రభుత్వం ఆదుకోవాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ వేదికగా సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్ జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వరంలా కనిపించగా, ఖజానాకు మాత్రం కాస్త భారంగా మారింది. రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపుపై సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి మోదం..ఖేదం అంటూ రెండు రకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. 30 శాతం ఫిట్మెంట్ వల్ల జీహెచ్ఎంసీలోని దాదాపు ఆరువేల మంది రెగ్యులర్ ఉద్యోగులకు, మరో ఏడువేల మంది పెన్షనర్లకు వేతనాలు పెరగనున్నాయి. వీరితోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులకు సైతం వేతనాలు పెంచుతామని సీఎం హామీ ఇవ్వడంతో వారివీ పెరగ్గలవని భావిస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాపై భారం పడనుంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం అందరికీ వెరసి నెలకు దాదాపు రూ.120 కోట్లు వేతనాల కింద చెల్లిస్తున్నారు. ఇలా సంవత్సరానికి దాదాపు రూ.1440 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. సీఎం ప్రకటించిన ఫిట్‌మెంట్‌ను వర్తింపచేస్తే నెలకు దాదాపు రూ.36 కోట్ల వంతున సంవత్సరానికి రూ.432 కోట్లు అదనపు భారం పడుతుంది. వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే జీహెచ్ఎంసీ ఉద్యోగులకు కూడా పెరిగే వేతనాలు వర్తింపచేయాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ ఖజానా నుంచే వాటిని చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ వివిధ ప్రాజెక్టులను నెత్తికెత్తుకోవడంతో ఇప్పటికే ప్రతినెలా వేతనాల చెల్లింపులకు తిప్పలు పడుతోంది. గతంలో మొదటివారంలోనే వీటిని చెల్లించేవారు. ప్రస్తుతం నెలాఖరు వరకు జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం కేంద్రం నుంచి ఆర్థిక సంఘం నిధులు రూ.38 కోట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి మరో రూ.38 కోట్లు ప్రతినెలా అందుతున్నందున వేతనాలు చెల్లించగలుగుతున్నారు. వేతనాలు పెరగనున్నందున అందుకనుగుణంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం పెరగనిదే కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ వర్తింపు.. జీహెచ్ఎంసీ స్థానికసంస్థ అయినా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీహెచ్ఎంసీ ఉద్యోగులకూ పీఆర్సీ వర్తింపు ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఫిట్మెంట్ కనుగుణంగా పెరిగే జీతాలు చెల్లించేందుకు స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సమాచారమివ్వడం సంప్రదాయం మాత్రమేనని పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో , ఈనెలాఖరున రిటైర్ కావాల్సిన వారు జీహెచ్ఎంసీలో 17 మంది ఉన్నారు. ఈసంవత్సరాంతానికి రిటైర్ కావాల్సిన వారు 236 మంది ఉన్నారు. రిటైర్మెంట్ వయసు పెంపు వల్ల రానున్న మూడేళ్లలో రిటైర్ కానున్న 858 మందికి లబ్ధి కలిగిందని జీహెచ్ఎంసీ పేర్కొంది. రిటైర్మెంట్ వయసు పెంపుపై జీహెచ్ఎంసీలో కొందరు హర్షం వ్యక్తం చేయగా,కొందరు ఎక్కువకాలం పనిచేయాలని తమకు లేదని పెదవి విరిచారు. వేతనాలు, రిటైర్మెంట్ వయసుపెంపుపై మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వోద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచి సీఎం తన పెద్ద మనసు చాటుకున్నారని కొనియాడారు. మేయర్, తదితరులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. చదవండి: హెచ్ఆర్ఏ తగ్గిస్తే..తగ్గనున్న వేతనాలు -
తెలంగాణలో చాప కింద నీరులా కరోనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటు దేశంలో కరోనా ఉధృతి అధికమైంది. అటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజల్లో నిర్లక్ష్యం ఫలితంగా తెలంగాణలోనూ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఆరు రోజుల వ్యవధితో పోలిస్తే ఇప్పుడు 26 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కొన్నిచోట్ల స్వల్పంగా, కొన్నిచోట్ల కాస్తంత ఎక్కువగానే నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో ఈ నెల 8వ తేదీన 31 కరోనా కేసులుండగా, శనివారం 46 నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8వ తేదీన 10 కేసులుంటే, శనివారం 15 కేసులకు పెరిగాయి. కాగా శనివారం 50,998 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 228 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు ఆదివారం ఉదయం బులెటిన్‌లో వెల్లడించారు. మొత్తం ఇప్పటివరకు 92,00,465 నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,01,161 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో శనివారం 152 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2,97,515 మంది కోలుకున్నారు. ఈ ఒక్కరోజులో ఒకరు చనిపోగా, మొత్తం కరోనాతో 1,653 మంది మృతి చెందారు. 367 మంది వెంటిలేటర్‌పై.. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 1,993 కరోనా యాక్టివ్ కేసులుండగా, అందులో ఇళ్లు, కోవిడ్ కేర్ కేంద్రాల్లో 795 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.78 శాతం ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ఇప్పటివరకు ప్రతీ పది లక్షల జనాభాలో 2,47,191 మందికి పరీక్షలు చేశారు. శనివారం నిర్వహించిన 50,998 కరోనా పరీక్షల్లో 46,067 ప్రభుత్వంలో.. 4,931 ప్రైవేట్‌లో చేశారు. ఆదివారం లెక్కల ప్రకారం రాష్ట్రంలోని కరోనా రోగుల్లో 590 మంది ఆక్సిజన్ పడకలపై, 367 మంది వెంటిలేటర్/ఐసీయూ పడకలపై చికిత్స పొందుతున్నారు. 2.15 లక్షల మందికి వ్యాక్సిన్.. రాష్ట్రంలో శనివారం నాటికి 60 ఏళ్లు పైబడినవారు, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కలసి మొత్తం 2,15,980 మంది టీకా వేయించుకున్నారని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇక జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటి డోస్ టీకా తీసుకున్నవారు 5,27,117 మంది కాగా, రెండో డోస్ టీకా తీసుకున్నవారు 2,22,080 మంది ఉన్నారు. అంటే మొత్తం మొదటి, రెండో డోస్ టీకాల సంఖ్య 7,49,197కు చేరింది. ఇక శనివారం 60 ఏళ్లు పైబడిన 10,539 మందికి, 45–59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో 7,793 మందికి మొదటి డోస్ టీకా ఇచ్చారు. ఇటు 753 మంది వైద్య సిబ్బంది, 474 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కూడా శనివారం మొదటి డోస్ టీకా ఇచ్చారు. అలాగే ఈ ఒక్కరోజులో 165 మంది వైద్య సిబ్బందికి, 2,693 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోస్ టీకా వేశారు. ఇలా ఒక్కరోజులో మొదటి, రెండో డోస్ టీకా పొందినవారు 22,417 మంది ఉన్నారు. -
