Top News
-
రైల్‌రోకో చేస్తే కఠిన చర్యలు : డీజీపీ
హైదరాబాద్ : రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ దినేష్ రెడ్డి గురువారం డీజీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైల్‌రోకో చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉద్యమకారులను ఆయన హెచ్చరించారు. రైళ్లను ఆపినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినా నాన్‌బెయిల్‌బుల్ కేసులు నమోదు చేస్తామని డీజీపీ వెల్లడించారు. రైల్‌రోకో కార్యక్రమాలను ఆషామాషీగా తీసుకోవద్దని ఆయన అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీజీపీ సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కఠిన చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైల్రోకోలపై నిషేధం ఉందన్ని....నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదని డీజీపీ అన్నారు. రైల్రోకోలను నిరోధించేందుకు తగినంత భద్రత ఉందని డీజీపీ తెలిపారు. జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేసినవారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరికలు చేశారు. ఆందోళనలను వీడియో తీస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర ఉద్యమాలకు అనుమతి లేదని డీజీపీ తెలిపారు. నిరసన తెలపాలనుకుంటున్న ఉద్యోగులు పికెటింగ్‌లు చేయరాదన్నారు. అలాగే హైదరాబాద్ లో ర్యాలీలకు అనుమతి లేదన్నారు. -
సుప్రీంకోర్టులో మాయవతికి ఊరట
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో పునర్ విచారణకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో మాయపై దాఖలైన అక్రమాస్తుల కేసును కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్న సీబీఐ పిటిషన్‌పై జస్టిస్ పి.సదాశివం, దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్ తీర్పు వెలువరించింది. తాజ్ కారిడార్ కేసులో అనుమతి లేకుండా యూపీ ప్రభుత్వం రూ.17 కోట్లను విడుదల చేసిన కేసుపై తామిచ్చిన ఆదేశాలను సీబీఐ సరిగా అర్థం చేసుకోలేదని చెబుతూ సుప్రీంకోర్టు గతంలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసిన విషయం తెలిసిందే. -
ఒబామా చిరకాల స్వప్నం తీరనున్న వేళ...
అమెరికా మాజీ అధ్యక్షుడు మార్టిన్ లూథర్ కింగ్ 50వ వర్థంతి వేడుకలు ఆగస్టు 28న దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఆ సందర్బాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్‌లోని లింకన్ మెమోరియల్ హాల్లో లూథర్ కింగ్‌పై ప్రసంగించనున్నట్లు ఒబామా గురువారం వెల్లడించారు. ఆ ప్రదేశం నుంచే కింగ్‌పై ప్రసంగించాలన్న తన చిరకాల స్వప్నం ఇలా సాకారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఒబామా చెప్పారు. ఆర్థ శతాబ్దం క్రితం ఇదే రోజు లింకన్ మెమోరియల్ హాల్ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ దాదాపు మూడు లక్షల మంది యూఎస్ వాసుల నుద్దేశించి ప్రసంగించారని ఆయన తెలిపారు. దేశంలోని బ్లాక్, అమెరికన్ల మధ్య బంధం మరింత బలపడాలని మార్టిన్ ఆ సభ నుంచే ఆకాంక్షించిన సంగతిని ఒబామా ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ వర్థంతిని పురస్కరించుకుని దేశావ్యాప్తంగా ఆగస్టు 21 నుంచి 28 వరకు మతపరమైన సేవలు జరగనున్నాయి. -
వాయిదపడ్డ పంచాయతీల్లో పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్ : వేలంపాటల వల్ల వాయిదా పడ్డ పంచాయతీల్లో గురువారం పోలింగ్ ప్రారంభమైంది. నెల్లూరు జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో అయిదు, గుంటూరు జిల్లాలో అయిదు, నిజామాబాద్ జిల్లాలో రెండు, కృష్ణా, నల్గొండ, వైఎస్ఆర్ జిల్లాల్లో ఒక్కొక్క గ్రామాల్లో పోలింగ్ జరుగుతోంది. వేలం పాటలు నిర్వహించారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల కమిషన్ నిజామాబాద్ డివిజన్ వేల్పూర్ మండలం కోమన్‌పల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికలను రద్దు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ ఉదయం7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటల లోగా ఫలి తాలు వెలువడుతాయి. గుంటూరు జిల్లాలో వెల్దుర్తి శిరిగిరిపాడు, కండ్లకుంట, వినుకొండ మండలం అందుగులపాడు, ఈపూరు మండలం ఊడిజర్ల, గురజాల మండలం గోగులపాడు, దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం, నరసరావుపేట మండలం ఇక్కుర్రు, పెదరెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం రొంపిచర్ల, ముత్తనపల్లి, నాదెండ్ల మండలం తూబాడు, గుంటూరు డివిజన్లోని చల్లావారిపాలెం గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. 40 మంది సర్పంచ్్ అభ్యర్థులు, 118 వార్డులకు 260 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.28,264 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు భారీగా మోహరించారు. -
అఖిలేష్ యాదవ్ కు మేనకాగాంధీ లేఖ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం పథకం కింద పాఠశాల చిన్నారులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ కోరారు. ఈ మేరకు ఆమె సీఎంకు లేఖ రాశారని ఆయన కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. చిన్నారులకు వడ్డిస్తున్న భోజనంలో పురుగులు, బల్లులు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. యూపీలోని తన నియోజకవర్గమైన అనొలలో పర్యటనలో భాగంగా ఆ విషయాన్ని గుర్తించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు కూడా ఆ పరిసరాలు తగు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అయితే గత నెలరోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాల చిన్నారులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారని, కానీ కొన్ని ప్రదేశాల్లో ఆ భోజనంలో క్రిమికీటకాలు ఉంటున్నాయని తెలిపారు. గతనెల్లో బీహార్ రాష్ట్రంలో శరన్ జిల్లాలోని చాప్రా డివిజన్లో గందమయిలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి 23 మంది మరణించిన సంగతిని మేనకా గాంధీ రాసిన లేఖలో ప్రస్తావించారు. అయితే మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇప్పటికే అఖిలేష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ రాయబరేలి జిల్లాలోని రైయిన్ గ్రామంలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక పాఠశాలను ఆయన సందర్శించారు. భోజనంలో ఆహారం సరిగా ఉండటం లేదని పాఠశాల విద్యార్థులు అఖిలేష్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన ఉన్నతాధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. స్థానిక విద్యాశాఖ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. -
నకిలీ నగల కేసులో ఇద్దరు భారతీయులకు జైలు
నకిలీ నగల కుంభకోణం కేసులో ఇద్దరు భారత జాతీయులు గురుప్రీత్ రామ్ సిద్దు (22), జస్విందర్ సింగ్ బ్రార్ (38)లకు సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా ద స్ట్రేయిట్ టైమ్స్ గురువారం వెల్లడించింది. రాగి వస్తువులకు బంగారం తాపడం వేసి ఆవి నిజమైన నగలని 11 దుకాణదారులను మోసం చేసిన గురుప్రీత్‌కు 15 నెలల జైలుశిక్ష విధించింది. అలాగే నకిలీ నగల ద్వారా రూ. 30 వేల నగదును పొందిన బ్రార్‌కు 10 నెలల జైలు శిక్ష విధించినట్లు తెలిపింది. వారిద్దరు సోషల్ విజిట్ పాసెస్ ద్వారా సింగపూర్ వచ్చారని పేర్కొంది. గతేడాది ఏప్రిల్, ఆక్టోబర్ మాసాల్లో బ్రార్ ఆ మోసాలకు పాల్పడ్డారని తెలిపింది. అయితే దుకాణదారుల వద్ద ఆ నగలను కుదవ పెట్టి, వారిద్దరు నగదు తీసుకువెళ్లారని చెప్పింది. అనంతరం దుకాణదారులు నగలను పరీక్షించగా అవి నకిలీ నగలని తెలింది. దాంతో దుకాణదారులు ఆ విషయాన్ని సింగపూర్ పాన్‌బ్రోకర్స్ అసోసియేషన్‌కు సమాచారం అందించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందని ద స్ట్రేయిట్ టైమ్స్ పేర్కొంది. అయితే తన క్లైయింట్ బ్రార్ ఈ కుంభకోణంలో పాత్ర చాలా తక్కువ అని అతని తరపు న్యాయవాది ఎస్.కే.కుమార్ న్యాయమూర్తికి విన్నవించారు. ఈ నేపథ్యంలో అతనికి తక్కువ శిక్ష విధించాలని కోరారు. శిక్ష కాలం పూర్తి అయన వెంటనే అతడు స్వదేశం వెళ్లిపోతాడని న్యాయమూర్తికి విన్నవించారు. సిద్దు, బ్రార్‌లకు సహకరించిన మరో భారతీయుడు జగత్తర్ సింగ్‌కు వచ్చే నెలలో జైలు శిక్ష ఖరారుకానుందని ద స్ట్రైయిట్ టైమ్స్ తెలిపింది. -
నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చర్చకు రావటం లేదని సమాచారం. సాయంత్రం 5.30 గంటలకు మంత్రి మండలి సమావేశమవుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చిస్తారని ముందు అనుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు ఎదురయ్యే సమస్యల గురించి అధ్యయనం చేసేందుకు రక్షణ శాఖ మంత్రి ఎ.కె.ఆంటోనీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నలుగురితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినందున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై మంత్రివర్గంలో చర్చ జరగడం లేదని తెలిసింది. ఒక వైపు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేయడం, మరో వైపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవటం మంచిది కాదని కాంగ్రెస్ అధినాయకత్వం అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. వచ్చే వారం జరిగే కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అంశం చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
రేషన్ చక్కెరకు రెక్కలు!
న్యూఢిల్లీ: చౌక ధరల దుకాణాల ద్వారా అందిస్తున్న చక్కెర ధర పెరిగే అవకాశముంది. దీని రిటైల్ ధరను పెంచుకోవడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చేందుకు కేంద్ర ఆహార మం త్రిత్వ శాఖ.. కేబినెట్ పరిశీలన కోసం ఓ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఆ శాఖ మంత్రి కేవీ థామస్ బుధవారమిక్కడ ఈ సంగతి వెల్లడించారు. చక్కెర సేకరణ ధర ఎక్కువగా ఉంది కనుక ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఇచ్చే చక్కెర ధరను పెంచాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయన్నారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రితో చర్చించానని, కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. చక్కెర ధరను కేజీకి గరిష్టంగా రూపాయి పెంచాలని ఆహార శాఖ ప్రతిపాదించినట్లు సమచారం. బహిరంగ మార్కెట్లో కేజీ రూ.35-40 పలుకుతున్న చక్కెరను రేషన్ షాపుల్లో పదేళ్లుగా రూ.13.50కి అందజేస్తున్నారు. ఈ ఏడాది మేలో చెక్కర ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఎత్తేసిన కేంద్రం ఈ నెల నుంచి రాష్ట్రాలు పీడీఎస్ కోసం చక్కెరను బహిరంగ మార్కెట్ల నుంచి సేకరించాలని పేర్కొంది. కేజీకి రూ.18.50 మాత్రమే సబ్సిడీ ఇస్తామని స్పష్టం చేసింది. -
‘అనర్హత’ తీర్పును అమలు చేయండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసుల్లో దోషులుగా తేలిన రోజు నుంచే పదవులకు అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు ప్రారంభించింది. ‘సుప్రీం’ ఆదేశాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. తీర్పు వచ్చిన తర్వాత దోషులుగా తేలి, జైలుశిక్ష, జరిమానా పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు నిబంధనల ప్రకారం తక్షణమే అనర్హులవుతారని, వారి సీటు ఖాళీ అవుతుందని స్పష్టం చేసింది. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి పేర్లను తమకు పంపాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన పాలనాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల కోర్టుల్లో దోషులుగా తేలే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలతో కూడిన నివేదికను ప్రతి నెలా 15 నాటికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా తమకు అందజేయాలని సూచించింది. ఈ కేసుల పర్యవేక్షణ కోసం సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఇలాంటి కేసుల సమాచారాన్ని చట్టసభల అధిపతులకు(స్పీకర్/చైర్మన్), తమకు వెంటనే తెలియజేయడానికి ఈ యంత్రాంగం అవసరమని పేర్కొంది. ఇందులో అడ్వొకేట్ జనరల్/ప్రాసిక్యూషన్ డెరైక్టరేట్, తదితరాలను భాగం చేయాలని సూచించింది. -
పార్లమెంటులో ‘పాక్ మంటలు’
రెండోరోజూ స్తంభించిన ఉభయ సభలు పాక్ సైన్యం కాల్పులపై ఆంటోనీ ప్రకటన దుమారం న్యూఢిల్లీ/జమ్మూ/ఇస్లామాబాద్: పూంచ్‌లో పాక్ సైన్యం కాల్పులకు సంబంధించి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ చేసిన ప్రకటనతో చెలరేగిన దుమారం బుధవారం కూడా పార్లమెంటును స్తంభింపజేసింది. పాక్ సైన్యానికి రక్షణ మంత్రి క్లీన్ చిట్ ఇచ్చారంటూ ప్రధాన ప్రతిపక్షం విరుచుకుపడింది. ఆయన క్షమాపణకు డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన లోక్‌సభ, రాజ్యసభలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎలాంటి ముఖ్యమైన అంశాలను చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. జమ్మూకాశ్మీర్ పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద సోమవారం అర్ధరాత్రి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైనికులు కొందరు ఉగ్రవాదులతో కలిసి కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు మరణించారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్ సైనిక యూనిఫామ్‌లో ఉన్న కొందరితో కలిసి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టుగా ఆంటోనీ చేసిన ప్రకటనపై మంగళవారం నాడే ఉభయ సభల్లోనూ విపక్షాలు మండిపడ్డాయి. బుధవారం రాజ్యసభలో మాట్లాడిన రక్షణ మంత్రి తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఆ ప్రకటన చేశానని చెప్పారు. జమ్మూ వెళ్లిన ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ తిరిగొచ్చిన తర్వాత ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు లభించినట్టయితే మరోమారు సభకు తెలియజేస్తానని చెప్పారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు విమర్శల దాడిని కొనసాగించారు. తప్పుడు ప్రకటన చేసినందుకు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘వాళ్లు (పాక్ సైన్యం) చంపడానికొస్తే మన రక్షణ మంత్రి వారి ప్రమేయం లేదంటున్నారు..’ అని షేమ్ షేమ్ అనే కేకల మధ్య సుష్మాస్వరాజ్ ఎద్దేవా చేశారు. దాడిలో పాక్ సైనికుల ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధ ప్రకటనలు: జమ్మూలో సైన్యం రూపొందించిన ప్రకటనకు రక్షణ మంత్రి ప్రకటన విరుద్ధంగా ఉందంటూ బీజేపీ సభ్యులు అంతకుముందు ఉభయ సభల్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంటోనీ మార్పు చేసిన ఆర్మీ ప్రకటనను తీసుకువచ్చారంటూ.. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి ఎందుకిలా చేశారని ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ రెండు సభల్లోనూ హక్కుల తీర్మానం నోటీసు ఇచ్చింది. పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ లోక్‌సభలో ఆ పార్టీ నేత యశ్వంత్‌సిన్హా నోటీసు ఇచ్చారు. మరోవైపు ఆంటోనీ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో ఆ పార్టీ సభ్యుడు ఎం.వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దేశ నైతికతను దిగజార్చిందంటూ మండిపడ్డారు. ఆర్మీ ప్రకటనలో రక్షణమంత్రి మార్పులెందుకు చేశారని ప్రశ్నించారు. లోక్‌సభ మొదటిసారి వాయిదాపడిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను కలిసిన బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ.. ఆర్మీ, ఆంటోనీ పరస్పర విరుద్ధ ప్రకటనలపై తమ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అద్వానీ.. ఆంటోనీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కమల్‌నాధ్ ఆంటోనీకి మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో అందుబాటులో ఉన్న వాస్తవాల ఆధారంగా రక్షణ మంత్రి ప్రకటన చేశారని విలేకరులతో చెప్పా రు. కాంగ్రెస్ కూడా ఆంటోనీకి దన్నుగా నిలి చింది. పాక్ సైన్యానికి ఆయన క్లీన్చిట్ ఇవ్వలేదని ఆ పార్టీ ప్రతినిధి పి.సి.చాకో అన్నారు. పొరుగుదేశంతో ఉన్న వివాదాలకు చర్చలే ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రధానితో ఆంటోనీ భేటీ: పూంచ్ మరణాలపై తాను చేసిన ప్రకటన వివాదానికి దారితీసిన నేపథ్యంలో.. ఆంటోనీ ప్రధాని మన్మోహన్‌తో భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిపై వివరణ ఇచ్చారు. అయితే పాక్ కాల్పులపై రక్షణ శాఖ రూపొందించిన నోట్లో 13 మంది ఉగ్రవాదులకు సంబంధించిన ప్రస్తావనను తొలగించారని ‘టైమ్స్ నౌ’ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తత నేపథ్యంలో భారత్, పాక్ మిలటరీ ఉన్నతాధికారులు హాట్లైన్లో మాట్లాడుకున్నారు. పరిహారం వద్దు: జవాను భార్య పాట్నా: పాక్ దళాల కాల్పుల్లో మృతిచెందిన ఐదుగురు జవాన్లలో ఓ జవాను భార్య బీహార్ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల నష్టపరిహారాన్ని నిరాకరించారు. అందుకు బదులుగా పాక్‌పై సైనిక చర్య జరపాలని డిమాండ్ చేశారు. ‘రూ.10 లక్షల పరిహారం నా భర్తను తిరిగి తీసుకురాగలదా? మాకు పరిహారం వద్దు. నా భర్త సహా ఇతర జవాన్లను చంపినందుకు సైన్యం పాక్‌కు దీటైన జవాబివ్వాలి’ అని అమర జవాను విజయ్రాయ్ భార్య పుష్పారాయ్ అన్నారు. -
నగరమే చిక్కుముడి: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు
ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసుకు నేతల నివేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో హైదరాబాదే పెద్దచిక్కుముడి అని, దానికి సరైన పరిష్కారం చూపితే ఇపుడున్న ఆందోళనలు చాలావరకు తగ్గుముఖం పడతాయని పలువురు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్రవ్యవహారాల సహాయ ఇన్చార్జి తిరునావుక్కరసుకు సూచించారు. విభజనతో సీమాంధ్రలో తలెత్తిన ఆందోళనలపై రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉండి పార్టీనేతల నుంచి అభిప్రాయాలు సేకరించిన తిరునావుక్కరసు బుధవారం ఢిల్లీకి వెళ్లారు. తన నివేదికను అధిష్టానానికి అందించనున్నారు. తిరునావుక్కరసును కలిసిన నేతల్లో ఎక్కువమంది ఒకవైపు సమైక్యాంధ్ర వాదాన్ని వివరిస్తూనే విభజన విషయంలో హైదరాబాద్ అంశంపై తలెత్తే అభ్యంతరాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇక్కడి ప్రజల్లో నెలకొన్న భయాలు పోగొట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తిచేశారు. యూటీ చేస్తే నగర ప్రజలకు నష్టం: జాఫ్రీ హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయడంవల్ల ఏ ప్రాంత ప్రజలకూ ఫలితం ఉండదని, ఇలాంటి ప్రతిపాదన సరికాదని ఎంఐఎం నేతలు అభిప్రాయపడుతున్నారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ, విప్ రుద్రరాజు పద్మరాజు, ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ ఒకరికొకరు ఎదురుపడి దీనిపై మాట్లాడుకున్నారు. హైదరాబాద్‌పై సీమాంధ్ర నేతలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు సరైనవి కావని జాఫ్రీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అక్కడ సమకూరే ఆదాయం మొత్తం కేంద్రానికే దక్కుతుందని, తద్వారా ఇరుప్రాంతాలూ నష్టపోతాయని చెప్పారు. యూటీగా మారిస్తే ప్రజల సమస్యలు తీర్చేవారు కానీ, వారి హక్కులు పరిరక్షించే వారు కానీ కనిపించరని చెప్పారు. సమైక్యంగా ఉన్న ప్రస్తుత తరుణంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్థానిక సీమాంధ్రులకు టికెట్లు ఇచ్చేందుకు పార్టీలు వెనుకాడుతున్నాయని పద్మరాజు పేర్కొన్నారు. విభజన జరిగితే సీమాంధ్రులు పోటీచేస్తామన్నా టికెట్లు ఇచ్చేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రాదని, సీమాంధ్ర ప్రజలకు ఇక్కడి చట్టసభల్లో అవకాశం దొరుకుతుందనుకోవడం అత్యాశే అవుతుందని చెప్పారు. -
అధిష్టానానికి.. ఫిర్యాదుల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కేంద్రమంత్రి పల్లంరాజుపై టీ-ఎంపీలు, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై పల్లంరాజు, జేడీ శీలం, రేణుకా చౌదరిలపై గోవర్ధన్‌రెడ్డి సోనియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బుధవారం లోక్‌సభ మొదటిసారి వాయిదా పడిన తర్వాత సభలో సోనియా గాంధీతో కేంద్రమంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి మాట్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌లు అక్కడకు చేరుకున్నారు. ఆంటోనీ కమిటీ పని పూర్తయ్యేంతవరకూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోతుందని పల్లంరాజు వెల్లడించినట్లు ప్రచురించిన ఒక ఆంగ్ల దినపత్రిక కథనాన్ని అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు. విభజనతో సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలను పరిశీలించి పరిష్కారాలు కనుగొనేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్న కమిటీ నివేదిక వచ్చాకే ప్రభుత్వంలో అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని మాత్రమే తాను విలేకరులకు చెప్పినట్లు సోనియాకు పల్లంరాజు వివరించినట్లు తెలిసింది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర మంత్రులతో సహా సీమాంధ్రవాసులంతా తెలంగాణ నుండి వెళ్లిపోవాల్సిందేనని సీనియర్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యలు కూడా సోనియా వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలిసింది. పాల్వాయి అలా మాట్లాడడం తప్పేనని అభిప్రాయపడిన కాంగ్రెస్ అధ్యక్షురాలు తాను ఆయనతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్రియ ఆపొద్దు.. వేగం పెంచండి: టీ-ఎంపీలు సీమాంధ్ర ప్రజల అభ్యర్థనల పరిశీలన పూర్తయ్యేవరకు రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని సీమాంధ్ర నేతలు ప్రచారం చేస్తున్న దృష్ట్యా బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత ఎంపీలంతా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలకు మద్దతుగా వ్యవహరించిన జేడీ శీలం, రేణుకాచౌదరిలపై అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్లు ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. -
కాంగ్రెస్ ఇస్తుందన్న నమ్మకం లేదు: కిషన్‌రెడ్డి
మీట్ ది ప్రెస్‌లో బీజేపీ నేత కిషన్‌రెడ్డి తెలంగాణపై సోనియా, చంద్రబాబు నాటకం ఆడిస్తున్నారు కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణకు విఘాతమే సీమాంధ్రలో నిరసనలను చల్లార్చేందుకు పార్టీలు ప్రయత్నించాలి ఎల్లకాలం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కుదరదు సాక్షి, హైదరాబాద్: కుట్రలు, కుతంత్రాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఇప్పటికీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత 2009 నాటి పరిస్థితిని పునరావృతం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ, చంద్రబాబే ఈ నాటకం ఆడిస్తున్నారని, వీళ్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడయిందని విమర్శించా రు. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణపై మాట తప్పని నేరానికి తమను సీమాంధ్రలో దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను ప్రకటించినప్పటికీ పార్లమెంటులో బిల్లు పెడితే తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లక తప్పదని, ఎటువంటి ఆప్షన్లు ఉండవని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రక్రియకు విఘాతమేనని పునరుద్ఘాటించారు. కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు, నిరసనలు వ్యక్తమవుతున్న దశలో కేసీఆర్ సంయమనం పాటించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన విధివిధానాల మేరకు ఉద్యోగుల విభజన ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ప్రాణాలను అడ్డం పెట్టయినా తెలంగాణలోని సీమాంధ్రుల్ని కాపాడతామన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జరిగిన మరణాలకు బాధ్యులైన వారిపై కోర్టుల్లో ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉందని, ప్రజలు ఆ హక్కును ఉపయోగించుకుంటే సంతోషిస్తానని చెప్పారు. కలసికట్టుగా సముదాయిద్దాం: సీమాంధ్రలో నిరసనలను చల్లార్చేందుకు అన్ని పార్టీలు నడుంకట్టాలని కిషన్‌రెడ్డి పిలుపిచ్చారు. ‘‘రాష్ట్ర విభజన ఆవశ్యకతను తెలియజెప్పి, ఉద్యమకారులను బుజ్జగించేందుకు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐ, బీజేపీ, టీడీపీల అధ్యక్షులు కలిసికట్టుగా సీమాంధ్రలో పర్యటించాలి. ప్రజల్లో అనుమానాలను పోగొట్టాలి. కేంద్ర సహకారంతో 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. 2 రాష్ట్రాలైతే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. వేలాది పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు మంచి ప్యాకేజీ రాబడదాం. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదాకు కృషిచేద్దాం. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎల్లకాలం కొనసాగించడం కుదరదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తామని కేంద్రం అంటే అప్పుడు స్పందిస్తాం’’ అని చెప్పారు. మీడియా సహకరిస్తే సీమాంధ్ర ఉద్యమకారుల్ని సముదాయించడం సులువేనని అభిప్రాయపడ్డారు. మజ్లిస్‌కు ఇష్టమున్నా లేకున్నా తెలంగాణ ఏర్పడితే బీజేపీదే అధికారమన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కుపోయాయన్నారు. 2014లో అధికారం తమదేనని, మోడీయే భావి ప్రధానిగా తమ పార్టీ ప్రకటించక మునుపే ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. సమావేశానికి టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షత వహించగా పల్లె రవికుమార్, క్రాంతికుమార్, పీవీ శ్రీనివాస్, శైలేష్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. -
