Devotion
-
తప్పుని ఎత్తిచూపడం కంటే.. చక్కదిద్దడమే ఉత్తమం
ఎవరైనా తప్పు చేసినప్పుడు లేదా ఆకస్మికంగా తప్పుదారిలో నడిచినప్పుడు వారిని తిరస్కార భావంతో చూసి ఎగతాళి చేసే వారే కానీ చెడుదారిన వెళ్లేవారి తప్పును సున్నితంగా ఎత్తి చూపించి, ప్రేమతో దిద్ది, ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసానికీ, ఆత్మాభిమానానికీ దెబ్బ తగలకుండా అతడిని చక్కదిద్దే నేర్పరితనం మనలో ఎంతమందిలో ఉంటుంది? తప్పు చేసినప్పుడు సహనం కోల్పోయి తీవ్రంగా దండించి ‘అలా చేయకూడదు, ఇలా చేయకూడదు..’ అంటూ చెప్పినంత మాత్రాన పెద్దల కర్తవ్యం ముగిసిందా? ఒకడు కాలుజారి కిందపడుతున్నప్పుడు వాడిని లేవదీయకుండా వ్యంగ్యంగా విమర్శిస్తూ ‘అయ్యో పాపం!’ అని జాలి ప్రదర్శించే మాటలు కురిపించే వారే చాలామంది! అటువంటి వారిపై దోషారోపణ చేసినంత మాత్రాన మనకొచ్చే ఫలితం ఏమీ ఉండదు. తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు తమ ఉపాధ్యాయులు తమకు విధించిన శిక్షలు (కొట్టడం వంటివి) తమకు నచ్చకపోయినా, తాము ఉపాధ్యాయులు అయిన తర్వాత ఆ పద్ధతినే అనుసరిస్తూ వస్తారు. సహనం, ప్రేమ ఆచరణ యోగ్యం కావనీ, ఉపన్యాసాలకూ, రాతలకూ మాత్రమే పనికి వస్తాయనీ భావిస్తారు. బానిసత్వంలో పెరిగిన వర్గాల ప్రజల్లో కనిపించే ఒక అలవాటు ఇది. తమకంటే పై మెట్టులో ఉన్నవారి ఎదుట దైన్యంగా ఉండటం, తమకంటే కిందిస్థాయిలో ఉన్న వారి పట్ల దర్పం చూపడం గమనిస్తూనే ఉన్నాం. సామాజిక విప్లవం, కుల నిర్మూలన వంటి విషయాలను గురించి భావోద్వేగంతో ప్రసంగించే ఒక కార్యాలయాధికారిని ‘మీరెప్పుడైనా మీ విభాగంలోని సిబ్బందినంతా సమీకరించి దానిలో అందరూ పాల్గొనేటటువంటి ఒక ఒక సభను నిర్వహించారా?’ అని అడిగితే, ‘లేదు’ అన్నాడా అధికారి. ఒకే ప్రభుత్వ శాఖలో, ఒకే కార్యాలయంలో కొన్ని ఏళ్లపాటు కొద్ది వేతన వ్యత్యాసాలతో పనిచేసే వారిలో అధికారికీ, ఉద్యోగులకూ సామరస్యం లేదని తెలిసింది. కేవలం యాంత్రికంగా వారి ఉద్యోగం నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాని, పరస్పర ప్రేమ, విశ్వాసం, సహకార భావం వంటివి వారిలో మచ్చుకైనా కనిపించలేదు. బుద్ధిమంతులు, సంస్కారవంతులూ అయినవారంతా అణగదొక్కబడిన వారిపట్ల ప్రేమ, ఆదరాభిమానాలు చూపాలి. అంతేకాని, క్షణికమైన ఉద్రేకంతో నేను పరోపకారిని అని ప్రకటించుకుని ప్రయోజనం లేదు. నిష్కల్మషమైన ప్రేమ ఒక్కటే ప్రగతిశీలమైన రాచబాట అనే వాస్తవాన్ని మరువకూడదు. పైస్థాయిలో ఉన్న వారు ఈ విషయాన్ని గ్రహించి, కింది వారిపట్ల శ్రద్ధాసక్తులు చూపాలి. అప్పుడే సమన్యాయం సాధ్యం అవుతుంది. – స్వామి జగదాత్మానంద (చదవండి: సంపదలు సత్కార్యాలకు ద్వారాలు) -
సంపదలు సత్కార్యాలకు ద్వారాలు
సాధారణంగా సంపద అంటే డబ్బులు అనుకుంటారు. కాని, సనాతన ధర్మం ఎప్పుడు కాగితం ముక్కల్ని కాని, లోహపు బిళ్ళలని కాని ధనంగా పరిగణించినట్టు కనపడదు. అష్టలక్ష్ములు అని చేప్పే సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ధనంగా చెప్పటం జరిగింది. సత్కార్యాలు చేయటానికి చేతి నిండుగా డబ్బు లేదే అని బాధ పడ నవసరం లేదు. మనకి ఎన్నో రకాలైన సంపదలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేయవచ్చు.సంపదలు ఉంటే ఎన్నో సత్కార్యాలు చేయవచ్చు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సంపదలు అనుభవించటానికి మాత్రమే అని లోకంలో ఉన్న అభిప్రాయం. కానీ, అవి ఎన్ని పనులు చేయటానికో సాధనాలు. దురదష్టవంతులు, దుర్మార్గులు అయినవారికి పతనానికి హేతువులుఅవుతాయి. సంపద అంటే ఇతరులకి ఎంత ఇచ్చినా తరగనంత ఉన్నది. తాను అనుభవించటానికి లేదే అని కొద్దిగా కూడా బాధ పడవలసిన అవసరం లేనంత ఉండటం. ఎవరికైనా ఇవ్వాలంటే ముందు తన దగ్గర ఉండాలి కదా! ఇవ్వాలని ఉద్దేశం ఉంది కాని, తన దగ్గర తగినంత లేక పోతే ఏమి చేయగలరు ఎవరైనా? అందువల్ల ఎవరికైనా సహాయం చేయాలంటే తగినంత సమకూర్చుకోవలసి ఉంటుంది. అన్నిటిని మించి ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. దానితో శారీరకంగా బలహీనంగా ఉన్న వారికి సహాయం చేయ వచ్చు. బలహీనుడు మరొకరికి చేయూత నివ్వలేడు కదా! కనీసం ఈ సంపదని పెంపొందించు కోవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసమైనా ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. అదీ కాక పోయినా, తాను ఇతరుల పైన ఆధార పడి ఉండకుండా ఉంటే అదే పెద్ద సహాయం. (నట్టింటి నుంచి.. నెట్టింటికి..)మరొక ప్రధాన మైన సంపద జ్ఞానసంపద. ఇతరులకి జ్ఞానాన్ని పంచాలి అంటే తన దగ్గర ఉండాలి. ఎంత చదువుకుంటే ఏం లాభం? అంటూ ఉంటారు చాలా మంది. నిజమే! దానిని ఎవరికి పంచక, తన జీవితంలో ఉపయోగపరచక పోతే వ్యర్థమే. సార్థకం చేసుకోవాలంటే తనకున్న జ్ఞానాన్ని వీలైనంత మందికి పంచుతూ పోవాలి. ఈ మాట అనగానే నాకు పెద్ద పెద్ద డిగ్రీలు లేవు నేనేం చేయ గలను? అంటారు. జ్ఞానం అంటే కళాశాలలలోనో, విశ్వవిద్యాలయాలలోనో చదివితే వచ్చేది కాదు. ఆ చదువు సహజంగా ఉన్న దానికి సహకరించ వచ్చు. అనుభవంతో, లోకాన్ని పరిశీలించటంతో వచ్చేది ఎక్కువ. ఆ జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా పదిమందికి పంచితే నశించకుండా తరువాతి తరాలకి అందుతుంది. అందుకే ధర్మశాస్త్రాలు కూడా ఏదైనా విషయంలో కలిగిన సందేహానికి పరిష్కారం గ్రంథాలలో లభించక పోతే ఆ కుటుంబంలో వృద్ధురాలైన మహిళని అడగమని చెప్పాయి. అనుభవ జ్ఞానం అంత గొప్పది. అన్నిటినీ మించినది ప్రేమ. దీనితోఎన్నిటినో సాధించవచ్చు. ఈ సంపద పంచిన కొద్ది పెరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చినదే మన సంపద. దాచుకున్నది ఏమవుతుందో తెలియదు. మనం అన్ని విధాలా సంపన్నులం అయే మార్గం తెలిసింది కదా! శారీరికంగా ఏమీ చేయలేనప్పుడు ఏ మాత్రం కష్టపడకుండా చేయగలిగిన సహాయం కూడా ఉంది. అది మాట సాయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి మాట సహాయం చేయవచ్చు. తాను చేయ లేక పోయినా, చేసే వారిని చూపించ వచ్చు. అది కూడా తనకి అందుబాటులో లేక పోతే కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా ఒక్క మాట చెపితే ఎంతో ధైర్యం కలుగుతుంది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోవుగా! ఇదీ చేయటం రాక పోతే ఊరకున్నంత ఉత్తమం లేదు. పిచ్చి మాటలు మాట్లాడి చెడగొట్టకుండా ఉండటం కూడా గొప్ప సహాయమే అంటారు తెలిసిన పెద్దలు. నేర్పుగా మాట్లాడిన ఒక్క మాటతో సమస్యల పరిష్కారం, బాధల నుండి ఓదార్పు దొరకటం చూస్తూనే ఉంటాం. – డా. ఎన్. అనంతలక్ష్మి -
రారాజు ఆగమనానికి... ‘అడ్వెంట్’
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజాలు అన్నీ ఆచరించే పెద్ద పండుగ క్రిస్మస్, క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రీస్తు జన్మదినం జరుపుకునే డిసెంబర్ 25కి ముందు నాలుగు వారాల నుంచి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభిస్తారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. లాటిన్ భాషలోని అడ్వెంటస్ అనే పదం దీనికి మూలం. అడ్వెంట్ అంటే ఆగమనం/ రాకడ/ ఆహ్వానం అని అర్థం. డిసెంబర్ 24 సాయంత్రంతో అడ్వెంట్ ముగుస్తుంది.అడ్వెంట్ నాలుగు వారాల్లో దేవాలయాల్లో ముందస్తు క్రిస్మస్ వాతావరణం ఏర్పడుతుంది. అడ్వెంట్ తొలి ఆదివారమే పెద్ద నక్షత్రాన్ని అలంకరిస్తారు. ఏసు జననానికి ముందు ఆకాశంలో పుట్టిన కొత్త నక్షత్రానికి గుర్తుగా నక్షత్రాన్ని అలంకరించడంతో క్రిస్మస్ పండుగ వాతావరణం ఏర్పడుతుంది. దేవాలయాల్లోనూ క్రిస్మస్ చెట్టును అలంకరించి రంగురంగుల దీపాలతో అలంకరణలు చేసి ముస్తాబు చేస్తారు. పచ్చని చెట్టు ప్రేమకు, శాంతికి, జీవిత విలువలకు ప్రతీక. అడ్వెంట్ నాలుగు వారాల్లో వరుసగా మూడు వారాలు ఊదారంగు మైనపు వత్తులూ, చివరివారం గులాబి రంగు మైనపు వత్తి వెలిగిస్తారు.