సగం ఆస్తి పన్ను మాఫీ
సాక్షి, హైదరాబాద్ : గృహ యజమానులు, వరద బాధితులు, జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బందికి పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు దీపావళి రోజు పండుగ కానుకలు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో రూ.15 వేలలోపు వార్షిక ఆస్తిపన్ను ఉన్న ఇళ్ల యజమానులకు 2020–21 సంవత్సరానికి సంబంధించి 50 శాతం ఆస్తిపన్ను మాఫీ చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని మిగిలిన 140 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో సైతం రూ.10 వేలలోపు ఆస్తిపన్ను ఉన్న వారికీ ఆస్తిపన్నులో 50 శాతం మాఫీ చేస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో 13.72 లక్షల ఇళ్ల యజమానులకు రూ.196.48 కోట్లు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో 31.40 లక్షల ఇళ్ల యజమానులకు రూ.326.48 కోట్ల రాయితీ లభిస్తుందన్నారు. ఇప్పటికే 2020–21కి సంబంధించిన ఆస్తిపన్నులను చెల్లించిన వారికి సైతం ఈ మాఫీ వర్తిస్తుందని, వచ్చే ఏడాది (2021–22)కి సంబంధించిన వీరి ఆస్తిపన్నులను ఆ మేరకు సర్దుబాటు చేస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో మంత్రి కేటీఆర్ శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, దీనికి తోడు ఇటీవల భారీ వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీతో పాటు చుట్టుపక్కలున్న 15 పురపాలికల ప్రజలు సర్వం కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నారని, వారి కోసం ఇంకేమైనా చేస్తే బాగుంటుందని గత శుక్రవారం జరి గిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోమంత్రులందరూ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో శనివారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై ఈ మేరకు ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కాగా, మంత్రి కేటీఆర్ ప్రకటన మేరకు 50 శాతం ఆస్తిపన్నును మాఫీచేస్తూ అదేరోజు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. మాఫీచేసిన ఆస్తిపన్నును సంబంధిత పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మీ–సేవ ద్వారా ‘వరద సాయం’ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మోకాల్లోతు నీళ్లున్న ముంపు కాలనీల్లో పర్యటించి ప్రజలకు అండగా నిలిచారని, ఎవరూ అడగక ముందే మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించడానికి రూ.530 కోట్లను విడుదల చేశారని గుర్తుచేశారు. శనివారం నాటికి 4,75,871 కుటుంబాలకు రూ.475 కోట్ల సహాయం పంపిణీ చేశామన్నారు. ఇంకా ప్రభుత్వ సహాయం అందని బాధిత కుటుంబాలు మీ–సేవ కేంద్రాల ద్వారా సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులపై విచారణ జరిపి అర్హుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జమ చేస్తామన్నారు. పేరు, ఇంటి నంబర్, ప్రాంతం, మొబైల్, ఆధార్ నంబర్, పిన్‌కోడ్, బ్యాంకు ఖాతా నంబర్ వివరాలను దరఖాస్తుతో పాటు అందజేస్తే సరిపోతుందన్నారు. ఈ మేరకు మీ–సేవ కేంద్రాల ద్వారా వరద బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అర్హుల బ్యాంకు ఖాతాల్లో సహాయాన్ని జమ చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ప్రత్యేక మెమో జారీచేశారు. గ్రేటర్ పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు పెంపు జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది వేతనాలను రూ.14 వేల నుంచి రూ.17 వేలకు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు/ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలను రూ.14,500 నుంచి రూ.17,500కు పెంచుతున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీపావళి కానుకగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా వచ్చినా పారిశుధ్య, వైద్య సిబ్బంది ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు వేతనాలను పెంచుతూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు ఈపీఎఫ్, ఈఎస్ఐ కలిపి రూ.3 వేల పెంపు వర్తిస్తుందన్నారు. ఫిబ్రవరి 10 వరకు టైం ఉంది.. ‘తొందరేం ఉంది.. ఫిబ్రవరి 10 వరకు మాకు టైం ఉంది.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం.. మీరెందుకు తొందర పడుతున్నారు’అని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలను ప్రకటించడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయని ఊహాగానాలున్న సమయంలో మంత్రి కేటీఆర్ ఇలా పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ముందే అనుకున్నట్టు ప్రస్తుత నవంబర్లోషెడ్యూల్ జారీచేస్తారా? లేక కొంత కాలం వేచిచూస్తారా? అన్న అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
గ్రేటర్‌లోనే 10 వేల కరోనా కేసులు
సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు 10 వేలు దాటాయ్. శనివారం 888 కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృత్యువాత పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 13,436 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 10,150 పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పటికే 243 మంది మృతి చెందారు. వీరిలో 206 మందికిపైగా నగరవాసులే. అత్యధిక కేసులు నమోదైన జిల్లాల్లో హైదరాబాద్ తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో రంగారెడ్డి, మూడో స్థానంలో మేడ్చల్, నాలుగో స్థానంలో సూర్యాపేట, ఐదోస్థానంలో నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కరోనా మృత్యు మృదంగం మోగిస్తోంది. (కోటికి చేరుకున్న కరోనా కేసులు) ఇప్పటికే పలువురు ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. తాజాగా శనివారం ఐడీపీఎల్ లైన్స్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) సురేష్ సహా రాజేంద్రనగర్ డివిజన్లో పని చేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్హమీద్లు కరోనాతో మృతి చెందారు. సిటీసౌత్ సర్కిల్లో పని చేస్తున్న మరో అసిస్టెంట్ లైన్మెన్ గుండెపోటుతో చనిపోయినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలో ఒకేరోజు ముగ్గురు క్షేత్రస్థాయి ఉద్యోగులు మృతి చెందడంతో ఆ విభాగంలో విషాదం నెలకొంది. ఇప్పటికే 300 మంది పోలీసు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడగా.. తాజాగా మరో తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో సీసీఎస్‌లో 8, సైబర్ క్రైంలో ఒక పాజిటివ్ కేసు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న పది మంది ఆరోగ్య మిత్రలకు కరోనా వైరస్ సోకింది. ఉస్మానియా వైద్య కళాశాల పరిధిలో ఇప్పటికే వంద మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడగా, గాంధీలో 30 మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకడంతో ఆస్పత్రి వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శివారులో శివాలు! గ్రేటర్‌ను ఇప్పటికే బెంబేలెత్తిస్తున్న కోవిడ్.. తాజాగా శివారు మున్సిపాలిటీలను చుట్టేస్తోంది. పాతబస్తీ, ఓల్డ్ మలక్‌పేట్, జియాగూడ, సబ్జిమండి, మేకల మండి, మలక్‌పేట గంజ్ మార్కెట్లు కేంద్రంగా కోర్‌సిటీలో విస్తరించిన వైరస్.. తాజాగా ఔటర్ రింగ్‌రోడ్డుకు అటు, ఇటుగా ఉన్న శివారు మున్సిపాలిటీల్లో విరుచుకుపడుతోంది. జీహెచ్ఎంసీకి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇన్నర్ రింగ్‌రోడ్డుకు బయట, ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపల ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోజుకు సగటున 50 నుంచి 100 కేసులు నమోదవుతున్నాయి. జల్పల్లిలో అత్యధికంగా 90, బోడుప్పల్లో 35, మీర్‌పేటలో 28, పీర్జాదిగూడ, నిజాంపేటలో 15 కేసుల చొప్పున నమోదయ్యాయి. బడంగ్పేట్, జవహర్‌నగర్‌లో 12, నార్సింగ్‌లో 11, తుర్కయాం జాల్లో 10 కేసులు నమోదయ్యాయి. బండ్లగూడ జాగీర్, మణికొండలలో 9 కేసుల చొప్పున నమోదు కాగా, పెద్ద అంబర్‌పేటలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులతో పాటు పోలీసు విభాగం, సచివాలయ ఉద్యోగులు, జర్నలిస్టులు సహా ఐటీ, దాని అనుబంధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది శివారు మున్సిపాలిటీల్లోనే నివాసం ఉంటున్నారు. విధి నిర్వహణలో భాగంగా వీరంతా రోజూ కోర్‌సిటీలోని ఆఫీసులకు వెళ్లి వస్తున్నారు. అలాగే శివారు ప్రాంతాల్లోని రైతులు, ఇతర వ్యాపారులు తమ ఉత్పత్తులను నగరంలోని ప్రధాన మార్కెట్లకు తరలించి విక్రయిస్తుంటారు. ఇప్పటి వరకు కోర్íసిÜటీకే పరిమితమైన కరోనా వైరస్.. రాకపోకలు పెరగడంతో శివారు ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుతం గ్రేటర్‌తో పోటీ పడుతున్నట్లుగా శివారు జిల్లాల్లో కేసులు పెరుగుతుండటానికి ఇదే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిలిచిన టెస్టులతో పరేషాన్.. కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తుండటంతో గ్రేటర్ హైదరాబాద్ సహా శివారులోని మొత్తం 30 నియోజక వర్గాల్లో 50 వేల టెస్టులు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు 36 వేల నమూనాలు సేకరించింది. ప్రస్తుతం ప్రభుత్వ డయాగ్నోస్టిక్స్‌లో 2,290 టెస్టులు.. ప్రైవేటు ల్యాబ్స్‌లో 2,160 టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు సేకరించిన నమూనాల్లో 30 వేల నమూనాలను పరీక్షించి, రిపోర్టులు జారీ చేసింది. మరికొన్ని నమూనాల రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఐసీఎంఆర్ నుంచి అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్స్‌ల్లో పరీక్షల నిర్వహణ తీరు అధ్వానంగా ఉన్నట్లు ప్రభుత్వ నిపుణుల కమిటీ గుర్తించింది. ఇప్పటికే టెస్టుల నిర్వహణ సామర్థ్యానికి మించి నమూనాలు వచ్చి చేరడం, మరో వైపు ప్రైవేటు ల్యాబ్స్‌లో టెస్టుల నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రభుత్వం ఆయా డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షలను నిలిపివేసింది. నమూనాల సేకరణ కూడా ఆపేయడంతో ఇప్పటికే దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రుల్లోని పడకలు కూడా రోగులతో నిండిపోవడంతో కొత్తగా వైరస్ బారిన పడిన వారికి అడ్మిషన్ దొరకని దుస్థితి. హోం క్వారంటైన్‌లోనే మూడు వేలకుపైనే.. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 12,349 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోనే 9,262 కేసులు నమోదు కావడం విశేషం. నగరంలో మార్చి నుంచి మే వరకు 1,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జూన్‌లో 26 రోజుల్లోనే.. 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 237 మంది మృతి చెందారు. వీరిలో 200 మందికిపైగా కోర్‌సిటీ సహా శివారు ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. కరోనా బాధితుల చికిత్స కోసం ప్రభుత్వం 34 కోవిడ్ ఆస్పత్రులను ఎంపిక చేసింది. వీటి పరిధిలో 17,081 పడకలను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. వీటిలో 10,970 ఐసోలేషన్ బెడ్స్ ఉండగా.. 3,227 పడకలకు మాత్రమే ఆక్సిజన్ సరఫరా ఫెసిలిటీ ఉంది. 1,448 ఐసీయూ పడకలు ఉండగా, వీటిలో 460 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గాంధీ, కింగ్‌కోఠి, ఛాతి ఆస్పత్రి, ఆయుర్వేద, నేచర్ క్యూర్, ఉస్మానియా ఆస్పత్రుల్లోని ఐసీయూ, ఐసోలేషన్ పడకలు రోగులతో నిండిపోయాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొత్తగా వైరస్ బారిన పడిన వారికి అడ్మిషన్ దొరకని పరిస్థితి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా లేవు. ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఏ లక్షణాలు లేని పాజిటివ్ బాధితులతో పాటు వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులు కూడా విధిలేని పరిస్థితుల్లో హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ప్రస్తుతం 7,436 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మూడు వేలకుపైగా కేసులు హోం క్వారంటైన్లో ఉండటం గమనార్హం. -
హైదరాబాద్‌లో దడపుట్టిస్తున్న కరోనా