సీమను చీల్చే కుట్ర : గడికోట శ్రీకాంత్‌రెడ్డి
వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం బాబు రాజగురువే చీల్చాలని చెప్పారు సీమను విడదీస్తుంటే కిరణ్, చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా? నేతలు మౌనం దాలిస్తే భారీ మూల్యం చెల్లించకతప్పదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి విపత్కర పరిస్థితులను సృష్టించిన కాంగ్రెస్ అధిష్టానవర్గం.. రాయలసీమ జిల్లాలను కూడా చీల్చాలన్న దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం కో-ఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గపు పనికి రాయలసీమ ప్రాంతానికే చెందిన కొందరు నేతలను పావులుగా వాడుకుంటోందని.. విభజించు-పాలించు అనే బ్రిటిష్ విధానాన్ని అమలుచేస్తోందని విమర్శించారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి.. రాష్ట్రాన్ని విభజిస్తే తమను తెలంగాణతో కలపాలని సోనియాగాంధీని అడిగారని, ప్రధాని మన్మో హన్నూ అదే కోరబోతున్నారని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. మంత్రి రఘువీరారెడ్డి కూడా తాను సోనియాను కలిసి రాష్ట్రాన్ని విభజిస్తే గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని చెబుతానని చెప్పారు. ఈ నేతలు రాష్ట్ర సమైక్యత కోసం పాటు పడుతున్నామని బయటకు చెబుతూ... తెరవెనుక సోనియా తో రాయలసీమను చీల్చే ప్రతిపాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతినిధి బృందంలో వెళ్లిన కాంగ్రెస్ నేతలే ఈ విషయాలను బయటకు చెబుతున్నారన్నారు. రాజకీయంగా తాను పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ రాయలసీమను చీల్చాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ప్రాంతా ల మధ్య చిచ్చు పెట్టింది చాలక.. జిల్లాల వారీగా కూడా చిచ్చుపెట్టే దౌర్భాగ్య స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘శతాబ్దాల చరిత్ర ఉన్న రాయలసీమను చీల్చాలనే కుట్ర జరుగుతున్నా.. అదే ప్రాంతానికి చెందిన సీఎం కిరణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రులు గల్లా అరుణ, రామచంద్రయ్య, అహ్మదుల్లా వంటి వారు ఎందుకు స్పందించడం లేదు. కాంగ్రెస్ దుర్బుద్ధిని ఎందుకు ప్రశ్నించ లేకుండా ఉన్నారు? వారంతా గాడిదలు కాస్తున్నారా? లేక తాము పదవుల్లో ఉంటే చాలనుకుంటున్నారా?’’ అని గడికోట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీకి స్వతహాగానే ప్రజాదరణ ఉండేదని, ప్రస్తుతం సోనియాకు ఏమాత్రం ప్రజాదరణ లేకపోవడంతో.. ఏ రాష్ట్రంలోనైనా ఒక ప్రజాదరణ గలిగిన బలమైన నాయకుడు ఎదుగుతూ ఉంటే ఓర్వడం లేదని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ‘‘2009 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 33 లోక్‌సభ స్థానాలు గెలిపించి ఇస్తే... కాంగ్రెస్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది. రాష్ట్రాన్ని, జిల్లాలను చీలికలు చేసి తగవు పెడుతోంది. గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతగా కాంగ్రెస్ ఇచ్చే బహుమతి ఇదా!’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ మంచి సంక్షేమ పథకాలు అమలు చేసి, ఒంటరి పోరాటం చేసి 33 స్థానాలు గెలిపించి ఇస్తే... ఆయనను కూడా బలహీనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ఇప్పుడు జగ న్మోహన్రెడ్డి బలమైన నాయకుడవుతాడనే భయం కాంగ్రెస్‌కు పట్టుకుందని, 30, 40 లోక్‌సభ సీట్లు గెలుచుకుని ఆయన తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవిస్తే తమకు సమస్యలు వస్తాయనే కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్పారు. బాబు, రాజగురువు ఆస్తుల కోసమేనా!? ‘‘చంద్రబాబు తన ఆస్తులు, తన రాజగురువు ఆస్తులు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతోనే మాట్లాడడం లేదు.. చంద్రబాబు రాజగురువే సాక్షాత్తు గవర్నర్ వద్దకు వెళ్లి రాష్ట్రాన్ని ఎలా విభజించాలో చెప్పి వచ్చారట.. ఈ రాష్ట్రం, తెలుగు ప్రజలు ఏమైపోయినా ఆ రాజగురువుకు పట్టలేదు. తెలుగు ప్రజల బలీయమైన ఆకాంక్షలు, మనోభావాలు ఆయనకు పట్టలేదు..’’ అని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదని, ఏ ప్రాంతం ఎటుపోయినా ఫర్వాలేదని మౌనంగా ఉంటే నష్టం జరుగుతుందన్నారు. నేతలు ఇప్పటికైనా నోరు విప్పాలని లేదా తమకు పదవులు, స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం కనుక మాట్లాడబోమని చెప్పాలని తాను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. నోరు మెదిపితే సీబీఐ కేసులు పెడతామని చంద్రబాబును కాంగ్రెస్ బెదిరించిన మాట వాస్తవం కాదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. వారికి లొంగి మౌనంగా ఉంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తీరు నాజీయిజమే ! కాంగ్రెస్ వ్యవహారం చూస్తోంటే జర్మనీలో నాజీ నియంతల తీరును గుర్తుకుతెస్తోందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. నాజీలు ప్రజలను ఎలా విభజించి హతమార్చిందీ రచయిత మార్టిన్ నిలోమర్ చెప్పిన మాటలను ఆయన ఉదహరించారు. ‘‘వాళ్లు (నాజీలు) ముందుగా కమ్యూనిస్టులను చంపాలని వచ్చారు.. మేం కమ్యూనిస్టులం కాదు కనుక ఏమీ మాట్లాడలేదు.. వారిని నరికేశారు. రెండోసారి సోషలిస్టులను హతమార్చాలని వచ్చారు.. మేం సోషలిస్టులం కాదు కనుక పట్టించుకోలేదు.. వారినీ చంపేశారు. ఆ తరువాత వాళ్లు ట్రేడ్ యూనియన్ నేతల కోసం వచ్చారు. నేను ట్రేడ్ యూనియన్ నేతను కాదు కనుక జోక్యం చేసుకోలేదు.. అనంతరం క్యాథలిక్‌ల కోసం వచ్చారు.. మళ్లీ యూదుల కోసం వచ్చారు.. ఎప్పుడూ అంతే. చివరిగా వాళ్లు నాకోసమే వచ్చామన్నారు. అపుడు నా వెనుక ఎవరైనా ఉన్నారేమోనని చూశాను.. అప్పటికి ఎవరూ మిగల్లేదు. నా గురించి మాట్లాడేవారే లేకుండా పోయారు..’’ అని ఆ రచయిత వాపోయారని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలు కూడా అలాగే ఉన్నాయని గడికోట వ్యాఖ్యానించారు. ‘‘తొలుత జగన్‌పైకి వచ్చారు.. ‘ఆయన మా పార్టీ కాదు కదా, మేమెందుకు మాట్లాడాలి’ అని వేరే పార్టీల వారు భావించారు. తరువాత కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకుంది. ‘ఈ ప్రాంతం మాది కాదు కదా, ఎందుకు మాట్లాడాలి’ అనుకున్నారు. ఈ రోజు జిల్లాల వారీగా చీలికలు తెస్తున్నారు. ఇంకా మేమెందుకు మాట్లాడాలని నాయకులు మౌనంగా కూర్చోవడం చూస్తోంటే ఆనాడు నాజీల సమయంలోలాగే అందరూ బలికావాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. -
మంత్రి ధర్మాన, సబితాల జ్యుడీషియల్ కస్టడీకి నో: సీబీఐ ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కేసును ప్రభావితం చేసేలా తరచుగా మీడియాతో మాట్లాడుతున్న వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమోను ప్రత్యేక కోర్టు బుధవారం కొట్టివేసింది. వీరిద్దరూ మీడియాతో మాట్లాడిన సీడీలను పూర్తిగా పరిశీలించామని, వీరి వ్యాఖ్యలు సాక్షులను ప్రభావితం చేసేలా లేవని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. సీబీఐ సమర్పించిన అన్ని రికార్డులను పరిశీలించామని, వారు చేసిన నేరారోపణలకు సంబంధించి ఆధారాలేవీ కనిపించడంలేదని స్పష్టంచేశారు. ధర్మాన, సబితలు చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. అయినా సాక్షులు వాటిని తప్పుగా అర్థం చేసుకుంటే అందుకు వీరు బాధ్యులు కారని తేల్చిచెప్పారు. వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ వేసిన మెమోలో సరైన కారణాలేవీ లేవని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. ‘‘మంత్రివర్గ సమష్టి నిర్ణయాల మేరకే వ్యవహరించామని, తాము ఎటువంటి తప్పు చేయలేదని మీడియా ద్వారా ప్రజలకు వివరించడమే మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు చేసిన తప్పా? సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్‌భాన్ మీడియాతో మాట్లాడితే తప్పు లేనప్పుడు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాట్లాడితే చట్ట విరుద్ధం ఎలా అవుతుంది. దర్యాప్తు చేస్తున్నప్పుడు, చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు ధర్మాన, సబితలు సాక్షులను ప్రభావితం చేయనప్పుడు.. ఇప్పుడెలా చేస్తారు? మంత్రులుగా ఉన్నపుడు సాక్షులను ప్రభావితం చేయని వారు మంత్రి పదవులు కూడా లేని ఈ సమయంలో ఎలా చేస్తారు? చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కూడా వీరిని కస్టడీకి తీసుకోవాలని సీబీఐ కోరలేదు కదా!! కోర్టు ప్రశ్నించినప్పుడు సైతం సమన్లు ఇస్తే సరిపోతుందని పేర్కొంది కదా!! అందుకని సహేతుకమైన కారణాలు చెప్పకుండా వీరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమో విచారణార్హం కాదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి, గవర్నర్లను కలిసి కళంకిత మంత్రులంటూ ధర్మాన, సబితలపై ఫిర్యాదు చేశారు. వాటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా వారిపై ఉంది. ఆరోపణలకు వివరణ ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే వారు మీడియాతో మాట్లాడారు. తాము ఎటువంటి తప్పు చేయలేదని, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని మాత్రమే వారు వ్యాఖ్యానించారు’’ అని మంత్రుల తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్రావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. -
చిట్ ఫండ్ మోసాలపై ఫోరం
ముంబై: చిట్‌ఫండ్ మోసా లపై నియంత్రణ సంస్థలు దృష్టి సారిం చాయి. ఈ పథకాలపై ప్రభుత్వ విభాగాలు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై సమన్వయానికి ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపిం ది.ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సారధ్యంలో జరిగిన సమావేశంలో సెబీ, ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ చీఫ్‌లు పాల్గొన్నారు. కొత్తగా ఆర్బీఐ గవర్నర్ పగ్గాలను చేపట్టబోతున్న రాజన్ కూడా హాజరయ్యారు. -
ర్యాన్‌బాక్సీ నష్టం రూ. 524 కోట్లు
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ రూ. 524 కోట్ల నికర నష్టాన్ని ప్రక టించింది. ఇందుకు రూపాయి విలువ క్షీణించడంతో విదేశీ కరెన్సీ రుణాలు భారంకావడం, ఫ్రాన్స్ కార్యకలాల గుడ్‌విల్ నష్టాలు ప్రభావం చూపాయి. గతేడాది ఇదే కాలంలో అంటే ఏప్రిల్-జూన్’12లో సైతం రూ. 586 కోట్ల నష్టాలను నమోదు చేసుకుంది. నిజానికి రూపాయి విలువ క్షీణించడంవల్ల కంపెనీకి ఎగుమతుల ఆదాయం పెరుగుతుంది. అయిదే ఇదే సమయంలో డెరివేటివ్స్‌లో ఏర్పడ్డ మార్క్ టు మార్కెట్(ఎంటూఎం) నష్టాలు, విదేశీ కరెన్సీ రుణాలు భారంకావ డం వంటి అంశాలు దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. క్షీణించిన అమ్మకాలు: ప్రస్తుత సమీక్షా కాలంలో అమ్మకాలు కూడా రూ. 3,205 కోట్ల నుంచి రూ. 2,633 కోట్లకు క్షీణించాయి. యూఎస్ మార్కెట్ల నుంచి ప్రత్యేక హక్కుల ఆదాయం తగ్గడంతో అమ్మకాలు పరిమితమయ్యాయని కంపెనీ సీఈవో అరుణ్ సాహ్నే చెప్పారు. -
మరో 68 పాయింట్లు డౌన్
డాలరుతో మారకంలో రూపాయి విలువ మరో కొత్త కనిష్టాన్ని తాకడంతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ ఒడిదొడుకులను ఎదుర్కొంది. 18,811-18,551 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 18,665 వద్ద స్థిరపడింది. ఇది 68 పాయింట్ల నష్టంకాగా, నిఫ్టీ కూడా 23 పాయింట్లు క్షీణించింది. 17 వారాల కనిష్టమైన 5,519 వద్ద నిలిచింది. అయితే మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లు పుంజుకున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.3% లాభపడగా, మిడ్ క్యాప్ 0.7% బలపడింది. వెరసి ట్రేడైన మొత్తం షేర్లలో 1,249 లాభపడగా, 1,042 నష్టపోయాయి. ఏప్రిల్-జూన్ కాలానికి కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ 1.7% స్థాయిలో వృద్ధి చెందడంతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలలో కోత విధించవచ్చునన్న అంచనాలు బలపడుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లుతాయన్న ఆందోళనతో అమ్మకాలు కొనసాగుతున్నాయని విశ్లేషించారు. రియల్టీ హైజంప్ ప్రధానంగా ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.5% స్థాయిలో డీలాపడగా, రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5% ఎగసింది. ఐటీ షేర్లపై ఫండ్స్ మక్కువ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల కంపెనీలపై దేశీయ మ్యూ చువల్ ఫండ్స్‌కు మక్కువ పెరుగుతోంది. జూన్ చివరికి ఐటీ రంగ షేర్లలో ఫండ్స్ మొత్తం పెట్టుబడులు రూ. 18,430 కోట్లకు చేరాయి. ఇవి మూడు నెలల గరిష్టంకాగా, ఫండ్స్ నిర్వహణలోగల మొత్తం ఆస్తులలో(ఏయూఎం) 10% వాటాకు సమానం. సెబీ గణాంకాల ప్రకారం జూన్ 30కల్లా ఫండ్స్ ఏయూఎం రూ. 1.80 లక్షల కోట్లుగా నమోదైంది. -
రాజన్.. రాత మారుస్తారా!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్‌గా నియమితులైన రఘురామ్ రాజన్ ప్రస్తుత ఆర్థిక మందగమనం నుంచి భారత్‌ను బైటపడేస్తారని ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్‌కు మధ్య మంచి సమన్వయం నెలకొనేలా ఆయన చూడగలరని వారు విశ్వసిస్తున్నారు. అయితే విధాన నిర్ణయాల్లో రాజన్ ఎలాంటి మార్పులు తెస్తారో ముందే వ్యాఖ్యానించడం తొందరపాటవుతుందని వీరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్న రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. అక్కరకు అనుభవం: ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో రాజన్ నియామకం ఆశలు రేకెత్తించేదిగా ఉందని క్రెడిట్ సూసీ డెరైక్టర్(ఏషియన్ ఎకనామిక్స్ రీసెర్చ్) రాబర్ట్ ప్రియర్-వాండెస్ఫోర్డే వ్యాఖ్యానించారు. అవసరమైన నిర్ణయాలను త్వరితంగా తీసుకోవలసిన అవసరం ఇప్పుడుందని ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసిన అనుభవం కారణంగా ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్‌కు మధ్య రాజన్ మంచి సమన్వయం సాధించగలరని నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండట్ సెక్యూరిటీస్ ఎకనామిస్ట్ సోనాల్ వర్మ చెప్పారు. మార్కెట్లు సానుకూలం రాజన్ నియామకం పట్ల మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయని డీబీఎస్ బ్యాంక్ ఎకనామిస్ట్ రాధికా రావు విశ్లేషించారు. -
చిన్న కార్లతో హ్యుందాయ్ సందడి
హైదరాబాద్: చిన్న కార్ల మార్కెట్లో హ్యుందాయ్ భారీ యుద్ధానికే సిద్ధం అవుతోంది. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకికి పోటీగా కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి తేనున్నది. రెండేళ్లలో కనీసం నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తేవడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది, వీటిల్లో ఎస్యూవీ, సెడాన్లు కూడా ఉంటాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మరోవైపు అమ్మకాలు మరింతగా పెంచుకోవడానికి గాను పూర్తిగా భారత్‌లోనే డిజైన్ చేసి, భారత్‌లోనే కార్లను తయారు చేసే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. దీంట్లో భాగంగా హైదరాబాద్‌లోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. వివరాలు..., వచ్చే నెలలో గ్రాండ్ ఐ10 చిన్న కార్ల సెగ్మెంట్లో మారుతీ తర్వాతి స్థానం హ్యుందాయ్‌దే. కొత్త కొత్త మోడళ్లను రంగంలోకి తేవడం ద్వారా మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి కంపెనీకి గట్టిపోటీనివ్వాలని హ్యుందాయ్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ కార్లపై కంపెనీ దృష్టిపెడుతోంది. దీంట్లో భాగంగానే ఈ సెగ్మెంట్లో బాగా అమ్ముడయ్యే మారుతీ సుజుకి ఆల్టోకు పోటీగా ఇయాన్ 1.1 లీటర్ కారును అందుబాటులోకి తేనున్నదని సమాచారం. కొత్త కాంపాక్ట్ కారు, గ్రాండ్ ఐ10ను హ్యుందాయ్ కంపెనీ వచ్చే నెలలో మార్కెట్లోకి తేనున్నది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారు మారుతీ స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో కార్లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా. డీజిల్ కార్ల విభాగంలో హ్యుందాయ్ వెనకబడి ఉందని, అమ్మకాలు మరింతగా పెంచుకోవడానికి కొత్త డీజిల్ కార్లతో రంగంలోకి రానున్నదని నిపుణులంటున్నారు. మేడిన్ ఇండియా గ్రాండ్ ఐ10 తరహా కార్లను భారత్‌లోనే అభివృద్ధి చేసే, తయారు చేయాలని హ్యుందాయ్ యోచిస్తోంది. వీటిని విదేశాలకు కూడా విక్రయించాలని భావిస్తోంది. మార్కెట్లో అమ్మకాలు పెంచుకునే వ్యూహాంలో భాగంగా పూర్తిగా భారత్‌లోనే తయారయ్యే కారును రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ షారుక్ హాన్ చెప్పారు. అయితే ఈ లక్ష్యం ఐదేళ్ల తర్వాతే సాకారం అవుతుందని ఆయన చెప్పారు. ఈ లక్ష్యసాధన కోసం హైదరాబాద్‌లో ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నామని పేర్కొన్నారు. తమ మాతృ కంపెనీకి కొరియాలో ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్‌తో పోల్చితే ఈ సెంటర్ శక్తి సామర్థ్యాలు తక్కువేనని అంగీకరించారు. తమ మాతృసంస్థ డెవలప్ చేసిన కార్లను భారత పరిస్థితులకు తగ్గట్లుగా అవసరమైన మార్పులు, చేర్పులు చేయడానికి ప్రస్తుతం ఈ హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్ తోడ్పడుతోందని వివరించారు. ఇలాంటి సహకారమందించే స్థాయి నుంచి సొంతంగా కార్లును డిజైన్ చేసే స్థాయికి ఈ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నామని షారుక్ హాన్ పేర్కొన్నారు. -
రూపాయి మరింత డౌన్
ముంబై: రెండు రోజుల లాభాల అనంతరం రూపాయి బుధవారం మరో కొత్త కనిష్ట స్థాయిలో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 53 పైసలు క్షీణించి 61.30 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం నాటి 61.10 తర్వాత ఇది కొత్త కనిష్ట స్థాయి ముగింపు. డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్.. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఉపసంహరించే అవకాశాలున్నాయన్న సంకేతాలు, మరిన్ని విదేశీ నిధులు తరలిపోతుండటం సైతం రూపాయి బలహీనతకు దారితీశాయని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. రూపాయి ట్రేడింగ్ 60.90-61.90 శ్రేణిలో ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
టాటా మోటార్స్ లాభం 23% డిప్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు టాటా మోటార్స్ రూ.1,726 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతంలో అంటే ఏప్రిల్-జూన్’12 కాలానికి ఆర్జించిన రూ.2,245 కోట్లతో పోలిస్తే ఇది 23% క్షీణత. బ్రిటిష్ అనుబంధ కంపెనీ జేఎల్ఆర్ మెరుగైన పనితీరును ప్రదర్శించినప్పటికీ వరుసగా మూడో క్వార్టర్లోనూ లాభాలు తగ్గడం గమనార్హం. ఇదే కాలానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అమ్మకాలు మాత్రం రూ. 43,171 కోట్ల నుంచి రూ. 46,751 కోట్లకు పెరిగాయి. ఇవి 8% అధికం. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర 3% క్షీణించి రూ. 279 వద్ద ముగిసింది. కాగా, జేఎల్ఆర్ లాభం దాదాపు 29% ఎగసి 30.4 కోట్ల పౌండ్లను తాకగా, ఆదాయం 13% ఎగసి 412 కోట్ల పౌండ్లకు చేరింది. ఆర్థిక మందగమనంతో దేశీయ అమ్మకాలు క్షీణించడం, పోటీ కారణంగా వాహనాల ధరలు తగ్గించడం వంటి అంశాలు లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని కంపెనీ సీఎఫ్‌వో సి.రామకృష్ణన్ చెప్పారు. 19% తగ్గిన దేశీయ అమ్మకాలు స్టాండెలోన్ ప్రాతిపదికన దేశీయ కార్ల అమ్మకాలు 19% క్షీణించి 1,54,352 యూనిట్లకుపరిమితమయ్యాయి. అంతక్రితం 1,90,483 వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే స్టాండెలోన్ లాభం మాత్రం 242% ఎగసి రూ. 703 కోట్లయ్యింది. గతంలో ఇది రూ. 205 కోట్లు మాత్రమే. ఇందుకు అనుబంధ కంపెనీ జేఎల్ఆర్ నుంచి లభించిన రూ. 1,537 కోట్ల డివిడెండ్లు దోహదపడ్డాయి. -
బేస్‌రేటు పెంచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కనీస (బేస్) రుణ రేటును స్వల్పంగా 0.2% పెంచింది. దీంతో ఈ రేటు 9.60% నుంచి 9.80 శాతానికి చేరింది. ఫలితంగా ఈ రేటుకు అనుసంధానమైన ఆటో, కార్పొరేట్, ఇతర రుణ రేట్లు పెరగనున్నాయి. ఆగస్టు 3వ తేదీ నుంచీ తాజా రేటు అమల్లోకి వచ్చిందని బ్యాంక్ ట్రెజరర్ అశీష్ పార్థసారథి తెలిపారు. రూపాయి విలువ బలోపేతానికి రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న కఠిన లిక్విడిటీ చర్యలు, పాలసీ సమీక్షలో కీలక రేట్లను యథాతథంగా ఉంచిన నేపథ్యంలో యస్ బ్యాంక్ మొదట బేస్ రేటును పెంచింది. ఇప్పుడు ఇదే బాటను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుసరించింది. -
18% తగ్గిన ఎన్ఎండీసీ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి నికరలాభం 17.51 శాతం క్షీణించి రూ.1,572 కోట్లుగా నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే కాలానికి కంపెనీ రూ.1,906 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మంచి పనితీరు కనపర్చినప్పటికీ ముడి ఇనుము ధరలు తగ్గడం వల్ల ఆ మేరకు లాభాలు తగ్గినట్లు ఎన్ఎండీసీ చైర్మన్ సి.ఎస్.వర్మ తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో అమ్మకాలు స్వల్పంగా పెరిగి రూ.2,838 కోట్ల నుంచి రూ.2,869 కోట్లకు చేరినట్లు కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న దేశీ ఉక్కు పరిశ్రమకు తోడ్పాటును అందించడంపైనే అధికంగా దృష్టిసారిస్తున్నట్లు వర్మ తెలిపారు. సెవర్‌స్టల్ ఔట్!: ఛత్తీస్‌గఢ్‌లోని 3 మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఉక్కు ఫ్యాక్టరీని సొంతంగానే చేపడుతున్నామని, ఈ ప్రాజెక్టు నుంచి రష్యా కంపెనీ సెవర్‌స్టల్ వైదొలిగినట్లేనని వర్మ ప్రకటించారు. ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి 2010లో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినప్పటికీ సెవర్‌స్టల్ అంతగా ఆసక్తి చూపించడం లేదని, దీంతో ప్రస్తుతానికి సొంతంగానే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టులో సెవర్స్టల్కి ఎన్ఎండీసీ మెజార్టీ వాటా ఇవ్వనందుకే వెనకడుగువేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఇండియాలో అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌ను ఆపేసినట్లు సెవర్‌స్టల్ ప్రతినిధులు పేర్కొన్నారు. -
రిలయన్స్‌కు డీజీహెచ్ షాక్!