ఈ అన్ని రోజుల్లో జరిగే ప్రార్థనలో ప్రేమ –ఆనందం, విశ్వాసం – శాంతికి గుర్తుగా రంగురంగుల మైనపు వత్తులు వెలిగించడం క్రీస్తుశకం 567 నుండి కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వారు ప్రారంభించారు. ఈ నాలుగు వారాలూ దేవాలయం ప్రధాన పీఠభాగం (ఆల్టార్)ని ఉదారంగు వస్త్రాలతో అలంకరిస్తారు. దేవాలయ అధిపతులు కూడా అదే రంగు వస్త్రాలను ధరిస్తారు. ఊదారంగు రాచరికానికి గుర్తు. రారాజు ఆగమనానికి ఆహ్వానం పలకడానికి సమాజాన్ని సిద్ధం చేయడంలో మతాధిపతులు ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తారు. అడ్వెంట్ కాలమంతా తెల్లవారుజామునే ప్రార్థనలు నిర్వహించి, సమాజానికి క్రిస్మస్ ఆగమన సందేశం ఇస్తారు.అడ్వెంట్ కాలంలోనే క్రిస్మస్ కారల్స్ ప్రధాన భూమిక పోషిస్తాయి. యువకులు, పెద్దలు ఒక సమూహంగా ఏర్పడి ఆ యా గృహాలు సందర్శించి పాటలు, నృత్యాలతో పండుగ ఉత్సాహాన్ని నింపుతారు. ఈ నేపథ్యంలోనే ఆ యా ప్రాంతాల్లోని అనాథలను గుర్తించి వస్త్రాలు, ఆహారం పంచి ఇస్తారు. ‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించ’మన్న సందేశం అక్షరాలా పాటిస్తారు. అడ్వెంట్ వల్ల ఏసును హృదయంలో ప్రతిష్టించుకుని తప్పులు పునరావృతం కాకుండా ఆత్మక్షాళనం గావించుకోవడం ప్రధాన కర్తవ్యం. వ్యక్తిగత శుద్ధితో పాటు సమాజ ప్రక్షాళన జరుపుకుని మానవ సమాజమంతా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఆనందించడం, ఒకరికొకరు చేయూతను అందించుకోవడం అడ్వెంట్ కాలంలో చేయవలసిన కర్తవ్యం.– ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి(నవంబర్ 24న అడ్వెంట్ ప్రారంభం) -
విపత్కర పరిస్థితులలో వేడుకోవాలి
మహనీయ ముహమ్మద్ (సఅసం) ప్రవచనం: పీడలు, విపత్కర పరిస్థితుల బాధనుంచి, దౌర్భాగ్యకర స్థితి దాపురించడం నుంచి, దురదృష్టకర జాతకం నుంచి, శత్రువులు పరిహాసం చేయటం నుంచి అల్లాహ్ శరణు వేడుకోండి.వివరణ: ఈ హదీసులో స్థూలంగా నాలుగు విషయాల నుండి రక్షణ కోరమని చెప్పినట్లుగా ఉంది. కానీ వాస్తవానికి ఈ నాలుగు విషయాలలోనే ఇహ పరాలకు సంబంధించిన అన్ని చెడుగులు కఠిన పరీక్షలు, కష్టాలు కడగండ్లు వచ్చేశాయి. వాటిలో మొదటిది (జిహాదిల్ బలా) అంటే ఏదైనా ఆపద లేక పీడన వల్ల కలిగే యాతన. మనిషిని శారీరకంగా బాధించి మానసిక క్షోభకు గురి చేసే ప్రతిదీ అతని పాలిట పీడే. ఈ విపత్కర స్థితి ప్రాపంచికమైనదీ కావచ్చు. ఈ ఒక్క పదంలోనే అన్నిరకాల ఆపదలు, విపత్తులు, పీడలు, పరీక్షలు చేరి ఉన్నాయి. రెండవ మూడవ అంశాలు: నిజానికి ఏ దాసునికైతే దౌర్భాగ్యకర స్థితి నుంచి, దురదృష్టం నుంచి దేవుని తరపున రక్షణ లభించిందో అతనికి సర్వస్వం ప్రార్థించినట్లే.నాలుగవ అంశం: షమాతతుల్ ఆదాయి అంటే మనకు కలిగిన ఏదేని కష్టంపై ఎదురైన గడ్డు పరిస్థితిపై మన శత్రువు నవ్వటం, దెప్పి ΄÷డవడం, ఎగతాళి చేయడం, సంకట స్థితిలో శత్రువు చేసే పరిహాసం తీవ్ర వ్యాకులతకు గురిచేస్తుంది. అందుకే ప్రత్యేకంగా దీని నుంచి కూడా దేవుని శరణు వేడమని ఉపదేశం.ప్రవక్త (స) వారి ఈ ఉపదేశాన్ని పాటిస్తూ, ఈ నాలుగింటి నుండి శరణు వేడే సరైన తీరు ఇది: (2) ఓ అల్లాహ్ గండం వల్ల కలిగే బాధనుండి, దౌర్భాగ్యకర స్థితి నెలకొనడం నుండి, శత్రువులు నవ్విపోవడం దురదృష్టకర జాతకం జాతకం నుండి నేను నీ శరణు వేడుతున్నాను. (3) ఓ అల్లాహ్! విచారం, దుఃఖం నుండి, అధైర్యం నుండి, సోమరితనం నుండి, పిరికితనం నుండి, పిసినారితనం నుండి, జనుల ఒత్తిడి నుండి నేను నీ శరణు వేడుతున్నాను.ఈ (దువా) వేడుకోలులో 8 విషయాల రక్షణ కోరబడింది. ఈ ఎనిమిది విషయాలలో నాలుగు మరీ ముఖ్యమైనవి అవి: విచారం, దుఃఖం, రుణభారం, ప్రజల శత్రువుల ప్రాబల్యం, ఒత్తిడి ఈ నాలుగు విషయాలకు లోనైన మనిషి సున్నిత మనస్కుడై ఉంటే అతని బతుకు దుర్భరమైపోతుంది. తత్కారణంగా అతనిలోని తెలివితేటలు, శక్తియుక్తులు చచ్చుబడి పోతాయి. ఫలితంగా ఇహపరాలలోని ఎన్నో విజయ శిఖరాలను అందుకోలేక పోతాడు. అధైర్యం, సోమరితనం, పిసినారితనం, పిరికితనం... ఈ నాలుగు బలహీనతలకు లోనైనా మనిషిలో సంకల్పబలం ధైర్యం తెగువ క్షీణిస్తాయి. అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లం) ఈ అంశాలన్నిటి నుంచి అల్లాహ్ శరణు వేడుకోవడమే కాకుండా ఈ విధంగా ్ర΄ార్థిస్తూ ఉండమని తన అనుయాయులకు కూడా నొక్కి చెప్పారు.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్∙ -
కన్ను తేటగా ఉంటే... దేహమంతయు వెలుగు
అనేకమంది యువతీ యువకుల కన్నులు పాపంతో నిండి వున్నాయి. ఈ విషయంలో యేసుప్రభువు తన కొండమీద ప్రసంగంలో ఒక స్త్రీని మోహపు చూపు చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినవాడవుతాడని, సాధారణంగా కామం కంటిచూపుతోనే మొదలవుతుందన్నారు. శోధన అంతర్గతంగా బయలుదేరుతుంది. తర్వాత కార్యరూపం దాలుస్తుంది. కనుక కంటిని ఎంతో పవిత్రంగా కాపాడు కోవాలి. దేహానికి, ఆత్మకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయూ వెలుగు మయమై వుండును. నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటిమయమవునని వాక్యం బోధిస్తున్నది (లూకా 11:33–34).ఒకరోజు యేసుప్రభువువారు గతిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని–నన్నువెంబడించుమని అతనికి చెప్పాడు.. ఫిలిప్పు నతనయేలును కనుగొని–ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతానియేలు–నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతనిని అడగ్గా –వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాడు. యేసు నతానియేలు తన వద్దకు రావడం చూసి యితడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కటము లేదు. నన్ను నీవు ఎలాగైనా ఎరుగుదువని నతానియేలు యేసును అడగ్గా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే, నీవు అంజూరపు చెట్టుకింద ఉన్నప్పుడే నిన్ను చూశానని అతనితో చెప్పాడు. నతానియేలు –బోధకుడా! నీవు దేవుని కుమారుడవు. ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసుక్రీస్తు అంజూరపు చెట్టుకింద కూర్చున్నావని చెప్పినందుకు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యక్రమాలు చూస్తావని అతనితో చె΄్పాడు. ఆయన (యేసు ప్రభువువారు) – మీరు ఆకాశం తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపైగా ఎక్కుటయు, దిగుటయు చూస్తారని మీతో నిశ్చయంగా చెబుతున్నానని అన్నాడు (యోహాను 1:43–51). కనుక మనకు ఇంత సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి వున్నందున మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కుల్లో పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసానికి కర్తయైన యేసుప్రభువు వైపు చూసి పందెంలో ఓపికతో పరుగెత్తవలెను. మీరు ΄ాపంతో ΄ోరాడటానికి రక్తం కారునంతగా ఎదిరింపలేరు. ఇంకో సంగతి నా కుమారులారా! ప్రభువు వేయు శిక్షను తృణీకరించవద్దు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించును.. అని కుమారులతో మాట్లాడినట్లు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు.మనం శరీర సంబంధీకులైన తలిదండ్రులతో భయభక్తులతో ఉన్నాడు కానీ, ఆత్మలకు తండ్రియైన దేవునికి మరింత ఎక్కువగా లోబడి బతుకవలెనని, అట్టి భయభక్తులు దేవునియందు కలిగి ఉండి, మంచిగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది (హెబ్రీ 12:1 –10). కనుక ఆ విధంగా ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకొందురు గాక.– కోట బిపిన్ చంద్రపాల్ -
అయ్యప్పభక్తులకు గుడ్‌న్యూస్ : వాట్సాప్‌లో శబరిమల సమాచారం
ఇకపై శబరిమల వెళ్లే యాత్రికులు ఆలయ సమాచారం తెలుసుకోవడం కోసం ప్రయాస పడనక్కరలేదు. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్‌లో 6238998000 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు... క్షణాల్లో శబరిమల ఆలయ సమాచారం అందుతుంది.‘స్వామి చాట్‌బాట్’ పేరిట అందించే ఈ సేవలను ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఇంగ్లిష్, హిందీ, మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అందించనున్నట్టు పథానంతిట్ట జిల్లా అధికార యంత్రాంగం తెలియజేసింది. ఆలయ వేళలు, ప్రసాద లభ్యత, పూజ వేళలు, శబరిమల చుట్టుపక్కల ఉండే ఇతర ఆలయాల వివరాలు, దగ్గరలో ఉండే రైళ్లు, బస్సులు, ఎయిర్పోర్ట్ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ చాట్‌బోట్ ద్వారా తెలుసుకోవచ్చునని దేవస్థానం అధికారులు తెలియజేశారు -
ధర్మసూక్ష్మం ఇలా ఉంటుందా..? ఆత్వస్తుతి అంత పాపమా..?
కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. ఒకనాడు కర్ణుడితో యుద్ధం చేస్తూ ధర్మరాజు అతడి శరాఘాతాలకు గురై గాయాల పాలయ్యాడు. కర్ణుడి సూటిపోటి మాటలతోనైతే మృత్యు సమాన స్థితినే పొందాడు. అవమాన భారం తట్టుకోలేక దూరంగా పారిపోయి వెళ్ళి దాక్కున్నాడు. మరోపక్క అశ్వత్థామను తీవ్ర గాయాలపాలు చేసి అర్జునుడు విజయగర్వంతో ధర్మరాజు కోసం చూశాడు. ఎక్కడా కనిపించపోయేసరికి కృష్ణుడితో కలిసి ధర్మరాజు కోసం వెతుకుతూ వెళ్ళాడు. ఒకచోట ధర్మరాజును కలుసుకున్నాడు. తనను సమీపించిన కృష్ణార్జునుల ముఖంలో సంతోషం చూసి కర్ణుణ్ని వధించి ఉంటారని అనుకున్నాడు ధర్మరాజు. అతణ్ని ఎలా వధించారో చెప్పమన్నాడు. కర్ణుణ్ని ఇంకా చంపలేదని అర్జునుడు సమాధానమిచ్చాడు.అవమానభారంతో కోపంగా ఉన్న ధర్మజుడు అర్జునుణ్ని అనేక విధాలుగా నిందించాడు. ఎంతో గొప్పదైన గాండీవం ఉండి కూడా ఉపయోగించుకోలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఎవరికైనా ఇచ్చేయమన్నాడు. ఆ మాట వినడంతోనే అర్జునుడు ధర్మరాజును చంపడానికి కత్తి ఎత్తాడు. పక్కనే ఉన్న కృష్ణుడు అర్జునుణ్ని ఆపి అతడి కోపానికి కారణాన్ని ప్రశ్నించాడు. తన ఎదురుగా ఎవరైనా గాండీవాన్ని అవమానించి దాన్ని విడిచి పెట్టమని అంటే వాళ్లను ఆ క్షణంలోనే చంపుతానని ప్రతిజ్ఞ చేసినట్లు అర్జునుడు చెప్పాడు. అదొక విషమ సందర్భం. ఆ సమయం లో వారిద్దరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత కృష్ణుడిపై పడింది. అప్పుడు కృష్ణుడు ముందు ధర్మరాజును రక్షించాలనే ఉద్దేశంతో అర్జునుడికి ధర్మం స్వరూప స్వభావాలను తెలియజేశాడు. జీవహింస మహాపాపంమంటుంది ధర్మం. కానీ బలాకుడు అనే బోయవాడు భార్యాపుత్రులు, వృద్ధులైన తల్లిదండ్రుల ఆకలి తీర్చడం కోసం క్రూర జంతువును చంపి స్వర్గానికి వెళ్ళిన వృత్తాంతాన్ని వివరించాడు. అలాగే సత్యాన్ని మాత్రమే మాట్లాడమంటుంది వేదం. ఒక్కోసారి అది తప్పంటుంది ధర్మసూక్ష్మం. ఒకరోజు కొందరు వ్యక్తులు తమను దొంగలు వెంటపడుతుంటే ప్రాణభయంతో పారిపోయి కౌశికుడనే తపస్వి ముందు నుంచే అరణ్యంలోకి వెళ్ళారు. కొంతసేపటికి దొంగలు అటుగా వచ్చి వారి గురించి కౌశికుణ్ని ప్రశ్నించగా వారు ఎటు పారిపోయిందీ వివరించాడు. దొంగలు వెళ్ళి వారిని సంహరించి ధనాన్ని దోచుకుపోయారు. వారి మరణానికి పరోక్ష కారణమైన కౌశికుడు తాను చేసిన పనిమూలంగా పాపభారాన్ని మోయాల్సి వచ్చింది. కృష్ణుడి మాటలు విని అర్జునుడు ధర్మస్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అన్నను చంపబోయానని చింతించాడు. ప్రతిజ్ఞాభంగం కలగకుండా ధర్మరాజును, తనను కాపాడమని వేడుకొన్నాడు. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు పెద్దలను, గురువులను ఏకవచనంతో సంబోధిస్తే వారిని చంపినట్లే కాగలదన్నాడు. వెంటనే అర్జునుడు అలాగే చేశాడు. ధర్మరాజును అవమానించిన బాధతో కొంతసేపటికి అర్జునుడు నేనింకా బతికుండటం వృథా అంటూ మరణానికి సిద్ధమయ్యాడు. వెంటనే శ్రీ కృష్ణుడు అతణ్ని ఆపి ఆత్మస్తుతి చేసుకోవడం ఆత్మహత్యా సదృశమని చెప్పాడు. వెంటనే ధర్మరాజు ఎదుట అర్జునుడు తనను తాను అనేక రకాలుగా ప్రశంసించుకొని తాను చేసిన పాపం బారినుంచి విముక్తుడయ్యాడు. ఈ విధంగా ధర్మం అనేక ధర్మసూక్ష్మాలతో మిళితమై ఉంటుంది.(చదవండి: -
శివపరివారం కొలువుదీరిన మహాపుణ్య క్షేత్రం ఉజ్జయిని
పరమేశ్వరుడు కొలువై ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఉజ్జయిని. ఇక్కడ ఉన్నది మహాకాళేశ్వరుడు. మహాకాలుడు అంటే చాలా నల్లనివాడు అని ఒక అర్థం. అలాగే మృత్యువుకే మృత్యువు, కాలానికే కాలం.. అంటే కాలాన్నే శాసించేవాడు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి విశిష్టత ఏమిటంటే.. తెల్లవారుఝామున జరిగే అభిషేకం. అది భస్మాభిషేకం. ఆ భస్మం చితాభస్మం. అంటే మహాకాలేశ్వరుడి రూపంలో ఉన్న శివుడికి అప్పుడే కాలిన శవభస్మంతో చేసే అభిషేకం అత్యంత ప్రీతిపాత్రం. దీనికే భస్మహారతి అని పేరు. తెల్లవారుఝామున 3.30 గంటలకు మాత్రమే జరిగే ఈ భస్మహారతిలో పాల్గొనేందుకు పురుషులు మాత్రమే అర్హులు. అదీ ప్రత్యేక వస్త్రధారణతో మాత్రమే. సాధారణంగా జాతకంలో అపమృత్యు దోషాలు ఉన్నవారు, దీర్ఘరోగాలతో బాధపడేవారు, అంతుచిక్కని సమస్యలతో మానసిక వేదన పడుతున్నవారు ఈ భస్మహారతిలో పాల్గొని, ఉపశమనం పొందుతుంటారు.నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిని పూర్వం అవంతీ నగరమనేవారు. సప్తమహానగరాలలో అవంతీనగరం కూడా ఒకటి. ఈ ఉజ్జయిని నగరం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మూలంగా ఎంత ప్రసిద్ధి పొందిందో, మహాకాళికాదేవి వల్ల కూడా అంత ప్రసిద్ధి పొందింది కాబట్టి ఉజ్జయినీ నగరానికి వెళితే ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని, అటు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన మహాకాళిని కూడా సందర్శించి నేత్రపర్వాన్ని పొందవచ్చు.స్థలపురాణంఉజ్జయినీ నగరంలో వేదప్రియుడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నలుగురు కొడుకులూ తండ్రికి తగ్గ పుత్రులు. ఆ నగరానికి సమీపంలోని పర్వతం మీద దూషణుడనే రాక్షసుడుండేవాడు. వాడు ఋషి పుంగవుల జపతపాలకు, వైదిక ధర్మానుష్టానానికి ఆటంకం కలిగిస్తూ ఉండేవాడు. దూషణుడు ఉజ్జయినీ పురప్రజలను కూడా అలాగే భయభ్రాంతులకు గురిచేయసాగాడు. అయితే వేదప్రియుడు మాత్రం ఇవేమీ పట్టకుండా ఒక పార్థివ లింగాన్ని తయారు చేసుకుని, శివదీక్షలో తదేక ధ్యానంలో గడపసాగాడు.దూషణుడు ఒకనాడు వేదప్రియుణ్ణి సంహరించేందుకు ప్రయత్నించగా ఆ లింగం నుంచి మహాశివుడు మహాకాళేశ్వరుడిగా ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని భస్మం చేశాడు. వేదప్రియుడి భక్తితత్పరతలకు సంతోషించిన మహేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అసహాయులైన, దీనులైన తనవంటి భక్తులను అకాల మృత్యుభయం నుంచి కాపాడేందుకు ఇక్కడే ఉండవలసిందిగా నీలకంఠుడిని వేడుకున్నాడు వేదప్రియుడు. ఆ కోరికను మన్నించిన స్వామి ఆనాటి నుంచి మహాకాళేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగస్వరూపుడిగా ఉజ్జయినీ క్షేత్రంలో కొలువుదీరాడు.మరో గాథఉజ్జయినీ రాజ్యాధిపతి చంద్రసేనుడు ఒకరోజు శివపూజ చేస్తుండగా శ్రీకరుడనే గోపాలుడు అక్కడికి వచ్చాడు. చంద్రసేనుడి శివార్చనా విధానాన్ని గమనించి తానూ అలాగే స్వామికి పూజ చేయాలని భావించిన శ్రీకరుడు, దారిలో ఒక రాతిముక్కను తీసుకుని దాన్నే శివలింగంగా భావించి ఇంటికి తీసుకెళ్లి పూజించసాగాడు. ఆ బాలుడు పూజలో నిమగ్నమై ఒక్కోసారి బాహ్యస్మృతిని కూడా కోల్పోయేవాడు. తల్లి ఎంత పిలిచినా పలికేవాడు కాదు. ఒకరోజు పూజలో లీనమై బాహ్యస్మృతి మరిచిన శ్రీకరుని దగ్గర నుంచి అతను శివలింగంగా భావిస్తున్న రాతిముక్కను అతని తల్లి తీసిపారేసింది. స్మృతిలోకి వచ్చిన బాలుడు తల్లి చేసిన పనికి చింతస్తూ శివుణ్టి వేడుకుంటూ ధ్యానం చేశాడు. అప్పుడు శివుడు అతన్ని కరుణించి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు.భస్మాభిషేకంఉజ్జయినీ మహాకాళేశ్వరుడికి సాధారణ అభిషేకానంతరం చితాభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడి విశిష్టత. చితాభస్మం సాధారణంగా అమంగళకరమైనా, స్వామిని తాకడం వల్ల అతి మంగళప్రదమైనదిగా మారుతోంది. భస్మ హారతితోబాటు మరోవిధమైన అర్చన కూడా కాలేశ్వరుడికి జరుగుతుంది. ఇది భస్మాభిషేకం. ఆవుపేడను కాల్చి బూడిద చేసి, మూటగట్టి, దానిని శివలింగం పై భాగాన వేలాడదీసి, అటువంటి మరో మూటతో మెల్లగా కొడుతుంటారు.అప్పుడు భస్మం మహాకాలుడి మీదనేగాక, మొత్తం ఆలయమంతా పరుచుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో నాగసాధువులు రుద్రనమకం చెబుతూ ఢమరుకం, మృదంగం, భేరీలు మోగిస్తూ, శంఖనాదాలు చేస్తారు. ఆ సమయంలో ఆలయంలో ఉన్నవారికి సాక్షాత్తూ కైలాసంలోనే ఉన్నామేమో అనుకునేంతటి అలౌకికానుభూతి కలుగుతుంది.ఇతర విశేషాలుమహాకాళేశ్వరాలయం నేటి మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో క్షి్ర΄ా(శి్ర΄ా)నది ఒడ్డున ఉంది. ఈ నగరంలో ఏడు సాగర తీర్థాలు, 28 సాధారణ తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండాలు ఉన్నాయి. ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్థులుగా ఉంటాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాలేశ్వర లింగం. ఇది దక్షిణాభిముఖంగా ఉంటుంది. మహాకాలేశ్వరుడి విగ్రహం పైన ఓంకారేశ్వర లింగం ఉంటుంది. ఆ పైన ఉండేది నాగచంద్రేశ్వర లింగం. ఆలయంలో గణపతి, ΄ార్వతి, కార్తికేయుల చిత్రాలు పశ్చిమ, ఉత్తర, తూర్పుగోడలపై ఉంటాయి. దక్షిణభాగంలో మహాదేవుని వాహనమైన నంది విగ్రహం ఉంటుంది. మహాకాలేశ్వరలింగం స్వయంభూలింగం. ఇది అత్యంత ్ర΄ాచీనమైనది. సృష్టి ్ర΄ారంభంలో బ్రహ్మ శివుడిని ఇక్కడ మహాకాలునిగా కొలువు తీరి ఉండమని ్ర΄ార్థించాడట. బ్రహ్మ అభీష్టం మేరకు శివుడు ఇక్కడ కొలువై ఈ మందిరానికి ప్రత్యేక శోభను ఇస్తున్నాడని పురాణగాథలు ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ఉన్న ఉజ్జయిని మహాకాలుడి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండదీ΄ాలని పిలుస్తారు.కాలభైరవాలయంఉజ్జయిని వెళ్లినవారు ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవుని సందర్శించుకుని, అటు పిమ్మట మహాకాళికా లేదా మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోవడం ఆచారం. కాగా కాలభైరవుడి విగ్రహానికి మద్యంతో అభిషేకం చేయడం, మామూలుగా గుడికి కొబ్బరికాయ తీసుకు వెళ్లినట్లుగా కాలభైరవుడి ఆలయానికి వెళ్లే భక్తులు మద్యం, కల్లు సీసాలను తీసుకువెళ్లి సమర్పించడం ఆచారం. కాలభైరవార్చన విశిష్ట ఫలప్రదమైనదిగా పేరు పొందింది.ఎలా వెళ్లాలంటే..? హైదరాబాద్‌నుంచి ఉజ్జయినికి నేరుగా రైళ్లున్నాయి. లేదంటే పూణే వెళ్తే అక్కడినుంచి కూడా ఉజ్జయినికి రైళ్లుంటాయి. హైదరాబాద్‌నుంచి జైపూర్ఎక్స్ప్రెస్ ట్రెయిన్ ఎక్కితే సుమారు 19 గంటల్లో ఉజ్జయినిలో దిగవచ్చు. చవకగా, తొందరగా వెళ్లగలిగే మార్గాలలో అది ఒకటి. ఇంకా యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌లో కూడా వెళ్లవచ్చు. విమానంలో అయితే హైదరాబాద్‌నుంచి పూణే లేదా ఇండోర్ వెళ్తే అక్కడినుంచి ఉజ్జయినికి రైలు లేదా బస్సులో వెళ్లవచ్చు.– డి. పూర్ణిమాభాస్కర్ (చదవండి: దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!) -