సాక్షి, సిటీబ్యూరో : కరోనా పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ రోజుకో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. తాజాగా శనివారం రికార్డు స్థాయిలో 179 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెల 11న అత్యధికంగా 175 కేసులు నమోదు కాగా.. తాజాగా కోవిడ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4737 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటి వరకు 182 మంది మృతి చెందారు. 2352 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం 2203 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 శాతం మంది గ్రేటర్‌వాసులే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా వైరస్ బారిన పడుతుండటం ఆందోళన కల్గిస్తోంది. కరోనా విస్తరణ నగరంలో కొనసాగుతోంది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మహమ్మారి విస్తరిస్తున్న తీరుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. (స్వచ్ఛందంగా లాక్డౌన్) ఎల్బీనగర్ : ఎల్బీనగర్ సర్కిళ్ల పరిధిలో శనివారం 4 కరోపా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మన్సూరాబాద్ డివిజన్ లెక్చరర్స్ కాలనీలోని ఎస్వీ హోమ్స్ అపార్టుమెంట్లో ఉండే ఓ వ్యక్తి(37)కి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. మన్సూరాబాద్‌లోని శ్లోకా స్కూల్ సమీపంలో నివాసముండే ఓ వ్యక్తి(32)కి, ఇదే డివిజన్‌కు చెందిన చంద్రపురికాలనీలోని రోడ్ నంబర్–5లో నివాసముండే మరో వ్యక్తి(38)కి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. సర్కిల్–5లో అష్టలక్ష్మీ టెంపుల్ సమీపంలోని వాసవీకాలనీలోని ఓవ్యక్తి కరోనా బారిన పడ్డారు. ఇతను నగరంలో ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్నారు. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రగతి నగర్లో... నిజాంపేట్ : ప్రగతి నగర్లో సాయి భవాని టిఫిన్ సెంటర్ యజమానికి కరోనా ఫాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పరిసర ప్రాంతాల ప్రజలతోపాటు, కార్పొరేషన్ సిబ్బంది కూడా ఇక్కడి నుంచి టిఫిన్స్ తీసుకెళ్లడంతో ఆందోళన అధికం అవుతోంది. రాంగోపాల్‌పేట్ డివిజన్లో... రాంగోపాల్‌పేట్: రాంగోపాల్‌పేట్ డివిజన్లో ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంగళరావునగర్‌కు చెందిన ఓ మహిళ(58) జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. బేగంపేట బ్రాహ్మణవాడిలో విధులు నిర్వహిస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. పంజగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఈఎస్ఐలో ఉచిత వైద్యం అందుబాటులో ఉండగా అక్కడికి తరలించారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో సిటీ స్కాన్ కోసం సచివాలయ ప్రాంతంలోని మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాస్మండిలో మరో వృద్ధురాలి(62)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె దీర్ధకాలిక రోగాలతో నిమ్స్‌లో చికిత్స పొందుతుంది. వైద్యులు ఆమెకు కరోనా టెస్టు చేయగా పాజిటివ్‌గా తేలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో... వెంగళరావునగర్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని జీహెచ్ఎంసీ సర్కిల్–19 ఉప కమిషనర్ ఎ.రమేష్ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్ హైలాంకాలనీలోని బాలుడు(15), అదే ప్రాంతానికి చెందిన యువకుడు(28), శ్రీకృష్ణానగర్‌లోని మహిళ(33)కు కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అలాగే రహమత్‌నగర్ డివిజన్లోని శ్రీరామ్‌నగర్‌కు చెందని ఓ యువకుడు(29), బాబా సైలానీనగర్లోని ఓ వ్యక్తి(58), ఓంనగర్‌కు చెందిన మహిళ(52) మహమ్మారి బారిన పడ్డారన్నారు. బోరబండ డివిజన్ ఎస్ఆర్టీనగర్లోని మహిళ(51) కు కరోనా వచ్చినట్టు డీఎంసీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో... శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన టైర్ పంక్ఛర్ చేసే వ్యక్తి(47)కి పాజిటివ్‌గా రావడంతో చెస్ట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చందానగర్ రాజేందర్‌రెడ్డి కాలనీకి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి రావడంతో ప్రైవేటు హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. గచ్చిబౌలికి చెందిన 52 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిజివ్ రావడంతో హోం క్వారంటైన్లో ఉన్నాడు. ఎస్ఆర్నగర్ పీఎస్‌లో... అమీర్‌పేట: ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే ఇద్దరు పోలీసులకు పాజిటివ్ ఇచ్చింది. జనరల్ డ్యూటీలో పనిచేసే కానిస్టేబుల్‌తోపాటు హోంగార్డుకు కరోనా నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం వారిని ఎర్రగడ్డ ఛాతీ వైద్య ఆస్పత్రికి తరలించారు. బోడుప్పల్లో... బోడుప్పల్: బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ రాగా ఓ మహిళ మృతిచెందింది. భాగ్యనగర్ కాలనీలోని స్నేహ నివాస్‌లో ఉండే ఓ మహిళ (53) కరోనాతో ఆస్పత్రి చికిత్స పొందుతూ మృతిచెందింది. బోడుప్పల్ లెక్చరర్స్ కాలనీలో ఓ టీవీ రిపోర్టర్(42)కు కరోనా సోకింది. వారి కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రకటనలకు కొత్త విధానం
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో అన్ని రకాలైన అడ్వర్టయిమెంట్లకు సంబంధించి కొత్త విధానం అమలులోకి వచ్చింది. నగరంలో ఏర్పాటు చేసే హోర్డింగ్స్‌పై గరిష్ట ఎత్తును జీహెచ్ఎంసీ నిర్ధేశించింది. హోర్డింగ్స్ 15 అడుగుల ఎత్తును మించి ఉండరాదన్న నిబంధన విధించింది. వాహనాలపై ఏర్పాటు చేసే ప్రకటనలకు కచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని జీహెచ్ఎంసీ స్పష్టంగా పేర్కొంది. అలాగే, నాలలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రకటనలను పూర్తిగా నిషేధించింది. అడ్వర్టయిజ్మెంట్స్కు సంబంధించి హోర్డింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు కచ్చితంగా రోడ్డు, ప్రజాభద్రత విధివిధానాలను పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ శనివారం హెచ్చరించింది. (‘ఒకరి బాధకు కారణమవ్వకండి’) -
జీహెచ్ఎంసీ పరిధిలో 427 కరోనా పాజిటివ్ కేసులు
-
పారిశుధ్య కార్మికులకు కరోనా ఎఫెక్ట్!