న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రంలో అంచనాల కన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకుగాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై (ఆర్ఐఎల్) అదనంగా మరో 781 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,700 కోట్లు) జరిమానా విధించాలని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఇప్పటిదాకా ఆర్‌ఐఎల్‌పై విధించిన జరిమానా మొత్తం 1.786 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,700 కోట్లు)కు చేరినట్లయింది. 2012-13లో కేజీ-డీ6లో రోజుకి 86.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఆర్ఐఎల్ సగటున కేవలం 26.07 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తి చేసిందని గత నెల 22న చమురు శాఖకు రాసిన లేఖలో డీజీహెచ్ తెలిపింది ఈ నేపథ్యంలో కేజీ క్షేత్రంపై పెట్టిన పెట్టుబడుల్లో 1.786 బిలియన్ డాలర్ల వ్యయాలను ఆర్ఐఎల్ రికవరీ చేసుకోవడాన్ని ఆమోదించరాదని పేర్కొంది. ఆర్ఐఎల్ 80 ఎంసీఎండీ మేర గ్యాస్ ఉత్పత్తి చేయడానికి సరిపడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినా.. ప్రస్తుతం 14 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ ముందుగా చెప్పిన స్థాయిలో గ్యాస్ బావులు తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి క్షీణించిపోయిందని, దీని మూలంగా చాలామటుకు మౌలిక సదుపాయాలు నిరుపయోగంగా మారాయని డీజీహెచ్ ఆరోపించింది. వ్యయాల రికవరీని అనుమతించకపోవడం వల్ల ఆర్ఐఎల్ అదనంగా లాభాల్లో వాటాల కింద 2012-13 ఆర్థిక సంవత్సరానికి 114 మిలియన్ డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని డీజీహెచ్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కంపెనీ 103 మిలియన్ డాలర్లు బకాయి పడింది. అయితే, వ్యయాల రికవరీని నిరాకరిస్తూ గతంలో ఇచ్చిన నోటీసులు ప్రస్తుతం ఆర్బిట్రేషన్‌లో ఉన్నందున.. తాజా డీజీహెచ్ లేఖపై చమురు శాఖ ఇంకా చర్యలేమీ చేపట్టలేదు. డీజీహెచ్ యూటర్న్.. గ్యాస్ ఉత్పత్తి తగ్గినందుకు ఆర్‌ఐఎల్‌పై జరిమానా విధించాలంటూ చమురుశాఖకు లేఖ రాసిన డీజీహెచ్.. ఆగస్టు 1న రాసిన మరో లేఖలో అందుకు పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గ్యాస్ ధరలపై పరిమితులు విధించడం, బకాయిపడిన గ్యాస్‌ని పాత ధరకే విక్రయించేలా ఆర్ఐఎల్ను ఆదేశించాలన్న వాదనలను తోసిపుచ్చింది. గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి సంక్లిష్టమైన అంశం కావడం వల్ల.. క్షేత్ర అభివృద్ధి ప్రణాళికలో అంచనా వేసినట్లుగా గ్యాస్ ఉత్పత్తి కాకపోతే.. దానికి కంపెనీలను బాధ్యులను చేయలేమని పేర్కొంది. డీజీహెచ్ పీఎస్సీ హెడ్ అనురాగ్ గుప్తా ఈ నెల 1న ఈ మేరకు లేఖ రాశారు. క్షేత్ర స్థాయిలో సంక్లిష్టమైన పరిస్థితుల కారణంగా ఏ రెండు బ్లాకుల్లోనూ అంచనాలకు అనుగుణంగా ఒకే స్థాయిలో ఉత్పత్తి జరగబోదని తెలిపారు. వ్యయాల వివాదమిదీ.. ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలు కేజీ డీ6 క్షేత్రంలో వివిధ రూపాల్లో మొత్తంమీద 9.2 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. ఉత్పత్తిలో వాటాల పంపకం ఒప్పందం (పీఎస్సీ) ప్రకారం ఆర్ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలు గ్యాస్ అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో ప్రభుత్వానికి వాటాలు పంచడానికి ముందే తమ వ్యయాలను రికవర్ చేసుకోవచ్చు. అంచనాల ప్రకారం ఈ ఏడాది గ్యాస్ ఉత్పత్తి 86.92 ఎంసీఎండీ ఉండాలి గానీ.. ఆ స్థాయికి ఉత్పత్తి ఏనాడూ చేరలేదు. పెపైచ్చు, అవసరానికి మించి మౌలిక సదుపాయాలపై అనవసర ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన లాభాల్లో వాటా తగ్గిపోయింది. దీంతో.. ఖజానా నష్టపోయిన మొత్తాన్ని రాబట్టేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. -
పార్లమెంటు రేపటికి వాయిదా
అత్యంత కష్టమ్మీద కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం పార్లమెంటు ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. గత నెలలో జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2011లో సభలో ప్రవేశపెట్టిన ఆహార భద్రత బిల్లును ఆహార శాఖమంత్రి కేవీ థామస్ ముందుగా ఉపసంహరించుకుని, ఆ తర్వాత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో రాష్ట్రాల హక్కుల్లో జోక్యం విషయం లేదని, సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదని థామస్ తెలిపారు. ఆహారాన్ని ఒక హక్కుగా ఇవ్వడానికే ఈ బిల్లు ఉద్దేశించామన్నారు. అయితే ఆహార భద్రత కంటే సరిహద్దు భద్రత మరింత ముఖ్యమని లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ ఈ సందర్భంగా తెలిపారు. జమ్ము కాశ్మీర్లో సైనికుల హత్యపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తన విధానాన్ని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆహార భద్రత బిల్లు రాష్ట్రాల హక్కులకు విరుద్ధంగా ఉందంటూ అన్నాడీఎంకే సభ్యుడు ఎ.తంబిదురై దాన్ని వ్యతిరేకించారు. బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందే రాష్ట్రాలను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బిల్లుకు కొన్ని సవరణలు చేయాలని యూపీఏ మాజీ మిత్రపక్షం డీఎంకేకు చెందిన టీఆర్ బాలు అన్నారు. ఈ గందరగోళం నడుమ స్పీకర్ మీరాకుమార్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు. ఆహార భద్రత బిల్లుపై చర్చకు ఆరు గంటలు కేటాయించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. గురువారం లేదా వచ్చే సోమవారం చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. అయితే, ఉభయ సభల్లో కాశ్మీర్ అంశం తీవ్ర గందరగోళానికి కారణమైంది. దీనిపై రక్షణ మంత్రి ఆంటోనీ ఇచ్చిన సమాధానం పార్లమెంటును కుదిపేసింది. ఈ సంఘటనపై భారత ఆర్మీ చెప్పేదానికి, ఆంటోనీ చెప్పిన విషయాలకు పొంతన కుదరకపోవడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ పదే పదే వాయిదా పడగా రాజ్యసభలో బీజేపీ సభ్యులు కార్యకలాపాలను స్తంభింపజేశారు. లోక్ సభ సమావేశం కాగానే విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాకిస్థానీ సైనికుల దాడి విషయంలో ఆంటోనీ తీరును తప్పుబట్టారు. ఆయన పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లుందని ఆమె అన్నారు. వామపక్షాల సభ్యులు కూడా ఇదే సమయంలో వెల్‌లోకి దూసుకెళ్లారు. పశ్చిమబెంగాల్లో విపక్షాలు, మహిళలు, బలహీనవర్గాలపై తృణమూల్ దాడులకు అంతులేకుండా పోతోందని వారు మండిపడ్డారు. అప్పుడే ఇరు సభల్లోనూ సీమాంధ్ర సభ్యులు తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని వచ్చారు. రక్షణమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభలోనే ఉన్నందున ఆయన కాశ్మీర్ సంఘటనపై వివరంగా ఓ ప్రకటన చేయాలని ఆమె కోరారు. తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఉభయ సభలు తొలుత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. అనంతరం రెండోసారి సమావేశమైన తర్వాత ఆహార భద్రత బిల్లును ప్రవేశపెట్టినా, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. దీంతో అటు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీలు ఉభయ సభలను గురువారానికి వాయిదా వేశారు. -
బ్యాంకింగ్ రంగానికి 10వేల కోట్ల నష్టం
రాష్ట్రాన్ని విభజించేందుకు తాము సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పిన ఒక్క మాట విలువ ఎంతో తెలుసా... అక్షరాలా పదివేల కోట్లు!! అది కూడా కేవలం ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే! తెలంగాణ ఏర్పాటుకు తాము సుముఖమేనంటూ కేంద్ర మంత్రి అజయ్ మాకెన్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ జూలై 30వ తేదీన ఢిల్లీలో ప్రకటించారు. తత్ఫలితంగా సీమాంధ్ర ప్రాంతం ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. దాదాపు గడిచిన వారం రోజుల నుంచి అక్కడ ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పాఠశాలలు, దుకాణాలు, బ్యాంకులు, చివకు ఆస్పత్రులు కూడా సరిగా పనిచేయడంలేదు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోవడం వల్ల ఆ రంగానికి దాదాపు పదివేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టడానికి కూడా కుదరకపోవడంతో చాలా వరకు ఏటీఎంలు ఖాళీగానే ఉంటున్నాయి. దాదాపుగా బ్యాంకులన్నీ కలిసి ఈ పదమూడు జిల్లాల్లో మూడువేల ఏటీఎంలు, నాలుగువేల శాఖలు కలిగి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రాష్ట్రం మొత్తమ్మీద చూసుకుంటే ఆరువేల శాఖలలో 80 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏటీఎం సేవలకు అంతరాయం కలిగిన మాట వాస్తవమేనని ఎస్బీఐ సీనియర్ అధికారి ఒకరు కూడా అంగీకరించారు. కొన్ని ప్రాంతాల్లో భద్రతాపరమైన కారణాల వల్ల ఏటీఎంలలో డబ్బులు పెట్టలేకపోతున్నామని, కానీ సాధ్యమైన చోటల్లా పెడుతున్నామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో వినియోగదారుల సౌకర్యం కోసం తెల్లవారుజామునే డబ్బులు పెడుతున్నట్లు చెప్పారు. చాలా నగరాల్లో ఉద్యోగులు తమ జీతం డబ్బులు తీసుకోడానికి ఏటీఎంలే ఆధారం కాబట్టి వాటివద్ద పొడవాటి క్యూలు ఉంటున్నాయి. అయితే, తమ బ్యాంకు శాఖలకు దగ్గరగా ఉండే ఏటీఎంలలో అయితే డబ్బులు ఉంటున్నాయని ఎస్బీఐ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని సీమాంధ్ర జిల్లాల్లో స్టేట్ బ్యాంకుకు దాదాపు 1200 ఏటీఎంలు ఉన్నాయి. సగటున ఒక్కో ఏటీఎంలో 300 లావాదేవీలు జరుగుతాయని, సుమారుగా 6-7 లక్షల రూపాయల వరకు డ్రా చేసుకుంటారని అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమైనట్లు ఆయన చెప్పారు. -
మధ్యాహ్న 'భోజనం' తో చిన్నారులకు అస్వస్థత
నలందా జిల్లాలోని చాందీ బ్లాక్‌లోని తరారీ గ్రామంలో బుధవారం ప్రాధమిక పాఠశాలలో వడ్డించిన భోజనం తిని 15 మంది చిన్నారులతోపాటు టీచర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు బ్లాక్ ఎడ్యుకేషన్ (బీడీఓ) అఫీసర్ చిత్తరంజన్ ప్రసాద్ వెల్లడించారు. ఆహారం తీసుకున్న వెంటనే కడుపులో తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వారు ఫిర్యాదు చేశారు. దాంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ఆ వార్త తెలిసిన వెంటనే జిల్లా అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. ఆ ఆహార పదార్థాలను పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ప్రయోగశాలకు పంపినట్లు బీడీఓ తెలిపారు. మధ్యాహ్న భోజనం కింద భోజనం చేసి గతనెల్లో శరన్ జిల్లా చాప్రా డివిజన్లో గందమయి గ్రామంలో 23 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనతో నివ్వెరపడిన బీహార్లొని నితీశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించినట్టు గప్పాలు పలికింది. అయిన బీహార్ రాష్ట్రంలో ఏదో మూల మధ్యాహ్న భోజన పథకం కింద భోజనం చేసిన విద్యార్థులు ఆసుపత్రులపాలైన సందర్భాలు లెక్కలుమిక్కిలిగా పోగుపడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బుధవారం తరారీ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన ఓ ఉదాహారణ మాత్రమే. -
విభజనపై కాంగ్రెస్ ఉన్నతస్థాయి కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న అభ్యంతరాల పరిశీలనకు కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీని ప్రకటించింది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి వీరప్ప మెయిలీ, అహ్మద్ పటేల్ ఇందులో సభ్యులుగా ఉంటాయి. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలను ఈ కమిటీ ఆలకించనుంది. హైదరాబాద్‌పై పీఠముడి పడిన నేపథ్యంలో కమిటీ పనితీరుపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే ఇరు ప్రాంతాల నాయకులు అధిష్టాన పెద్దల ముందు పలుమార్లు తమ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పన కమిటీని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. నారాయణస్వామి, దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉండవల్లి, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. -
స్టేట్‌బ్యాంకుకు రూ. 5.6 లక్షల జరిమానా
కరెన్సీ చెస్ట్ నిబంధనలను అతిక్రమించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రిజర్వు బ్యాంకు 5.6 లక్షల రూపాయల జరిమానా విధించింది. కరెన్సీ చెస్టులను తెరిచి, నిర్వహించే విషయంలో తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు తేలడంతో మొత్తం 5,62,555 రూపాయల జరిమానాను విధించినట్లు రిజర్వు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు గత నెలలో నో యువర్ కస్టమర్, మనీలాండరింగ్ నిరోధక పద్ధతులు సరిగా పాటించనందుకు స్టేట్ బ్యాంకుకు మూడుకోట్ల రూపాయల జరిమానాను రిజర్వు బ్యాంకు విధించింది. ఒక ఆన్లైన్ పోర్టల్ ఈ విషయమై ఫిర్యాదు చేయడంతో రిజర్వు బ్యాంకు ఈ చర్యలు తీసుకుంది. ఈ కేసులో అన్ని రకాల వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం స్టేట్ బ్యాంకు తగిన విధంగా వ్యవహరించట్లేదని నిర్ధారణకు వచ్చి, ఈ జరిమానా వడ్డించింది. బ్యాంకు ఖాతాలు తెరిచేటప్పుడు, లాకర్లు కేటాయించేటప్పుడు కేవైసీ పద్ధతులు పాటించకపోవడంతో వారు తమ నల్లడబ్బును తెల్లగా మార్చుకుని నకిలీ పాన్ కార్డులు కడా పొందుతున్నట్లు తేలింది. -
బక్కచిక్కిపోతున్న రూపాయి
డాలర్‌తో పోల్చితే రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. నగదు ప్రవాహాన్ని తగ్గించేందుకు కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడంతో రూపాయి కొంత పుంజుకుంది. కానీ రెండు వారాలు కూడా కాకముందే మళ్లీ పతనం దిశలో కింద కిందకు వెళుతోంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉంది. రూపాయి రోజు రోజుకు కిందకు పోతుండటంతో కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడుతోంది. గత నెల 31వ తేదీ బుధవారం డాలర్‌తో పోల్చితే 55.65 రూపాయలు కాగా, ఈరోజు 61.27కి పడిపోయింది. రూపాయి విలువ రోజురోజుకు దిగజారిaపోతూ ఆందోళన కలిగిస్తోంది. ఈ పతనం ఇలాగే కొనసాగి 70 వరకు పడిపోతుందనే అంచనాలు వస్తుండటంతో అటు ఆర్థిక శాఖ, ఇటు రిజర్వ్ బ్యాంకు పలు చర్యలు చేపడుతున్నాయి. కానీ ఇవేవీ ఫలితం ఇస్తున్న దాఖలాలు లేవు. రూపాయి పతనంతో దిగుమతులు భారమవుతున్నాయి. రెండు నెలల్లో పెట్రోల్ ధర నాలుగు సార్లు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ ధర దాదాపు 78 రూపాయలకు చేరింది. రూపాయి గనుక 70కి చేరితే లీటర్ ధర 100 రూపాయలకు చేరే ప్రమాదం ఉంది. ఒక్క పెట్రోల్ మాత్రమే కాకుండా అనేక రకాల వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గినా, రూపాయి విలువ పడిపోవడంతో మనదేశంలో బంగారం ధర పెరుగుతూ ఉంది. రూపాయి పతనం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం లేదు. ఇందువల్ల రూపాయిని నిలబెట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద నగదు సరఫరాను తగ్గించారు. మార్కెట్లో వడ్డీరేట్లు పెరిగేలా చేశారు. ఈ చర్యల నేపథ్యంలో వారం కింద రూపాయి 55 వరకు బలపడింది. కానీ మళ్లీ అంతలోనే 61 దాకా వచ్చింది. ఇలాగే వదిలేస్తే 65 దాకా వెళ్లిపోతుందేమోనని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పతనాన్ని అడ్డుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ చర్యల్లో భాగంగా ప్రధానంగా విదేశాల్లో జరుగుతున్న రూపాయి లావాదేవీలను నియంత్రించనుంది. ఈ లావాదేవీలను టెక్నికల్‌గా నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్‌డిఎఫ్) అని పిలుస్తున్నారు. సింగపూర్, లండన్, న్యూయార్క్ నగరాల్లో ఈ లావాదేవీలు జరుగుతున్నాయి. ఎం.ఎన్.సి. బ్యాంకులు, ఫండ్లు, పెద్ద పెద్ద ఇండియన్ కంపెనీలు ఈ లావాదేవీల కొనుగోళ్లు, అమ్మకాల్లో పాల్గొంటున్నాయి. గత పదేళ్లుగా ఈ తరహా లావాదేవీలు బాగా పెరిగాయి. మన దేశంలో రూపాయి గమనాన్ని ఇవి ప్రభావితం చేస్తున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఎన్డిఎఫ్లను అదుపు చేయాలని నిర్ణయించింది. ఈ పరిస్థితులలో వచ్చే నెల 4న రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన సారధ్యంలో రూపాయి బలపడుతుందని పలువురు భావిస్తున్నారు. రాజన్ తనకు ఉన్న అనుభవంతో ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెస్తారని ఆశిద్దాం. -
ధర్మాన, సబితాలకు సీబీఐ కోర్టులో ఊరట
హైదరాబాద్ : మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వీరిద్దర్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలన్న సీబీఐ గతంలో దాఖలు చేసిన మెమోను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ గతంలో కోర్టుకు విన్నవించింది. అలాగే వీరిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను కోర్టుకు సమర్పించింది. వ్యక్తిగత పూచికత్తులు సమర్పించినా ..జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపవచ్చంటూ సీబీఐ వాదించింది. అయితే సీబీఐ నిందితులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తుందని ధర్మాన ,సబితా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసిందని.. కోర్టుకు వ్యక్తిగత పూచికత్తును కూడా సమర్పించారని .. అప్పుడు జ్యుడీషియల్ రిమాండ్ అడగని సీబీఐ ఇప్పుడు ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని తన తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి....సాక్ష్యులను బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ కోర్టు పేర్కొంది. -
32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులు అరెస్ట్
గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న ఆందోళనకారుల చేపట్టిన బంద్ బుధవారం ఐదో రోజుకు చేరింది. అయితే 32 మంది గూర్ఖాలాండ్ ఉద్యమకారులను గతరాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. వారందరిపై గతంలోనే కేసు నమోదు అయ్యాయని, అలాగే శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దాంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఉద్యమకారుల సంఖ్య 143 మందికి చేరిందని తెలిపారు. అయితే గూర్ఖాలాండ్ జనమూక్తి మోర్చ అధ్యక్షుడు బిమల్ గురంగ్ అనిత్ ధపాను ఈ నెల మొదట్లోనే అరెస్ట్ చేసినట్లు పోలీసుల ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఆ రాష్ట్ర హోం సెక్రటరీ బాసుదేబ బెనర్జీ డార్జిలింగ్ హిల్స్‌లోని స్థానిక అధికారులతో కలసి శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఆయన డార్జిలింగ్‌లోని గూర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన ముఖ్యకార్యదర్శి రామదాస్ మీనాతో సమావేశమైనారు. స్థానిక పరిస్థితులపై ఇరువురు చర్చించారు. పరిస్థితులు అదుపులోకి తీసుకువచ్చేందుకు సహకరించాలని ఆయనకు బెనర్జీకి సూచించారు. కొల్కత్తా వెళ్లగానే డార్జిలింగ్‌లోని పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీకి నివేదిక సమర్పిస్తానని ఆయన తెలిపారు. అయితే డార్జిలింగ్ జిల్లా కలెక్టర్‌గా ఆర్థిక శాఖ సంయూక్త కార్యదర్శి పునీత్ యాదవ్‌ను నియమిస్తు బెంగాల్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుటివరకు ఆ పదవిలో ఉన్న సౌమిత్ర మోహన్‌ను బృద్వన్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఆర్టీసీకి ఉద్యమ సెగ, ఇరుప్రాంతాల్లో సమ్మె!
హైదరాబాద్ : ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ విభజన సెగ తగిలింది. ఇప్పటికే సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, ఉద్యమాల దెబ్బకు బస్సులు ....డిపోలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికే సీమాంధ్ర ఆర్టీసీ యూనియన్లు ఈనెల 12వ తేదీ నుంచి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ టీఎంయూ సమ్మెకు సిద్ధమైంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌తో టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చేందుకు నిర్ణయించింది. సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైప్పటి నుంచి తెలంగాణలోనూ సమ్మె ప్రారంభిస్తామని టీఎంయూ నేత అశ్వథ్ధామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. కాగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అటువైపు వెళ్లాల్సిన ఆర్టీసీ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. సీమాంధ్రలో ఉద్యమంతో ఆర్టీసీ రోజుకు రూ. 4కోట్లు ఆదాయాన్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ....సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో పోటా పోటీ సమ్మెలకు దిగితే ఆర్టీసీ కోలుకోవటం కష్టమే. -
పూంఛ్ ప్రాంతాన్ని సందర్శించిన ఆర్మీచీఫ్ బిక్రం సింగ్
పూంచ్ జిల్లాలో భారత సైనికులపై పాకిస్థాన్ మూకలు కాల్పులు జరిపి హతమార్చిన సంఘటనపై వాస్తవాలు పరిశీలించి, పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ బుధవారం అక్కడకు చేరుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిని కూడా ఆయన సమీక్షించనున్నారు. జనరల్ సింగ్ ముందుగా పూంఛ్ జిల్లాతో పాటు జమ్ము ప్రాంతంలో నియంత్రణ రేఖను పరిరక్షించే 16 కోర్ దళం ప్రధాన కార్యాలయం ఉన్న నగ్రోటాను సందర్శించారు. అనంతరం రాజౌరి వెళ్లి అక్కడ డివిజన్ ప్రధాన కార్యాలయంలో ఉన్న పలువురు సీనియర్ ఆర్మీ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం పూంఛ్ వద్దకు వెళ్లి అక్కడ నియంత్రణ రేఖ సమీపంలో భద్రత పరిస్థితిని సమీక్షించారు. పాకిస్థానీ సైనిక దుస్తులలో ఉన్న దాదాపు 20 మంది వచ్చి పూంఛ్ సెక్టార్‌లోని చకన్ దా బాగ్ ప్రాంతంలో భారత సైనికులపై కాల్పులు జరిపి ఐదుగురిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో భారత సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారికి అండగా ఉండేందుకు బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు. -
సైనికుల కాల్చివేతపై ప్రకటనను సమర్థించుకున్న ఆంటోనీ
ఐదుగురు భారత సైనికులను పాకిస్థాన్ మూకలు కాల్చి చంపిన సంఘటనపై పార్లమెంటులో తాను చేసిన ప్రకటనను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సమర్థించుకున్నారు. తనకు మరిన్ని వివరాలు అందిన వెంటనే వాటిని పార్లమెంటుకు సమర్పిస్తానన్నారు. ఈ సంఘటనపై ఆంటోనీ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాకిస్థానీ సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారనడం వాళ్లు తప్పించుకోడానికి అవకాశం ఇచ్చినట్లేనని తీవ్రంగా విమర్శించాయి. మంత్రి ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించాయి. అయితే, 'రక్షణ మంత్రిగా ఏవైనా ప్రకటనలు చేసేటప్పుడు నేను జాగ్రత్తగానే ఉంటాను. నేను నిన్న ఓ ప్రకటన చేశాను. ఈరోజు ఆర్మీ చీఫ్ బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు. నాకు మరిన్ని వివరాలు తెలియగానే వాటిని మీ ముందుంచుతాను' అని ఆయన రాజ్యసభలో బుధవారం తెలిపారు. పార్లమెంటుతో పాటు భారతదేశం మొత్తం జాతి భద్రత, సమగ్రత విషయంలో ఒక్కటిగానే ఉన్నట్లు ఆంటోనీ చెప్పారు. అయితే, ఆంటోనీ ఇచ్చిన సమాధానం బుధవారం కూడా పార్లమెంటును కుదిపేసింది. ఈ సంఘటనపై భారత ఆర్మీ చెప్పేదానికి, ఆంటోనీ చెప్పిన విషయాలకు పొంతన కుదరకపోవడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లోక్‌సభ పదే పదే వాయిదా పడగా రాజ్యసభలో బీజేపీ సభ్యులు కార్యకలాపాలను స్తంభింపజేశారు. లోక్ సభ సమావేశం కాగానే విపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పాకిస్థానీ సైనికుల దాడి విషయంలో ఆంటోనీ తీరును తప్పుబట్టారు. ఆయన పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లుందని ఆమె అన్నారు. వామపక్షాల సభ్యులు కూడా ఇదే సమయంలో వెల్‌లోకి దూసుకెళ్లారు. పశ్చిమబెంగాల్లో విపక్షాలు, మహిళలు, బలహీనవర్గాలపై తృణమూల్ దాడులకు అంతులేకుండా పోతోందని వారు మండిపడ్డారు. అప్పుడే ఇరు సభల్లోనూ సీమాంధ్ర సభ్యులు తమ వాదనను గట్టిగా వినిపించారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నోటికి నల్ల గుడ్డ కట్టుకుని వచ్చారు. రక్షణమంత్రి దేశానికి క్షమాపణ చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సభలోనే ఉన్నందున ఆయన కాశ్మీర్ సంఘటనపై వివరంగా ఓ ప్రకటన చేయాలని ఆమె కోరారు. తీవ్ర గందరగోళం చెలరేగడంతో ఉభయ సభలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. -
భారత్ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులకు గాయాలు
భారత్, పాక్ సరిహద్దు ప్రాంతమైన లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఇరుదేశాల సైనికులు పరస్పరం జరిపిన కాల్పుల్లో బుధవారం ఇద్దరు పాకిస్థాన్ సైనికులు గాయపడ్డారు. దాంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తాము ఎటువంటి చర్యలకు దిగకుండానే భారత్ సైనికులు తమపై కాల్పులు జరిపారని పాకిస్థాన్ మిలటరీ అధికారి ఆరోపించారు. అయితే ఎల్ఓసీని పాక్ దళాలు అతిక్రమించిన కారణంగానే తాము కాల్పులు జరపవలసి వచ్చిందని భారత సైనిక అధికారులు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఐదుగురు భారతీయ సైనికులను హతమార్చిన పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుందని జమ్ముకాశ్మీర్‌లోని సీనియర్ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు. కాగా ఇరుదేశాల సరిహద్దుల వద్ద యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్న నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య చర్చలకు విఘాతం కలిగి అవకాశం ఉంది. గతంలో భారతీయ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి చర్చలు జరపాలని పాక్ భావించింది. అయితే ఈ ఏడాది మొదట్లో కాశ్మీర్లో పాక్ విధ్వంసానికి యత్నించింది. దాంతో ఆ చర్చల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చాయి. -
రష్యాలో రోడ్డును దొంగిలించిన మొనగాడు
ఎక్కడైనా డబ్బు దొంగతనం గురించి విన్నాం, నగల దొంగతనం గురించి విన్నాం. ఇంకా మాట్లాడితే ఇంట్లోకి చొరబడి మొత్తం దుస్తుల దగ్గర్నుంచి టీవీలు, టేప్ రికార్డర్లు.. ఇలా వస్తువులన్నింటినీ చోరీ చేయడం కూడా మనకు తెలుసు. కానీ, ఎవరైనా రోడ్డును దొంగిలించడం చూశారా? ఏంటి.. నమ్మలేకపోతున్నారా.. కానీ ఇది పచ్చి వాస్తవం. ఎప్పుడూ హడావుడిగా ఉండే ఓ జాతీయ రహదారి మీద ఉన్న మొత్తం 82 కాంక్రీటు శ్లాబు బ్లాకులను ఓ దొంగ ఎత్తుకుపోయాడు. నిరంతరం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డును అతగాడు దర్జాగా చోరీ చేస్తున్నా ఎవరికీ తెలియకపోవడం విశేషం. అతగాడు చోరీ చేసిన కాంక్రీటు శ్లాబుల విలువ అక్షరాలా 3,73,576 రూపాయలు. సిక్టివ్కర్ అనే నగరానికి శివార్లలో ఉన్న జాతీయరహదారి మీద పరిచిన శ్లాబులను అతగాడు వలుచుకుని తీసుకెళ్లిపోయాడు. ఫోర్కులిఫ్టుతో కూడిన ట్రక్కు, బుల్డోజర్ రెండింటినీ తీసుకెళ్లి మరీ అతడీ పని చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 82 బ్లాకులను రోడ్డు మీద నుంచి తీసుకెళ్లిపోయాడు. వీటిని మూడు పెద్ద పెద్ద ట్రక్కులలో లోడ్ చేసుకుని పట్టుకెళ్లాడు. రోడ్డును మూసేసినట్లు ఓ బోర్డు పెట్టి, వాహనాలు అటువైపు రాకుండా చూసుకుని మరీ ఈ చోరీ చేసినట్లు భావిస్తున్నారు. అయితే.. ఇంత గొప్పగా చోరీ చేసిన సదరు దొంగగారు చివరకు పోలీసులకు పట్టుబడిపోయాడు. పోలీసులు అనుకోకుండా ఈ మూడు వాహనాలను ఆపి తనిఖీ చేస్తుంటే అతడు దొరికాడు తప్ప, చోరీ జరిగిన విషయాన్ని పోలీసులు గమనించలేకపోయారు. ఈ దొంగతనానికి గాను అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, కాంక్రీటు శ్లాబులు పట్టుకెళ్లి ఏం చేద్దామనుకుంటున్నాడో మాత్రం తెలియరాలేదు. -
పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై వృద్ధుడి యాసిడ్ దాడి
తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటూ వెంట పడటమే కాదు.. ఆమె కాదన్నందుకు ఆ యువతిపై యాసిడ్ పోశాడో 50 ఏళ్ల ప్రబుద్ధుడు. అయితే, అదృష్టవశాత్తు ఆమె ఎలాగోలా ఈ దాడి నుంచి తప్పించుకోగలిగింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో జరిగింది. పేపర్ మిల్లు కాలనీకి చెందిన విష్ణు నారాయణ్ శివపురి అనే వ్యక్తి మహానగర్ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి (24) ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. అయినా అతడు వెంటపడటం మానలేదు. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఆమె వెంట పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడు. కానీ ఆమె అంగీకరించలేదు. అంతే.. చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకుని, మూత తీసి ఆమె మీద పారబోశాడు. కానీ, అతడి దుశ్చర్యను ముందే గమనించిన ఆ యువతి తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకుంది. తన దివంగత తండ్రికి శివపురి స్నేహితుడని, ఆ పరిచయంతోనే చనువు పెంచుకుని, తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంత పెట్టాడని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు అతగాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పదవుల కోసం పాకులాట ఎందుకు: వీరశివారెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మల్యే వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. విభజన జరుగుతుందని తెలిసినా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు మిన్నకుండిపోయారని ఆయన బుధవారమిక్కడ ధ్వజమెత్తారు. ప్రజల మనోభావాలు నేతలకు పట్టవా అని ప్రశ్నించిన ఆయన రాజీనామాలు చేయకుండా పదవులు పట్టుకుని వేలాడేవారిని ప్రజలు క్షమించరని వీరశివారెడ్డి అన్నారు. నాలుగు నెలల మంత్రి పదవుల కోసం పాకులాట ఎందుకని ఆయన మండిపడ్డడారు. పనిలో పనిగా వీరశివారెడ్డి టీఆర్ఎస్ పార్టీపై శివాలెత్తారు. కేసీఆర్‌పై భౌతిక దాడి చేయాల్సిన పని రాష్ట్రంలో ఎవరికి లేదన్నారు. రాజకీయ వారసత్వం, ఆస్తుల కోసమో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో, లేక పార్టీ నేతలు హరీష్ రావు, ఈటెల రాజేందర్, కేకేలకే ఈ ఆలోచన ఉండొచ్చని ఆరోపించారు. విజయశాంతి ఇప్పటికే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారని, మరో ఎనిమిది మంది కాంగ్రెస్‌లో చేరుతారనే ఆందోళనలతోనే టీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను హతమార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని వీరశివరెడ్డి ఎద్దేవా చేశారు. -