శత్రువులు..మిత్రులు
ఒక భక్తుడు అడవిలో కఠోర తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు అతని ముందు ఓ ఆయుధంతో ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు. దేవుడు అలా అడిగేసరికి భక్తుడు ఆగుతాడా...‘‘దేవుడా, నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులను నీ ఆయుధంతో నాశనం చేయాలి. ఇదే నా కోరిక’’ అన్నాడు.దేవుడు చిన్న నవ్వు నవ్వాడు. దానికేం చేసేస్తాను అంటూ అదృశ్యమయ్యాడు. కాసేపైంది. భగవంతుడి చేతిలో ఉన్న ఆయుధం తిన్నగా వచ్చి భక్తుడిపై దాడి చేసింది. భక్తుడు తడబడి కిందపడ్డాడు. ‘‘భగవంతుడా, ఏమిటిది... నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులనే కదా నాశనం చేయమన్నాను. కానీ నువ్వు నా మీద దాడి చేయించావు అని అడిగాడు భక్తుడు. వరమడగటం తప్పయిపోయింది’’ అని బాధపడ్డాడు. కాసేపటికి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నువ్వు చెప్పినట్లే ఆయుధాన్ని విసిరాను. నా తప్పమీ లేదు. అదేమీ గురి తప్పలేదు. సరిగ్గానే వచ్చింది’’ అన్నాడు దేవుడు. ఇతరులను దెబ్బతీయాలి. నాశనం చేయాలి... అని అనుకునే నీ మనసే నీ పురోగతికి పెను అడ్డంకి. నీ మనసే నీకు బద్ద శత్రువు. అదే నీ వృద్ధికి అడ్డుగోడగా ఉంది. అందుకే నా ఆయుధం నీ మీదకే దాడి చేసింది అని చెప్పాడు దేవుడు. దీనిని బట్టి మనకెవరు శత్రువో అర్థమై ఉండొచ్చు.మనకు మిత్రులెవరు....మనకు దొరికే మిత్రులను మూడు రకాలుగా విభజించవచ్చు. తాటి చెట్టు. కొబ్బరి చెట్టు. పోక చెట్టు. తాటి చెట్టు ఉంది చూసారూ అది తానుగా ఎదుగుతుంది. తానుగానే నీరు తాగుతుంది. తానుగా పెరుగుతుంది. మనకు ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎదురుపడి మనకు సహాయం చేసే మిత్రులు ఇలాంటి వారు.కొబ్బరి చెట్టు ఉంది చూసారూ... అది ఎప్పుడో అప్పుడు నీరు పోస్తే చాలు. పెరుగుతుంది. ఇలాగే ఎప్పుడైనా సహాయం చేస్తే దానిని గుర్తు పెట్టుకుని మనకు సాయపడే మిత్రులు ఇలాంటి వారు.పోక చెట్టు ఉంది చూసారూ... ఈ చెట్టుకి రోజూ నీరు పెట్టాలి. అప్పుడే పెరుగుతుంది. ఫలితాన్ని ఇస్తుంది. ఇలా రోజూ సహాయం చేస్తేనే మనల్ని గమనించే మిత్రులు ఉంటారు కొందరు. వీరు పోక చెట్టులాగా. కనుక మిత్రులు ఈ విధంగా ఎవరు ఎలాంటి వారో గుర్తు పెట్టుకోవచ్చు. దానికి తగినట్లు మెలగాలి. అది తప్పేమీ కాదు. – యామిజాల జగదీశ్ -
తాత్వికత: ఎంతో చిన్నది జీవితం
ఓ గురువు అటవీ ప్రాంతంలోని మారుమూల ఉన్న చిన్నచిన్న గ్రామాలకు వెళ్ళి సత్సంగం చేయాలని బయలుదేరాడు. ఆయనతోపాటు శిష్యబృందం కూడా బయలుదేరింది. కొండలు, గుట్టలు, సెలయేర్లు దాటి వెళ్తూ ఉన్నారు. దారిలో ఓ శిష్యుడు, గురువుని ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా?’’ అని అడిగాడు. ‘‘మానవ శరీరం దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం. మరలా రమ్మంటే రాదు. అందుకని దాని విలువ తెలుసుకుని క్షణం క్షణం ఆనందంగా జీవించాలి!’’ అన్నాడు.‘‘అదెలా?’’ అని అడిగాడు శిష్యుడు.ఇంతలో దూరంగా కొందరు మహిళలు పొయ్యిపైన నీళ్ళు కాగిస్తూ కనిపించారు గురువుకి. శిష్యుడిని అక్కడే కొద్దిసేపు ఆగమని చె΄్పాడు. ఆ కట్టెలు కాలే వాసన పీల్చి కాలుతున్నదేదో చెప్పమన్నాడు.వాసన పీల్చిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ‘తను గమనించింది వాస్తవమా కాదా’ అని ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాడు. తను చూస్తున్నది ముమ్మాటికీ నిజమేనని అర్థమయ్యింది.‘‘అక్కడ కాలుతున్నది చందనం కట్టెలు. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు. ఎంతో విలువైన చందనం కొయ్యలను వంటచెరుకుగా వాడటమేమిటి?’’ అని మనసులో అనుకున్నాడు.‘భర్తలకు తెలియకుండా వారు పొరపాటుగా అలా చేస్తున్నారేమోనని’ అనుమానమేసింది. జాగ్రత్తగా గమనించిన అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. అది ఏమిటంటే ఆ మహిళలకు కొద్ది దూరంలోనే వారి భర్తలు చందనం కొయ్యలను కత్తితో నరికి పొయ్యిలో పెట్టడానికి అనువుగా కట్టెలు చీల్చుతున్నారు.అదే విషయాన్ని శిష్యుడు బాధగా ‘బంగారంలాంటి చందనాన్ని మంటపాలు చేయడం’ గురించి గురువుకు చెప్పాడు. దానికి గురువు నవ్వి ‘‘చందనం కొయ్యల విలువ, వాటి ప్రత్యేకత వారికి తెలియదు. అందుకే వాటిని పొయ్యిలోపెట్టి తగులబెట్టేస్తున్నారు. వారి కళ్ళకు అవి మామూలు కట్టెల్లాగే అగుపిస్తున్నాయి. నీకు వాటి విలువ తెలుసు కాబట్టే ఆశ్చర్యపోతున్నావు. వారు చేస్తున్నది తప్పని చెబుతున్నావు. వారికి వాటి విలువ తెలిసేంత వరకు వారు చేస్తున్నది సరైనదేనని అనుకుంటారు. మనిషి కూడా అంతే. జీవితం విలువ తెలుసుకోక లేనిపోని పట్టింపులు, అహం, అసూయాద్వేషాలు, కోపం, ప్రతీకారం, ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం... ఇలాంటి వాటితో ఎంతోకాలం వృథా చేస్తున్నాడు. జీవితం విలువైనదన్న ఎరుక ఉంటే చాలు, ఆనందం మన వెంటే ఉంటుంది’’ అని వివరించాడు.జీవితం చాలా చిన్నదనీ, ప్రతిక్షణం ప్రకృతి ప్రసాదమని, అది తెలుసుకోక΄ోతే అసలైన ఆనందాన్ని కోల్పోతామని గ్రహించిన శిష్యబృందం ముందుకు నడిచింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
అగస్త్యుడి చేతిలో రావణుడి ఓటమి
మేరు పర్వతంతో స్పర్థకు పోయిన వింధ్య పర్వతం ఆకాశాన్ని కమ్మేస్తూ పెరిగిపోవడంతో గ్రహగతులు తప్పి, ముల్లోకాల్లోనూ కల్లోలం ఏర్పడింది. దేవతలందరూ ప్రార్థించడంతో అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలసి వింధ్య పర్వతం వైపుగా దక్షిణదేశ యాత్రకు బయలుదేరాడు. అగస్త్యుడు భార్యా సమేతంగా తనవైపు వస్తుండటంతో వింధ్యుడు ఆయన ముందు మోకరిల్లాడు. తాను దక్షిణదేశ యాత్రలకు వెళుతున్నానని, తాను తిరిగి వచ్చేంత వరకు అలాగే ఉండమని వింధ్యుణ్ణి ఆదేశించాడు. అలా వింధ్యుడిని అణచిన అగస్త్యుడు దక్షిణ భారత దేశంలోని తీర్థక్షేత్రాలన్నింటినీ దర్శించుకున్నాడు. తీర్థయాత్రలు ముగిశాక ఆయన కావేరీ తీరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని, భార్యా సమేతంగా తపోజీవనం గడపసాగాడు.దక్షిణ భారత దేశానికి ఆవల సముద్రం నడిబొడ్డున ఉన్న లంకను అప్పట్లో రావణుడు పరిపాలించేవాడు. తన అన్న కుబేరుడిని అలకాపురి వరకు తరిమికొట్టి, అప్పటి వరకు అతడు పాలించిన లంకను, అతడి పుష్పక విమానాన్ని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత రావణుడు దేవతలను జయించాడు. అష్ట దిక్పాలకులను తన ఆజ్ఞలకు లోబడేలా చేసుకున్నాడు. నవగ్రహాలను తన అదుపులోకి తెచ్చుకున్నాడు. అయితే, లంకకు చేరువలో ఉన్న దక్షిణ భారతదేశం మాత్రం అతడికి స్వాధీనం కాలేదు. ఆ ప్రాంతాన్ని కూడా ఎలాగైనా తన వశంలోకి తెచ్చుకోవాలని తలచాడు.దక్షిణ భారతదేశంలో పరిస్థితులు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకుని రావాలని ముందుగా కొందరు దూతలను, వేగులను పంపాడు. వారు దక్షిణ భారతదేశం నలుమూలలా సంచరించారు. కొండలు, కోనలు, అడవులతో పచ్చని ప్రకృతి సౌందర్యంతో అలరారే దక్షిణ భారతదేశం అత్యంత ప్రశాంతంగా కనిపించింది. అడవుల్లో అక్కడక్కడా చక్కని పొదరిళ్లలాంటి రుషి ఆశ్రమాలు కనిపించాయి. వారు తిరిగి లంకకు చేరుకుని, తాము చూసిన పరిస్థితులను రావణుడికి వివరించారు.అంత ప్రశాంతంగా ఉన్న దక్షిణ భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవడం తేలిక పనేనని అనుకున్నాడు. తాను కూడా ఒకసారి స్వయంగా పరిస్థితులను చూసి, అవసరమైనట్లయితే యుద్ధానికి తగిన ఏర్పాట్లతో తిరిగి వచ్చి, దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నాడు.కొద్దిమంది అనచరులతో కలసి రావణుడు దక్షిణ భారతదేశానికి వచ్చాడు. కావేరీ తీరం మీదుగా సంచరిస్తూ, అగస్త్యుడి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు. ఆశ్రమం ఆవరణలోనే అగస్త్యుడు కూర్చుని ఉండటం చూసి, రావణుడు ‘మునీశ్వరా! ప్రణామాలు’ అంటూ నమస్కరించాడు.అగస్త్యుడు సాదరంగా స్వాగతం పలుకుతూ, ‘రావయ్యా లంకేశ్వరా! రా! లోపలికి పద’ అంటూ ఆశ్రమం లోనికి తీసుకుపోయి, ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘ఏం పని మీద ఇక్కడకు వచ్చావు?’ అని నేరుగా అడిగాడు అగస్త్యుడు.‘మునీశ్వరా! ఇప్పటికే నేను స్వర్గాన్ని కూడా నా అధీనంలోకి తెచ్చుకున్నాను. ఈ ప్రాంతం మాత్రం ఇంకా నా స్వాధీనంలో లేదు. దీనిని కూడా నా స్వాధీనంలోకి తెచ్చుకుందామనే ఉద్దేశంతోనే ఇక్కడకు వచ్చాను’ అని అసలు విషయాన్ని చెప్పేశాడు రావణుడు.‘అది సరే, నువ్వు రుద్రవీణ గొప్పగా వాయిస్తావుటగా! నువ్వు నాతో రుద్రవీణ వాయించి జయించావనుకో, నీ కోరిక నెరవేరుతుంది’ అన్నాడు అగస్త్యుడు.‘సరే, మునీశ్వరా!’ అంటూ అగస్త్యుడితో వీణా వాదన పోటీకి సిద్ధపడ్డాడు రావణుడు.అగస్త్యుడితో రావణుడు వీణా వాదన పోటీకి సిద్ధపడిన వార్త ముల్లోకాలకూ పాకింది. వారి పోటీని తిలకించడానికి దేవ గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ తరలి వచ్చారు. ఇద్దరికీ పోటీ ప్రారంభమైంది. మొదట మంద్రగతిలో ప్రారంభించారు. మధ్యమంలోకి వెళ్లాక పోటా పోటీగా అపురూపమైన రాగాలను పలికించారు. తారస్థాయిలో రావణుడు అగస్త్యుడి ధాటిని, వేగాన్ని అందుకోవడానికి నానా తంటాలు పడసాగాడు. అగస్త్యుడి వీణా వాదనకు చుట్టుపక్కల కొండలు నీరై ప్రవహించసాగాయి. వీణ వాయించడంలో అగస్త్యుడి నైపుణ్యానికి రావణుడు నిరుత్తరుడయ్యాడు. మారు మాట్లాడకుండా ఓటమిని అంగీకరించాడు.‘మహర్షీ! నా ఓటమిని అంగీకరిస్తున్నాను. మీరు సంచరిస్తున్న ఈ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించను’ అని చెప్పి లంకకు వెనుదిరిగాడు.∙సాంఖ్యాయన -
ధర్మపురిని దర్శిస్తే... యమపురి ఉండదట !