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో చెత్త సేకరిస్తున్న జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మాస్కులు లేకుండానే వారు చెత్త సేకరణకు వెళ్లడంతో ఇంటి యజమానులు అభ్యంతరం చెప్తున్నారు. వైరస్ నియంత్రణ చర్యలు పాటించకుండా, గుర్తింపు కార్డులు లేకుండా ఇళ్లల్లోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈనేపథ్యంలో కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని తమకు గుర్తింపు కార్డులు, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ కోరుతూ మాల్కాజిగిరి జోన్‌లోని పారిశుధ్య కార్మికులు డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం అందజేసారు. (చదవండి: ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!) లాక్డౌన్ నేపథ్యంలో గుర్తింపు కార్డులు లేవని పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, చెత్త సేకరణకు వెళితే ఇంటి యజమానులు సైతం గుర్తింపు కార్డులు, మాస్కులు ధరించపోతే రావద్దంటున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు. కాగా, పారిశుధ్య కార్మికులకు స్థానికులు మద్దతుగా నిలిచారు. అధికారులు, ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే చెత్త సేకరణ ఆగిపోతుందని వారు హెచ్చరించారు. (చదవండి: దేశానికి సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే: నటి) -
కరోనా వ్యాప్తి చెందకుండా జీహెచ్ఎంసీ చర్యలు
-
దోమలపై ‘స్మార్ట్’ ఫైట్
సాక్షి, హైదరాబాద్:మస్కీట్.. ఇది దోమల నివారణ యంత్రం. దోమలు నగరంలో ఏయే ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి.. ఏ రకం దోమ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి.. అనే వివరాలు తెలుసుకు నేందుకు జీహెచ్ఎంసీ దీన్ని వినియోగించనుంది. క్యాచ్, కౌంట్, క్లాసిఫ్ అనే మూడు పనులను ఈ పరికరం చేస్తుంది. మెషీన్‌లోని సువాసనలతో కూడిన లిక్విడ్, సెన్సర్ల వల్ల దోమలు దీంట్లోకి వస్తాయి. దీంతో ఆయా వాటిలోని దోమలను వర్గీకరించి.. ఫలానా వ్యాధిని కలిగించే దోమలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. తద్వారా సదరు ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టవచ్చు. నిరోధక చర్యలు చేపట్టాక ఏ మేరకు దోమలు తగ్గాయో కూడా తెలుసుకోవచ్చు. నగరంలో జోన్‌కొకటి వంతున దీన్ని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. దీని వ్యయం రూ.60 వేలని చెప్పారు. -
‘నోటీసులుండవు; అక్రమమైతే కూల్చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ చట్టంపై రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ‘పంచవర్ష ప్రణాళికలను ప్రజాప్రతినిధులు అధ్యయనం చేయాలి. మనది బలమైన పునాదులున్న ప్రజాస్వామ్యం. మున్సిపల్ చట్టాన్ని పారదర్శకంగా రూపొందించాం. నిధులు, అధికారాలు మున్సిపాలిటీలకే. కొన్ని అధికారాలను కలెక్టర్లకు కేటాయించాం. ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజాదర్బారు ఉంటుంది. అర్బన్ లోకల్ బాడీస్ కూడా పద్ధతిగా ఉండాలి. ప్రతియేడు రూ.3,200 కోట్ల నిధులు గ్రామాలకు వెళ్తాయి. 500 జనాభా ఉండే పంచాయతీకి కనీసం రూ.5 లక్షలు అందిస్తాం. పట్టణాలకు రూ.2,060 కోట్లు వెళ్తాయి. 500 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాలకు మున్సిపల్ ఆఫీసుల చట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఇకపై 128 మున్సిపాలిలు ఉంటాయి. నగర పంచాయతీలు ఉండవు. మున్పిపాలిటీల్లో ఆస్తిపన్ను కట్టకుండా అబద్ధాలు చెబితే 25 రెట్ల జరిమానా విధిస్తాం. ఎన్నికల నిర్వహణలో ఈసీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కేవలం ఎన్నికల తేదీలను మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తుంది. మున్సిపల్ వ్యవస్థను అవినీతి రహితం చేయడమే లక్ష్యం. 75 చదరపు గజాల్లోపు ఉన్న ఇల్లుకు ఏడాదికి రూ.100 పన్ను చెల్లించాలి. 75 చదరపు గజాల్లోపు జీ+1 కడితే అనుమతి అవసరం లేదు. ఒక్క రూపాయితోనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్రమ కట్టడాలను రాష్ట్రంలో ఎక్కడా అనుమంతించం. అక్రమ నిర్మాణమని తెలిస్తే వెంటనే కూల్చేస్తాం. ఎలాంటి నోటీసులు ఇవ్వం’అన్నారు. -
జీహెచ్ఎంసీకి మరో జాతీయ అవార్డు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి మరో జాతీయస్థాయి అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎక్సలెన్సీ 2018 అవార్డును దక్కించుకుది. నేడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించగా రాష్ట్రంలోని 13 మందికి అధికారులకు అవార్డులు దక్కగా వీరిలో జీహెచ్ఎంసీ కమీషనర్ డాక్టర్. బి. జనార్ధన్ రెడ్డి కూడా ఉండడం విశేషం. గ్రటర్ హైదరాబాద్‌లో చేపడుతున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మాణాలకు అతి తక్కువ సమయంలో భూసేకరణ చేయడం సఫలీకృతమైనందుకు కమీషనర్ బి. జనార్ధన్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. -
పరిశ్రమలపై పెత్తనం ఎందుకు..?
ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ఒప్పుకోం పరిశ్రమల మంత్రికి తేల్చిచెప్పిన తెలంగాణ పారిశ్రామిక వేత్తలు 30 పారిశ్రామికవేత్తల సంఘాలతో జూపల్లి సమావేశం సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక వాడలపై జీహెచ్ఎంసీ పెత్తనాన్ని తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతోంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఆస్తిపన్ను వసూళ్లు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా)లను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఇటీవలి కాలంలో కమిషనర్ సోమేశ్‌కుమార్ చేస్తున్న ప్రయత్నాలపై పారిశ్రామిక వేత్తలు విరుచుకుపడ్డారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే జీహెచ్ఎంసీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, పారిశ్రామిక వేత్తలను పీడించడమే ధ్యేయంగా వ్యవహరిస్తుందని తెలంగాణ పారిశ్రామిక వేత్తలు ముక్తకంఠంతో ధ్వజమెత్తారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమల కమిషనర్ జయేష్ రంజన్‌లతో సోమవారం సచివాలయంలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం ఆధ్వర్యంలో 30 సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ. 700 కోట్ల మేర రాయితీలను విడుదల చేయడం, నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించడంపై పారిశ్రామిక వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో పారిశ్రామిక వేత్తలపై జీహెచ్ఎంసీ చేస్తున్న పెత్తనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత జులై 22న కేసీఆర్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమై ‘ఐలా’ను పటిష్టం చేస్తానని, పరిశ్రమలకు స్వయం ప్రతిపత్తి కాపాడుతామని హామీ ఇచ్చిన విషయాన్ని పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి గుర్తు చేశారు. అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా పరిశ్రమలపై గుత్తాధిపత్యాన్ని కార్పొరేషన్‌కు దఖలు చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు ఎస్.వి. రఘు, సుధీర్, పారిశ్రామిక వేత్తల సంఘాల ప్రతినిధులు ఎ.ఎల్.ఎన్.రెడ్డి(జీడిమెట్ల), ఎం.గోపాల్ రెడ్డి(చర్లపల్లి), జనార్దన్ రెడ్డి (పటాన్చెరు), నర్సింగ్‌రావు(మెదక్), మహిళా పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షురాలు సరిత, ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి రాజ మౌళి, ఎన్వీ నరేందర్, సూక్ష్మ పరిశ్రమల సంఘం అధ్యక్షుడు లక్ష్మీకాంతయ్య పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ తీరుపై ఆందోళన ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ వ్యవహరించడం పట్ల ఇతర సంఘాల ప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆస్తిపన్ను పేరుతో పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ రకాల పన్నులు చెల్లిస్తూ పరిశ్రమలను నడుపుతున్న తమకు ఆస్తిపన్నును వాణిజ్య అవసరాల పేరుతో వసూలు చేయడం వల్ల నష్టపోతున్నామని మంత్రి జూపల్లికి వివరించారు. కంపెనీల్లో పనిచేసే కార్మికుల కోసం తాగునీటి కనెక్షన్లు తీసుకుంటే వాటికి కూడా వాణిజ్య అవసరాల టారిఫ్‌లో బిల్లులు వేస్తున్నారని తెలిపారు. ఐలాను జీహెచ్ఎంసీలో విలీనం చేయడం, ఆస్తిపన్ను, నీటి పన్నులకు సంబంధించి జీహెచ్ఎంసీ, పురపాలక శాఖలతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న తెలంగాణ పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్- వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో వెయ్యి ఎకరాలు కేటాయించి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పరిశ్రమలతో సంబంధం ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మునిసిపల్ శాఖ, రిజిస్ట్రేషన్లు, పీసీబీ వంటి విభాగాల అధికారులతో మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రను కోరారు. త్వరలోనే సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. -
ఎంఐఎంతో అంటకాగొద్దు!
టీఆర్ఎస్ మైనారిటీ నేతల కొత్త వాదన ఎంఐఎం దోస్తీతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టమేనంటున్న నాయకులు ముస్లింల్లో పార్టీకి ఆదరణ ఉందని ఇద్దరు మంత్రులకు వివరించిన నేతలు అధినేత కేసీఆర్‌కు విన్నవించే ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: మజ్లిస్‌తో దోస్తీని విడనాడకుంటే పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని టీఆర్ఎస్లోని ముస్లిం మైనారిటీ నేతలు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ను కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీఆర్ఎస్ మహా నగరంలోని ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం ఎంఐఎంతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తోంది. అయితే, టీఆర్ఎస్లోని ముస్లిం నేతలకు ఇది మింగుడు పడడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన చోట విజయం సాధించకున్నా, ఆ తర్వాత ప్రభుత్వం ముస్లింల కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలతో సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వచ్చిందని వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లో 75 వేల వరకూ ముస్లింలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని, దీనిని బట్టి వారిలో పార్టీకి ఆదరణ ఉందన్న విషయం తేలిపోయిందని అంటున్నారు. ‘గతంలో ఏ పార్టీ ముస్లిం మైనారిటీలకు ఇవ్వనంత గుర్తింపు టీఆర్ఎస్ ఇచ్చింది. ఒక ముస్లిం మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ముస్లిం యువతుల వివాహ ఖర్చులు భరిస్తోంది. ఏరకంగా చూసినా.. వారి సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఈ పరిస్థితుల్లో ఇంకా ఎంఐఎంతో అంటకాగాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేదు..’ అని ఆ పార్టీ మైనారిటీ నాయకులు తమ అగ్రనేతల వద్ద ప్రస్తావించడం మొదలు పెట్టారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు ఇదంతా వివరించినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వాస్తవ పరిస్థితిని వివరిస్తామని, ఆయన అపాయింట్మెంటు ఖరారు చేయించాలని కూడా వీరు కోరినట్లు తెలిసింది. ఎంఐఎంతో పొత్తు.. పార్టీకి నష్టం.. గతంలో ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ లాభపడలేదని, కాంగ్రెస్ అంతకు ముందు టీడీపీ ఇదే తరహాలో హైదరాబాద్‌లో దెబ్బతిన్నాయని వీరు గుర్తు చేస్తున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దేవీప్రసాద్ ఓటమికి దారితీసిన కారణాల్లో ఎంఐఎంతో దోస్తీ కూడా ఒకటని పేర్కొంటున్నారు. ముస్లిం మైనారిటీల ఓట్లు పడడమేమో కానీ, హిందువుల ఓట్లు మైనస్ అయ్యాయని విశ్లేషిస్తున్నారు. తమ పార్టీకి ముస్లింలలో మంచి ఆదరణ ఉందని చెపుతున్నారు. పరిస్థితి బాగున్నా ప్రతీ విషయంలో ఎంఐఎంకు పార్టీ అగ్రనాయకత్వం ప్రాధాన్యం ఇవ్వడాన్ని టీఆర్ఎస్ మైనారిటీ నాయకత్వం జీర్ణించుకోలేక పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తామెలా ఎదుగుతామని వీరు ప్రశ్నిస్తున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సొంతంగా బరిలోకి దిగాలన్న అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎంను నమ్ముకోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘‘ఎంఐఎంతో మనకు పొత్తు వద్దు. ఈ విషయంలో సీఎంకు అన్ని అంశాలూ వివరించండి. మాకు సమయం ఇప్పించండి. మా దగ్గర ఉన్న సమాచారం ఆయనకు వివరిస్తాం..’’ అని కొందరు మైనారిటీ నేతలు ఇద్దరు మంత్రులకు తేల్చి చెప్పారని తెలిసింది. -
ఆయనేమైనా మోనార్కా!