విభజన ప్రక్రియను ఆపాలి: ఎంపీ వేణుగోపాల్ రెడ్డి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే ఆపాలని నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు నష్టపోతారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రాజీనామాలు ఆమోదించేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి, సోనియాగాంధీ ముందు ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపామని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిన్న సభలో తెలుగుదేశం సభ్యులు నిమ్మల కిష్టప్ప, నారాయణరావు, వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్ పోడియం వద్దకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను స్తంభింప చేసిన విషయం తెలిసిందే. -
యూపీలో 22 మంది చిన్నారులకు అస్వస్థత
కడుపులో నులిపురుగులను అంతమెందించేందుకు వేసుకున్న మాత్రలు వికటించి 22 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న చోటు చేసుకుంది. ఝాన్సీ జిల్లాలోని బాబినా ప్రాంతంలోని దుర్గాపూర్ గ్రామంలో ఆశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్ కింద చిన్నారులకు ఆ మాత్రలను అందజేశారు. ఆ మాత్రలు వేసుకోవడంతో వారు తీవ్ర కడుపునొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు మొదలైనాయి. దాంతో ఆ చిన్నారులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లలకు వెంటనే వైద్యం అందించాలని వారి తల్లితండ్రులు ఆ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో వైద్యులను ఆసుపత్రిలో ఆందోళనకారులు నిర్బంధించారు. పోలీసుల జోక్యం చేసుకుని వారిని విడుదల చేశారు. అయితే ఆ విద్యార్థులు తీవ్ర ఆనారోగ్యంపాలైన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. చిన్నారులు అరోగ్యంగానే ఉన్నారని, దాంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వైద్యులు బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు ఆరు కోట్ల చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అఖిలేష్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
యూపీలో 22 మంది చిన్నారులకు అస్వస్థత
కడుపులో నులిపురుగులను అంతమెందించేందుకు వేసుకున్న మాత్రలు వికటించి 22 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న చోటు చేసుకుంది. ఝాన్సీ జిల్లాలోని బాబినా ప్రాంతంలోని దుర్గాపూర్ గ్రామంలో ఆశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్ కింద చిన్నారులకు ఆ మాత్రలను అందజేశారు. ఆ మాత్రలు వేసుకోవడంతో వారు తీవ్ర కడుపునొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు మొదలైనాయి. దాంతో ఆ చిన్నారులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లలకు వెంటనే వైద్యం అందించాలని వారి తల్లితండ్రులు ఆ ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో వైద్యులను ఆసుపత్రిలో ఆందోళనకారులు నిర్బంధించారు. పోలీసుల జోక్యం చేసుకుని వారిని విడుదల చేశారు. అయితే ఆ విద్యార్థులు తీవ్ర ఆనారోగ్యంపాలైన ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. చిన్నారులు అరోగ్యంగానే ఉన్నారని, దాంతో వారిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వైద్యులు బుధవారం తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు ఆరు కోట్ల చిన్నారుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అఖిలేష్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అశీర్వాద్ చైల్డ్ హెల్త్ గ్యారంటీ స్కీమ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
పార్లమెంటు ఉభయ సభలు వాయిదా
వరుసగా మూడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలకు ఆటంకాలు తప్పలేదు. తొలి రెండు రోజులు సమైక్యాంధ్ర నినాదాలతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఎంపీలు సభను హోరెత్తించి వాయిదా వేయిస్తే మూడోరోజు బుదవారం నాడు పాకిస్థాన్ సైనికులు జమ్ము కాశ్మీర్‌లోని పూంఛ్ సెక్టార్‌లోకి చొచ్చుకొచ్చి మరీ భారత సైనికులను హతమార్చిన వైనంపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఉభయ సభలను అట్టుడికించింది. దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న మెతక వైఖరి వల్లే పాకిస్థాన్ చెలరేగిపోతోందని, పదే పదే మన దేశం మీద దాడులకు పాల్పడుతూ జవాన్ల విలువైన ప్రాణాలను హరిస్తోందని బీజేపీ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజీనామా చేసి తీరాల్సిందేనని బీజేపీ గట్టిగా పట్టుబట్టింది. లోక్‌సభతో పాటు రాజ్యసభలో కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఈ అంశంపై ప్రభుత్వాన్ని దునుమాడారు. రాజ్యసభలో రక్షణమంత్రి ఆంటోనీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని పార్లమెంట్లో బీజేపీ డిమాండ్ చేసింది. విపక్షాల గలభాతో లోక్‌సభ, రాజ్యసభ రెండూ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. -
ఏఏపీ సభ్యురాలు సంతోష్ కోలి మృతి
రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలు తగిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) అభ్యర్థి సంతోష్ కోలి బుధవారం మరణించారు. ఆమె మృతి పట్ల ఏఏపీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గతనెల 30న కోశాంబిలోని పసిఫిక్ మాల్ సమీపంలో సంతోష్ కోలి, ఏఏపీ మరో కార్యకర్త కులదీప్ ప్రయాణిస్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చి ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంతోష్ తలకు తీవ్ర గాయమైంది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆ ప్రమాదంలో కులదీప్ మాత్రం స్వల్పగాయాలపాలయ్యాడు. వచ్చే ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సంతోష్ కోలి పోటీ చేయనున్నారు. ఎన్నికల బరిలో నిలబడితే ప్రాణాలకు హాని తలపెడతామని గతంలో సంతోష్ కోలికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. -
ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకి జారిన భారత్
రూపాయి పతనం, స్టాక్ మార్కెట్ల బలహీన పడటంతో భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి కిందకు జారింది. స్టాక్ మార్కెట్లో నిన్న సాయంత్రానికి జరిగిన మొత్తం వాణిజ్యంలో భారత్ రూ. 989 కోట్ల అమెరికన్ డాలర్లు నమోదు అయింది. ట్రిలియన్ డాలర్లకు స్వల్పంగా కొన్ని కోట్లు తగ్గటంతో ఆ క్లబ్లో భారత్ స్థానం చేజారింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ కనిష్టస్థాయికి చేరుతుంది. అంతలోనే రూపాయి విలువ పెరుగుతుంది. ఆ ఒడిదుడుకుల నేపథ్యంలో భారత్‌కు ఆ పరిస్థితి నెలకొంది. గత కొన్ని వారాలుగా ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి భారత్ వైదొలిగే సూచనలు కనిపించాయి. కానీ రూపాయి పతనం, మరల పుంజుకొవడంతో భారత్ ఆ క్లబ్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. కానీ మంగళవారం జరిగిన వాణిజ్యంలో రూపాయి పతనం అయ్యే సరికి ఆ క్లబ్ నుంచి భారత్ వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 2007లో మొట్టమొదటగా భారత్ ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం పొందింది. 2008, సెప్టెంబర్‌లో ఆ క్లబ్ నుంచి వైదొలిగింది. 2009లో భారత్ మళ్లీ ట్రిలియన్ క్లబ్లో సభ్యత్వం పొందింది. భారత్ వైదొలగడంతో యూఎస్, యూకే, జపాన్, చైనా, కెనడా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతం, బ్రెజిల్ దేశాల స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. కాగా బ్రెజిల్, దక్షిణ కొరియా, నార్డిక్ ప్రాంతంలోని స్టాక్ మార్కెట్లు మాత్రం స్వల్ప తేడాతో ఆ క్లబ్లో కొనసాగుతున్నాయి. అయితే గతంలో రష్యా, స్పెయిన్, దక్షిణాఫ్రికాలు ఆ క్లబ్లో స్థానం పొంది మరల కొల్పోయాయి. -
పార్లమెంటు సమావేశాలను వీడని గ్రహణం
పార్లమెంటు సమావేశాలంటే చిన్న పిల్లల ఆటలా తయారైపోతోంది. అటు అధికార పక్షం గానీ, ఇటు ప్రతిపక్షం గానీ సమావేశాలు ఎలా జరగాలన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఏ అంశం దొరుకుతుందా, వాటిని స్తంభింపజేద్దామనే చూస్తున్నాయి. గత సంవత్సరం జరిగిన వర్షాకాల సమావేశాలు బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం పుణ్యమాని ఒక్కరోజు కూడా సరిగ్గా జరగలేదు. అంతకుముందు శీతాకాల సమావేశాలదీ అదే దారి. అప్పట్లో 2జీ కుంభకోణం పార్లమెంటు సమావేశాలను మింగేసింది. ఇప్పుడు తెలంగాణ అంశం మొదలైంది. ప్రతిసారీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ఏదో ఒక వివాదం తెరపైకి రావడం, అది కాస్తా పార్లమెంటు పనిచేయాల్సిన కాలం మొత్తాన్ని హరించడం ఇటీవలి కాలంలో మామూలైపోయింది. కేంద్రానికి బొగ్గు మసి గడిచిన వర్షాకాల సమావేశాలనే తీసుకుంటే.. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని, ఇద్దరు కళంకిత మంత్రులను తప్పించాలని బీజేపీ పట్టుబట్టగా, అధికారపక్షం తన మంకుపట్టును ఏమాత్రం వీడలేదు. పార్లమెంటు సమావేశాలు వర్షార్పణం అయిపోయిన తర్వాత తీరిగ్గా అప్పుడు మంత్రుల శాఖల్లో మార్పు లాంటి చర్యలు తీసుకుంది. అప్పట్లో 19 రోజుల పాటు పార్లమెంటు సమావేశం కావాలని ముందుగా నిర్ణయిస్తే.. కేవలం ఆరంటే ఆరే రోజులు నడిచింది. అందులోనూ ఎలాంటి చర్చలు సవ్యంగా సాగలేదు. జేపీసీ కావాలంటే.. పట్టించుకోని అధికార పెద్దలు ఇక 2010 శీతాకాల సమావేశాలదీ అదే పరిస్థితి. అప్పట్లో 2జీ స్పెక్ట్రం కేటాయింపు కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటూ విపక్షం పట్టుబట్టగా, అధికార పక్షం మాత్రం అందుకు ససేమిరా అంటూ తన మొండివైఖరి కొనసాగించింది. తీరా సమావేశాలు మొత్తం ఆ చర్చలతోనే సరిపోయిన తర్వాత.. అప్పుడు తీరిగ్గా జేపీసీని ఏర్పాటు చేసింది. ప్రతిసారీ ఇలాగే చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారిపోయింది. అప్పట్లో 23 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరగాలని తొలుత నిర్ణయించగా, గట్టిగా కొన్ని గంటలు కూడా పనిచేయలేదు. విపక్షాలన్నీ ఏకతాటిమీద నిలవడంతో.. ప్రతిరోజూ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అవి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి. ఉభయ సభల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. సభలో తెలంగాణ లొల్లి ఇక ఈసారి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని రోజులు ఉందనగా తెలంగాణకు తాము అనుకూలమంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇది కాస్తా సీమాంధ్ర ప్రాంతంలో చిచ్చురేపింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇటు లోక్‌సభతో పాటు అటు రాజ్యసభలో కూడా ఎంపీలు తీవ్రస్థాయిలో తమ ఆందోళన వ్యక్తం చేస్తూ గత రెండు రోజులుగా సమావేశాలను సాగనివ్వలేదు. దీనికి తోడు కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో భారత జవాన్ల కాల్చివేత అంశం ఒకటి సభను మంగళవారం కుదిపేసింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎంపీలు సభలో సమైక్య నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి కార్యకలాపాలను రెండు రోజులుగా అడ్డుకుంటున్నారు. ఈ ఆందోళన ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఈసారి సమావేశాల్లో ఆహార భద్రత సహా కీలకమైన బిల్లులను ఆమోదించాల్సి ఉంది. అదంతా జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తే.. అటు తెలంగాణ ఎంపీలు మండిపడతారు. ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీనంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ పెద్దలు హడావుడిగా నిర్ణయం ప్రకటించడం తప్ప మరొకటి కానే కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. -
రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి వాసులు మృతి
హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డికి చెందినవారు దుర్మరణం చెందారు. భాగల్ కోట్ కొల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దుర్ఘటనలో అయిదుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఇండికా కారు (AP 13 S 5405) అదుపు తప్పి గ్రానైట్ రాళ్ల లోడ్‌తో వెళుతున్న లారీని ఢీకొంది. దాంతో వారు అక్కడకక్కడే చనిపోయారు. మృతులు మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన శశి భూషణ్, ప్రవీణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రాబిన్, శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా గోవా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలకు బీజాపూర్‌లోని అల్ అమీల్ ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. ఈ సాయంత్రానికి మృతదేహాలను బంధువులు సంగారెడ్డికి తీసుకురానున్నారు. -
మారిషస్‌లో యూఎస్ ఎంబసీ మూసివేత
మారిషస్‌లోని యూఎస్ రాయబార కార్యాలయాన్ని వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు ఆ కార్యాలయ ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. ప్రపంచంలోని పలుదేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలను అల్ ఖైదా తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని సమాచారం మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విదేశాల్లోని యూఎస్ వాసులు, రాయబార కార్యాలయ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికాతోపాటు వివిధ దేశాల రాయబార కార్యాలయాలను మూసివేయాలని అమెరికా ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది. పలుదేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడి చేయాలని తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా వివిధ దేశాల్లోని తమ శాఖలను ఆదేశించినట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఒబామా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈజిప్టు, యెమెన్, సౌదీ అరేబియా, కువైట్, మెడగాస్కర్, బురుండి దేశాలతోపాటు మరో 19 దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలను ఇప్పటికే మూసివేసిన సంగతి తెలిసిందే. -
కరాచీలో బాంబు పేలుడు: 11 మంది చిన్నారులు మృతి
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించి 11 మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం ఇస్లామాబాద్‌లో వెల్లడించారు. ఈ ఘటనలో మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారిని నగరంలోని ఆసుపత్రికి తరలించామని, అయితే వారి పరిస్థితి ఆందోళనగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. నగరంలోని లయరి ప్రాంతంలో మార్కెట్ సమీపంలో పేలుడు పదార్థంతో ఉంచి మోటర్ బైక్ పేలి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఆ సమీపంలోనే చిన్నారులు పూట్‌బాల్ ఆట ముగించుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుందని లయరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రోవెన్షియల్ అసెంబ్లీ సభ్యుడు సానియా నాజ్ చెప్పారు. కాగా గాయపడిన చిన్నారులంతా 12 నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులే అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఫూట్‌బాల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన సింధ్ ప్రోవెన్సియల్ అసెంబ్లీ సభ్యుడు జావెద్ నగొరి కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. -
నేడు తేలనున్న ధర్మాన, సబిత భవితవ్యం
హైదరాబాద్ : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద్‌ల భవితవ్యం నేడు తేలనుంది. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలన్న సీబీఐ మెమోపై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును బుధవారం వెలువరించనుంది. సబితా , ధర్మాన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. వీరిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను సీబీఐ కోర్టుకు సమర్పించింది. వ్యక్తిగత పూచికత్తులు సమర్పించినా ..జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపవచ్చంటూ సీబీఐ వాదించింది. అయితే సీబీఐ నిందితులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తుందని ధర్మాన ,సబితా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసిందని.. కోర్టుకు వ్యక్తిగత పూచికత్తును కూడా సమర్పించారని .. అప్పుడు జ్యుడీషియల్ రిమాండ్ అడగని సీబీఐ ఇప్పుడు ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని ఈ నెల 7కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
అల్కాయిదాపై ఎదురుదాడికి అమెరికా సిద్ధం
వాషింగ్టన్: పశ్చిమ ఆసియాలోని తమ రాయబార కార్యాలయాలపై అల్‌కాయిదా దాడులకు తెగబడొచ్చన్న నిఘా హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా తాజాగా అల్కాయిదాపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది. అరేబియన్ ద్వీపకల్పం (ఏక్యూఏపీ)లోని అల్‌కాయిదా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ అక్కడున్న తమ దేశ ప్రత్యేక దళాలను అప్రమత్తం చేసింది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు చెందిన కార్యాలయాలపై దాడులకు తుది సన్నాహాలు చేసుకోవాలంటూ అల్‌కాయిదా చీఫ్ అల్‌జవహరి, ఏక్యూఏపీలో అల్‌కాయిదా నేత నసీర్ అల్వుహాషీల మధ్య సాగిన సంభాషణలను అగ్రరాజ్యం పసిగట్టిందని ‘ద న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. ఆ నేపథ్యంలో అమెరికా ఎదురుదాడికి వ్యూహం రచిస్తోంది. -
పాక్ రాయబారికి నిరసన తెలిపిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: పాక్ చర్యపై మండిపడిన ప్రభుత్వం.. భారత్‌లోని పాక్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌ను పిలిపించి తమ నిరసనను వ్యక్తంచేసింది. సౌత్ బ్లాక్‌లోని విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి రుద్రేంద్ర టాండన్.. ఖాన్‌ను పిలిపించి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతీస్తాయని హెచ్చరించారు. కాగా దాడి నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ బుధవారం పూంచ్‌కు వెళ్లనున్నారని సైనిక వర్గాలు తెలిపాయి. అలాగే సైనిక వ్యవహారాల డీజీ లెఫ్టినెంట్ జనరల్ వినోద్భాటియా.. పాకిస్థాన్ సైనిక వ్యవహారాల డీజీతో మాట్లాడి ఘటనపై నిరసన వ్యక్తం చేస్తారని వివరించాయి. దౌత్య చర్చలపై నీలినీడలు ఈ ఏడాది జనవరిలో ఇద్దరు భారత సైనికుల్ని పాక్ సైన్యం దారుణంగా చంపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల చర్చల పునరుద్ధరణకు పాక్ ప్రతిపాదించింది. భారత్ తన స్పందన తెలపాల్సిందిగా కోరింది. అలాగే వచ్చే నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో భారత్, పాక్ ప్రధానులు మన్మోహన్ సింగ్, నవాజ్ షరీఫ్ న్యూయార్క్‌లో భేటీ కావాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ప్రస్తుత ఘటన చర్చల పునరుద్ధరణకు ఆటంకంగా మారనుంది. -
పాక్‌కు బుద్ధి చెప్పండి: ఆంటోనీ
విపక్షాల డిమాండ్.. ఉభయ సభలను కుదిపేసిన పాక్ దుశ్చర్య సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులొచ్చారని రక్షణ మంత్రి ఆంటోనీ ప్రకటన మండిపడిన ప్రతిపక్షాలు.. పాక్‌కు తప్పించుకునే మార్గం చూపుతున్నారని ధ్వజం పాక్ కాలుదువ్వుతున్నా ప్రభుత్వం స్పందించదేమని నిలదీత సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసిన సోనియా గాంధీ న్యూఢిల్లీ: భారత సైనికులను పాక్ దళాలు కాల్చి చంపిన ఘటన మంగళవారం పార్లమెంటులోని ఉభయసభలను కుదిపేసింది. ప్రభుత్వం దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. ‘‘పాకిస్థాన్ పదే పదే కాలు దువ్వుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?’’ అని బీజేపీ, లెఫ్ట్, ఎస్పీ, జేడీయూ, శివసేన, బీఎస్పీ ఉభయసభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీశాయి. సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులొచ్చారు: ఆంటోనీ లోక్‌సభ, రాజ్యసభల్లో రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తూ.. పలువురు ఉగ్రవాదులు పాకిస్థాన్ సైనికుల యూనిఫామ్ వేసుకున్న వ్యక్తులతో కలిసి ఈ దాడి చేశారని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు పార్టీలకతీతంగా మండిపడ్డాయి. పాకిస్థాన్ సరిహద్దు యాక్షన్ టీమ్ నేతృత్వంలోనే దాడి జరిగిందని స్వయంగా రక్షణ శాఖ ప్రతినిధి ఆచార్య ప్రకటిస్తే.. పాకిస్థాన్ సైనికుల దుస్తుల్లో ఉగ్రవాదులే దాడి చేశారని చెప్పడమేంటంటూ నిలదీశాయి. పాకిస్థాన్ తప్పించుకోవడానికి ఆంటోనీ మార్గం చూపుతున్నారని విమర్శించాయి. బీజేపీ నాయకులు యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. పాకిస్థాన్ విషయంలో అసలు కఠినంగా వ్యవహరించే ఉద్దేశం కాంగ్రెస్‌కు ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. దాడి చేసేసి, అది ప్రభుత్వేతర శక్తుల కుట్రేనని తప్పించుకుంటున్న పాకిస్థాన్‌కు ఆంటోనీ వ్యాఖ్యలు మద్దతిస్తున్నట్లుందని విమర్శించారు. వామపక్షాలు, అన్నా డీఎంకే, బీఎస్పీ సహా పలువురు నేతలు ఇదే అంశంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఆంటోనీ మాట్లాడుతూ.. ‘‘నియంత్రణ రేఖ వెంబడి భారత ప్రయోజనాలను కాపాడడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకునేందుకు మన సైన్యం పూర్తిస్థాయిలో సమాయత్తమై ఉంది’’ అని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయితే తనకు అందిన సమాచారం వరకు ఉగ్రవాదులు దాడి చేశారనే తెలుసని, పూర్తి సమాచారం అందేవరకు ఒక నిర్ణయానికి రాకూడదని పేర్కొన్నారు. పాక్ చర్యలను బట్టే భారత స్పందన ఆధారపడి ఉంటుందన్నారు. దౌత్య మార్గంలో పాక్‌కు భారత నిరసన తెలిపామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాల్పుల విరమణ ఉల్లంఘనలు రెట్టింపయ్యాయని చెప్పారు. గతేడాది జనవరి-ఆగస్టు మధ్య 57 ఉల్లంఘనలు ఉంటే.. ఈ ఏడాది అవి 80 శాతం పెరిగాయన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ మాట్లాడుతూ.. పాక్, చైనా చొరబాట్లను అరికట్టే విషయంలో భారత వైఖరిపై అనుమానం వ్యక్తంచేశారు. పాక్నుగాని, చైనానుగాని ఎట్టిపరిస్థితుల్లో నమ్మరాదన్నారు. సోనియా విచారం.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఇలాంటి మోసకారి దాడులకు భారత్ తలవంచరాదని, ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీతోపాటు యావత్ దేశమంతా తోడుగా ఉంటుందని అన్నారు. పాక్ విషయంలో ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని కోరినట్లు పార్టీ ప్రతినిధి భక్త చరణ్ దాస్ తెలిపారు. మరోవైపు ‘‘సైనికులపై దాడి జరిగిన విషయం ఉదయాన్నే తెలిసిం ది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఇలాంటి సంఘటనలు రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు పునరావృతం కావడానికి దోహదం చేయవు’’ అని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో పేర్కొన్నారు. -
20 మంది ఉగ్రవాదులతో కలిసి భారత్‌లోకి చొరబడిన పాక్ దళాలు
జమ్మూ/కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి తన యుద్ధోన్మాదాన్ని బయటపెట్టుకుంది. చీకటి వేళ ఉగ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ సైన్యం ఐదుగురు భారత జవాన్లను కాల్చి చంపింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి భారత జవాన్లు గస్తీ తిరుగుతుండగా ఈ దాడి జరిగింది. ఇది దేశవ్యాప్తంగాను, పార్లమెంటులోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడిలో గాయపడిన మరో జవాన్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఏడాది జనవరిలో హద్దు మీరిన పాక్ సైన్యం ఇద్దరు భారత జవాన్లను దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. వారిలో ఒకరి తల నరికిన ఘటన దుమారం రేపింది. దాడి జరిగిందిలా.. ‘పూంచ్ జిల్లాలోని చకన్ దా బాగ్ సెక్టార్ పరిధిలోకి వచ్చే సార్లా ఫార్వర్డ్ పోస్ట్‌కు చెందిన ఆరుగురు సైనికులు సోమవారం గస్తీకి వెళ్లారు. అర్ధరాత్రి దాటాక 01:15 గంటల అనంతరం వారి నుంచి సైనిక స్థావరానికి ఎలాంటి సమాచారమూ అందలేదు. దీంతో 05:30 గంటల సమయంలో మరో బృందాన్ని వారి కోసం పంపగా ఐదుగురు జవాన్ల మృతదేహాలు తూటా గాయాలతో రక్తపుమడుగులో కనిపించాయి’ అని రక్షణ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. గాయపడిన మరో జవాన్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. అతనికి ఎయిమ్స్‌లో చికిత్స చేస్తున్నారు. పాకిస్థాన్ సరిహద్దు యాక్షన్ టీమ్(బీఏటీ) నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, పాక్ సైనికులు, సుమారు 20 మంది సాయుధ ఉగ్రవాదులు 450 మీటర్ల మేర భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని రక్షణ శాఖ ప్రతినిధి ఎస్.ఎన్.ఆచార్య ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. మృతుల్లో ఒక నాన్ కమిషన్డ్ ఆఫీసర్, నలుగురు ఇతర ర్యాంకుల అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మృతులను నాయక్ ప్రేమ్ నాథ్ సింగ్, లాన్స్ నాయక్ శంభు శరణ్రాయ్, సిపాయి రవినంద్ ప్రసాద్, సిపాయి విజయ్ కుమార్ రాయ్, కులీన్ మన్నెగా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో నలుగురు 21 బీహార్ రెజిమెంట్‌కు, ఒకరు 14 మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ బెటాలియన్‌కు చెందినవారు. దేశప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు: ఖుర్షీద్ పాకిస్థాన్ బలగాలు ఐదుగురు భారత జవాన్లను కాల్చిచంపిన నేపథ్యంలో దీనిపై అన్ని అంశాలను పరిశీలించి తగిన విధంగా జవాబిస్తామని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మంగళవారం మాట్లాడుతూ.... ప్రభుత్వానికి తన బాధ్యతలపై అవగాహన ఉందని అన్నారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరమే దేశప్రయోజనాలకు అనుగుణంగా సరైన చర్య తీసుకుంటామన్నారు. ‘దేశ భద్రత, శాంతికి విఘాతం కలిగించేలా పరిస్థితులను సృష్టించుకోవాలనుకోవడం లేదు. దేశానికి ఏది అవసరమో అదే చేస్తాం’ అని పేర్కొన్నారు. మాకు సంబంధం లేదు: పాక్ ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి దాడి చేసి ఐదుగురు భారత సైనికులను హత్యచేసిన ఘటనతో తమ సైనిక బలగాలకు ఎలాంటి సంబంధమూ లేదని పాకిస్థాన్ మంగళవారం వెల్లడించింది. 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎల్వోసీ వెంబడి పూంచ్ సెక్టార్లో జరిగిన దాడిలో ఐదుగురు భారత సైనికుల మరణానికి పాక్ బలగాలే కారణమంటూ భారత మీడియాలోని కొన్ని వర్గాలు ప్రసారం చేసిన కథనాలను పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇజాజ్ చౌదరి తోసిపుచ్చారు. ఆ ప్రాంతంలో ఎలాంటి కాల్పులు జరగలేదని తమ సైన్యం ధ్రువీకరించిందని, భారత మీడియా ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. -
12 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: బీఎన్పీ పరిబాసహా 12 పెట్టుబడి ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక బో ర్డు(ఎఫ్ఐపీబీ) సిఫారసు మేరకు ప్రభుత్వం మొత్తం రూ. 343 కోట్ల విలువైన 12 ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. కాగా, యూఎస్ కంపెనీ మైలాన్ చేసిన ప్రతిపాదనపై నిర్ణయాన్ని పక్కనబెట్టింది. జనరిక్ ఔషధాల దేశీయ కంపెనీ ఏగిలా స్పెషాలిటీస్‌ను కొనుగోలు చేసేందుకు స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్తో మైలాన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందుకు రూ. 5,168 కోట్లను వెచ్చించనుంది. ఏగిలా స్పెషాలిటీస్... స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్కు అనుబంధ సంస్థ. -
భారతీ వాల్‌మార్ట్ ఉచిత శిక్షణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించిన భారతీ వాల్‌మార్ట్ యువతకి ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా రిటైల్, బ్యాంకింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. రాష్ట్రంలో ఈ ఉచిత శిక్షణను తొమ్మిది నెలల క్రితం ప్రారంభించగా, ఇప్పటి వరకు 1,000 మంది వరకు శిక్షణ తీసుకున్నట్లు భారతీ వాల్‌మార్ట్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ ఎఫైర్స్) ఆర్తి సింగ్ తెలిపారు. ఇలా శిక్షణ తీసుకున్న వారిలో 293 మందికి వివిధ రిటైల్ సంస్థల్లో ఉపాధి అవకాశాలను కల్పించామని, మిగిలినవారికి కూడా త్వరలోనే అవకాశాలను కల్పించనున్నట్లు సింగ్ తెలిపారు. మంగళవారం ఇక్కడ ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ వెయ్యి మందిలో 33 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఆరు శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు ఈ కేంద్రాల ద్వారా 25,000 మంది శిక్షణ తీసుకోగా అందులో 9,000 మందికి భారతీ వాల్‌మార్ట్ గ్రూపులో అవకాశాలను కల్పించినట్లు తెలిపారు. -
ఎన్ఎస్ఈఎల్ ఈ-కాంట్రాక్ట్లపైనా నిషేధం
న్యూఢిల్లీ: ఇప్పటికే నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో నిలిచిపోయిన కొత్త కమోడిటీ కాంట్రాక్ట్‌లకు జతగా ప్రభుత్వం తాజాగా ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించింది. దీంతో ఎన్ఎస్ఈఎల్లో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోయింది. ముందుగా రూ. 5,600 కోట్లమేర నిలిచిపోయిన చెల్లింపుల సెటిల్మెంట్ను పూర్తిచేయాల్సిందిగా ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ఆదేశించినట్లు ఆహారం, వినియోగ వ్యవహారాల మంత్రి కేవీ థామస్ చెప్పారు. ఎన్ఎస్ఈఎల్లో ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం నిషేధించినట్లు తెలిపారు. ఈ అంశంపై రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా పసిడి, వెండిలతోపాటు ప్రాథమిక లోహాలకు సంబంధించిన కాంట్రాక్ట్‌లను ఎన్ఎస్ఈఎల్ నిర్వహిస్తుంది.ఈక్విటీలలో నగదు విభాగాన్ని పోలి ఈ సిరీస్ కాంట్రాక్ట్‌ల నిర్వహణ ఉంటుందని థామస్ పేర్కొన్నారు. -
సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సీమాంధ్ర వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం
సాక్షి; హైదరాబాద్: హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగుల ప్రయోజనాలకు ఏ చిన్న నష్టం వాటిల్లినా సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత నేతలు హెచ్చరించారు. ఉద్యోగుల రక్షణ, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతామన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయంలో ఆందోళన కొనసాగిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను మంగళవారం పార్టీ నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులకు అండగా ఉంటామని, వారి ఉద్యమానికి తమవంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా ఏ ఒక్క వర్గంతోనూ చర్చించకుండా ఏకపక్షంగా తెలంగాణ నిర్ణయం ప్రకటించారని మేకపాటి వ్యాఖ్యానించారు. ‘ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ మాయావతి నేతృత్వంలోని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు నెగ్గి దాన్ని కేంద్రానికి ప్రతిపాదించినా ఇంతవరకూ పట్టించుకోలేదు. కానీ ఎవరూ కోరని ఆంధ్రప్రదేశ్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేయదలచారు. ఇది కాంగ్రెస్ రాజకీయ కుట్ర. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యల వంటి వాటిపై కనీస స్పష్టత ఇవ్వకుండా రాష్ట్ర విభజన ప్రకటించడం దుర్మార్గం. రాష్ట్ర రాజధానిని తెలంగాణకు ఇస్తే సీమాంధ్రలో సచివాలయం చెట్టు కింద, అసెంబ్లీని గుడిసెలో ఏర్పాటు చేసుకోవాలా? రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేయదలచడం దారుణం’ అని అన్నారు. రాష్ట్రాలను విడదీస్తూ పోతే దేశానికి రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల మీద ఈగ వాలినా సహించబోమని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగుల మేలు కోరి అందరికంటే ముందుగా పదవులకు రాజీనామాలు చేసింది తామేనని గుర్తుచేశారు. రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఒకప్పటి ఉద్యోగిగా వారి ఆందోళన తనకు తెలుసని, ఉద్యోగుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేసులు పెట్టాలి: సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ వదిలిపోవాలని కొందరు పేర్కొనడం చాలా బాధ కలిగించిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ‘ఒకరు రాయల తెలంగాణ అంటున్నారు. మరొకరు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమంటున్నారు. ఇంకొకాయన ఆంధ్ర రాజధానికి లక్షల కోట్లిమ్మంటున్నాడు. ఇవన్నీ వృథా. సమైక్యాంధ్రప్రదేశే మా ధ్యేయం’ అని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రభుత్వం సుమోటో కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఎలాంటి ఆపద వచ్చినా ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలంటూ తన ఫోన్ నంబరును అందజేశారు. రాష్ట్రం అడుగుతోంది తెలంగాణ వారైతే కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు కొత్త రాష్ట్రమిస్తోందని తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. అడిగినవారికి ఇవ్వకుండా అడగని వారికి అన్నీ ఇచ్చి వెళ్లిపోమంటున్నారని, ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ‘1956 తరవాత రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను ఎంచుకుని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. నగర నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చెమట బిందువులున్నాయి. గతంలో మద్రాసు, కర్నూలును వదులుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా పోగొట్టుకుంటే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు’ అని అన్నారు. విదేశీ శక్తుల వల్ల దేశానికి ముప్పుందని చెప్పిన ఇందిరాగాంధీ.. ఇంట్లోని విదేశీయురాలు సోనియాగాంధీని పసిగట్టలేక పోయిందని ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బైఠాయించిన ఉద్యోగులు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ ఆందోళనను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా విధులను బహిష్కరించి రోడ్లపై బైఠాయించారు. సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. యూపీఏ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సీమాంధ్ర ఉద్యోగుల ఉద్యోగ భద్రత, రక్షణపై కేంద్రం భరోసా కల్పించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ చెప్పారు. -
యువత కోసమే...‘క్యాంపస్’ స్మార్ట్ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల విక్రయ రంగంలో ఉన్న సెల్కాన్.. క్యాంపస్ సిరీస్‌లో ఏ63, ఏ60 స్మార్ట్ఫోన్లను మంగళవారమిక్కడ విడుదల చేసింది. 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.2 గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ ప్రాసెసర్, 3.2 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లతో ఏ63 రూపొందించారు. దీని ధర రూ.4,499. ఇంత తక్కువ ధరలో డ్యూయల్ కోర్, జెల్లీబీన్ ఓఎస్ స్మార్ట్‌ఫోన్‌ను దేశంలో తొలిసారిగా తాము ఆఫర్ చేస్తున్నామని సంస్థ సీఎండీ వై.గురు తెలిపారు. కంపెనీ ఈడీ రేతినేని మురళితో కలసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. యువత కోసమే క్యాంపస్ సిరీస్‌ను రూపొందించామని చెప్పారు. అన్ని కళాశాలల వద్ద ప్రచారం చేస్తామని, రెండు నెలల్లో ఒక లక్ష ఏ63 ఫోన్లను విక్రయిస్తామని అన్నారు. 4.5 అంగుళాల డిస్ప్లే, ఆన్‌డ్రాయిడ్ ఐస్‌క్రీం శాండ్విచ్ ఓఎస్‌తో తయారైన ఏ60 ధర రూ.5,199. రూ.17 వేల ఫోన్లు కూడా.. సెల్కాన్ ఇప్పటి వరకు రూ.13 వేలలోపు ధరలో వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. త్వరలో మోనాలిసా సిరీస్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ ప్రీమియం స్మార్ట్ఫోన్ల విభాగంలోకి అడుగు పెట్టనుంది. మోనాలిసా ఫోన్ల ధర రూ.17 వేల దాకా ఉంది. 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 1.5 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 12 ఎంపీ కెమెరా, వన్ గ్లాస్ సొల్యూషన్ తదితర ఫీచర్లున్నాయి. సెల్కాన్ ఈ ఏడాది ఇప్పటివరకు 50 మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. క్యాంపస్ సిరీస్‌తో సహా డిసెంబర్‌కల్లా మరో 30 దాకా మోడళ్లు రానున్నాయి. ఇటీవల సెల్కాన్ కప్ క్రికెట్ సిరీస్ చివరి వన్డే సందర్భంగా జింబాబ్వేలో క్యాంపస్ ఫోన్లను ఆవిష్కరించారు. ఎగుమతులపై ఆశాభావంతో ఉన్నామని, నెలాఖరులోగా ఆఫ్రికా దేశాల్లో ప్రవేశిస్తామని కంపెనీ తెలిపింది. దేశవాళీ క్రికెట్‌కు కూడా.. రెండు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలకు స్పాన్సర్ చేసిన సెల్కాన్.. దేశవాళీ క్రికెట్‌కూ తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉందని వై.గురు తెలిపారు. ‘వ్యాపారపరంగా విదేశాల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. ఇకపై దేశవాళీ సిరీస్‌లను కూడా స్పాన్సర్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం’ అని అన్నారు. ఆఫ్రికాలో జరిగే మ్యాచ్‌లకు భారత జట్టు ఆడనప్పటికీ స్పాన్సర్ చేస్తామని వెల్లడించారు. -
రాష్ట్రం రగిలిపోతుంటే నోరెత్తరేం ? : శోభా నాగిరెడ్డి
కిరణ్, చంద్రబాబులపై శోభా నాగిరెడ్డి ధ్వజం బాధ్యతను మరచి మొహం చాటేస్తున్నారు నోరెత్తితే సీటు లాగేస్తారని కిరణ్‌కు భయం కేసులు రాకుండా ఉండేందుకే బాబు మౌనం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన కేంద్ర మంత్రులు సెంటిమెంట్ ఒక ప్రాంతానికే పరిమితం కాదు తెలుగువారి భవిష్యత్తు ఆంటోనీ, దిగ్గీల చేతిలోనా? ఇదేమీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదు జగన్‌ను అభిమానిస్తున్నారని చిచ్చు పెట్టారు కేసీఆర్ విద్వేష ప్రసంగాలు హరీశ్‌కు గుర్తు రాలేదా? సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతం ఉద్యమాలతో రగిలిపోతున్నా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు మాత్రం ప్రజలకు ముఖం చాటేశారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ఈ ఇద్దరూ ‘కనబడుటలేదు’ అని ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కిరణ్, బాబు వైఖరిపై మండిపడ్డారు. ‘‘సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే... ఆ ప్రాంతానికే చెందిన కిరణ్, బాబు ప్రజల ముందుకు వచ్చి వారిని సమాధానపర్చకుండా అజ్ఞాతం (అండర్‌గ్రౌండ్)లోకి వెళ్లి పోయారు. నోరెత్తి మాట్లాడితే ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తొలగిస్తారని కిరణ్ భయపడుతున్నారు. తనపై కేసులు రాకుండా చూసుకునేందుకు, ఆస్తులు కాపాడుకునేందుకే బాబు కిమ్మనడం లేదు. సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం జరుగుతున్నా వీరు పట్టించుకోవడం లేదు’’ అని దుయ్యబట్టారు. ప్రతి చిన్న విషయానికి వేలు చూపుతూ, ఎదుటివారిని బెదిరించే విధంగా ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడే చంద్రబాబు ఇంత పెద్ద సమస్య రాష్ట్రంలో రగులుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన ఆవేశం ఏమైంది? వేలెత్తి ఎందుకు మాట్లాడ్డంలేదని శోభ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించి పోలవరంకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించినప్పుడు, రాయలసీమ ప్రాంతానికి ఏమిచ్చారని బాబు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఇవన్నీ ఆ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇక సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తమ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా బొమ్మల్లాగా కూర్చున్నారని దుయ్యబట్టారు. మరో ఆరు నెలలు మాత్రమే ఉండే పదవుల కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు. సమైక్యంగా ఉంచాలన్న వాంఛ ప్రజల్లో ఇంత బలీయంగా ఉంటుందని విభజన నిర్ణయం వెలువడిన తరువాతనే తమకు తెలిసిందని పళ్లంరాజు చెప్పడం దారుణమన్నారు. ‘‘సెంటిమెంట్ ఒక ప్రాంతానికే పరిమితమనుకున్నారా... మరో ప్రాంతంలో ఉండదనుకున్నారా? మంత్రి పదవి పోతుందనే భయంవల్ల మీకు సెంటిమెంట్ లేకపోవచ్చు, కానీ సామాన్య ప్రజలకు మనోభావాలు బలీయంగా ఉంటాయి’’ అని చెప్పారు. పార్లమెంట్లో కాంగ్రెస్, టీడీపీ ఎంపీలది డ్రామా కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న హడావుడిని ఒక డ్రామా అని శోభా నాగిరెడ్డి అభివర్ణించారు. సీమాంధ్రులకు అన్యాయం చేస్తూ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలే ఉద్యమాలంటూ డ్రామాలు చేయడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయం వెలువడిన రెండోరోజే 4, 5 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మరో రాజధాని నిర్మించుకుంటామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారని, మళ్లీ ఆ పార్టీకి చెందిన ఎంపీలే పార్లమెంటులో నిరసన డ్రామా చేస్తున్నారని విమర్శించారు. వీరంతా ఇపుడు డ్రామాలు చేసే కంటే విభజన ప్రకటన వెలువడటానికి ముందే రాజీనామాలు చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చి ఉండేది కాదు కదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. తమతో చర్చించడానికి ఏకే ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్‌లతో ఒక హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రులు చెబుతుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. 12 కోట్ల మంది తెలుగు ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది వీళ్లిద్దరా? వాళ్లెవరు... మనపై నిర్ణయం తీసుకోవడానికి? ఇదేమీ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం కాదని, కోట్లమంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని చెప్పారు. సమన్యాయం చేయకుండా రాష్ట్ర విభజన చేస్తామనడం సరికాదన్నారు. రాష్ట్రంలో నదీజలాలతో పాటుగా ఉన్న అనేక జటిలమైన సమస్యలను పట్టించుకోకుండా కేవలం 15, 16 లోక్‌సభ స్థానాల కోసం, రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ ఈ విభజన నిర్ణయం తీసుకోవడం సబబేనా అని ప్రశ్నించారు. రాహుల్‌ని ప్రధాని చేయడంకోసమే విభజన: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత మూడు ప్రాంతాల ప్రజలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ఆదరిస్తున్నారన్న నిజాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోయిందని, కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వైఎస్‌పై ఉన్న అభిమానాన్ని జగన్‌పై చూపిస్తున్నారనే కోపంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసిందని శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం కోసం రెండు ప్రాంతాల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెట్టిందని చెప్పారు. సీమాంధ్రులకు హైదరాబాద్‌లో ఏమీ జరక్కుండా రక్షణ కల్పిస్తామని కొందరు తెలంగాణ మంత్రులు చెప్పడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ‘‘మీరెవరు మాకు రక్షణ కల్పించడానికి? మిమ్మల్ని సీమాంధ్రులేమైనా అడుక్కున్నారా రక్షణ కల్పించమని? మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం సీమాంధ్రులకు లేదు. ఇక్కడ మీకు ఎంత హక్కు ఉందో మాకూ అంతే హక్కుంది. మా హక్కును పోరాడి సాధిస్తాం’’ అని స్పష్టంచేశారు. సీమాంధ్రను అభివృద్ధి చేస్తామని ఢిల్లీ నేతలు చెబుతున్నారని, కొత్తగా ఏర్పడిన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిందేనని ఆక్షేపించారు. రాజకీయ లబ్ధికోసం రాష్ట్రంలో చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. షర్మిల ఇచ్ఛాపురం సభలో మాట్లాడిన మాటలను తప్పుపడుతున్న టీఆర్ఎస్ నేత హరీశ్‌రావుకు అంతకుముందు కేసీఆర్ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాలు గుర్తుకు రాలేదా? అని శోభ ప్రశ్నించారు. ‘‘సీమాంధ్రులను అవమానిస్తూ కేసీఆర్ ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఎవరికి తల్లి అని తెలుగుతల్లిని కూడా కించపరిచింది మరిచారా? జాగో, భాగో అని మాట్లాడలేదా? మీ మాటల్లో తప్పు లేదు కానీ, షర్మిల మాట్లాడితేనే తప్పుగా కనిపించిందా?’’ అని నిలదీశారు. తెలంగాణ రాకముందే ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగానే షర్మిల ప్రజలకు భరోసాగా అలా మాట్లాడారు తప్ప ఇతర ఉద్దేశాలు ఏమీ లేవని ఆమె వివరించారు. -
సెన్సెక్స్ 450 పాయింట్లు పతనం
ఒక్క రోజు గ్యాప్ తరువాత మళ్లీ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. అన్ని వైపుల నుంచి వెల్లువెత్తిన అమ్మకాలతో సెన్సెక్స్ 449 పాయింట్లు పతనమైంది. 6 వారాల తరువాత మళ్లీ 19,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. 18,733 వద్ద ముగిసింది. గత శుక్రవారం వరకూ 8 వరుస రోజుల్లో 1,138 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం నామమాత్రంగా లాభపడ్డ సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా ఇదే విధంగా స్పందిస్తూ 143 పాయింట్లు దిగజారింది. వెరసి నాలుగు నెలల కనిష్టమైన 5,542 వద్ద నిలిచింది. ఇందుకు రూపాయి పతనంతోపాటు, పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావం చూపాయి. ఫలితంగా 2009 జూన్ తరువాత మళ్లీ దేశీయ స్టాక్ మార్కెట్ల విలువ లక్ష కోట్ల డాలర్ల దిగువకు పడింది! మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 989 బిలియన్ డాలర్ల(రూ. 60,18,504 కోట్లు) వద్ద స్థిరపడింది. కారణాలేంటి? జమ్మూ-కాశ్మీర్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్లో పాక్ నుంచి చొరబడిన సాయుధులు కొందరు ఐదుగురు భారత సైనికులను హతమార్చడంతో మంగళవారం ఉదయమే మార్కెట్లో టెన్షన్లు పెరిగాయి. ఇదికాకుండా ఇటీవల డాలరుతో మారకంలో బలహీనపడుతున్న రూపాయి ఉన్నట్టుండి 61.80కు పడిపోవడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. ఇది చరిత్రాత్మక కనిష్ట స్థాయికాగా, ఇది కరెంట్ ఖాతా లోటును మరింత పెంచనుంది. ఇక మరోవైపు వర్ధమాన మార్కెట్ల నుంచి డాలర్ల నిధులు వెనక్కు మళ్లుతాయన్న ఆందోళనలు తాజాగా చెలరేగాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలతో ప్రస్తుతం అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలను ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే ఎత్తివేయవచ్చునన్న అంచనాలు పెరగడమే దీనికి కారణం. ఇవి చాలవన్నట్లు నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో ఏర్పడ్డ చె ల్లింపుల సంక్షోభం నేపథ్యంలో ‘ఈ’ సిరీస్ కాంట్రాక్ట్‌లను సైతం ప్రభుత్వం నిషేధించడంతో అగ్నికి ఆజ్యం పోసి న ట్లయ్యింది. ఫలితంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అన్ని రంగాలూ డీలా బీఎస్ఈలో అన్ని రంగాలూ 0.5-5.5% మధ్య పతనమయ్యాయి. ప్రధానంగా వినియోగ వస్తువులు, రియల్టీ, బ్యాంకింగ్, మెటల్, పవర్, ఆయిల్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ 5.5-2% మధ్య నీర సించాయి. సెన్సెక్స్, నిఫ్టీలలో 3 షేర్లు మాత్రమే లాభపడగా, టాటా పవర్ అత్యధికంగా 15% కుప్పకూలింది. మిగిలిన దిగ్గజాలలో భెల్, హెచ్డీఎఫ్సీ, స్టెరిలైట్, టాటా స్టీల్, భారతీ, బజాజ్ ఆటో, జిందాల్ స్టీల్, ఎల్అండ్టీ 6.6-2.3% మధ్య పతనమయ్యాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ 4-2.5% మధ్య తిరోగమించగా, ఆయిల్ దిగ్గజాలు ఓఎన్జీసీ 3.3%, ఆర్ఐఎల్ 2.4% చొప్పున నష్టపోయాయి. మార్కెట్లను మించుతూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.6% నీరసించగా, స్మాల్ క్యాప్ 1.8% క్షీణించింది. ట్రేడైన షేర్లలో 1,599 నష్టపోగా, 655 మాత్రమే బలపడ్డాయి. ఎన్ఎస్ఈఎల్లో ఈ సిరీస్ కాంట్రాక్ట్‌లు సైతం నిలిచిపోవడంతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు దాదాపు 20% కుప్పకూలి రూ. 159 వద్ద ముగిసింది. ఇదే గ్రూప్ షేరు ఎంసీఎక్స్ సైతం 10% పతనమై రూ. 332 వద్ద నిలిచింది. ఎఫ్ఐఐలు రూ. 213 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 324 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. -
ఇక ఆల్టో డీజిల్ హల్చల్!
ముంబై: మారుతీ సుజుకి కంపెనీ ఆల్టో 800 మోడల్లో డీజిల్ వేరియంట్‌ను మార్కెట్లోకి తేనున్నదని సమాచారం. ఈ ఏడాది ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన కొత్త ఆల్టోను, వచ్చే ఏడాది ఆల్టోలో డీజిల్ వేరియంట్‌ను అందించాలని మారుతీ ప్రయత్నాలు చేస్తోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ వర్గాల సమాచారం ప్రకారం.... ఎయిర్ బ్యాగ్‌తో కూడిన కొత్త ఆల్టోలో ఎల్ఎక్స్, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ వేరియంట్లను మార్కెట్లోకి తేనున్నది. ఎయిర్‌బ్యాగ్‌తో కూడిన ఆల్టో కార్ల ధరలు రూ.3.35 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయి. ప్రస్తుత ఆల్టో ధరల కంటే కొత్త ఆల్టో ధరలు సుమారుగా రూ.20,000 అధికంగా ఉండొచ్చు. వ్యాగన్ఆర్లో కూడా డీజిల్... మాతృకంపెనీ సుజుకి సహకారంతో ఆల్టో డీజిల్ ఇంజన్‌ను మారుతీ కంపెనీ భారత్‌లోనే రూపొందించిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఒక్క ఆల్టోలోనే కాకుండా మారుతీ 800, వ్యాగన్ ఆర్, ఏ స్టార్ కార్లలో కూడా డీజిల్ ఇంజన్లు తయారు చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ మోడళ్లలో డీజిల్ వేరియంట్లు వస్తే, హ్యుందాయ్ ఈఆన్, ఐటెన్, షెవర్లే బీట్ తదితర కార్లకు గట్టిపోటీనిస్తాయి. అంతేకాకుండా భారత వాహన మార్కెట్లో ప్రస్తుతమున్న 40 శాతం మార్కెట్ వాటాను నిలుపుకోవడమనే లక్ష్యాన్ని కంపెనీ సులభంగా సాధించగలదని అంచనా. ఆదరణ ఉంటుంది... కొత్తగా కార్లు కొనేవారికి కొనుగోలు ధరే కాకుండా, నిర్వహణ వ్యయాలు కూడా ప్రాధాన్యత గల అంశాలే. మైలేజీని దృష్టిలో పెట్టుకుంటే డీజిల్ కార్లు ఖరీదైనవైనా సరే వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు వెనకాడరు. పెట్రోల్ కారును కొనుక్కున్నప్పటికీ, సీఎన్జీ, ఎల్పీజీ కిట్ల కోసం అదనంగా రూ. 50 వేల వరకూ ఖర్చు చేయడానికి వినియోగదారులు ముందుకు వస్తుంటారు. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే మారుతీ చిన్న కార్లలో డీజిల్ వేరియంట్ల అమ్మకాలకు ఢోకా ఉండదనేది నిపుణుల అభిప్రాయం. -
రాజన్ చేతికి ఆర్బీఐ పగ్గాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులాంటి అత్యున్నత నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లో కొత్త సారథి కొలువుదీరనున్నారు. ప్రపంచ విఖ్యాత ఆర్థిక రంగ నిపుణుడు రఘురామ్ గోవింద్ రాజన్.. ఆర్బీఐ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టనున్నారు. వచ్చే నెల 4న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత గవర్నర్ స్థానాన్ని ఆయన భర్తీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రాజన్ నియామకానికి పచ్చజెండా ఊపింది. ఐదేళ్ల క్రితం 2008లో ప్రపంచదేశాలను అల్లాడించిన ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన రాజన్... ఎంతోమంది నిపుణులు, విశ్లేషకులను నివ్వెరపరిచారు. ఇప్పుడు భారత్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన ఎలాంటి విధానాలను అమలుచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రూపాయి కనీవినీఎరుగని రీతిలో పాతాళానికి పడిపోవడం, విలవిల్లాడుతున్న స్టాక్ మార్కెట్లు... ఆర్థిక మందగమనం వంటివి దేశాన్ని కుదిపేస్తున్నాయి. దీనికితోడు అధిక వడ్డీరేట్లు, ధరల మంటల్లో చిక్కుకున్న ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలిగిస్తారో వేచిచూడాల్సిందే. న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురామ్ జి. రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. 50 సంవత్సరాల రాజన్, మూడేళ్ల పాటు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4వ తేదీన పదవీ విరమణ చేయనున్న దువ్వూరి సుబ్బారావు స్థానంలో రాజన్ బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రేట్ల వైఖరిపై సర్వత్రా ఆసక్తి! ద్రవ్యోల్బణంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధి రేటుకూ సైతం ఆర్బీఐ ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకు అనుగుణంగా పాలసీరేట్లను సైతం తగ్గించాలని కేంద్రం చేస్తున్న సూచనలకు ఇప్పటివరకూ రాజన్ సానుకూల రీతిలో స్పందిస్తూ వచ్చారు. డాలర్ మారకంలో రూపాయి విలువ కిందకు జారిపోవడాన్ని నిలువరించడానికి, ఒడిదుడుకులను నివారించడానికి ఆర్బీఐ ఇటీవల లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరమైన కఠిన విధానాన్ని సమర్థిస్తూనే... ఆర్బీఐ రూపాయితోపాటు ఆర్థికాభివృద్ధి రేటుపైనా దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక మందగమనం, తీవ్ర ఆహార ఉత్పత్తుల ధరలు, రూపాయి క్షీణత, తీవ్ర కరెంట్ అకౌంట్ లోటు వంటి సవాళ్లతో కూడిన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో- ద్రవ్యోల్బణం నియంత్రణే ప్రధాన ధ్యేయంగా దువ్వూరి సుబ్బారావు ఇప్పటివరకూ అనుసరిస్తూ వచ్చిన కఠిన విధానాన్ని రాజన్ కూడా కొనసాగిస్తారా...? లేక తనదైన శైలిలో ముందుకు వెళతారా అన్నది ప్రస్తుతం విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చ. మంత్రదండం లేదు... ఆర్బీఐ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే రాజన్ స్పందిస్తూ... ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం, ఆర్బీఐ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇబ్బందులను మాయం చేయడానికి తమ వద్ద మంత్రదండం ఏదీ లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే సవాళ్లను ఎదుర్కొనగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. సర్వోన్నత సమగ్రత, స్వతంత్రత, వృత్తి నిపుణత కలిగిన సంస్థగా ఆర్బీఐని ఆయన అభివర్ణించారు. పాలక, పారిశ్రామిక వర్గాల హర్షం రాజన్ నియామకం పట్ల పాలక, పారిశ్రామిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమయ్యింది. రాజన్ చక్కటి నిర్ణయాలు తీసుకుని బాగా పనిచేయగలరన్న అభిప్రాయాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి (పీఎంఈఏసీ) చైర్మన్ సి.రంగరాజన్ వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంలో అత్యంత ప్రతిభావంతుడైన రాజన్ నుంచి ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికాభివృద్ధికి తగిన సంకేతాలు, మార్గదర్శకాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా వ్యక్తం చేశారు. గవర్నర్‌గా మంచి నిర్ణయాలు తీసుకోడానికి ఆర్థిక రంగంలో ఆయన అపార అనుభవం దోహదపడుతుందని సీఐఐ మాజీ ప్రెసిడెంట్ ఆది గోద్రెజ్ పేర్కొన్నారు. రాజన్ లాంటి ప్రముఖ ఆర్థికవేత్త ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం మనకు అదృష్టమని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనాలాల్ కిద్వాయ్ అన్నారు. రాజన్ ఎంపిక ‘చాలా చక్కనిది’ అని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడిలో, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనడంలో ఆయన విజయం సాధించగలరని అసోచామ్ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. చిన్న వయసులోనే.. ఆర్బీఐ గవర్నర్‌గా అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తుల్లో రాజన్ ఒకరు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 5న బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన వయసు 50 సంవత్సరాల 6 నెలలుగా ఉంటుంది. ప్రస్తుత ప్రధాని మన్మోహన్ 1982లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన తన 50వ పుట్టిన రోజుకు 10 రోజుల దూరంలో ఉన్నారు. 1932 సెప్టెంబర్ 26న జన్మించిన మన్మోహన్, 1982 సెప్టెంబర్ 16న ఆర్బీఐ పగ్గాలు చేపట్టారు. ఆర్బీఐకి అతి చిన్న వయసులో గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రికార్డు ఇప్పటికీ సర్ సీడీ దేశ్‌ముఖ్‌కే దక్కుతుంది. 1943లో కేవలం 47 ఏళ్ల వయస్సులోనే ఆయన ఈ బాధ్యతల్లో నియమితులయ్యారు. 1947లో భారత్ స్వాతంత్య్రం పొందే వరకూ ఆయన కొనసాగారు. ఈ పదవిలో నియమితుడైన మొట్టమొదటి భారతీయుడు కూడా ఆయనే. గత పదేళ్ల కాలంలో నాన్-సివిల్ సర్వెంట్‌గా ఆర్బీఐ గవర్నర్ కుర్చీలోకి రాబోతున్న వ్యక్తి రాజన్. ఇంతక్రితం బిమల్ జలాన్ నాన్-ఐఏఎస్‌గా ఈ బాధ్యతలను నిర్వహించి 2003లో పదవీ విరమణ చేశారు. రచనలు... సేవింగ్ క్యాపిటలిజం ఫ్రమ్ ది క్యాపిటలిస్ట్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ ముప్పుగా పొంచి ఉన్న పెను సవాళ్ల గురించి ఆయన రచించిన ‘ఫాల్ట్ లైన్స్’ అనే పుస్తకం అత్యధిక ప్రాచుర్యం పొందింది. భారత్‌లో ప్రణాళికా సంఘానికి సంబంధించి ఆర్థిక రంగ సంస్కరణలపై నివేదికను రూపొందించడంలో కూడా ఆయన కీలక బాధ్యతలు పోషించారు. అత్యున్నతస్థాయి బాధ్యతలు... గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ చీఫ్ ఎకనమి స్ట్‌గా పనిచేసిన రాజన్, గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ)గా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఎకనమిస్ట్‌గా పనిచేస్తున్న కౌశిక్ బసు స్థానంలో ఆయన ఆగస్టులో ఈ బాధ్యతలు చేపట్టారు. సీఈఏగా బాధ్యతలను చేపట్టే నాటికి ఆయన షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ప్రధాన మంత్రికి గౌరవ ఆర్థిక సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు. ముందుచూపు... ఆర్థిక అంశాల విశ్లేషణలో తనకంటూ ఒక ప్రత్యేకత. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన అతి కొద్ది మంది ఆర్థికవేత్తల్లో ఒకరిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. -
ప్రజల మదిలో వైఎస్ చిరస్మరణీయుడు
ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇరు ప్రాంతాల ప్రజల మనసుల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ విభాగం రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు అన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచి పంచాయతీల్లో నూతనంగా పదవీబాధ్యతలు చేపట్టిన 206 మంది సర్పంచుల అభినందన సభ మంగళవారం ఖమ్మంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నట్లు తెలిపారు. గత ఉప ఎన్నికల్లో ఈ ప్రాంతంలో పార్టీ అభ్యర్థులను బరిలో దింపకుండా తెలంగాణ వాదానికి మద్దతు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఏడాది క్రితమే తన నిర్ణయం ప్రకటించి ఉంటే వెయ్యిమందికి పైగా తెలంగాణ బిడ్డలు చనిపోయే వారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఆటలను బట్టబయలు చేసేలా షర్మిల మాట్లాడిన మాటలను వక్రీకరించి రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన వైఎస్, ఆయన కుటుంబ సభ్యులపైనా ఇక్కడివారికి ఎంతో గౌరవముందన్నారు. కష్టపడే వారికి వైఎస్సార్సీపీ ప్రాధాన్యమిస్తుందని అన్నారు. కోవర్టు రాజకీయాలు చేసేవారిని సహించదని, ఇటువంటి రాజకీయాలు చేసేవారే పార్టీ నుంచి వెళ్తున్నారని, వారి వల్ల పార్టీకి జరిగే నష్టమేమీ ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన తమ పార్టీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందుతోందని, యువనేత జగన్మోహన్రెడ్డి జాతీయ నాయకుడిగా ఎదుగుతారని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని పార్టీకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులే అధ్యక్షులుగా ఉంటారన్నారు. పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కన్వీనర్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ జిల్లాలోనే అత్యధిక స్థానాలు గెలుచుకొని ఖమ్మం జిల్లాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖిల్లాగా మార్చారన్నారు. నిజాలను నిలదీసే సత్తా, దమ్ము, ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్రెడ్డికే ఉన్నాయని ప్రకటించారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశరావు, ఖమ్మం పార్లమెంటరీ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, సీఈసీ సభ్యుడు మదన్‌లాల్, సీజీసీ సభ్యుడు చందా లింగయ్యదొర తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ 9 కల్లా రెండు రాష్ట్రాలు!