ధర్మపురి: ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం ప్రాంగణంలోనే యమధర్మరాజు ఆలయం ఉంది. ఇక్కడి యమధర్మరాజు విగ్రహం దేశంలోనే అరుదైనదిగా చెబుతుంటారు. భక్తులు ముందుగా యమధర్మరాజును దర్శించుకున్న తర్వాతే శ్రీలక్ష్మీనృసింహ, వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. యమధర్మరాజు భరణి జన్మనక్షత్రం సందర్భంగా ప్రతి నెలా ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం, హారతి, మంత్రపుష్పం తదితర పూజలు చేస్తారు. ఏటా దీపావళి పర్వదినం సందర్భంగా యమ ద్వితీయ వేడుకలు నిర్వహిస్తారు. యమ ద్వితీయ రోజు యమధర్మరాజు నరక ద్వారాలను మూసివేసి తన సోదరి అయిన యమి ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. నరక ద్వారాలు మూసిన సందర్భంగా ఆరోజు మృతిచెందిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని నమ్మకం. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. యమధర్మరాజు ఆలయంలో ఆయుష్షు హోమం ఇదీ ఆలయ ప్రాశస్త్యం పూర్వం యముడు తాను చేసిన పాపాన్ని తొలగించుకోవాలనుకున్నాడు. మనస్సుకు శాంతి కావాలని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు. చివరగా నృసింహస్వామిని దర్శించుకునేందుకు ధర్మపురికి చేరుకున్నాడు. పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించి.. నృసింహుడిని శరణు వేడుకుంటాడు. స్వామి అనుగ్రహం లభించి పాప విముక్తుడయ్యాడు. నృసింహుని కృపతో ఆలయంలో దక్షిణ దిశలో వెలిశాడు. ముందు భక్తులు తనను దర్శించుకున్న తర్వాతే నృసింహుడిని దర్శించుకునేలా వరం పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి. కాగా యముడు గోదావరి నదిలో స్నానం ఆచరించిన చోట యమగుండాలు అనే పేరు వచ్చింది. క్రీ.శ 850– 928 నాటి ఆలయం ధర్మవర్మ అనే రాజు పాలించినందుకు ధర్మపురికి ఆ పేరు వచ్చింది. ఈ క్షేత్రం క్రీ.శ. 850– 928 నాటి కంటే ముందునుంచే ఉన్నా.. క్రీ.శ. 1422–1436 కాలంలో బహమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంసమైంది. అనంతరం 17వ శతాబ్దంలో నృసింహ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు చరిత్ర చెబుతోంది.మా ఇలవేల్పు లక్ష్మీనృసింహుడు ధర్మపురి లక్ష్మీనృసింహుడు మా ఇంటి ఇలవేల్పు. స్వామివారి దర్శనం కోసం వస్తూనే ఉంటాం. ఇక్కడున్న యమ ధర్మరాజును దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని మా నమ్మకం. – భారతి, భక్తురాలు, కరీంనగర్యముని దర్శనం కోసం వస్తాం ధర్మపురిలోని యమ ధర్మరాజు దర్శనం కోసం వస్తుంటాం. దేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని అంటుంటారు. అందుకే ఏటా యమున్ని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో వస్తాం. – సాహితి, భక్తురాలు, మంచిర్యాలఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ధర్మపురిలోని యమధర్మరాజు ఆలయాన్ని దేశంలోనే అరుదైనదిగా భావిస్తారు. అందుకే యముడు, లక్ష్మీనృసింహుని దర్శనం కోసం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. – శ్రీనివాస్, ధర్మపురి ఆలయ ఈవో -
మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపించే నెలరేడు!
ప్రకృతి తీరుతెన్నులను చురుకుగా పరిశీలించే స్వభావం కలవారికి ఎవరికయినా, కలువపూలు వెన్నెలలో వికసిస్తాయనీ, మనిషి మనసుకూ చందమామకూ సంబంధం ఉంటుందనీ మరొకరు చెప్పవలసిన పని ఉండదు. పున్నమి చంద్రుడిని చూస్తే... సముద్రమే పట్టరాని ఆవేశంతో పొంగిపోతుంది. మనిషి మనసూ అంతే. ‘రసమయ జగతిని ఉసిగొలిపే తన మిసమిస’తో నెలరేడు మనుషుల మదులను ఉత్తేజితం చేసి మైమరపిస్తాడు. మనసు పని తీరును తీవ్రతరం చేస్తాడు. కోరిన దిశలో మరింత వేగంగా నడిపిస్తాడు. భోగులను భోగంవైపూ, యోగులను యోగంవైపూ, భావుకులను భావ తీవ్రతవైపూ, ప్రేమికులను ప్రేమ జ్వరం దిశగానూ, భక్తులను అనన్య భక్తి మార్గంలోనూ నడుపుతాడు. ‘చంద్రమా మనసో జాతంః’ చంద్రుడు విరాట్ పురుషుని మనసు నుండి సృష్టి అయినవాడు అని వేదం. అందుకే కాబోలు మనసుకు పున్నమి చంద్రుడంటే అంత వెర్రి ఆకర్షణ.అందునా, కార్తీక పూర్ణిమ మరీ అందమైంది. అసలే శరదృతువు. ఆపైన రాతిరి. ఆ పైన పున్నమి. పున్నమి అంటే మామూలు పున్నమి కాదు. పుచ్చ పూవు వెన్నెలల పున్నమి. మనసు చురుకుగా చిందులు వేస్తూ పరవశంతో, రెట్టింపు ఉత్సాహంతో విజృంభించి విహరించే సమయం.అయితే చిత్త నది ‘ఉభయతో వాహిని’ అన్నారు. అది ‘కల్యాణం’ (శుభం) దిశగానూ ప్రవహించగలదు. వినాశం దిశగానూ ప్రవహించ గలదు. మనస్సు యజమానిగా ఉండి, ఇంద్రియాలను నియంత్రిస్తే, చిత్త నది సరయిన దిశలో ప్రవహించేందుకు అవి సాయపడతాయి. ఇంద్రి యాలు లాక్కెళ్ళినట్టు, మనసు వెళితే ప్రవాహం వినాశం దిశ పడుతుంది.చదవండి: కార్తీక పూర్ణమి విశిష్టత.. త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారు?చిత్త నదిని ‘కల్యాణం’ దిశగా మళ్ళించే ప్రయత్నాలకు పున్నమి దినాలు అనువైనవనీ, పున్నములలో కార్తీక పూర్ణిమ ఉత్తమోత్తమమనీ భారతీయ సంప్రదాయం. ఈ పుణ్య దినాన చేసిన నదీస్నానాలకూ, తులసి పూజలకూ, జపతప దాన యజ్ఞ హోమాది కర్మలకూ ఫలితాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయని నమ్మిక. ప్రాకృతిక కారణాలవల్ల ఈ పర్వదినాన, మనసు మరింత శ్రద్ధా, శుద్ధీ నిలుపుకొనేందుకు సన్నద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈనాడు చేసే ఉపవాసాలూ, శివారాధనలూ, ప్రత్యేక దీపారాధనలూ, దీపదానాలూ, ఆలయాలలో ఆకాశ దీప నమస్కారాలూ, జ్వాలా తోరణ దర్శనాలూ వంటి పర్వదిన విధులు, సత్ఫలాలు కాంక్షించే సజ్జనులకు పెద్దలు చూపిన మార్గం.కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు?
కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు, విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతదేశంలోఇదే రోజుని దేవ దీపావళి, దేవ దివాళి అని పిలుస్తుంటారు. అలాగే అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల దీన్ని త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. అంత పరమ పవిత్రమైన ఈ కార్తీక పూర్ణిమ వెనుకున్న నేపథ్యం, ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందామా..!ఏం చేస్తారంటే..కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.సత్యనారాయణ వ్రతం :సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.ఏకాదశి రుద్రాభిషేకం :ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్రాభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత. జ్వాలాతోరణం...ఈ రోజు సంధ్యాసమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీపరమేశ్వరులను పల్లకిలో ఉంచి ఈ తోరణం నుంచి మూడుసార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల అనేక జన్మల నుంచి చేసిన పాపాలన్నీ పటాపంచలై సుఖ సంతోషాలతో వర్థిల్లుతారని శాస్త్రవచనం.ఈ పూర్ణిమకు మరొక పేరు..కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. కార్తీకపురాణం ప్రకారం ఈరోజు దీపదానం, సాలగ్రామ దానం చేయాలి. దానధర్మాలు చేయాలి. ఇవి కోటిరెట్లు ఫలితాన్నిస్తాయని భక్తుల నమ్మకం. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు. ప్రాముఖ్యత గలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. పౌర్ణమినాడు శ్రీ కృష్ణుని రాసలీలకు పెట్టినది పేరు. అందువలన ఈ రోజు శ్రీ కృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతమైనది. మరోవేపు సిక్కులు , జైనులు కూడా..సిక్కులు , జైన మతస్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు. సిక్కులు దైవంగా భావించే శ్రీ గురు నానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజుని పవిత్రమైనదిగా భావిస్తారు. జైన్లు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.(చదవండి: 365 వత్తులు..కార్తీక పురాణం ఏం చెబుతోంది?) -
365 వత్తులు.. కార్తీక పురాణం ఏం చెబుతోంది?
కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున స్నానం, దీపం,దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పవిత్ర కార్తీకమాసంలో పౌర్ణమికిచాలా ప్రాధాన్యత ఉంది. చాలా పవిత్రమైంది భక్తులు పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తికపౌర్ణమి ఎపుడు, పూజలు గురించి తెలుసుకుందాం.కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలన్నీ దీప కాంతులతో వెలుగొందుతాయి. శివనామ స్మరణలతో శివాలయాలన్నీ మార్మోగుతాయి. కార్తీక పూర్ణిమ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించినట్లు నమ్ముతారు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. త్రిపురాసురుని పీడ తొలగిపోయినందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించారట.. అందుకే భక్తులు కూడా ఈ విజయాన్ని ఎంతో భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. దేవాలయాలు , నదీ తీరాల దగ్గర దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి దొప్పల్లో నేతి దీపాలను వెలగించి నీటిలో వదిలే దృశ్యాలు శోభాయమానంగా ఉంటాయి.ఈ రోజున విష్ణువు తన మత్స్య (చేప) అవతారంలో కనిపించడాన్ని సూచిస్తుందని, ఇది సృష్టి సంరక్షణకు సంబంధించిన విశ్వ చక్రంతో ముడిపడి ఉందని నమ్ముతారు. ఈ పూర్ణిమ నాడు చేసే పుణ్య కార్యాలు ఆధ్యాత్మిక వృద్ధితోపాటు, సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.“అల్పమపి క్షితౌ క్షిప్తం వటబీజం ప్రవర్ధతే.జలయోగాత్ యథా దానాత్ పుణ్యవృక్షో ⁇ పి వర్ధతే॥”“దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే”కార్తీక పూర్ణిమ నాడు పవిత్ర స్నానం , దానంగంగా , యమునా, కృష్ణ లాంటి వంటి పవిత్ర నదులలో స్నానం చేస్తే మోక్షం, లభిస్తుందని సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఆవునేతిలో ఉంచిన 365 వత్తులను ఆ దేవుడి ముందు వెలిగించి పాపాలను తొలగించి, ముక్తిని ప్రసాదించమని కోరుకుంటారు. సంవత్సరమంతా పూజలు చేయకపోయినా, కార్తీకమాసం అంతా దీపారాధన చేయలేనివారు కనీసం కార్తీక పౌర్ణమిరోజు భక్తితో ఇలా దీపం ముట్టించి, ఆ దేవదేవుడికి నమస్కరిస్తే చాలని కార్తీక పురాణం చెబుతోంది.రోజంతా ఉపవాసం ఉండి శివాలయం లేదా వైష్ణవ ఆలయంలో ఆవునేతి లో నానబెట్టి ఉంచుకున్న 365 వత్తులను వెలిగిస్తారు. భక్తితో పూజాదికాలు సమర్పించి అపుడు ఉపవాసాన్ని విరమిస్తారు. దేవాలయాలక, నదీ తీరాలకు వెళ్లలేని వారు ఇంట్లో చక్కగా శుభ్రం చేసి పిండితో ముగ్గులు పెట్టుకొని అలంకరించుకున్న తులసమ్మ దగ్గర పున్నమి కాంతుల్లో ఈ దీపాలు వెలిగించి నమస్కరించినా, శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతారు. అలాగే కార్తీక పూర్ణిమ నాడు చేసే విరాళం ఈ రోజున అత్యంత ముఖ్యమైనది. బ్రాహ్మణులు ,నిరుపేదలకు ఆహారం, దుస్తులు, ఇతర వస్తువులను దానం చేస్తారు. గరుడ పురాణంతో సహా వివిధ హిందూ గ్రంథాలలో దాతృత్వం గురించిన ప్రాముఖ్యత చెప్పబడింది. మరికొంతమంది ఈ రోజు కేదారీశ్వరుడిని నోము నోచుకొని అన్నదానం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున దీపాలను దానం చేయడం మరో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీ పూజ, తులసి పూజ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. జ్వాలా తోరణంతో కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. తద్వారా ఆధ్యాత్మిక ఫలితాలతోపాటు ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. -
కందినంది : అరుదైన నక్షత్రాకారపు కట్టడం, తనివి తీరని అద్భుతం
అతి పురాతనమైన పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నంది కంది గ్రామంలో ఉంది. స్వయంగా శ్రీరాముడు ఈ రామలింగేశ్వర లింగాన్ని ప్రతిష్టించినట్లు చెప్పుకుంటారు. తర్వాత 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ఈ మహాలింగాన్ని గుర్తించి రామలింగేశ్వర ఆలయంగా నక్షత్ర ఆకారంలో గుడిని కట్టడం మరో విశిష్టత. ఇక్కడ 6 శాసనాలు ఉన్నాయి. ఒక్కొక్క శాసనం ఒక్కొక్క విశిష్టత. ఈ ఆరు శాసనాలలో ఆరు రంధ్రాలు ఉండడం విశేషం. ఈ 6 రంధ్రాల నుండి సూర్యుని కిరణాలు రామలింగేశ్వరునిపై పడడం మరో విశిష్టత. రెండవది, ఈ గుడి గర్భగుడి ఆకారం నక్షత్రం ఆకారంలో ఉండడం మరో విశేషం. ఇక్కడ గజ స్తంభాలు కళ్యాణ చాళుక్యుల శిల్ప కళకు నిదర్శనం. ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలోరామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. సంగారెడ్డి నుంచి 15 కి.మీ., మెదక్ నుండి 60 కి.మీ ల దూరంలో ఉన్న నంది కంది ఒక చిన్న గ్రామం నక్షత్ర ఆకారంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది.11వ శతాబ్దంలో వీర చాళుక్యుల ఆధ్వర్యంలో నిర్మించబడిన నందికందిలోని రామలింగేశ్వర దేవాలయం ప్రత్యేకించి దాని ప్రత్యేక ఆకృతికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రతి స్తంభం అద్భుతమైన శిల్పకళతో కనువిందు చేస్తుంది. సెంట్రల్ హాల్ లేదా నవరంగలోని నాలుగు అలంకార స్తంభాలు దాని అత్యుత్తమ నమూనాలలో ఒకటి. బ్రహ్మ, విష్ణు, శివ, నరసింహ, వరాహ, నటరాజ, దేవి మహిషాసుర మర్దిని, సరస్వతి, గజలక్ష్మి వంటి దేవతల రూపాలు స్తంభాల ముఖభాగం, పక్క గోడలను అలంకరించాయి.గర్భగృహంలో ఆలయ ప్రధాన దైవాలైన రామలింగేశ్వర స్వామి లింగరూపం లో కొలువై ఉండగా,పార్వతీ దేవి విగ్రహం అందమైన నల్ల రాతిపై చెక్కబడి ఉంటుంది. ఇతర శిల్పాలలో అప్సరసలు, దిక్పాలకులు, రాక్షసులు, మాతృమూర్తి, దర్పణ యోధుల శిల్పాలు ఉన్నాయి. ఆలయంలో రామలింగేశ్వరునికి అభిముఖంగా నల్లరాతితో చెక్కి ఉన్న భారీ నంది విగ్రహం మూల విరాట్టులతో పోటీ పడుతున్నదా అన్నంత అందంగా... అద్భుతంగా... ఆకర్షణీయంగా ఉంటుంది. రామలింగేశ్వర దేవాలయం శిల్పకళా వైభవానికి ఒక ప్రత్యేక నమూనా. దాని అద్భుతమైన శిల్పం చాళుక్యుల శకం నాటి హస్తకళల గురించి చెబుతుంది. చాళుక్య రాజుల నుంచి సంక్రమించిన సంస్కృతి, వారసత్వాన్ని అనుభవించాలనుకుంటే ఈ ఆలయాన్ని మిస్ చేయకూడదు.సుసంపన్నమైన చారిత్రిక ప్రాముఖ్యత, అద్భుతమైన చెక్కడం వల్ల రామలింగేశ్వర దేవాలయం తెలంగాణలోని పురాతన దేవాలయాల జాబితాలో ఉండాలి.ఆలయ వేళలు..ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7:00 వరకుఎక్కడ బస చేయాలి?∙సంగారెడ్డి, సమీప పట్టణం, కొన్ని మంచి వసతి ఎంపికలను అందిస్తుంది. శ్రీ చంద్ర ఫార్మ్స్ – రిసార్ట్స్ న్యూ గ్రాండ్ హోటల్ లాడ్జ్ కొన్ని ప్రసిద్ధ ఎంపికలు.∙అంతేకాకుండా, హైదరాబాద్‌కు చాలా దగ్గరగా ఉండటంతో, పర్యాటకులు హైదరాబాద్ నుంచి డే ట్రిప్‌లలో సంగారెడ్డికి కూడా ప్రయాణించవచ్చు.ఇంకా ఏమేం చూడవచ్చంటే..?మెదక్ కోట, పోచారం ఆనకట్ట రిజర్వాయర్, పోచారం వన్య ప్రాణుల అభయారణ్యం, కోటిలింగేశ్వర ఆలయం, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, పురావస్తు మ్యూజియం, కొండాపూర్. కళ్యాణి చాళుక్యుల నిర్మాణ శైలికి నిదర్శనం నంది కంది ఆలయం. ఇది క్రీ.శ 1014లో విక్రమాదిత్యుని హయాంలో నిర్మించబడి ఉండవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయం విలక్షణమైన లక్షణాలలో ఒకటి దాని ప్రవేశ తోరణం, తోరణం అని పిలువబడే ఏడు విలోమ తామర నమూనాలతో అలంకృతమై ఉంటుంది. కమలాల మధ్య ఉన్న ఈ ఖాళీలు ఉదయపు సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాయి. లోపలి గర్భగుడిలోని శివలింగాన్ని ప్రకాశవంతం చేస్తాయి, ప్రతి అంతరం ఒక ఋతువును సూచిస్తుంది. ఈ ఆలయం బ్రహ్మ, విష్ణు, శివుడు, నరసింహ వంటి హిందూ దేవతలతో ΄ాటు వరాహ, నటరాజ, దేవి మహిషాసురమర్దిని, సరస్వతి, గజలక్ష్మితో సహా క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడింది. ఈ బొమ్మలు నాలుగు కేంద్ర స్తంభాలలో చెక్కబడ్డాయి, ఇవి ఆలయ మండపం లేదా నవరంగాన్ని ఏర్పరుస్తాయి. అదనంగా, ఈ ఆలయంలో దిశాత్మక సంరక్షకులు, సొగసైన బొమ్మలు, పౌరాణిక జీవుల శిల్పాలు ఉన్నాయి. గర్భగుడి నక్షత్రం ఆకారంలో...శిఖరం పద్మాకారంలో రూ పొందించడబడి ఉంటాయి. ఈ నిర్మాణ అంశాలు, కళాకృతుల కలయిక పురాతన హస్తకళ మతపరమైన కళలపై ఆసక్తి ఉన్నవారికి అపూర్వమైన, అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. -
ప్రతీదానికీ ఓ పద్ధతి ఉంటుంది కళ్ళు మూసుకుంటే సరిపోదు!!
అతను తన గురువుగారి ఆశ్రమంలో విడిగా ఏర్పాటు చేసిన ఓ పూరిపాకలో కూర్చుని స్థిరమైన మనసు కోసం తీవ్రంగా ప్రయత్నించ సాగాడు. ఎవరు చూడడానికి వచ్చినా అతను కళ్ళు తెరచి చూసేవాడు కాదు. ఎవరైనా వచ్చినట్టు అలికిడైనా సరే చూసేవాడు కాదు.అయితే ఒకరోజు గురువుగారు ఈ శిష్యుడిని చూడడానికి వెళ్ళారు. కానీ శిష్యుడు గురువుగారిని కూడా పట్టించుకోలేదు. అయినా గురువుగారు అక్కడి నుంచి కదలలేదు. పైగా ఆ పూరిపాక గుమ్మంలో ఓ ఇటుకరాయిని మరొక రాయిమీద పెట్టి అరగదీయడం మొదలుపెట్టాడు. అలా గీయడంతో పుట్టిన శబ్దాన్ని శిష్యుడు భరించలేకపోయాడు.అతను కళ్ళు తెరిచి అడిగాడు –‘‘మీరేం చేస్తున్నారు...తెలుస్తోందా...’’అని.గురువు చెప్పాడు – ‘‘ఇటుకను అద్దంగా మారుస్తున్నాను’’ అని.అప్పుడతను ‘‘ఇటుకను అద్దంగా మార్చడం సాధ్యమా... దానిని పిచ్చితనమంటారు... మరెంత అరగదీస్తే అంతగా అది అరిగి చివరికి ఇటుకరాయి జాడ కూడా కనిపించకుండా పోతుంది. అలాంటిది అద్దం ఎలా ఏర్పడుతుంది. కాస్త ఆపండి ఆలోచించండి... నన్ను నా మనసు మీద ఏకాగ్రత నిలుపు కోనివ్వండి’’ అని చెప్పాడు.అతని మాటలకు గురువుకు నవ్వొచ్చింది.‘‘అలాగైతే నువ్వేం చేస్తున్నావు... ఇటుకరాయి అద్దం కాలేని పక్షంలో మనసు ఎలా స్వచ్ఛమైన అద్దమవుతుందో చెప్పు. ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన నిలకడ వచ్చేయదు. దానికో పద్ధతి ఉంది. అది తెలుసుకోకుండా ఎవరినీ చూడనని కళ్ళు గట్టిగా మూసుకుంటే సరిపోతుందని అనుకోవడం ఎంత అవివేకం?’’ అని ప్రశ్నించాడు గురువు. శిష్యుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. – యామిజాల జగదీశ్ -
కార్తీకమాసంలో ఉసిరిని పూజిస్తే...
పవిత్రమైన కార్తీకమాసంలో తులసి, ఉసిరికోట ముందు దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలుగుతాయి అని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరిచెట్టును పూజించటం వలన చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పార్ణమి రోజున ఉసిరికాయలతో దీపాలు వెలిగించి ఈ శ్లోకాలు పఠించాలి. దాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహా ప్రాజే యశోదేహి బలంచమే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఉసిరి చెట్టు పూజ సాధారణంగా అమావాస్య, పూర్ణిమ, ఇతర ముఖ్యమైన పండుగలు, పర్వదినాలలో నిర్వహిస్తారు. పూజ సమయంలో, చెట్టు వద్ద ఒక చిన్న, లోతులేని గొయ్యి తవ్వి, దానిలో ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగిస్తారు. చెట్టుకు పూలు, పండ్లు, ఇతర పూజాద్రవ్యాలను సమర్పించి శ్లోకాలను పఠిస్తారు. ఉసిరి చెట్టు చెట్టును విష్ణువుకు ప్రతి రూపంగా పరిగణిస్తారు. అందువల్ల ఉసిరి చెట్టును పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాదు, కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, తులసి చెట్టును నాటడం వల్ల శ్రేయస్సు, సంతోషం కలుగుతాయంటారు. అందువల్ల ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ వంటి పర్వదినాలలో ఆలయాలలో ఉసిరి, తులసి మొక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా పంచుతారు. పండ్లకు బదులు మనం ఎవరికైనా మొక్కలను కూడా పంచవచ్చు. -
ఆర్థిక ఇబ్బందులా? పరిహారాలివిగో!