తనను తాను నిజాం ఆఫ్ హైదరాబాద్‌గా భావిస్తున్నట్లుంది జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్‌పై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ సోమేష్ కుమార్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆయన మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని, తనను తాను నిజాం ఆఫ్ హైదరాబాద్‌లా భావిస్తున్నట్లుందని వ్యాఖ్యానించింది. ఆస్తి పన్ను చెల్లించలేదనే నెపంతో తమ విద్యుత్, నీటి కనెక్షన్లను జీహెచ్ఎంసీ తొలగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పన్ను చెల్లించలేదంటూ జీహెచ్ఎంసీ అధికారులు తమ ఇంటి విద్యుత్, నీటి కనెక్షన్‌ను తొలగించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకురాగా, ఏకంగా తన దుకాణాన్ని సీజ్ చేశారని సుజాత కోర్టుకు నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. మీ కమిషనర్‌కు జీహెచ్ఎంసీ చట్టం గురించి తెలుసా? అతని చర్యలను చట్టం సమర్థించడం లేదన్న విషయమైనా తెలుసా? అంటూ జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘మీరు విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వరు. మీ పని కేవలం ఇళ్ల నుంచి చెత్త సేకరించడమే. మరి మీరు అందివ్వని సదుపాయాలను మీరెలా తొలగిస్తారు? మీరిస్తున్న పన్ను చెల్లింపు నోటీసులను రద్దు చేయాలి. ఇటువంటి చర్యలు ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు మీ కమిషనర్ సిద్ధంగా ఉండాలి.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్చి 19న పన్ను చెల్లింపు నోటీసు జారీ చేసి, ఆ వెంటనే విద్యుత్, నీటి కనెక్షన్లను తొలగించారని తెలుసుకున్న ధర్మాసనం.. ‘మీ కమిషనర్ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను ఆయన నిజాం ఆఫ్ హైదరాబాద్‌గా భావిస్తున్నట్లున్నారు. అతని చర్యలు నిజాం సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. పిటిషనర్ల కేసులను తిరిగి పునఃపరిశీలించి, మళ్లీ నిర్ణయం తీసుకోవాలని, అలాగే సీజ్ చేసిన సుజాత షాపును తెరవాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. -
జీహెచ్ఎంసీ ఎన్నికలెప్పుడు?
తేల్చుతారా.. తేల్చమంటారా? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హుకుం వారంలోగా ఎన్నికల తేదీని ప్రకటించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: వార్డుల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని గత ఆగస్టులో ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు ఏం చేశారని రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కు ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో నిర్దిష్ట తేదీని వారం రోజుల్లో తెలియజేయాలని సోమవారం ఆదేశించింది. లేదంటే తామే తేదీని నిర్ణయించి, ఆ మేరకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గడువు ముగిసినప్పటికీ జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగవిరుద్ధంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జీని చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. స్పెషల్ ఆఫీసర్ల నియామకపు జీవో 186ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు 249 రోజుల గడువు కావాలంటూ జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్ సోమేశ్‌కుమార్ కౌంటర్ దాఖలు చేశారని తెలిపారు. వాస్తవానికి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కౌంటర్ ద్వారా తెలియజేయాలని, అయితే తెలివిగా ఆ పని చేయకుండా తప్పించుకుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. జీహెచ్ఎంసీ పాలక మండలి కాల పరిమితి గడువు గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిందని, రాజ్యాంగం ప్రకారం కాల పరిమితి ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కలుగజేసుకుంటూ.. రాష్ట్ర విభజన తర్వాత అతి తక్కువ మంది అధికారులతో పని చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం వార్డుల పునర్విభజనను చేపట్టామని వివరించారు. ఈ పనుల వివరాలను కౌంటర్ ద్వారా కోర్టుకు సోమేశ్‌కుమార్ తెలిపారని చెప్పారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. ‘249 రోజుల్లో ఇప్పటికే 90 రోజులు గడిచిపోయాయి. మీరు ఏం చేయాల్సి ఉందో అది మాత్రమే చెప్పారు. అయినా స్పెషల్ ఆఫీసర్ కౌంటర్ దాఖలు చేయడమేంటి? ప్రభుత్వం దాఖలు చేయాలి కదా..’ అని వ్యాఖ్యానించింది. తమకు ఏ వివరాలు అక్కర్లేదని, ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో వారం రోజుల్లో(వచ్చే సోమవారంలోగా) చెప్పాలని, లేనిపక్షంలో తామే తేదీని నిర్ణయించి ఉత్తర్వులిస్తామని పేర్కొంది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. -
పురపాలికల్లో 744 ఖాళీ పోస్టులు
కేసీఆర్‌కు పురపాలకశాఖ నివేదికలు సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 1535 పోస్టులు ఉండగా.. అందులో 744 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో మరో 666 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పురపాలికల స్థితిగతులతోపాటు ఉద్యోగుల కొరతపై తాజా సమాచారంతో కూడిన నివేదికలను రాష్ట్ర పురపాలకశాఖ ఆయనకు సమర్పించింది. పురపాలక సంస్థల్లోని పరిపాలన, రెవెన్యూ, అకౌంట్స్, ప్రజారోగ్యం-పారిశుద్ధ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా ఈ నివేదికలో పేర్కొంది. నిబంధనల ప్రకారం పదోన్నతులు, నియామకాల (డెరైక్ట్ రిక్రూట్మెంట్) ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీ పోస్టులను సైతం నివేదికలో పొందుపరిచింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఖాళీల భర్తీపై సీఎం ప్రకటన చేసే అవకాశం లేదు. కోడ్ ముగిశాక ఖాళీల భర్తీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఖాళీ పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా... -
రాజధానిలో పట్టుకు ‘గులాబీ’ తంటాలు!