సోనియాగాంధీ పుట్టినరోజు నాటికి విభజన బిల్లు ఆమోదం కేంద్రం పరిశీలనలో రాయల తెలంగాణ, భద్రాచలం అంశాలు తెలంగాణలోని సీమాంధ్రులు సెటి లర్లు కాదు సర్వీస్ నిబంధనల మేరకే ఉద్యోగుల విషయంలో నిర్ణయం రాష్ట్రపతి అసెంబ్లీ తీర్మానం కోరే అవకాశం లేదు విభజన ప్రక్రియలో సీఎం భాగస్వామి కాలేనంటే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9 నాటికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పడతాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఇప్పటికే విభజన నిర్ణయం జరిగిపోయినందున ఇంకా కలిసి ఉండాలనడంలో అర్థంలేద న్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగినప్పటికీ రాయల తెలంగాణ, సీమాంధ్రలో భద్రాచలం కలపడం వంటి అంశాలు కూడా కేంద్రం పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులంతా తెలంగాణలో అంతర్భాగమేనని, ఇక్కడ పనిచేస్తున్న ఆ ప్రాంత ఉద్యోగుల విషయంలో కేంద్రం.. సర్వీస్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమైక్య ఉద్యమాలను ఎదుర్కొనడమే కాంగ్రెస్ పార్టీ ముందున్న కర్తవ్యమని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ, నాయకులు శైలేష్‌రెడ్డి, పల్లె రవికుమార్, పీవీ శ్రీనివాస్, క్రాంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన, తెలంగాణ పునర్నిర్మాణం తదితర అంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీఎస్ బదులిచ్చారు. ‘గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ హైకమాండ్ విస్తృత సంప్రదింపులు, చర్చలు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నియామకం, ఆ కమిటీ నివేదిక ఇవ్వడం, కేంద్రం పలుమార్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం, ప్రతి ఒక్క పార్టీతో.. ప్రజాప్రతినిధులతో అభిప్రాయ సేకరణ... ఇలా అనేక రకాలుగా కసరత్తు చేసిన తర్వాతే తెలంగాణపై నిర్ణయం జరిగింది. ఇప్పుడు తొందరపాటు నిర్ణయమని సీమాంధ్ర నేతలు చెప్పడం సరికాద’న్నారు. విభజన నిర్ణయం అమలు బాధ్యత సీఎందే.. ‘రాష్ట్ర విభజన నిర్ణయం అమలుచేయాల్సిన బాధ్యత సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఉంది. వారు ఆ పని చేస్తారనే భావిస్తున్నా. ఒకవేళ విభజన ప్రక్రియలో భాగస్వామిని కాలేనని సీఎం చెబితే పార్టీ తగిన నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలం టూ వారు సంతకాలు చేశారని విన్నాను. అది వారి విచక్షణకే వదిలేస్తున్నా. నేను సమాధానం చెప్పలేను. తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులు సెటిలర్లు కాదు. కాంగ్రెస్ డిక్షనరీలో సెటిలర్లు అనే పదానికే తావు లేదు. వారంతా తెలంగాణలో అంతర్భాగమే. సీమాంధ్ర ఉద్యోగుల రక్షణకు ఢోకా లేదు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి.. అసెంబ్లీలు తీర్మానం చేస్తే కేంద్రం తగిన చర్య తీసుకోవడం. రెండోది వివిధ రూపాల్లో వస్తున్న ఆందోళనలు, ఉద్యమాల కారణంగా కేంద్రం తనంతట తాను విభజన ప్రక్రియ చేపట్టడం కోసం అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరడం. తెలంగాణ విషయంలో కేంద్రం రెండో ప్రక్రియను చేపట్టింది. ఈనెల 8న కేంద్ర కేబినెట్ తెలంగాణ అంశంపై చర్చించి రాష్ట్రపతికి పంపుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయాన్ని మాత్రమే కోరతారు. తీర్మానం చేయమని కోరే అవకాశంలేదు. 4,5 నెలల్లోనే విభజన ప్రక్రియ ముగుస్తుందని కేంద్ర హోంమంత్రి కూడా చెప్పినందున సోనియా పుట్టినరోజు నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయనే నమ్మకం నాకుంది.’ వాళ్లు తెలంగాణలో కలుస్తానంటే సంతోషమే ‘రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు ఆంధ్రలో ఉండలేమని చెబుతున్నారు. తెలంగాణలో కలుస్తామంటున్నారు. ఇది సంతోషమే. రాయల తెలంగాణ అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారనేది ఊహాజనితమే. దీనిని ఎవరూ ఒప్పుకునే ప్రసక్తిలేదు. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదు. ఇక తెలంగాణ విడిపోతే అభివృద్ధి కాలేదని అంటున్న వాళ్లు సైతం ఆశ్చర్యపోయేలా ఊహించని అభివృద్ధి సాధించడమే లక్ష్యం. తెలంగాణలో పుష్కలంగా వనరులున్నాయి. 70, 80 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచుకోవాలి. విద్య, వైద్య రంగాలను విస్తృతం చేయాలి. దేవుడిచ్చిన శరీరాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఆత్మహత్య చేసుకుంటాననడం ఎంత తప్పో... సాగుకు యోగ్యమైన భూమిని సాగులోకి తేకుండా ఉంచడం కూడా అంతే తప్పు.’ కేసీఆర్ హైకమాండ్‌కు చాలా దగ్గరి మనిషి ‘టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ హైకమాండ్‌కు చాలా దగ్గర మనిషి. మంచి సంబంధాలున్నాయి. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ చాలాసార్లు చెప్పారు. మొన్న కూడా తెలంగాణ బిల్లు పాసయ్యాక విలీనంపై చర్చిస్తానన్నారు. అవసరమైతే నా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను.’ నేను వినాయకుడిని.. కేసీఆర్ కుమారస్వామి! ‘తెలంగాణ సాధన విషయంలో మీరెందుకు స్పీడ్‌గా వెళ్లడంలేదని కొందరు మీడియా మిత్రులు గతంలో నన్ను అడిగారు. అప్పుడు నేనొక కథ చెప్పాను. ఆనాడు వినాయకుడు, కుమారస్వామిల్లో ఎవరిని గణనాథుడిగా ఎంపిక చేయాలా? అని శివపార్వతులు ఆలోచించి ముల్లోకాలను చుట్టొచ్చిన వారినే ఎంపిక చేస్తామని చెబితే ఏమైందో మీకు తెలుసు. తెలంగాణ విషయంలో కూడా అంతే. కేసీఆర్ తెలంగాణ ఇవ్వాలని ఊరూవాడా స్పీడ్‌గా తిరుగుతుంటే.. నేను మాత్రం తెలంగాణ ఇచ్చే శివపార్వతులు సోనియాగాంధీయే కాబట్టి ఆమె చుట్టే ప్రదక్షిణలు చేశాను. తెలంగాణ సాధిం చాను. ఇందులో కేసీఆర్ కృషి కూడా తక్కువేమీ కాదు. సమైక్యరాష్ట్రంలో సీఎం కాలేదనే బాధ నాకు లేదు. నేనిప్పుడు సీఎం కావాలా? పీసీసీ అధ్యక్షుడు కావాలా? అనేది నా చేతుల్లో లేదు. గతంలో సోనియాగాంధీ నన్ను రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు కూడా ఆమె చేతుల్లోనే నా భవిష్యత్తు ఉంది. నేను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి ఇదేమీ గుర్రాల పందెం కాదు..’ -
అసాధారణ ప్రతిభావంతుడు రాజన్
రిజర్వ్ బ్యాంకు కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పదవీ కాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. అదే రోజు 23 గవర్నర్‌గా రాజన్ బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన ఉంటారు. రాజన్ ప్రస్తుతం భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంకుకు ఐఏఎస్ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్ అధికారులే. ఐఏఎస్ కాకపోయినా రాజన్‌కు గవర్నర్ పదవి దక్కడానికి ఆయన మేధస్సే ప్రధాన కారణం. అసాధారణమైన ప్రతిభావంతుడిగా రాజన్‌కు పేరుంది. ప్రస్తుతం భారత దేశం తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ బాధ్యతలు చేపట్టడం ఆశాజనకమైన పరిణామం. రఘురామ్ రాజన్ భోపాల్‌లో 1963 ఫిబ్రవరి 3న జన్మించారు. ఆయన తండ్రి దౌత్యవేత్త. అందువల్ల 7వ తరగతి వరకు రాజన్ విదేశాల్లోనే చదువుకున్నారు. ఆ తర్వాత నుంచి ఢిల్లీలో చదువుకున్నారు. 1985లో ఢిల్లీ ఐఐటీ నుంచి గోల్డ్ మెడల్‌తో బీటెక్ పట్టా అందుకున్నారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. బ్యాంకింగ్ రంగంపై సమర్పించిన పత్రానికి ఎంఐటి పీహెచ్డీ మంజూరు చేసింది. రాజన్ చికాగోలోని బూత్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పని చేశారు. ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకానమిస్ట్‌గా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఫైనాన్స్ రంగంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశారు. 2008లో ఆర్థిక సంక్షోభం రాబోతోందని అంచనా వేసిన వారిలో రాజన్‌కు కూడా ముఖ్యమైన స్థానం ఉంది. అదే ఏడాది మన దేశానికి గౌరవ ఆర్థిక సలహాదారుగా ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నియమించారు. 2012లో ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యంత చిన్న వయసులో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. దువ్వూరి సుబ్బారావు తొలుత మూడేళ్ల కోసం గవర్నర్‌గా నియమితులయ్యారు. అనంతరం మరో రెండేళ్ల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. సుబ్బారావు హయాంలో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ధరల పెరుగుదలను అదుపు చేసేందుకు ఆయన వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లారు. ఈ పరిణామం కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని పెద్ద కంపెనీలు కూడా వాయిదాలు కట్టలేక చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి చిదంబరానికి, సుబ్బారావుకు మధ్య దూరం పెరిగింది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న రాజన్ ఈ దూరాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. -
పాక్ చర్యలను బట్టే భారత్ స్పందన: ఏకే ఆంటోనీ
కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో భారత జవాన్ల కాల్చివేతపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రాజ్యసభలో మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన చేశారు. పాకిస్థాన్ చర్యలను బట్టే భారతదేశం స్పందన కూడా ఉంటుందని ఆయన తెలిపారు. పాకిస్థానీ సైన్యం యూనిఫాం ధరించిన వ్యక్తులతో కలిసి ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తమకు కచ్చితమైన సమాచారం ఉందని ఆయన తెలిపారు. అంతకుముందు పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తీరాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. లోక్‌సభ సమావేశం కాగానే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్‌వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. -
విద్యార్థుల కోసం ఆఫీస్ 365 యూనివర్సిటీ
ఇంటర్నెట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం 'ఆఫీస్ 365 యూనివర్సిటీ'ని విడుదల చేసింది. ఇందులో మొత్తం ఆఫీస్ అప్లికేషన్లుంటాయి. వీటిని రెండు పీసీలు లేదా మ్యాక్‌లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో ఆఫీస్ ఆన్ డిమాండ్, 20 జీబీ ప్రీమియం స్కైడ్రైవ్ స్టోరేజి కూడా ఉంటాయి. నాలుగేళ్ల పాటు వ్యాలిడిటీలో ఉండే ఈ ప్యాకేజి ధర 4,199 మాత్రమే. దేశంలోని విశ్వవిద్యాలయాలు, గుర్తింపు ఉన్న కాలేజీలలో చదివేవారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. విద్యార్థులకు ఈ ప్రత్యేక ధర పెట్టడం వల్ల వారు భవిష్యత్తులో అవకాశాలను అందిపుచ్చుకోడానికి వీలుగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం ఆర్ పిచాయ్ తెలిపారు. దీనివల్ల పని చాలా సులభం అవుతుందని, ఒకేసారి డాక్యుమెంట్లు లేదా నోట్స్‌ను ఎడిట్ చేసి, షేర్ చేసుకుని, క్లౌడ్‌లో స్టోరేజి కూడా చేసుకోవచ్చని చెప్పారు. దీన్ని కొనాలంటే విద్యార్థులు ఆఫీస్ వెబ్సైట్లోకి వెళ్లి తమ అర్హతను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం వారు తమ యూనివర్సిటీ వివరాలను పేర్కొని, దాన్ని పరిశీలించుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చని వివరించారు. విద్యార్థులతో పాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో లెక్చరర్లు, అధ్యాపకులు, సిబ్బంది కూడా ఆఫీస్ 365 యూనివర్సిటీని కొనుగోలు చేసుకోవచ్చన్నారు. -
'తెలంగాణ' ఏర్పాటు సరైన చర్య కాదు: ప్రమోద్ బోరా
తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు సరైన చర్య కాదని అల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్యు) అధ్యక్షుడు ప్రమోద్ బోరా మంగళవారం రాటలో జరిగిన విలేకర్ల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఓ విధంగా ప్రధాని మన్మోహన్ సింగ్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలు కలసి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ఏబీఎస్యు ఇచ్చిన 15 వందల గంటల బంద్ నిరాటంకంగా సాగుతోంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అనుకూలం అంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు, కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. దాంతో దేశంలో ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమాలు చేస్తున్న వివిధ సంస్థలకు ఊపిరిలూదినట్లు అయింది. అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు తమ ప్రాంతాన్ని నూతన రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులకుపైగా నిత్య నిరసనలు, తీవ్ర ఆందోళనలతో అసోం రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రజ జీవనం అస్తవ్యస్తమైంది. కార్బి అంగ్లాంగ్ జిల్లాను ప్రత్యేక రాష్టంగా ఏర్పాటు చేయాలని రెండు సంఘాలు 64 గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలోని అన్నిపార్టీల నేతలు యూపీఏ చైర్మన్ సోనియాగాందీ, ప్రధాని మన్మోహన్, హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కలిసేందుకు న్యూఢిల్లీ పయనమైయ్యారు. అయితే జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా అంత సవ్యంగానే ఉందని కార్బి అంగలాంగ్ జిల్లా అధికారులు తెలిపారు. దాంతో ఆరుగంటలపాటు కర్ఫ్యూ ను సడలించినట్లు చెప్పారు. జిల్లాలోని మంజలో పారెస్ట్ కార్యాలయన్ని ఆందోళనకారులు తగలబెట్టారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను భద్రత దళాలు అరెస్ చేసినట్లు చెప్పారు. బోడోలాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూడీపీఎఫ్ సోమవారం పిలుపు నిచ్చింది. దాంతో దిగువ అసోంలోని అయిదు జిల్లాలు పూర్తిగా ప్రజాసేవలు నిలిచిపోయాయి. దాంతో జనాలు ఇళ్లకే పరిమితమైనారు. అయితే ఈద్ పండగ నేపథ్యంలో బంద్ పాక్షికంగా నిర్వహించాలిన 60 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీఎస్‌యూ నిర్ణయించింది. అలాగే 11 రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే వెల్లడించింది. అలాగే రాజధాని, సరయిగాట్,కామరుప్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు బ్రహ్మపుత్ర మెయిల్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్
రిజర్వు బ్యాంకు నూతన గవర్నర్‌గా రఘురామ్ జి రాజన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. దువ్వూరి ఐదేళ్ల పదవీ కాలం సెప్టెంబర్ 4తో ముగియనుంది. ఆర్బీఐ గవర్నర్ పదవిలో రఘురామ్ జి రాజన్ మూడేళ్ల పాటు కొనసాగుతారని అధికార ప్రకటనలో తెలిపారు. రాజన్ ప్రస్తుతం ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయనను గతేడాది ఆగస్టులో ఈ పదవిలో నియమించింది. గతంలో ఐఎంఎఫ్‌లో ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ప్రధానికి గౌరవ ఆర్థిక సలహాదారుగానూ కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ పలు సవాళ్లు ఎదుర్కొనున్నారు. రూపాయి పతనం, రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐఐటీ-అహ్మదాబాద్, ఐఐటీ-ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన రాజన్ 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా ఊహించారు. -
కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్రలు:టీఆర్ఎస్
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్రలు జరుగుతున్నాయని ఆపార్టీ నేతలు ఆరోపించారు. ఈ కుట్రలపై పూర్తిస్థాయిలో విచారణ జరించాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు వెంటనే జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని వారు కోరారు. కాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటనతో టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. మెదక్ టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు రావటం.... ఆ తర్వాత రోజు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయశాంతి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు పది సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు. మరోవైపు టీఆర్ఎస్ ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలతో ఆపార్టీ నేతల్లో గుబులు మొదలైంది. అధినేత తీసుకునే నిర్ణయంపై వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ఉనికి పోకుండా ఉండేందుకే కేసీఆర్‌పై హత్యాయత్నం కుట్రలు జరుగుతున్నాయని ప్రచారం చేసుకుంటున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. -
రాజ్యసభలో శీలం - పాల్వాయి వాగ్వాదం; లోక్‌సభ రేపటికి వాయిదా
లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. జమ్ము కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ వద్ద ఐదుగురు భారత సైనికులను పాకిస్థానీ సైన్యం హతమార్చిన ఘటనపై ప్రభుత్వం చేష్టలుడిగి కూర్చుందంటూ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్షాలన్నీ ఒంటికాలిపై లేవడం, సభ కార్యకలాపాలు సజావుగా సాగకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ మీరాకుమార్ సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లాయి. లోక్‌సభను ఎలాగోలా నడిపించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు జై సమైక్యాంధ్ర నినాదాలు మొదలుపెట్టారు. సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినదించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు ససేమిరా వీల్లేదంటూ గట్టిగా పట్టుబట్టారు. తెలంగాణ ఎంపీలు కూడా తమ స్థానాల్లోంచి లేచి నిల్చున్నారు. లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్ పదే పదే వారించినా, వెల్ లోంచి సభ్యులు వెళ్లలేదు. తిరిగి 12 గంటల ప్రాంతంలో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అప్పటికీ నినాదాలు ఆగలేదు. రాజ్యసభలో 'మాకు న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలలోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు కొనసాగించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ రాజ్యసభలో టీడీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టారు. ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం, తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. సీమాంధ్రులంతా తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని పాల్వాయి వ్యాఖ్యానించడంతో సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని కేంద్రమంత్రి జేడీ శీలం స్పందించారు. ఆయనకు రేణుకా చౌదరి కూడా మద్దతు పలికారు. అధికార పక్షానికి చెందిన పలువురు సభ్యులు వారిద్దరికీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. గొడవ పడొద్దని సీనియర్ సభ్యురాలు అంబికా సోనీ కూడా జేడీ శీలానికి సూచించారు. ఇంతలో టీడీపీ సభ్యులు రాష్ట్రాన్ని రక్షించాలంటూ నినాదాలు చేయడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వారిని హెచ్చరించారు. సభా కార్యకాలపాలకు అడ్డు తగలడం మానకపోతే చర్య తీసుకుంటామన్నారు. దీని గురించి చర్చ వచ్చినప్పుడు ముందుగా మాట్లాడే అవకాశం వారికే ఇస్తానని చెప్పారు. ఇలాగే గొడవ చేస్తే సస్పెండ్ చేయాల్సి ఉంటుందని, అలా చేసేలా తనను బలవంత పెట్టొద్దని చెప్పారు. అయినా ఎంపీలు మాత్రం తమ పట్టు వీడలేదు. నినాదాలు కొనసాగించారు. ఈ పరిస్థితి అంతటికీ ప్రభుత్వమే కారణమని రాజ్యసభలో విపక్షనేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. రాష్ట్రంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. ఏకాభిప్రాయం లేకుండా నిర్ణయం తీసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. దీనిపై చివరకు అధికార పార్టీయే ఒక్క మాటమీద లేదని, మంత్రికి - ఎంపీ పాల్వాయికి మధ్య జరిగిన వివాదమే ఇందుకు సాక్ష్యమని ఆయన అన్నారు. -
'చెన్నై ఎక్స్‌ప్రెస్' తో 'మై హు షాహిద్ ఆఫ్రిద్ లేట్
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రం పాకిస్థాన్‌లో విడుదల కానుంది. ఆ నేపథ్యంలో మై హు షాహిద్ ఆఫ్రిద్ (ఎంహెచ్ఎస్హెచ్) చిత్రం రంజాన్ పండగ తర్వాత విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆ చిత్ర నిర్మాతలు మంగళవారం పాకిస్థాన్‌లో వెల్లడించారు. అయితే ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారమే ఆ చిత్రాన్నివిడుదల చేయాలనుకున్నామని, కానీ ఆఖరి నిముషంలో అవాంతరాలు ఎదురైయ్యాయని ఆ చిత్ర రచయిత వ్యాస చౌదరి ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే దేశ చలన చిత్ర రంగంలో పేరు ప్రఖ్యాతలు పొందిన ఫిల్మ్ ఎడిటర్ అజాంఖాన్ మరణం కూడా ఆ చిత్ర విడుదలకు ఏర్పడిన అవాంతరాల్లో ఒకటన్నారు. చిత్ర పూర్తి కావచ్చున చివరి నిముషంలో ఆయన మరణించారన్నారు. అలాగే చిత్రంనికి సంబంధించి పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ అంతా విదేశాల్లో జరగడం కూడా ఇంకో కారణమన్నారు. అయితే ఇద్ పండగ నేపథ్యంలో భారత్‌కు చెందిన ఏ చిత్రాన్ని పాక్‌లో విడుదల చేయమని అంతకుమందు డిస్టిబ్యూటర్లు, సినీ నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆఖరి నిముషంలో ఆ ఒప్పందాన్ని అతిక్రమంచి చెన్నై ఎక్స్‌ప్రెస్‌ను విడుదల చేస్తున్నారని వ్యాస చౌదరి పేర్కొన్నరు. -
సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ : సమైక్య సెగ ఇప్పుడు రాష్ట్ర రాజధానికి కూడా తాకింది. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధ నీటి పారుదల కార్యాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు.. తెలంగాణ ఉద్యోగులు మధ్య మంగళవారం తోపులాట జరిగింది. దాంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. భోజన విరామ సమయంలో ఏపీ ఎన్జీవో ఉద్యోగులు విభజనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రామాన్ని చేపట్టారు. సమైక్య నినాదాలు చేస్తున్నారు. అదే సమయంలో టీ ఎన్జీవో ఉద్యోగులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలను ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఇటు సీమాంధ్ర ఉద్యోగులు.. అటు తెలంగాణ ఉద్యోగులు హోరా హోరిగా నినాదాలు చేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఏపీ ఎన్జీవోలు నిరసన ప్రారంభించగా టీఎన్జీవోలు వారితో ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఎవరికి వారే అన్నట్లు గట్టిగా పట్టుబట్టడంతో వివాదం మరింత ముదిరింది. ఈ సందర్భంగా వారి మధ్య తోపులాట మొదలైంది. ఈ విషయం తెలిసిన ఇతర విభాగాల ఉద్యోగులు భారీ ఎత్తున జలసౌధకు చేరుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు ప్రాంతాల ఉద్యోగులను శాంతింపజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల ఆందోళనలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, గొల్ల బాబురావు, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ప్రజలకు హైదరాబాద్ చెందదని... ఉన్నపళంగా హైదరాబాద్ వదలివెళ్లాలనడనం దుర్మార్గమని రాజమోహన్ రెడ్డి అన్నారు. -
పాకిస్థాన్‌లో తీవ్రవాదుల ఘాతుకం
పాకిస్థాన్‌లోని బెలుచిస్థాన్‌లో కిడ్నాప్‌నకు గురైన 23 మంది ప్రయాణికుల్లో 13 మందిని తీవ్రవాదులు హతమార్చారని మీడియా వెల్లడించింది. మంగళవారం ఉదయం వారి మృతదేహాలను పోలీసులు కనుగోన్నారని తెలిపింది. కాగా మరో 10 మంది ప్రయాణికుల ఆచూకీ ఇంతవరకు తెలియలేదని పేర్కొంది. ఆ ప్రయాణికుల ఆచూకీ వెంటనే కనిపెట్టాలని బెలుచిస్థాన్ ప్రావెన్స్ సీఎం అబ్దుల్ మాలిక్ బెలుచి ఉన్నతాధికారులను ఆదేశించారని చెప్పింది. అలాగే ఆ ఘాతుకానికి ఒడిగట్టిన తీవ్రవాదులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని ఆయన జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారని తెలిపింది. అయితే భద్రతా సిబ్బంది లేకపోవడంతో తీవ్రవాదులు ఆ రెండు బస్సుల్లోని ప్రయాణికులను ఆపి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని అధికారులు అభిప్రాయపడతున్నారని పేర్కొంది. సోమవారం అర్థరాత్రి క్విట్టా నుంచి పంజాబ్ ప్రావెన్స్‌కు వెళ్లున్న రెండు బస్సులను భద్రత దళానికి చెందిన దుస్తులు ధరించిన సాయుధ బృందం బలవంతంగా నిలిపివేసింది. అనంతరం ఆ బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులు తమ గుర్తింపుకార్డులు చూపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రయాణికులందరిని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కాగా మంచ్ ప్రాంతంలో ఆ రెండు బస్సులను తీవ్రవాదులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఆ బస్సుల వెంట ఉన్న భద్రత సిబ్బంది తీవ్రవాదుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో భద్రత సిబ్బంది, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ భద్రత సిబ్బంది మరణించగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని భద్రత సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. -
గీత దాటలేదు.. భారత సైనికులను చంపలేదు: పాకిస్థాన్
చేయాల్సిందంతా చేయడం, తర్వాత తమ తప్పేమీ లేదని చెప్పడం.. ఇలాంటివన్నీ పాకిస్థాన్‌కు అలవాటే. అలాగే ఈసారి కూడా ఇదే మాట చెప్పింది. తమ దళాలు అసలు నియంత్రణ రేఖను దాటనే లేదని, భారత సైనికులను హతమార్చలేదని తెలిపింది. అసలు నియంత్రణ రేఖ వద్ద అలాంటి సంఘటన ఏదీ జరగనే లేదని, తమ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని పాక్ సైనికాధికారి ఒకరు తెలిపారు. సుమారు 20 మంది పాకిస్థానీ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి, సర్లా పోస్టు వద్ద భారత సైనికులపై దాడి చేసి ఐదుగురిని కాల్చి చంపినట్లు భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మృతులలో 21 బీహార్ యూనిట్‌కు చెందిన ఒక సుబేదార్, నలుగురు జవాన్లు ఉన్నారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నియంత్రణ రేఖకు 450 మీటర్ల దూరంలో సంభవించింది. కాగా, పూంచ్ సెక్టార్లో ఐదుగురు భారత సైనికులను పాకిస్థానీ దళాలు హతమార్చడం దురదృష్టకరమని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోడానికి ఇది మార్గం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ తెలిపారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ సంఘటనపై ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటులో ఓ ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు నిలిపివేసేది లేదని కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తెలిపారు. మరోవైపు, సైనికులను హతమార్చిన సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియ ఆపేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ పేలినా చర్చలు జరపకూడదని, ఒకవైపు మన సైనికులను చంపేస్తూ మరోవైపు చర్చించడం సరికాదని బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్ అన్నారు. ఇక ఈ సంఘటన పార్లమెంటును కూడా కుదిపేసింది. లోక్‌సభ సమావేశం కాగానే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్‌వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. -