ఒక్కొక్కసారి ఎంత కష్టపడుతున్నా ఆర్థిక ఇక్కట్ల నుంచి గట్టెక్కడం కష్టంగా ఉంటుంది. కాలం పగబట్టిందేమో అనేంతగా గడ్డు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా అర్హతలకు, అనుభవానికి తగిన అవకాశాలు దక్కవు. దొరికిన అవకాశాలు తగిన ఆదాయాన్ని ఇచ్చేవిగా ఉండవు. అసంతృప్తి, నిస్పృహ మనసును కుదురుగా ఉండనివ్వవు. అలాంటి పరిస్థితుల్లో ఈ పరిహారాలను పాటించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.కాకులకు, కుక్కలకు, ఆవులకు ఆహారాన్ని పెట్టండి. ఇంట్లోని బీరువాలు, నగలు వంటి విలువైన వస్తువులను భద్రపరచుకునే పెట్టెలను ఖాళీగా ఉంచకండి. వాటిలో ఉంచడానికి ఏమీ లేనట్లయితే, కనీసం నాలుగు బాదం గింజలైనా వేసి ఉంచండి. ఎలాంటి ప్రలోభాలు ఎదురైనా అనైతిక కార్యకలాపాలకు, అవినీతికి దూరంగా ఉండండి. జూదానికి, స్పెక్యులేటివ్ లావాదేవీలకు దూరంగా ఉండండి. కుంకుమపువ్వును, కస్తూరిని కలిపి తిలకంగా ధరించండి. నిత్యపూజలో భాగంగా లక్ష్మీదేవిని తెల్లని పూలతో అర్చించండి. తెలుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టండి.ప్రవహిస్తున్న నీటిలో చిన్నబెల్లం ముక్కను, అక్షతలను విడిచిపెట్టండి. కనీసం ఆరు ఆదివారాలు నిరుపేద అంధులకు అన్నదానం చేయండి.వెదురుబొంగులో పంచదార నింపి, నిర్జనప్రదేశంలో దానిని పాతిపెట్టండి. మర్రిచెట్టు మొదట్లో పాలు, కొబ్బరినీరు ΄ోయండి. శనివారం పూర్తిగా మద్య మాంసాలకు దూరంగా ఉండండి. శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం జరిపించండి. కార్తీక మాసంలో రుద్రాభిషేకం జరిపించడం వల్ల దోషనివారణ జరుగుతుంది.– సాంఖ్యాయన -
దక్షిణ భారతాన అతి పెద్ద ఆలయం ఇదే..!
కార్తీకమాసం సందర్బంగా సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన మయూర నాథ ఆలయం గురించి తెలుసుకుందాం. దక్షిణ భారత దేశంలోని అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా పేరు గాంచింది. మాయవరంలోని మయూర నాథ ఆలయం. శివుడు లింగ రూపంలో వెలసిన ఆలయాలు అనేకంఉన్నాయి, అందులో అతి పెద్ద శివాలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషం ఏమింటంటే... పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం ఇది. మరి పార్వతీదేవి ఈ దేవాలయాన్ని ఎందుకు సృష్టించింది? ఇదెక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుందాము...తమిళనాడు లోని, నాగపట్నం జిల్లాలోని మైలాడుతురై అని పిలిచే మాయవరంలో మయూరనాథ దేవాలయం వుంది.ప్రస్తుతమున్న మైలాడుతురైనే మాయవరం అని పిలిచేవారు. ఇది చాలా పురాతనమైన ఆలయంగా, ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ దేవాలయ రాజగోపురం తొమ్మిది అంతస్థులలో నిర్మితమైంది.దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాలలో ఇది కూడా ఒకటి.స్థలపురాణంఇక్కడ దక్షప్రజాపతి శివపార్వతులను ఆహ్వానించక చేస్తున్న యాగానికి, పరమశివుడు వారిస్తున్నా వినకుండా వచ్చిన పార్వతీదేవిని అవమానిస్తున్న సందర్భంలో... జరుగుతున్న ఈ రసాభాసలో ఆ యజ్ఞగుండ అగ్నికి భయపడి, అక్కడే ఉన్నటువంటి ఓ చిన్న నెమలిపిల్ల పార్వతీదేవి ఒడిలో దాక్కుంది. అదే సమయానికి పార్వతీదేవి తనని తాను యోగాగ్నిలో దహించుకునేసరికి, ఒడిలో ఉన్న నెమలిపిల్ల కూడా ఆహుతైపోతుంది.అలా నెమలితో అగ్నికి ఆహుతి కావడంతో, తర్వాత నెమలి రూపంలో జన్మించి, జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి పార్వతీదేవి ఇక్కడ శివుని మందిరాన్ని సృష్టించి, శివుణ్ణి ప్రార్థించి, ఆయనలో లీనమైనట్లు స్థల పురాణం చెబుతోంది. పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి, ఈ ఆలయానికి మయూర నాథ దేవాలయం అని పేరు స్థిరపడింది. ఈ మయూరనాథుడే శివుడు. పార్వతీదేవిని ఇక్కడ అభయాంబిక, అభయ ప్రధాంబిక అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు.ఈ ఆలయాన ఓ మర్రి చెట్టు ఉంది.ఈ మర్రి చెట్టుకిందే పార్వతీదేవి మయూర రూపంలో తపస్సు చేసినట్లు భక్తులు భావిస్తారు.ఇక్కడ కావేరీ నది ప్రవహిస్తోంది. దీనిని వృషభా తీర్థం అని పిలుస్తారు. ఇక్కడి కావేరీ నదిలో, ప్రతీ పౌర్ణిమ రోజున తమ తమ గంగ యమునలతోపాటు ఇక్కడికి వచ్చి తమ అంశలతో కూడిన నదులు ఇక్కడికి వచ్చి, తమ జలాల్ని ఈ కావేరినదిలో జారవిడుస్తాయట. అందువలనే ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమమని భక్తులు తలుస్తుంటారు.మాయవరం పట్టణం చిదంబరం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.పురాతన ఆలయం శాసనాల ప్రకారం క్రీ.శ 9 వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మితమైందని చెబుతారు.చోళరాజుల వాస్తు నైపుణ్యం, అద్భుతమైన చెక్కడాలు, అపురూపమైన శిల్పాలు ఎంతోగాను ఆకట్టుకుంటాయి. తమిళనాడులోని అత్యంత అందమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
నాగుల చవిత విశిష్టత..! ఈ ఆచారం ఎలా వచ్చిందంటే..
ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన రోజుని నాగుల చవితి అంటారు. మనం కూడా పాములమే..హిందువులు పాములను దేవతలుగా భావించి పుజిస్తారు. శివుడి మెడలో కంఠాభరణం గా, శ్రీ మహా విష్ణువు శయనించే శేష తల్పం నాగులుగా మన పురాణాలు పేర్కొన్నాయి. సనాతన ధర్మంలో ప్రతి జీవిలో దైవం చూడమని పేర్కొంది. అలా ప్రకృతిలో భాగమైన చెట్లు, పక్షులను మాత్రమే కాదు ఆవు నుంచి నాగ పాము వరకూ అనేక రకాల జంతుజాలాలను పుజిస్తారు. అలాంటి పండగలలో ఒకటి నాగుల చవితి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరుస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు.తెలుగు రాష్ట్రాల ప్రజలు.. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంత ప్రజలు ఈ నాగుల చవితి పండగను ఘనంగా జరుపుకుంటారు. నాగుల చవితిని శాస్త్రం ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలని. ఈ రోజు(నవండర్ 5 ) చవితి తిధి సూర్యోదయ సమయం నుంచి సూర్యాస్తమ సమయం వరకూ ఉంటుంది కనుక.. ఈ రోజున నాగుల చవితి వేడుక జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. భూలోకానికి క్రింద ఉన్న అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.నాగుల విశిష్టత..కద్రువ నాగ మాత. మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే- ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు, రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది. నాగుల ప్రాణాలను రక్షించిన ఆస్తికుడుపాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు! పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి. రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుడుని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు. ‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని, వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి, సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే, నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు. యుగాలనాటిది. (చదవండి: కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?) -
కార్తీకంలో ఆకాశదీపం ఎందుకు వెలిగిస్తారు ?
ఈ కార్తీకమాసం అంటే పుణ్య మాసం అనే చెప్పాలి. ఈ నెల శివకేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు అభిషేకాలు వ్రతాలు చేస్తూ ఉంటారు. కార్తీకమాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ఆకాశ దీపం వెలాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇది ప్రతీ శివాలయం లో వెలిగించడం మనకు కనిపిస్తుంది. గుడికి వెళ్లిన సమయంలో ఆకాశ దీపాన్ని చూసి నమస్కరిస్తారు అందరూ. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు మార్గం చూపుతుంది అని నమ్మకం. దానిని తాడు సాయంతో పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఇలా ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని వారికి దారి కోసం అని కార్తీకపురాణం చెబుతోంది. ఇలా ఆ దీపాన్ని చూసినా తలచుకున్నా ఎంతో మంచిది మనలో ఉన్న నెగిటీవ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ కాంతిలో ఆ ప్రాంతం అంతా ఆ శివయ్య కాపాడుతాడు అని కూడా నమ్ముతారు. ఇక ఇంట్లో కూడా ఇలా ఆకాశదీపం వెలిగించవచ్చు. ఎత్తుగా ఒక కర్రకట్టి దానికి వేలాడదీయవచ్చు అని పెద్దలు పండితులు చెబుతారు, కొందరు ఇళ్లల్లో కూడా దీనిని కడతారు.(చదవండి: కార్తీకం.. పరమ పవిత్రం) -
కోణార్క్ సూర్య రథచక్రం రాష్ట్రపతి భవనంలో...
ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఈ కోణార్క్ సూర్య రథ చక్రాన్ని పోలిన నాలుగు ఇసుకరాయి ప్రతిరూపాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ అమృత్ ఉద్యాన్ లో ఏర్పాటు చేశారు.కోణార్క్ చక్రం భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. సాంస్కృతిక, చారిత్రక అంశాలను సందర్శకులకు పరిచయం చేసే దశల్లో భాగంగా, భారతదేశం గొప్ప వారసత్వాన్ని తెలుసుకోవడానికి ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి. ఒడిషా ఆలయ నిర్మాణ శైలికి పరాకాష్టగా దీనిని చెప్పుకోవచ్చు. ఇది సూర్య భగవానుడిని మోసుకెళ్లే బృహత్తర రథం ఆకారంలో నిర్మించబడింది. (చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
శాంతమే సౌఖ్యం..