జీహెచ్ఎంసీలో బలోపేతంపై టీఆర్ఎస్ మథనం 10రోజులే గడువున్నా మొదలుకాని సభ్యత్వ నమోదు నగర మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతో సతమతం నేడు స్టీరింగ్ కమిటీతో కేసీఆర్ ప్రత్యేక సమావేశం సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్కు రాజధానిలో ఇంకా పట్టు చిక్కడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పై గులాబీ జెండా ఎగరేయాలని చూస్తున్న ఆ పార్టీ నాయకత్వానికి తాజా పరిణామాలు జీర్ణం కావడం లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోందని పార్టీ వర్గాలు ఆనందంలో ఉన్నాయి. కానీ, హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క చోట కూడా సభ్యత్వ నమోదు మొదలు కాలేదు. కాకుంటే 18 నియోజకవర్గాల్లో సమావేశాలు జరిపామని, మంత్రులు కూడా హాజరయ్యారని రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. అసలు జీహెచ్ఎంసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలోనే పార్టీ నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలను నలుగురు మంత్రులకు పంచి, బాధ్యతలు అప్పజెప్పారు. కానీ ఊపు మాత్రం రాలేదు. 20వ తేదీతో సభ్యత్వ నమోదు గడువు ముగియనుంది. మరోవైపు ఒక్క రోజు కూడా గడువు పెంచబోమని సీఎం కె. చంద్రశేఖర్‌రావు తొలిరోజే ప్రకటించారు. దీంతో హైదరాబాద్‌లో పరిస్థితిని తక్షణమే చక్కదిద్దకుంటే అసలుకే ఎసరు వస్తుందన్న ఆందోళనతో మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్లో కేసీఆర్‌తో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. మంత్రుల మధ్య కుదరని సయోధ్య నగరంలో నలుగురు మంత్రులున్నా, ప్రధానంగా అందరి దృష్టి టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావుగౌడ్పైనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బాధ్యతలను తలసాని ఆశించారని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. తలసాని చేరినప్పటి నుంచే పద్మారావుగౌడ్ కొంత ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అయితే ఎన్నికల ముందే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావుకు తాత్కాలికంగా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పజె ప్పడంతో పద్మారావుగౌడ్ కూడా కొంత స్థిమితపడ్డారని, అయినా ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు మాత్రం సాగుతూనే ఉందని, అది సభ్యత్వ నమోదుపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీ గెలుచుకున్న స్థానాలు కేవలం మూడే. ఆ తర్వాత తలసాని, తీగల కృష్ణారెడ్డి టీఆర్ ఎస్‌లోకి రావడంతో ఆ సంఖ్య అయిదుకు పెరిగింది. మొదటి నుంచీ నగరంపై రాజకీయంగా అంతగా పట్టులేని టీఆర్ఎస్ ఈసారి మాత్రం గ్రేటర్‌పై జెండా ఎగరేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీఆర్ఎస్కు అధికార పార్టీ హోదా దక్కడంతో వివిధ పార్టీల నుంచి వలస వచ్చిన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఈ కారణంగానే స్టీరింగ్ కమిటీలో స్థానం కోసం పోటీ ఎక్కువైంది. అందుకే ఏకంగా 57 మందిని ఈ కమిటీలోకి తీసుకోవాల్సి వచ్చింది. కార్పొరేటర్లుగా అవకాశం రావాలంటే స్టీరింగ్ కమిటీలో బాధ్యతలు ఉండాలన్న ఆలోచనతో నేతలు పోటీ పడ్డారు. అన్ని నియోజకవర్గాల్లో కొత్త వారి చేరిక ఎక్కువగా ఉండటంతో వారి బలాబలాలను పార్టీ నాయకత్వం అంచనా వేయలేక పోయిందంటున్నారు. దీంతో ఎవరినీ పక్కన పెట్టలేక జంబో కమిటీని ఏర్పాటు చేశారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్ది, తక్షణం పార్టీని పట్టాలెక్కించడానికి సీఎం కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు, నగర పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారంనాటి సమావేశానికి హాజరుకానున్నారు. కేసీఆర్ నిర్దేశంతోనైనా సభ్యత్వ నమోదు ఊపందుకుంటుందన్న ఆశాభావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాలి
హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ప్రత్యేకాధికారుల పాలనను రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషన్, జీహెచ్ఎంసీ స్పెషల్ ఆఫీసర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పాలక మండలి కాల పరిమితి గత ఏడాది డిసెంబర్ 3తో ముగిసిందని, ఆ మరుసటి రోజే ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ప్రత్యేకాధికారిని నియమించిందని తెలిపారు. ప్రత్యేకాధికారుల పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజా ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల సమస్యలు సకాలంలో పరిష్కారం కావడం లేదని తెలిపారు. పాలక మండలి గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని, ఇలా చేయకపోవడం రాజ్యాంగంలోని అధికరణ 243(యూ)కు విరుద్ధమని వివరించారు. ప్రత్యేకాధికారుల పాలనను రద్దు చేసి, 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డులను పునర్విభజన చేసి, ఎన్నికలు నిర్వహించాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. -
అక్రమ నిర్మాణాన్ని తొలగించిన హీరో వెంకటేశ్
హైదరాబాద్: సినీ హీరో వెంకటేశ్ హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్-1లో తన ప్లాట్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్డును శనివారం స్వయంగా ఆయనే కూలీలను నియమించుకొని కూల్చివేయించారు. ఫిలింనగర్‌లోని ప్లాట్ నంబర్-3లో వెంకటేశ్‌కు ఫ్లాట్ ఉంది. గత కొద్ది రోజులుగా ఈ ఫ్లాట్‌లో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో రెండు వారాల క్రితం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల్లో వాటిని కూల్చివేయకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులో హెచ్చరించారు. దీనికి స్పందించిన వెంకటేశ్ నోటీసు గడువుకు ఒక రోజు ముందే ఆక్రమణలను నేలమట్టం చేయించారు. నిర్మాణాలు కూల్చివేసిన ప్రాంతాన్ని ఫొటోలు తీయించి జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు అందించారు. -
నాలాల అభివృద్ధికి కమిటీలు
సమీక్ష సమావేశంలో సోమేశ్‌కుమార్ సాక్షి, సిటీబ్యూరో: చెరువులు, నాలాల పరిధిలో ఆక్రమణల తొలగింపు.. వాటి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అందుకనుగుణంగా తగిన కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధమయ్యారు. తొలి విడతలో భాగంగా ఐదు ప్రధాన నాలాల పరిధిలో వెలసిన ఆక్రమణలను గుర్తించి , వాటిని తొలగించడంతోపాటు సదరు నాలాలను అభివృద్ధి చేసేందుకు తగు కార్యాచరణ సిద్ధం చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఈ అంశాలపై ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈపనుల కోసం ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, భూసేకరణ విభాగాల్లోని అధికారులతో సర్కిళ్ల స్థాయిలో సమన్వయకమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పనుల పర్యవేక్షణకు ప్రతి నాలాకు ప్రత్యేకాధికారిని నియమించనున్నట్లు చెప్పారు. తొలిదశలో మారియట్ హోటల్ నుంచి మూసీకి వెళ్లే హుస్సేన్‌సాగర్ సర్ప్లస్ నాలా, శేరిలింగంపల్లి నాలా, మీరాలం చెరువు- నూర్ మహ్మద్ట్యాంక్, ముర్కినాలా, కూకట్పల్లి నాలాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అఫ్జల్పార్కు పునరుద్ధరణకు సంబంధించి సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందిగా కన్సల్టెంట్‌కు సూచించారు. సమావేశంలో ఈఎన్సీ ధన్సింగ్, చీఫ్ సిటీప్లానర్ దేవేందర్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, జయరాజ్కెన్నెడితదితరులు పాల్గొన్నారు.