పాక్ దాడి 'దుర్మార్గపు చర్య': మోడీ
సరిహద్దులో భారత సైనికులను పాకిస్థానీ బలగాలు కాల్చి చంపడాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాక్ దురాగతాన్ని 'దుర్మార్గపు చర్య'గా మోడీ పేర్కొన్నారు. పాకిస్థాన్ చర్య ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదముందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ బలగాలు ఐదుగురు భారత జవాన్లను హత్య చేయడాన్ని ఖండిస్తూ మోడీ, ఒమర్ అబ్దుల్లా తమ వ్యాఖ్యలను ట్విటర్లో పోస్ట్ చేశారు. భారత సైనికులపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మోడీ స్పష్టం చేశారు. చైనా చొరబాట్లు, పాకిస్థాన్ దుశ్చర్యల నుంచి సరిహద్దులను రక్షించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమయిందని ఆయన విమర్శించారు. యూపీఏ పాలకులు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమయిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జమ్ము కాశ్మీర్లో నియంత్రణ రేఖను దాటి వచ్చిన పాకిస్థానీ దళాలు భారత సైనికులపై కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్ల ప్రాణాలు బలిగొన్నాయి. పూంచ్ జిల్లా చకన్ దా బాగ్ సెక్టార్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఎల్ఓసీలోని కర్మాడ్ గ్రామంలో గల తమ సైనిక పోస్టుపై వాళ్లు దాడి చేసి, తమ సైనికుల్లో ఐదుగురిని కాల్చి చంపారని, తర్వాత మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి పారిపోయారని సైన్యానికి చెందిన ఓ అధికారి తెలిపారు. -
పార్లమెంటులో ఆగని గందరగోళం.. వాయిదాల పర్వం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వరుసగా రెండోరోజు కూడా సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లాయి. లోక్‌సభను ఎలాగోలా నడిపించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు జై సమైక్యాంధ్ర నినాదాలు మొదలుపెట్టారు. సమైక్యాంధ్ర వర్థిల్లాలి అంటూ నినదించారు. రాష్ట్రాన్ని విభజించేందుకు ససేమిరా వీల్లేదంటూ గట్టిగా పట్టుబట్టారు. ఇంత గందరగోళం జరుగుతున్నా కూడా సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఎలాగోలా నిర్వహించేందుకు స్పీకర్ ప్రయత్నించినా మిన్నంటిన నినాదాల మధ్య అది కుదరలేదు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. తిరిగి 12 గంటల ప్రాంతంలో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అప్పటికీ నినాదాలు ఆగలేదు. రాజ్యసభలో 'మాకు న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పార్లమెంటు ఉభయ సభలలోనూ సీమాంధ్ర ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు కొనసాగించారు. ఇదే సమయంలో పాకిస్థాన్ దుశ్చర్యపై రాజ్యసభలో బీజేపీ సభ్యులు వెంకయ్య నాయుడు, రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం ఈ అంశంపై ఓ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు దీనిపై చర్చిద్దామని అధ్యక్ష స్థానంలో ఉన్న పీజే కురియన్ సూచించినా వెంకయ్యనాయుడు తన వాదనను కొనసాగించారు. ఒకపక్క దేశ భద్రత ప్రమాదంలో పడినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటోందని ఆయన మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ ఎంపీలు కూడా తమ స్థానాల్లోంచి లేచి నిల్చున్నారు. లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్ పదే పదే వారించినా, వెల్ లోంచి సభ్యులు వెళ్లలేదు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. భారత భూభాగంలోకి ప్రవేశించి భారత సైనికులను హతమార్చిన పాకిస్థాన్ సైనికుల దుశ్చర్యను పలువురు సభ్యులు తీవ్రంగా ఎండగట్టారు. ఈ విషయంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని, ప్రధాని సభకు రావాలని బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. అక్కడి గందరగోళం నడుమ సభ వాయిదా పడింది. -
నైజీరియాలో తీవ్రవాదుల దాడి: 35 మంది మృతి
నైజీరియాలోఈశాన్య రాష్ట్రమైన బోర్నోలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 35 మంది మరణించారని మిలటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సాగిర్ ముస వెల్లడించారని స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. బామా పట్టణంలోని మొబైల్ బేస్ క్యాంప్‌పై ఆదివారం బొకొ హరం సంస్థకు చెందిన తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారని పేర్కొంది. దాంతో పోలీసులు వెంటనే ఎదురుదాడికి దిగారు. దీంతో 17 మంది బొకొ హరం తీవ్రవాదులతోపాట ఓ పోలీసు మరణించారని చెప్పారు. ఆ ఘటనలో ఇద్దరు సైనికులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. అలాగే మౌలమ్ ఫటొరి ప్రాంతంలో నైజీరియా, చద్ద్ నుంచి వచ్చిన సైనికులతో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్‌పై అదే సంస్థకు చెందిన తీవ్రవాదులు మెరుపుదాడికి దిగారని చెప్పారు. ఆ ఘటనలో ఓ సైనికుడితోపాటు 15 మంది బొకొ హరం తీవ్రవాదులు మరణించారని ముస తెలిపారు. -
భారతీయ జాలర్ల పట్ల శ్రీలంకది అమానుష చర్య
భారతీయ జాలర్ల పట్ల శ్రీలంక నావికా దళం అమానుషంగా వ్యవహారిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితా ఆరోపించారు. ఆ దేశ నావిక దళ చర్యలను కట్టడి చేసేందుకు శ్రీలంకపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ జయలలిత మంగళవారం భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. చాలా కాలంగా సముద్ర జలాల్లోకి చేపల వేటకు వెళ్లే భారతీయ జాలర్లపై శ్రీలంక నావికదళం దాడులకు పాల్పడటంతోపాటు వారిని అపహరిస్తు శత్రుదేశం మాదిరిగా వ్యవహారిస్తుందని ఆమె రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని ఆ దేశ ఉన్నతాధికారులను ఆదేశించాలని జయలలిత కోరారు. ఇప్పటికైన ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుంటే ఆ దేశ నావిక దళం హద్దు మీరే అవకాశాలు ఉన్నాయని జయలలిత అభిప్రాయపడ్డారు. ఓ వేళ ఇలాంటి చర్యలు మరో సారి జరిగితే ఉపేక్షించేది లేదని శ్రీలంకకు గట్టిగా చెప్పాలని ఆమె సూచించారు. తమిళనాడుకు చెందిన ఎంతో మంది జాలర్లు తరుచుగా ఆ దేశ నావికాదళ సిబ్బంది చేతుల్లో పలు ఇక్కట్లకు గురవుతున్న సంఘటనలపై తరుచుగా లేఖల ద్వారా మీ దృష్టికి తెస్తున్న సంగతిని ప్రధానికి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆగస్టు 3న తమిళనాడుకు చెందిన 20 భారతీయ జాలర్లను లంక నావికాదళం అరెస్ట్ చేసిన సంఘటనను జయలలిత ఆ లేఖలో ప్రస్తావించారు. భారతీయ జాలర్ల అరెస్ట్‌తో రాష్ట్రంలోని ఆ సామాజిక వర్గం ఆందోళనలకు దిగుతున్నాయని, దాంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అలాగే శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న 90 మంది భారతీయ జాలర్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని జయలలిత ప్రధాని మన్మోహన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
గీత దాటిన పాకిస్థాన్: ఐదుగురు భారత జవాన్ల హతం
పాకిస్థాన్ మరోసారి పాపిస్థాన్ అనిపించుకుంది. జమ్ము కాశ్మీర్లో నియంత్రణ రేఖను దాటి వచ్చిన పాకిస్థానీ దళాలు భారత సైనికులపై కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్ల ప్రాణాలు బలిగొన్నాయి. పూంచ్ జిల్లా చకన్ దా బాగ్ సెక్టార్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఎల్ఓసీలోని కర్మాడ్ గ్రామంలో గల తమ సైనిక పోస్టుపై వాళ్లు దాడి చేసి, తమ సైనికుల్లో ఐదుగురిని కాల్చి చంపారని, తర్వాత మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి పారిపోయారని సైన్యానికి చెందిన ఓ అధికారి తెలిపారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య 2003 సంవత్సరంలో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తోంది. ఈ సంవత్సరం జనవరిలో కూడా ఇద్దరు భారతీయ సైనికులను ఎల్ఓసీ వద్ద గల మేంధర్ సెక్టార్లో హతమార్చింది. ఈ సంఘటనలో పాకిస్థాన్ సైన్యం ప్రత్యక్ష ప్రమేయం ఉందని భారత వర్గాలు ఆరోపించాయి. ఇంతకుముందు ఒకసారి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి, భారత సైనికుడి తల తెగనరికిన సంఘటన అప్పట్లో తీవ్ర వివాదానికి కారణమైంది. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా మన విదేశాంగ శాఖ వైపు నుంచి తగిన స్థాయిలో ప్రతిస్పందన ఉండట్లేదని సైన్యం ఆరోపిస్తోంది. -
యూఎస్‌లో వ్యక్తి కాల్పులు: ఇద్దరు మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియా పట్టణంలో రాస్ టౌన్షిప్లో జరుగుతున్న సమావేశంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఆ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. వారిలో ఇద్దరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ప్రత్యేక విమానంలో లీహై వ్యాలీలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుందని చెప్పింది. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియా తెలిపింది. -
తీవ్రవాదుల జాబితాను విడుదల చేసిన యెమెన్
ప్రముఖ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా యెమెన్ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు సమాయత్తమైంది. అందుకు దేశంలోని విదేశీ కార్యాలయాలు, సంస్థలను లక్ష్యంగా చేసుకుందని ఆ దేశ హోంమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన 25 మంది తీవ్రవాదుల పేర్ల జాబితాను సోమవారం సాయంత్రం యెమెన్ రాజధాని సనాలో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఆ తీవ్రవాదుల సమాచారం అందజేసిన లేదా ఆచూకీ తెలిపిన వారికి భద్రతా దళాలు రూ.23 వేల అమెరికన్ డాలర్లు పారితోషకంగా అందజేయనున్నాయని తెలిపింది. అయితే యెమెన్ ఆ ప్రకటన విడుదల చేయడంతో ముస్లిం దేశాల్లోని తమ దేశానికి చెందిన 20 దౌత్యకార్యాలయాలను అమెరికా వారం రోజులపాటు మూసివేసింది. యెమెన్‌లోని అల్‌ఖైదా శాఖ అత్యంత ప్రమాదకరమైనదని ఇటీవలే వాషింగ్టన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హిల్లరీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయొద్దు
అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయవద్దని దేశంలో ప్రముఖ న్యూస్ చానల్స్‌కు ద రిపబ్లికన్ పార్టీ మంగళవారం హెచ్చరించింది. యూఎస్‌లోని ప్రముఖ న్యూస్ చానల్స్ సీఎన్ఎన్, ఎన్బీసీలకు ఈ మేరకు ద రిపబ్లికన్ నేషనల్ కమిటీ చైర్మన్ రినిస్ ప్రిబస్ మంగళవారం లేఖ రాశారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె ఆ దేశాధ్యక్ష పదవికి డెమెక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. వ్యతిరేక కథనాల వల్ల హిల్లరీ తీవ్రంగా కలత చెందే అవకాశాలున్నాయన్నారు. అలాగే ఆమెపై రూపొందించి ప్రసారం చేసే కథనాలపై అమెరికన్లు ఆ న్యూస్ చానల్స్ ప్రశ్నించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దానితోపాటు ఆ న్యూస్ చానల్స్ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాగా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగే ప్రాధమిక చర్చల కథనాలను మాత్రం ప్రసారం చేయాలని ఆయా న్యూస్ చానల్స్‌కు సూచించారు. అయితే హిల్లరీపై చిన్న చిన్న కథనాలను రూపొందించి ప్రసారం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎన్బీసీ తెలిపింది. అలాగే ఆమెపై డాక్యుమెంటరీని నిర్మిస్తున్నట్లు సీఎన్ఎన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రినిస్ ప్రిబస్ ఆ న్యూస్ చానల్స్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. -
పాక్, ఆఫ్ఘన్ వరదల్లో 120మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన ఆకస్మిక వరదలతో మృతి చెందినవారి సంఖ్య 120కి చేరింది. అనేకమంది గల్లంతు అయ్యారు. భారీ వర్షాలకు సంభవించిన ఆకస్మిక వరదలకు ఆఫ్గనిస్తాన్‌లో 58 మంది చనిపోయారు. మరో 30 మంది వరకు గల్లంతయ్యారు. దేశ తూర్పు ప్రాంతంలోని దుర్గమప్రాంతాలైన నంగర్హార్, నూరిస్తాన్లలోని లోతట్టుప్రాంతాలు వరదలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. మట్టితో కట్టిన ఇళ్ళు పూర్తిగా కొట్టుకుపోగా, పక్కాఇళ్ళు కూలిపోయాయి. బాధితులను ఆదుకోడానికి హమీద్కర్జాయ్ ప్రభుత్వం రాజధాని కాబూల్ నుంచి ఆహారం మందులు, ఇతర అత్యవసర సామాగ్రిని పంపింది. తాలిబన్ తీవ్రవాద ముఠాలకు నిలయయమైన తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని కొండ ప్రాంత రాష్ట్రాల్లో అనూహ్య వరదలు సంభవించడం మామూలే. మరోవైపు పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీ భారీ వర్షాలకు జలదిగ్బంధనమైంది. ఆకస్మికంగా విరుచుకుపడిన వరదలకు మూడురోజుల్లో 53 మంది చనిపోయారు. వీధులన్నీ పెద్ద పెద్ద కాలువలుగా మారిపోవడంతో.. నిన్న కూడా కరాచీ వాసులు ఇళ్ళు వదిలి బైటకు రావడానికి నానా తంటాలూ పడ్డారు. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. మురుగునీటితో కలిసిన వర్షం నీరు నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది. లోపభూయిష్టంగా ఉన్న కరాచీ డ్రయినేజీ వ్యవస్థ వరద పరిస్థితిని మరింత గంభీరంగా మారుస్తోంది. మరోవైపు.. మూడురోజులుగా వర్షం పట్టిపీడిస్తుండడంతో నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయడం కూడా నగర ప్రజానీకానికి గగనమైపోతోంది. రంజాన్ పండుగ సమయంలో నెలకొన్న వరద పరిస్థితి జనాన్ని ఇక్కట్లకు గురిచేస్తోంది. కాగా పాక్, ఆఫ్ఘనిస్తాన్లు వరదలకు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇరు దేశాలకు వరద సహాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ఆదేశ ఉన్నతాధికారులు వెల్లడించారు. పాక్‌లో వర్షాలు, వరదలకు సుమారు 80మంది మరణించారని, వేలమంది గాయపడినట్లు తమకు నివేదికలు అందాయన్నారు. అయితే సాయం కావాలని పాక్ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదన్నారు. సాయం కోరితే ఆహారం, మందులుతో పాటు గృహాలు నిర్మాణానికి సాయం అందిస్తామని వారు పేర్కొన్నారు. -
మోసాల నివారణ శైశవ దశలోనే...
న్యూఢిల్లీ: భారత కంపెనీల్లో మోసాలను అరికట్టే యంత్రాంగం ఆశించిన మేరకు పనిచేయడం లేదని ఎర్నస్ట్ అండ్ యంగ్ తో కలిసి ఆసోచామ్ నిర్వహించిన సర్వేలో తేలింది. కంపెనీల్లో జరుగుతున్న అవకతవకలను వేరే మార్గాల ద్వారా ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. మరిన్ని వివరాలు..., కంపెనీకి ఆర్థికంగా నష్టాలు కలుగజేయడం, లేదా కంపెనీ పేరుప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేయడం వంటివి -ఇలాంటి మోసాలే కంపెనీల్లో అధికంగా జరుగుతున్నాయి. ‘‘విజిల్ బ్లోయింగ్’’(అక్రమాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం) విధానం భారత్‌లో ఇంకా శైశవదశలోనే ఉంది. ఈ విధానాన్ని భారత కంపెనీలు ఆశించిన స్థాయిలో ఉపయోగించుకోవడం లేదు. అమెరికా తదితర దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ విధానాన్ని కంపెనీల బిల్లులో నిర్దేశించారు. గత డిసెంబర్లో లోక్‌సభ ఆమోదం పొందిన ఈ కంపెనీల బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లోనే రాజ్యసభ ఆమోదం పొందే అవకాశాలున్నాయి. వ్యయాలను అధికం చేసి చూపడం, కొనుగోలు ఆర్డర్లలో గోల్మాల్ చేయడం, ఇతర అవకతవకలను టెక్నాలజీ సాయంతో సులభంగా గుర్తించవచ్చు. ఈ దిశగా భారత కంపెనీల ప్రయత్నాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. -
174మంది అమెరికన్లకు టీసీఎస్ ఉద్యోగాలు
ముంబై: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) కంపెనీ ఈ ఏడాది అమెరికాలో 174 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. తమ అంతర్జాతీయ క్లయింట్ల డిమాండ్లను తీర్చడానికి ఉద్దేశించిన స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్)ఉద్యోగాల్లో భాగంగా ఈ నియామకాలు జరిపామని టీసీఎస్ సోమవారం తెలిపింది. వీరందరికీ సిన్సినాటిలో ఉన్న తమ సెంటర్లో టీసీఎస్ ఇనీషియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద 6-12 వారాలు శిక్షణనిస్తామని పేర్కొంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరిలో వందమంది ఇదే సెంటర్లో ఉద్యోగాలు నిర్వహిస్తారని వివరించింది. మిగిలిన వారిని అమెరికావ్యాప్తంగా ఉన్న తమ సెంటర్లలో నియమిస్తామని పేర్కొంది. గత నాలుగేళ్లలో అమెరికాలో 500కు పైగా అత్యున్నత నైపుణ్యం గల కాలేజీ పట్టభద్రులకు ఉద్యోగాలిచ్చామని వివరించింది. అమెరికాలోని 71 విభిన్న యూనివర్శిటీల నుంచి వీరిని ఎంపిక చేశామని తెలిపింది. -
సహకార సంఘాల్లో స్పాట్ ఎక్స్ఛేంజ్
ఇటిక్యాల,(మహబూబ్‌నగర్ జిల్లా) న్యూస్‌లైన్: రైతులు తమ పంట ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా గిట్టుబాటు ధర లభించిన చోట విక్రయించుకునే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో(పీఏసీఎస్) స్పాట్ ఎక్స్ఛేంజ్ను ప్రారంభిస్తున్నట్లు నాబార్డ్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్ బక్షి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం పుటాన్‌దొడ్డి పీఏసీఎస్‌లో స్పాట్ ఎక్స్ఛేంజ్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లోనే అయినకాడికి అమ్ముకోవడం వల్ల సరైన రేటు రాక అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్(ఎన్సీడీఈఎక్స్)లో ధాన్యాన్ని విక్రయించుకునే విధంగా ఆన్లైన్ మార్కెటింగ్ లింకేజీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో స్పాట్ ఎక్స్చేంజ్ పథకాన్ని పుటాన్‌దొడ్డి పీఏసీఎస్ ద్వారా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను రిజిస్ట్రేషన్ చేసిన గిడ్డంగుల్లో నిల్వ ఉంచితే రసీదులు ఇస్తారని, వీటి ఆధారంగా దేశంలో ఏ బ్యాంక్‌లోనైనా రుణం కూడా పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ సీజీఎం రామ్‌చందర్‌నాయక్, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ కె.వీరారెడ్డి, జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
బీహెచ్ఈఎల్ డిజిన్వెస్ట్‌మెంట్ వాయిదా!
న్యూఢిల్లీ: విద్యుత్‌రంగ ఉపకరణాల దిగ్గజం బీహెచ్ఈఎల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు షేరు ధర పతనంకావడంతోపాటు, ఆర్డర్‌బుక్ బలహీనపడటం కారణంగా నిలిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం 2011లోనే 5% వాటాను డిజిన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. అయితే విద్యుత్ రంగం పలు సమస్యలను ఎదుర్కొంటూరావడంతో ఈ కాలంలో కంపెనీ షేరు ధర కూడా 60% పతనమైంది. తాజాగా ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో బీఎస్ఈలో షేరు దాదాపు 20% పతనమై రూ. 120 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి(ఏప్రిల్-జూన్) క్వార్టర్‌కు కంపెనీ నికర లాభం దాదాపు సగానికి పడిపోయి రూ. 465 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు కూడా 24% తగ్గి రూ. 6,353 కోట్లకు చేరాయి. ఇక ఆర్డర్‌బుక్ విలువ రూ. 1.15 లక్షల కోట్ల నుంచి రూ. 1.08 లక్షల కోట్లకు క్షీణించింది. ఈ నేపథ్యంలో కంపెనీలో డిజిన్వెస్ట్‌మెంట్‌ను భారీ పరిశ్రమల శాఖ వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో చౌక ధరల్లో కంపెనీ వాటాను విక్రయించడం సమర్థనీయంకాదని వాదిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 67.72% వాటా ఉంది. -
డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలి: ఎన్ఎస్ఈఎల్
ముంబై: చెల్లింపుల సంక్షోభం నేపథ్యంలో కమోడిటీ కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్ నిలిపివేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) లావాదేవీల పరిష్కారానికి(సెటిల్మెంట్స్) స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి రూ. 5,600 కోట్ల విలువైన లావాదేవీలను సెటిల్ చేయాల్సి ఉంది. ఇందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీను నియమించినట్లు ఎన్ఎస్ఈఎల్ తెలిపింది. కంపెనీ లాబోర్డ్ మాజీ చైర్మన్ శరద్ ఉపాసని అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్ఎస్ఈఎల్ ప్రమోటర్ జగ్నేష్ షా పేర్కొన్నారు. మిగిలిన సభ్యులలో ముంబై హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి ఆర్జే కొచర్, సెబీ, ఎల్ఐసీలకు గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన జీఎన్ బాజ్‌పాయ్, మహారాష్ర్ట మాజీ డీజీపీ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 14కల్లా చెల్లింపుల ప్రణాళికను వెల్లడించగలమని షా చెప్పారు. కాగా, చెల్లింపుల ప్రణాళికకు సహకరించని బ్రోకర్లు, సభ్యులపై తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ఎన్ఎస్ఈఎల్ ప్రభుత్వాన్ని కోరింది. కమోడిటీ మార్కెట్లను నియంత్రించే ఫార్వార్డ్ మార్కెట్ కమిషన్ ఎన్ఎస్ఈఎల్ సెటిల్మెంట్ అంశాన్ని పరిష్కరిస్తుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఫైనాన్షియల్ టెక్ షేరు హైజంప్ ఈ వార్తల నేపథ్యంలో ప్రమోటర్ కంపెనీ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు ధర బీఎస్ఈలో 31%(రూ. 47) ఎగసి రూ. 198 వద్ద ముగిసింది. అయితే గ్రూప్‌లోని మరో కంపెనీ ఎంసీఎక్స్ షేరు మాత్రం 10%(రూ. 41) పతనమై(లోయర్ సర్క్యూట్) రూ. 361 వద్ద నిలిచింది. -
సెన్సెక్స్ 18 పాయింట్లు ప్లస్
ఎట్టకేలకు 8 రోజుల నష్టాలకు అడ్డుకట్ట పడింది. సెన్సెక్స్ 18 పాయింట్లు కూడగట్టుకుని 19,182 వద్ద ముగిసింది. అయితే రోజు మొత్తం హెచ్చుతగ్గులకు లోనైంది. గరిష్టంగా 19,306, కనిష్టంగా 19,141 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. గత 8 రోజుల్లో 1,138 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా స్వల్పంగా 7 పాయింట్లు బలపడి 5,685 వద్ద నిలిచింది. కాగా, బీఎస్ఈలో క్యాపిటల్ గూడ్స్ అత్యధికంగా 3.6% పతనంకాగా, మెటల్ ఇండెక్స్ 2.7% పుంజుకుంది. ఎఫ్ఐఐలు కేవలం రూ. 33 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 303 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో కాంట్రాక్ట్‌ల సమస్య పరిష్కారానికి స్వతంత్ర కమిటీని వేయనున్న వార్తలతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 31% దూసుకెళ్లింది. రూ. 198 వద్ద ముగిసింది. కొత్త కాంట్రాక్ట్‌లను నిలిపివేసిన వార్తలతో గత రెండు రోజుల్లో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లలో లేని విధంగా జూలై నెలలో ప్రైవేట్ రంగ కార్యకలాపాలు మందగించినట్లు హెచ్ఎస్బీసీ ఇండియా సర్వే పేర్కొనడంతో కొంతమేర సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఏడాది కనిష్టానికి భెల్ శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో విద్యుత్‌రంగ దిగ్గజం భెల్ ఏకంగా 19% పతనమైంది. ఏడాది కనిష్టమైన రూ. 121 వద్ద ముగిసింది. నికర లాభం సగానికి పడిపోగా, ఆర్డర్‌బుక్ సైతం బలహీనపడటంతో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి కంపెనీ మార్కెట్ విలువలో రూ. 6,976 కోట్లు ఆవిరైంది. మార్కెట్ క్యాప్ రూ. 29,591 కోట్లకు పరిమితమైంది. ఇక మిగిలిన దిగ్గజాలలో భారతీ, టాటా మోటార్స్, ఎల్అండ్టీ 2% స్థాయిలో క్షీణించగా, జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.7% జంప్ చేసింది. ఈ బాటలో స్టెరిలైట్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, హీరో మోటో, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ 4-2% మధ్య లాభపడ్డాయి. -
బీఎండబ్ల్యూ కార్ల ధరలు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ అన్ని మోడళ్ల కార్ల ధరలనూ పెంచనుంది. మినీ మోడల్‌తో సహా అన్ని మోడళ్ల కార్ల ధరలనూ 5 శాతం వరకూ పెంచనున్నామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా సోమవారం తెలిపింది. ఈ పెరుగుదల ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని ధరలను పెంచాలని నిర్ణయించామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ సహర్ చెప్పారు. ధరల పెరుగుదలకు కారణాలను వెల్లడించలేదు. అయితే రూపాయి పతనం కారణంగా దిగుమతి వ్యయాలు పెరిగిపోతుండటంతో కంపెనీ ధరలను పెంచుతోందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఈ కంపెనీ భారత్‌లో బీఎండబ్ల్యూ 3, 5, 6, 7 సిరీస్, ఎస్యూవీ ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, స్పోర్ట్స్ కార్ ఎ సిరీస్ వంటి కార్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.28.6 లక్షల నుంచి రూ.1.73 కోట్ల రేంజ్లో ఉన్నాయి. కాగా రూపాయి పతనం కారణంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా కార్ల ధరలు పెంచే అవకాశాలున్నాయి. మరో లగ్జరీ కార్ల కంపెనీ ఆడి గత నెల 15 నుంచే ధరలను 4 శాతం పెంచింది. -
జలదిగ్బంధంలో గోదావరి లంక గ్రామాలు