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్షాకవచంగా నిలుస్తుందని సుమతీ శతకకారుని సుధామయ ప్రబోధం.. శాంతం అనేది మానవులు అలవోకగా, అలవాటుగా అలంకరించుకోవలసిన గొప్ప ఆభరణం. క్రోధం కలిగినపుడు మనలో ప్రజ్వరిల్లే తక్షణ ఆవేశానికి లోను కాకుండా మదిని శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. శాంతాన్ని ఆశ్రయించిన అతికొద్ది నిమిషాల్లోనే మనలోని వివేకం మేలుకొంటుంది.జంతుజాలానికీ, మనకూ ఉన్న భేదమే శాంతాన్ని కలిగించే వివేకం. జంతుకోటికి శాంతం వహించడం అంత సాధ్యం కాదు. వాటికి పక్కనే ఉన్న జంతువులతో తేడా వస్తే, ముందుగా గుర్తుకు వచ్చేది పోరాటం. తమను బాధపెట్టిన జంతువు బలాన్ని బేరీజు వేసుకుంటాయి. వాటితో పోరాటానికి సిద్ధమవుతాయి. అదే జంతువు బలం ఎక్కువైతే, అప్పటికప్పుడే పలాయనం చిత్తగిస్తాయి. వాటికి ఉన్న వివేకసంపద పరిమితి అంతే. కానీ, జంతుకోటికి భిన్నంగా జనించి, సమస్త జీవకోటిలోనూ అత్యంత తెలివైనవాడైన మానవుడు కోపంతోనూ, క్రోధంతోనూ చరించరాదు. బహుళ ప్రయోజనకరమైన శాంతాన్ని అన్నివేళలా ఆశ్రయించాలి. రంగస్థలంమీద పాత్రధారులు నవరసాలను పోషించి, అలరిస్తారు. అవి వరుసగా– శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం. ఈ రసాల్లో హృదయానికి ఎటువంటి ఉద్వేగాన్ని కలగనీయకుండా అలరించే ఏకైక రసం శాంతరసం. రంగస్థలం మీద కొందరే పాత్రధారులుంటారు. జీవన రంగస్థలం మీద మానవులంతా పాత్రధారులే. అంటే, ఒకరితో ఒకరు ఏదో ఒక పనిమీద సంభాషించుకుంటూ ఉంటారు, కార్యకలాపాలను నెరపుతూ ఉంటారు. అటువంటి కార్యాలకు జయాన్ని సిద్ధింపజేయడంలో శాంతం ప్రధానపాత్ర పోషిస్తుంది. అనవసరంగా కేకలు పెడుతూ, హడావుడి చేసే మనిషి దగ్గరకు చేరడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రశాంత చిత్తంతో, శాంతంతో మాట్లాడే వారి దగ్గరకు అందరూ చేరతారు. తీయగా మాట్లాడే అటువంటి వ్యక్తులకు ఏ రంగంలోనైనా జయాన్ని సాధించే అవకాశమూ మిగిలినవారితో పోలిస్తే బాగా ఎక్కువే..!! శాంతికరమైన వ్యవహారశైలి సొంతమైన వీరు జీవితంలో ఎంతగానో సుఖిస్తారు, వారితో చరించేవారినీ ఆనందపరుస్తారు. అత్యుత్తమమైన శాంత గుణానికున్న ప్రత్యేకతను తేటపరుస్తూ,‘‘శాంతములేక సౌఖ్యము లేదు’’ అన్నాడు వాగ్గేయకారుడు త్యాగయ్య.అయితే.. మనం ఆలోచించవలసిన ప్రశ్న ఒకటుంది. మనిషికి శాంతమనేది ఏ రకంగా లభిస్తుంది? కొంతమందికి అందమైన భార్య, ప్రయోజకులైన సంతానం, కావలసినంత సంపద.. ఈ విధంగా అన్నీ అమరినట్లే ఉంటాయి. కానీ, జీవితంలో మాత్రం నిరంతరం వారికి ఏదో అసంతృప్తి, అశాంతి..!! దానికి కారణం ఒక్కటే.. తాను కోరుకునే వస్తువులు, లేదా సుఖాల మీద అంతులేని వ్యామోహం నీడలా వెన్నాడడమే..!! మనిషిని సర్వకాల సర్వావస్థల్లో శాంతపరచేది తృప్తి మాత్రమే..!!ఆనందకరమైన మానవ జీవనానికి నిత్య వసంతాన్ని నింపే ఆమని.. శాంతమనే సంజీవని..పరిస్థితులవల్ల వచ్చిన ఉద్వేగాలకూ, ఉద్రేకాలకూ లోను కాకుండా స్వభావానికి దగ్గరగా ఉండడమే శాంతంగా వర్తించడమనే నిర్వచనం చెప్పుకోవచ్చు’’ ఇదీ ఓ ఆంగ్ల సిద్ధాంతకర్త వాక్కు. వినగానే, ఒకింత కఠినమైన సూత్రంగా ఈ వాక్యం అనిపించినా, అంతర్లీనమైన భావం మాత్రం సర్వకాల సర్వావస్థల్లో శాంతియుతంగా మానవులను ప్రవర్తించమన్నట్లుగా, శాంతంగా ఎదుటివారితో వర్తించమన్నట్లుగా భావించాలి.ఇంద్రియాలను జయించినవాడికైనా, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా చదివినవాడికైనా శాంతగుణం అవసరమే. ధన కనక వస్తు వాహనాలెన్ని ఉన్నా, భోగభాగ్యాల్లో తేలియాడామని తలపోసినా, మనిషి ప్రశాంతచిత్తుడు కాకపోతే, అతనికి కలిగే ‘ప్రయోజనం సున్నా’. ఇది వాస్తవం. స్వప్రయోజనాల కోసమో, పదవుల కోసమో వెంపర్లాడుతూ పంచకళ్యాణిలా పరుగెత్తే ఆశలతో సతతమూ నలిగిపోయే వాళ్లకు శాంతమనేది ఒక అందని ద్రాక్ష. జీవితకాలంలో వాళ్లు ఎప్పుడూ స్థిమితంగా ఉండరు. మరొకరిని ఉండనివ్వరు. ఏదో ఒక రూపంలో అసహనం, అశాంతి వాళ్లకు చుట్టంలా చుట్టుకుని ఉంటుంది. పక్కవాళ్లకూ వీళ్ళ సాహచర్యం ఒకింత భరింపరానిదిగానే ఉంటుంది. – వెంకట్ గరికపాటి‘‘వ్యాఖ్యాన విశారద’’ -
ఆంధ్రదేశంలో ఆది వైద్యుడి ఆలయం..!
ధన్వంతరి... నారాయణాంశ సంభూతుడు. మానవజాతికి చికిత్సా విధానాన్ని అనుగ్రహించిన ఆదివైద్యుడు. శ్రీభాగవతం సహా వివిధ పురాణాల్లో ధన్వంతరి ప్రస్తావన ఉంది. అనేక ప్రాంతాల్లో ఆ ఆరోగ్య ప్రదాతకు గుడికట్టి పూజిస్తున్నారు. అందులో ఒకటి తెలుగు నేల మీదా ఉంది.ఒకవైపు దేవతలూ మరోవైపు రాక్షసులూ – క్షీరసాగర మథనం ఓ యుద్ధంలా మహా తీవ్రస్థాయిలో జరుగుతోంది. కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి... ఆ వరుసలో పదకొండవవాడిగా పాలకడలిలోంచి స్ఫురద్రూపి అయిన ఓ పురుషుడు పుట్టుకొచ్చాడు. పెద్దపెద్ద కళ్లూ, ఒత్తయిన కేశాలూ, అంతెత్తు ఆకారం, చిరుదరహాసం... ఆ రూపాన్ని ముక్కోటి దేవతలూ రెప్పవాల్చకుండా చూశారు. అతను ధగ ధగ మెరిసే పీతాంబరాన్ని కట్టుకున్నాడు, మణికుండలాలు ధరించాడు, మెడలో దివ్యమాల మెరిసి΄ోతోంది. ఓ చేతిలో అమృతభాండం ఉంది. మరో చేతిలో వనమూలికలున్నాయి. అచ్చంగా శ్రీమన్నారాయణుడిలా ఉన్నాడు – కాదు కాదు, సాక్షాత్తూ నారాయణుడి అంశే! బ్రహ్మాదులు అతనికి ధన్వంతరి అని నామకరణం చేశారు. పురాణగాథలు... ఓసారి, దుర్వాస మహాముని శాపం కారణంగా... ముక్కోటి దేవతలూ ముక్కుతూ మూలుగుతూ మూలన పడాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆ సమయంలో ధన్వంతరి అరుదైన వనమూలికలతో చికిత్సలు చేసి... అమరుల్ని ఆరోగ్యవంతుల్ని చేశాడని ఐతిహ్యం. ధన్వంతరి ప్రస్తావన ఒక్కో పురాణంలో ఒక్కోలా కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం...ధన్వంతరి సూర్యనారాయణుడి ప్రియశిష్యుడు. ఆయన దగ్గరే ఆయుర్వేదం నేర్చుకున్నాడు. విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం... ద్వితీయ ద్వాపరయుగంలో కాశీ రాజ్యాన్ని పాలించిన చంద్రవంశ రాజు ధనపాలుడి కొడుకుగా అవతరించిన ధన్వంతరి... ఆయుర్వేదాన్ని శాస్త్రంగా మలిచి శుశ్రుతుడితో సహా ఎంతోమందికి బోధించాడనీ... అనేక సంవత్సరాల పాలన తర్వాత.. తిరిగి దైవత్వాన్ని పొందాడనీ పురాణ కథనం. ఆయుర్వేద వైద్యులకు ధన్వంతరే తొలిదైవం. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ధన్వంతరి ఆలయాలున్నాయి. చింతలూరు గ్రామాన... తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. గౌతమీ తీరాన, పచ్చని పంటపొలాల మధ్య, సుమారు రెండెకరాల సువిశాల ఆవరణలో స్వామివారు కొలువుదీరి ఉన్నారు. ఆ ఆలయంలో అడుగు పెట్టినంత మాత్రానే... సమస్త రోగాలూ నయమైపోతాయని భక్తుల నమ్మకం. ఆలయ ప్రాంగణంలో ఎత్తయిన ధ్వజస్తంభం కనిపిస్తుంది. విశాలమైన ముఖ మండపం ఉంది. గర్భాలయంలో ధన్వంతరి దివ్య మంగళరూపం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. కాశీలో ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. నాలుగు హస్తాలతో...ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో అమృతకలశం, ఒక చేతిలో జలగతో స్వామి దర్శనమిస్తాడు. ప్రాచీన ఆయుర్వేదంలో జలగ చికిత్స ఓ భాగం. చెడురక్తాన్ని పీల్చుకునే శక్తి ఉందా జీవికి. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వ్యవస్థాపకులు ద్విభాష్యం వెంకటేశ్వర్లు 1942లో ఈ ఆలయాన్ని నిర్మించారు. పూజాదికాలకు ఏ లోటూ లేకుండా శాశ్వత ప్రాతిపదికన గ్రామంలోనే పద్దెనిమిది ఎకరాల భూమిని కేటాయించారు. ఆయన వంశీకులైన ద్విభాష్యం వెంకట శ్రీరామమూర్తి చలువరాతితో సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఈ గుడి రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఏటా కార్తిక బహుళ త్రయోదశినాడు ధన్వంతరి జయంతిని వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాట... ఇతర ప్రాంతాల్లో.,, తమిళనాడులోని సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రం శ్రీరంగం. అక్కడున్న రంగనాథ స్వామి ఆలయంలో ధన్వంతరి ఉపాలయం ఉంది. ఏ గుడిలో అయినా తీర్థంగా అభిషేక జలం ఇస్తారు. మహా అయితే, పంచామృతం పోస్తారు. ఇక్కడ మాత్రం వనమూలికలతో కూడిన కషాయాన్ని ఇస్తారు. ఆ తీర్థాన్ని తీసుకుంటే మొండివ్యాధులు సైతం మటుమాయమైపోతాయని ఓ నమ్మకం. కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయ ఆవరణలోనూ ఆ ఆరోగ్యదేవుడి విగ్రహం ఉంది. కేరళలోని గురువాయూర్ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాన్ని నిర్మించారు. కొత్తగా ఆయుర్వేద వైద్యవృత్తిని చేపట్టేవారు...ముందుగా స్వామిని దర్శించుకుని పూజాదికాలు నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. కాలికట్ దగ్గర్లోనూ ఓ ధన్వంతరి క్షేత్రం ఉంది. ధన్వంతరి అంటే... మనసుకు పట్టిన జాడ్యాల్నీ, శరీరాన్ని కమ్ముకున్న వ్యాధుల్నీ తొలగించేవాడనీ ధన్వంతరి అనే పదానికి అర్థం. పురాణాల ప్రకారం...ధన్వంతరి ఆరోగ్యానికి అధిపతి. పరిపూర్ణ ఆయువు కోసం ఘనంగా ధన్వంతరీ వ్రతం చేయడం ్ర΄ాచీన సంప్రదాయం. ధనత్రయోదశినాడు లక్ష్మీదేవితో ΄ాటూ ధన్వంతరినీ పూజిస్తారు. ఏటా కార్తికమాసంలో ధన్వంతరి జయంతిని జరుపుకుంటారు. సముద్ర తీరంలోనో స్వగృహంలోనో వైద్యశాలలోనో కలశాన్ని స్థాపించి...పురాణాంతర్గతమైన ధన్వంతరి మహామంత్రాన్ని పఠించి... వైద్యులకూ సంపూర్ణ ఆరోగ్యవంతులకూ తాంబూలాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు. పెసర పులగాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం– డి.వి.ఆర్.