న్యూస్‌లైన్ నెట్వర్క్ : గోదావరి నదిలో వరద తీవ్రత కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో, ముంపు బారిన పడిన గోదావరి లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో నీటిమట్టం 17.90 అడుగుల వద్ద ఉండగా, 19.53లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలను ఆనుకుని ఉన్న16 మండలాలపై వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. 59 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద వల్ల 1.45 లక్షల మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లంకవాసులు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పక్షం రోజుల్లో 12 రోజులకు పైబడి ఈ గ్రామాలు ముంపున ఉండడంతో ఇళ్లు, పంట నష్టం తీవ్రత ఇంకా పెరుగుతోంది. వరదలకు తోడు ఆదివారం రాత్రి నుంచి వర్షం కురవడంతో లంకవాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలో సోమవారం వరద నీటిలో ఓ నాటు పడవ మునిగిపోయింది. అయితే, పది మంది ఒకరినొకరు పట్టుకుని సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా గోష్పాద క్షేత్రంలో ఆరడుగుల వరద నీరు ప్రవహిస్తోంది. కడెమ్మ స్లూయిజ్ వద్ద వరద ఉధృతంగా ఉండడంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూడి రేవులోని పలు ఆలయాలతోపాటు వేగేశ్వరపురంలోని మేరిమాత ఆలయం ఇంకా వరద ముంపులోనే ఉంది. కొవ్వూరు మండలంలో వందలాది ఎకరాల లంక భూముల్లోని పంటలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ గోదావరి వరదలతో అతలాకుతలమైంది. భద్రాచలం వద్ద అత్యధికంగా 62 అడుగుల నీటిమట్టంతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి సోమవారం సాయంత్రం 7గంటలకు 53 అడుగులకు చేరుకుంది. అల్పపీడనం కారణంగా సోమవారం రోజంతా విస్తారంగా వర్షం కురవడంతో ఏజెన్సీలోని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మళ్లీ వరద స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి 19 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి 73 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వాజేడు మండలం చీకుపల్లి వాగుకు అవతల ఉన్న 32 గ్రామాలకు ఎటూ దారిలేకుండాపోయింది. భద్రాచలం నుంచి కూనవరం రహదారిలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు వరదలు ముంచెత్తడంతో పరివాహక ప్రాంతంలో సుమారు 35వేల ఎకరాలకు పైగా పంటకు నష్టం వాటిల్లింది. భద్రాచలం రామాలయం చుట్టూ ఉన్న ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. చింతూరు మండలంలో శబరి నదిలో పడి పొన్నాడ ప్రసాద్(30) సోమవారం మృతి చెందాడు. ముంపు గ్రామాల్లో ఎటువంటి పునరావాసం లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 573 గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూరాలలో 28 క్రస్టుగేట్ల ఎత్తివేత ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో సోమవారం మరింత పెరిగిందని పీజేపీ అధికారులు కృష్ణయ్య తెలిపారు. దీంతో మొత్తం 28గేట్ల ద్వారా 2.32 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 2.70లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మొత్తం 34 క్రస్టుగేట్ల ద్వారా 2.11లక్షల క్యూసెక్కులు, ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.20లక్షల ఇన్‌ఫ్లో ఉండగా, 26 క్రస్టుగేట్ల ద్వారా 2.70లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిండుకుండలా శ్రీరాంసాగర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి సోమవారం సాయంత్రం వరద నీరు పెరగడంతో రెండు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి 16 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులతో నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు. రోడ్డు పక్కనే అంతిమ సంస్కారం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం వృద్ధ గౌతమి శ్మశాన వాటిక ముంపునకు గురవడంతో అంతిమ సంస్కారాలు, పిండ ప్రదానం చేయడానికి నానా ఇబ్బందు లు పడాల్సి వస్తోంది. కే జగన్నాథపురానికి చెందిన సంసాని నాగేశ్వరరావు (55) అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. ఆయన మృతదే హాన్ని శ్మశాన వాటికకు తీసుకువచ్చినా అక్కడ వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రోడ్డు పక్కనే అంతిమ సంస్కారం జరిపారు. వరదలపై సీఎం కిరణ్ సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదలకు గురైన ప్రాంతాల స్థితిగతులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మొహంతి, విపత్తుల నిర్వహణ విభాగం అధికారులతో మాట్లాడారు. ఇప్పటివరకూ వరదల కారణంగా 47 మంది మృతి చెందారని, 21,384 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని సీఎంకు చెప్పారు. ఎనిమిది జిల్లాల్లో 73వేల హెక్టార్లలో పంట, 43వేల ఎకరాల్లో పత్తి, 3వేలకు పైగా ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు.ఇప్పటివరకూ వరద బాధిత ప్రాంతాల్లో 158 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని... ఖమ్మం, తూర్పుగోదావరి, అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో మరో 119 సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. -
ఐటీ హైరింగ్ 17 శాతం తగ్గొచ్చు: నాస్కామ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీరంగ హైరింగ్ 17 శాతం తగ్గుతుందని నాస్కామ్ అంచనా వేస్తోంది. ఆటోమేషన్ పెరగడం, ఆట్రిషన్ (ఉద్యోగుల వలస)తగ్గడం వంటి కారణాల వల్ల ఐటీ రంగంలో 1,50,000 -1,80,000 వరకూ కొత్త ఉద్యోగాలే వస్తాయని నాస్కామ్ ప్రెసిడెంట్ శోమ్ మిట్టల్ చెప్పారు. గత ఏడాది నికరంగా 1,80,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ప్రస్తుతం 10,800 కోట్ల డాలర్ల భారత ఐటీ-ఐటీఈఎస్ రంగంలో 30 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ రంగంలో కిందిస్థాయి ఉద్యోగాల్లో ఆటోమేషన్ పెరగడంతో డొమైన్ నిపుణుల అవసరం పెరిగిపోతోందని మిట్టల్ వివరించారు. పరిశ్రమ సగటు అట్రిషన్ రేటు 20 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఐటీ రంగంలో ఈ రేటు 14-15 శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. హైరింగ్ విధివిధానాలు మారడంతో క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా తగ్గుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఉద్యోగ నియామకాల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు 60 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతికపరిజ్ఞాన నైపుణ్యాలపైకాక సాఫ్ట్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో భారత అగ్రశ్రేణి నాలుగు ఐటీ కంపెనీలు 10,900 కొత్త ఉద్యోగాలిచ్చాయని, ఈ ఏడాది ఇదే కాలానికి ఇది 4,100కు తగ్గిందని మిట్టల్ పేర్కొన్నారు. -
కష్టాల్లో ‘స్టెయిన్లెస్ స్టీల్’..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమకు ‘గట్టి’ కష్టాలే వచ్చిపడ్డాయి. దేశీయంగా ఈ లోహానికి భారీ డిమాండ్ ఉన్నా ఇక్కడి కంపెనీలు వ్యాపార అవకాశాలను అందుకోలేకపోతున్నాయి. దీనికి కారణం ముడిసరుకు ధరలు అంతకంతకూ పెరుగుతుండడం, నిపుణులైన కార్మికుల కొరత, విద్యుత్ సరఫరాలో సమస్యలు. దీనికితోడు స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులకు సరైన ధర రాకపోవడం, చైనా చవక ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలడం సమస్యను జటిలం చేస్తోంది. గత 10 ఏళ్లలో భారత్‌లో 3,000 పైగా చిన్నతరహా తయారీ యూనిట్లు మూతపడ్డాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తడిసి మోపెడు.. పదేళ్ల క్రితం ముడి స్టెయిన్లెస్ స్టీల్ ధర కిలోకు రూ.60 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.125-150 పలుకుతోంది. ఇంతకు చేరినా స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తుల ధర ఆశించిన స్థాయిలో పెరగడం లేదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తుల ధర కిలోకు సగటున రూ.250 పలుకుతోంది. వడ్డీ, విద్యుత్, వేతనాలు, మార్కెటింగ్ ఖర్చులు, అద్దెలు పోను మిగిలేది అంతంత మాత్రమేనని కంపెనీలు వాపోతున్నాయి. రాష్ట్ర కంపెనీలకైతే కరెంటు కష్టాలు వీడడం లేదు. ఇక దేశవ్యాప్తంగా ఈ రంగంలో సుమారు 50 వేల కంపెనీలున్నాయి. ఇందులో రాష్ట్రం నుంచి 100 దాకా ఉంటాయి. ముడి స్టెయిన్లెస్ స్టీల్ సరఫరా చేసే సెయిల్, జిందాల్ స్టీల్, టాటా స్టీల్‌లకు నగదు పూర్తిగా చెల్లిస్తేనే సరుకు పంపిస్తాయి. స్టీల్ ఉత్పత్తుల విషయంలో దుకాణదారుకు అరువు ఇవ్వాల్సి రావడంతో తయారీ కంపెనీలను కుంగదీస్తోంది. దేశీ కంపెనీలు రూ.20 వేల కోట్ల దాకా రుణాలు తీసుకున్నాయని ఇండియన్ స్టెయిన్లెస్ స్టీల్ డెవలప్మెంట్ అసోసియేషన్(ఐఎస్‌ఎస్‌డీఏ) వెల్లడించింది. తయారీ అంతంతే..: హోటళ్లు, రెస్టారెంట్లు, గృహ విభాగంలో స్టెయిన్లెస్ స్టీలు ఉత్పత్తులకు గిరాకీ ఏమాత్రం తగ్గడం లేదు. శస్త్ర చికిత్స పరికరాలు(సర్జికల్స్) సైతం ఈ లోహంతో తయారవుతున్నవే. ఇంత డిమాండ్ ఉన్నా ప్లాంట్ల సామర్థ్యంలో 60-70%కి మించి ఉత్పత్తి జరగడం లేదని అగ్రోమెక్ ఇండస్ట్రీస్ పార్టనర్ దినేష్ సి జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మొత్తం డిమాండ్‌లో దేశీ కంపెనీలు 80 శాతమే సమకూరుస్తున్నాయన్నారు. ఒక్కో కంపెనీ రోజుకు సగటున టన్ను స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, మలేషియా, కొరియా తదితర దేశాల్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది. కొన్ని కంపెనీలే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాయి. చౌక ఉత్పత్తులు.. చెన్నై వ్యాపారులు చౌక ధరలో ఫ్లాస్క్, కుకర్ల వంటి ఉత్పత్తులను పూర్తిగా చైనా నుంచి తెప్పిస్తున్నాయి. పన్ను భారం తక్కువగా ఉండడంతో కొన్ని కంపెనీలు పూర్తిగా తయారు కాని (అన్-ఫినిష్డ్) ఉత్పత్తులను దిగుమతి చేసుకుని వాటికి తుది మెరుగులు దిద్ది విక్రయిస్తున్నాయి. మరోవైపు తుక్కు స్టెయిన్లెస్ స్టీలు దిగుమతిపై ప్రభుత్వం 2.5 శాతం సుంకం విధించడాన్ని పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. కస్టమర్లు ధరే కాదు నాణ్యతను కూడా పరిగణించాలని ఇక్కడి కంపెనీల ప్రతినిధులు అంటున్నారు. దేశంలో ఉత్పత్తుల వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 40%. ఇక తయారీలో యూపీలోని మురాదాబాద్, మహారాష్ట్రలోని వసై, భయందర్తోపాటు గుజరాత్, చెన్నైలు ప్రసిద్ధి. చైనా, తైవాన్, కొరియాల చౌక ఉత్పత్తులతో దేశీ పరిశ్రమ కుదేలవుతోందని ఐఎస్‌ఎస్‌డీఏ ప్రెసిడెంట్ ఎన్.సి.మాథుర్ ఇటీవల చెప్పారు. అగ్రోమెక్ విస్తరణ..: స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తుల తయారీ కంపెనీ అగ్రోమెక్ త్వరలో ఖతార్‌లో ఔట్‌లెట్‌ను ప్రారంభించనుంది. అలాగే గుజరాత్లో జాయింట్ వెంచర్ ద్వారా భారీ ప్లాంటును నెలకొల్పాలని యోచిస్తోంది. రాష్ట్రంలో మరో 3 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ పార్టనర్ దినేష్ సి జైన్ తెలిపారు. ఫ్రాంచైజీకి తాము సిద్ధమని వెల్లడించారు. కంపెనీ హైదరాబాద్‌లో రెండు ఔట్లెట్లను 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వహిస్తోంది. -
కొత్త బ్యాంక్ లెసైన్సులకు మరికొంత సమయం: ఆర్బీఐ
ముంబై: కొత్త బ్యాంకులకు లెసైన్సుల విషయంలో నిబంధనలను సరళీకరించే అవకాశం లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆనంద్ సిన్హా (బ్యాంకింగ్ పర్యవేక్షణా విభాగం ఇన్చార్జ్) సోమవారం స్పష్టం చేశారు. లెసైన్సుల కోసం వచ్చిన 26 దరఖాస్తులపై ఆర్బీఐ అంతర్గత పరిశీలన మొదలైందని కూడా వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తికి మరికొంత కాలం పడుతుందని తెలిపారు. అనంతరం ఈ దరఖాస్తుల పరిశీలనకు మరొక కమిటీ (ఎక్స్టర్నల్)ని నియమించడం జరుగుతుందని కూడా పేర్కొన్నారు. మొత్తంమీద కొత్త లెసైన్సుల జారీకి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. -
భారత్ లో బీమాకు అవీవా గుడ్‌బై?
న్యూఢిల్లీ: బ్రిటన్ ఆర్థిక సేవల దిగ్గజం అవీవా భారత బీమా మార్కెట్ నుంచి వైదొలగడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ డాబర్‌తో జాయింట్ వెంచర్ద్వారా పదేళ్లుగా అవీవా జీవిత బీమా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జేవీలో అవీవా ఇండియా వాటా 26 శాతం. వాటాల అమ్మకానికి కొనుగోలుదారుని వెతికే ప్రక్రియలో భాగంగా కార్పొరేట్ సలహాదారులను నియమించుకునే పనిలో అవీవా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నో కామెంట్: ఈ వార్తలపై వ్యాఖ్య కోసం ఈ మెయిల్ ద్వారా సంప్రదించినప్పుడు, అవీవా ఇండియా ప్రతినిధి సమాధానమిస్తూ, ‘‘మార్కెట్ ఊహాగానాలు లేదా వదంతులపై మా విధానం ప్రకారం వ్యాఖ్యానించలేం’’ అని పేర్కొన్నారు. 2002లో ప్రారంభమైన జాయింట్ వెంచర్ పెయిడప్ క్యాపిటల్ రూ.2,004 కోట్లు. ఇందులో అవీవా వాటా 26 శాతం. 2011-12తో పోల్చితే, 2012-13లో అవీవా జీవిత బీమా కంపెనీల మొత్తం ప్రీమియం వసూళ్లు 11% క్షీణించి రూ. 2,140.6 కోట్లకు దిగింది. ఈ ఏడాది మొదట్లో నెదర్లాండ్స్‌కు చెందిన ఐఎన్జీ... ఇంగ్ వైశ్యా లైఫ్ కంపెనీలో తన 26% వాటాను యక్సైడ్కు విక్రయించాలని నిర్ణయించింది. గతేడాది అమెరికాకు చెందిన న్యూయార్క్ లైఫ్ కూడా భారత్ జాయింట్ వెంచర్ కంపెనీలో తన 26% వాటాను జపాన్‌కు చెందిన మిత్సూయీ సుమిటోమో బీమా కంపెనీకి విక్రయించింది. ఈ రంగంలో నెలకొన్న తీవ్ర పోటీ పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు కంపెనీల బాటన అవీవా నడుస్తుందన్న వార్తలు వస్తుండడం గమనార్హం. -
4 నెలల్లో కోటికిపైగా ఐటీ ఈ-ఫైలింగ్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ద్వారానే ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చెల్లింపుదారులు అధికంగా మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. గడచిన సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో ఈ-ఫైలింగ్ చేసిన వారి సంఖ్యలో 48% వృద్ధి నమోదు కావడమే కాకుండా వీరి సంఖ్య కోటి దాటిందని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) ప్రకటించింది. జూలై 31 వరకు ఆన్లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 1.03 కోట్లుగా ఉంటే గతేడాది ఇదే కాలానికి 69,63,056 మంది దాఖలు చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. ఆన్లైన్ ద్వారా దాఖలు చేసే వారి సంఖ్య పెరగడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగిందని, నిమిషానికి 2,303 మంది రిటర్నులు దాఖలు చేసినట్లు సీబీడీటీ అధికారులు తెలిపారు. దీంతో చివరకు రిటర్నుల గడువు తేదీని మరో 5 రోజులు పొడిగించడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2012-13లో మొత్తంమీద ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 2.14 కోట్లుగా ఉంది. -
సేవా పన్ను ఎగవేతలపై కేంద్రం కొర డా
న్యూఢిల్లీ/కోల్‌కతా: సేవా పన్ను ఎగవేతదారులపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపిస్తోంది. కోల్‌కతాకు చెందిన ఒక కొరియర్ కంపెనీ యజమానిని దాదాపు రూ.70 లక్షల పన్ను ఎగవేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇటువంటి కేసుల్లో కఠిన చర్యలకు అధికారాలు ఇస్తూ చట్టాల్లో సవరణ తీసుకొచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి అరెస్ట్ ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం పలు రకాల సేవలపై 12.36 శాతం సేవా పన్ను అమలవుతోంది. కేసు పూర్వాపరాలివీ...: బ్లూబర్డ్ పేరుతో కోల్‌కతాలో కొరియర్ ఏజెన్సీని నిర్వహిస్తున్న సుదీప్ దాస్.. పలు కంపెనీల నుంచి రూ.67 లక్షల మేరకు పన్ను వసూలు చేశారు. అయితే, దీన్ని ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో గతవారంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ మేరకు కోల్‌కతాలోని సేవా పన్నుల కమిషనర్ కేకే జైస్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దాస్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. సేవా పన్ను ఎగవేతలకు అడ్డుకట్టవేయడం కోసం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లో నిబంధనల మార్పులకు ఆర్థిక మంత్రి పి. చిదంబరం చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఈ ఏడాది ఫైనాన్స్బిల్లులో ఈ మేరకు సెక్షన్ 91లో కొత్త నిబంధనను చేర్చి ఆమోదింపజేశారు. దీనిప్రకారం సెంట్రల్ ఎక్సైజ్ పన్నుల విభాగానికి చెందిన అధికారులకు(సూపరింటెండెంట్ స్థాయికి తక్కువ కాకూడదు) సేవా పన్ను ఎగవేతదారుడిని అరెస్ట్ చేసే అధికారం లభించింది. కస్టమ్స్, ఎక్సైజ్ పన్నుల ఎగవేతలకు ఇప్పటికే సీఆర్పీసీ ప్రకారం ఈ కఠిన చర్యలు అమలవుతున్నాయి. ఇప్పుడు సేవా పన్నులకూ ఇది వర్తిస్తుంది. రూ.50 లక్షలు అంతకుమించి సేవాపన్నును ఎగవేస్తే అది శిక్షార్హమైన నేరం కిందికి వస్తుంది. ఈ కేసుల్లో ఎగవేతదారుడికి ఏడేళ్లదాకా జైలు శిక్ష పడొచ్చు. -
మన షేర్లు ముంచేశాయ్
ఒకప్పుడు భారీ లాభాలందించిన రాష్ట్ర కంపెనీలిపుడు ఇన్వెస్టర్లను నిండా ముంచుతున్నాయి. గడిచిన రెండేళ్లలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు లాభపడినా... రాష్ట్ర కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు మాత్రం ఆవిరైపోయాయి. అతితక్కువ కంపెనీలు తప్ప రాష్ట్రానికి చెందిన దిగ్గజాలు కూడా మదుపరులను ముంచేశాయి. స్టాక్ మార్కెట్లో రాష్ట్ర కంపెనీలు గతంలో ఓ వెలుగు వెలిగాయి. ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ముందంజ వేస్తే... సాఫ్ట్వేర్ రంగంలో సత్యం కంప్యూటర్స్, విజువల్ సాఫ్ట్ వంటివి ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు సృష్టించాయి. ఇక ఇన్ఫ్రా రంగంలోనైతే జీఎంఆర్, జీవీకే, ఐవీఆర్సీఎల్, ల్యాంకో, ఎన్సీసీ వంటివి పోటీపడి కాంట్రాక్ట్‌లను దక్కించుకుంటూ దూసుకెళ్లాయి. సిమెంట్ రంగంలో కూడా రాశి, సాగర్ సిమెంట్స్, ప్రియా సిమెంట్స్ వంటివి మంచి పనితీరు కనబరిచాయి. దీంతో ఇన్వెస్టర్లు రాష్ర్ట కంపెనీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు. కానీ నాలుగేళ్లుగా ఈ పరిస్థితులు తారుమారయ్యాయి. గడిచిన రెండేళ్లలో అయితే పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన ఆర్థిక సంక్షోభం ఒక కారణమైతే... ఆ ప్రభావంతో పెరిగిపోయిన వడ్డీ రేట్లు, యాజమాన్య వైఫల్యాలు, షేర్ల తనఖాలు వంటివి కూడా తోడయ్యాయి. దీంతో షేర్లు కుప్పకూలుతున్నాయి. ఒకో కంపెనీది ఒకో సమస్య యాజమాన్య వైఫల్యాలతో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు చరిత్రలో కలిసిపోయాయి. సత్యం... టెక్ మహీంద్రాలో విలీనంకాగా, విజువల్ సాఫ్ట్... మెగా సాఫ్ట్‌లో కలసిపోయింది. దేశ ముఖచిత్రాన్ని మార్చగల ఇన్ఫ్రా కంపెనీలు జీఎంఆర్, జీవీకే, ల్యాంకో, ఐవీఆర్సీఎల్, ఎన్సీసీ భారీ రుణాలతో కుదేలయ్యాయి. ఇక యానిమేషన్ వండర్ డీక్యూ ఎంటర్టైన్మెంట్, రైళ్లు ఢీకొనకుండా చూసే పరికరాలను అభివృద్ధి చేసిన కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, ఎల్ఈడీ ఉత్పత్తులు మిక్ ఎల క్ట్రానిక్స్, ఖనిజాల జాడకనిపెట్టే సీస్మిక్ సర్వేల్ని విశ్లేషించే అల్ఫాజియో వంటి ప్రత్యేక తరహా కంపెనీలు కూడా సమస్యల్లో పడ్డాయి. రుణ భారంలో ఇరుక్కుపోయిన ఇన్ఫ్రా కంపెనీలు... పోటీపడి దక్కించుకున్న కాంట్రాక్ట్‌లను సైతం వదులుకునే స్థితికి చేరాయి. బ్యాంకింగ్ రంగంలో పెరిగిన మొండిబకాయిల వల్ల ఆంధ్రాబ్యాంక్, ఆతిథ్య రంగ మందగమనం వల్ల తాజ్ జీవీకే హోటల్స్ వంటి సంస్థలు కూడా వెనకబడ్డాయి. ఈ ప్రభావమంతా షేర్లను తాకటంతో ఇన్వెస్టర్ల నెత్తిన పిడుగులు పడుతున్నాయి. నిలదొక్కుకున్న కంపెనీలూ ఉన్నాయ్... ఆటుపోట్లను తట్టుకుంటూ కచ్చితమైన భవిష్యత్ వ్యూహాలతో విస్తరిస్తున్న రాష్ట్ర కంపెనీలు కూడా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్నే తీసుకుంటే... పరిశోధన రంగంలోనూ భారీ పెట్టుబడులు పెడుతూ ముందుకెళుతోంది. దీంతో షేరు ధర కూడా గత రెండేళ్లలో దాదాపు 38% లాభాలను అందించటమే కాక సెన్సెక్స్‌లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తూ బిజినెస్‌ను పెంచుకుంటున్న అపోలో హాస్పిటల్స్ షేరు ఈ రెండేళ్లలో 79 శాతం దూసుకెళ్లింది. అంకాలజీ (కేన్సర్ చికిత్స) ఔషధాలలో తన ప్రత్యేకతను చాటుకోవడంతో పాటు చౌక ధరల్లో జనరిక్స్‌ను అందిస్తూ నాట్కో ఫార్మా కూడా నిలదొక్కుకుంది. దీంతో ఈ షేరు ధర రెట్టింపై ఇన్వెస్టర్ల పంట పండించింది. టెలికం రంగానికి అవసరమయ్యే యూపీఎస్ బ్యాటరీలతో మొదలుపెట్టిన అమరరాజా బ్యాటరీస్, తీవ్రమైన పోటీలో కూడా అమరాన్ బ్రాండ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళుతోంది. నిజానికి పతనమైన రాష్ట్ర కంపెనీలతో పోలిస్తే ఇన్వెస్టర్లకు లాభాలిచ్చినవి అతితక్కువే కావచ్చు. కానీ ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలు ఏ పరిస్థితిలోనైనా దూసుకెళతాయని మాత్రం ఇవి చెబుతున్నాయి. - సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆహార ఆర్డినెన్స్‌కే తొలి ప్రాధాన్యం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆహార భద్రత ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో ఆమోదింపజేయించడానికే యూపీఏ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్ తెలిపింది. ‘ఆహార భద్రత బిల్లుకు మేం పెద్ద పీట వేస్తాం. అన్ని పార్టీలూ దీనికి సహకరించాలని కోరుతున్నాం. గతంలో జరిగిన సమావేశాల కంటే ఈ సమావేశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నాం’ అని పార్టీ ప్రతినిధి మీమ్ అఫ్జల్ సోమవారమిక్కడ విలేకరులతో అన్నారు. కాగా సోమవారం లోక్‌సభలో ఓ పక్క ఆంధ్రప్రదేశ్ విభజనపై గందరగోళం నెలకొన్న సమయంలోనే ఆహార మంత్రి కె.వి.థామస్.. ఆహార భద్రత ఆర్డినెన్స్‌ను ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ ఓ ప్రతాన్ని సభకు అందించారు. బడ్జెట్ సమావేశాల్లో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడం వల్లే దీన్ని తీసుకొచ్చామన్నారు. ప్రజల మేలు కోసం ఉద్దేశించిన బిల్లు ఆలస్యం కాకూడదని ప్రభుత్వం భావించిందని, సభ సమావేశాలు లేని సమయంలో ఆర్డినెన్స్ తెచ్చిందని చెప్పారు. కాగా, ఈ ఆర్డినెన్స్‌ను బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశముందని అధికారవర్గాలు చెప్పాయి. లోక్‌సభ ఆమోదించాక ఈ వారాంతంలోనే రాజ్యసభలో ప్రవేశపెడతారని సమాచారం. రైతు ప్రయోజనాలను కాపాడితేనే మద్దతు: ములాయం రైతుల ప్రయోజనాలు కాపాడతామని కేంద్రం భరోసా ఇస్తే ఆహార భద్రత బిల్లుకు మద్దత్విడానికి తాము సిద్ధమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ అన్నారు. యూపీ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ సస్పెన్షన్ వ్యవహారంపై సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రధానికి సోనియా గాంధీ లేఖ రాసిన నేపథ్యంలో ములాయం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ఆహార బిల్లు రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని, అవసరమని భావిస్తే పార్లమెంటులో దీనికి వ్యతిరేకంగా ఓటేస్తామని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్ అగర్వాల్ చెప్పారు. బిల్లు పేరుతో ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు అమ్మేస్తారన్నారు. -
‘బాబ్రీ’ కూల్చివేత నాటి రాష్ట్రపతికి తెలుసు
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదును కూల్చివేత పథకం అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మకు తెలుసునని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సోమవారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. అయోధ్యలో 1992 డిసెంబర్ 6న బీజేపీ నేతృత్వంలో కరసేవకులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చివేయాలని బీజేపీ, దాని మద్దతుదారులు నిర్ణయం తీసుకోవడంతో 1992 డిసెంబర్ 4న తమ పార్టీ నాయకులతో కలసి తాను అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మను కలుసుకున్నానని, మసీదు కూల్చివేతను నివారించేందుకు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఈ మేరకు ఆయనకు లేఖ ఇచ్చామని, లేఖ అందుకున్న ఆయన దానిని చదివి, కాసేపు ఇటూ అటూ చూసి, మీరు ఎవరికీ చెప్పవద్దు... మసీదు కచ్చితంగా కూలిపోతుందని చెప్పారని తెలిపారు. ఈ అంశంపై అప్పటి ప్రభుత్వంతో మాట్లాడేందుకు తాను ఎంతగా ప్రయత్నించినా, ఎవరూ తన మాట వినిపించుకోలేదని, చివరకు డిసెంబర్ 6న మసీదు కూల్చివేత జరిగిందని అన్నారు. దీనిపై ఒక పుస్తకాన్ని రాయాలని సంకల్పించి, కొన్ని పేజీలు రాశానని, అయితే, పలువురు నాయకుల చరిత్ర బట్టబయలవుతుందని సన్నిహితులు చెప్పడంతో దాన్ని విరమించుకున్నానని చెప్పారు. -
గల్ఫ్‌లో 19 అమెరికన్ దౌత్య కార్యాలయాల మూసివేత
వాషింగ్టన్: గల్ఫ్ దేశాల్లోని 19 దౌత్య కార్యాలయాలను అమెరికా సోమవారం మూసివేసింది. అల్‌కాయిదా హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమాసియా, ఉత్తరాఫ్రికాల్లోని ఎంబసీలను ఈనెల 10 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లో అల్ కాయిదా అమెరికా దౌత్య కార్యాలయాలపై దాడులకు సిద్ధపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం లభించడంతో అమెరికా ముందు జాగ్రత్తలు చేపట్టింది. ఇందులో భాగంగానే గల్ఫ్‌లోని 22 ఎంబసీలను ఆదివారం మూసివేశారు. ఈ నెలలో అల్‌కాయిదా దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం ఉండటంతో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అమెరికా తన పౌరులను హెచ్చరించింది. రంజాన్ ముగింపులో జరిగే ఈద్ పర్వదినం సందర్భంగా గల్ఫ్ దేశాల్లోని స్థానిక పద్ధతుల ప్రకారం వారం రోజుల పాటు తమ రాయబార, దౌత్య కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి జెన్ సాకీ చెప్పారు. అయితే, అల్‌కాయిదా సంభాషణలను తాము సేకరించామని అమెరికన్ జనరల్ ఒకరు చెప్పారు. అమెరికన్లతో పాటు పాశ్చాత్య దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించాలని పథకం వేసుకుందని అమెరికా ఉమ్మడి బలగాల చైర్మన్ జనరల్ మార్టిన్ డింప్సీ చెప్పారు. -
డార్జిలింగ్‌లో ఆగని ‘ప్రత్యేక’ మంటలు
డార్జిలింగ్/న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ నిర్ణయం ప్రకటించిన దరిమిలా దేశంలో పలుచోట్ల ‘ప్రత్యేక’ మంటలు వ్యాపించాయి. గూర్ఖాలాండ్ డిమాండ్‌తో డార్జిలింగ్‌లో సోమవారం మూడోరోజూ బంద్ కొనసాగింది. అస్సాంలో ‘ప్రత్యేక’ వాదాన్ని వినిపిస్తున్న పలు సంఘాలు సోమవారం నుంచి 1,500 గంటల బంద్ ప్రారంభించాయి. మిగిలిన రాష్ట్రాల్లోనూ ‘ప్రత్యేక’ డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. కలింపాంగ్‌లో గూర్ఖాలాండ్ డిమాండ్‌తో ఆత్మాహుతి చేసుకున్న గూర్ఖా జనముక్తి మోర్చా మద్దతుదారు మంగళ్‌సింగ్ అంతిమయాత్రలో జీజేఎం కార్యకర్తలు మౌనప్రదర్శనగా పాల్గొన్నారు. అట్టుడుకుతున్న అస్సాం: ‘ప్రత్యేక’ డిమాండ్లతో అస్సాం అట్టుడుకుతోంది. కర్బీ-అంగ్లాంగ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనల్లో చెదురు మదురు ఘటనలు జరిగాయి. ‘బోడోలాండ్’ డిమాండ్ కూడా ఊపందుకుంది. ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ 48 గంటల బంద్‌కు పిలుపునివ్వగా, యునెటైడ్ డెమోక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ సోమవారం 1,500 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. కర్ణాటకలోనూ డిమాండ్లు: కర్ణాటకలోనూ ‘ప్రత్యేక’ డిమాండ్లు మొదలయ్యాయి. 1956 వరకు సి-కేటగిరీ రాష్ట్రంగా ఉన్న కొడుగుకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఇవ్వాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని 22 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కొడవ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్యూ నాచప్ప కొడవ హెచ్చరించారు. కాగా, కర్ణాటకలో అత్యంత వెనుకబడిన ‘హైదరాబాద్-కర్ణాటక’ ప్రాంతాన్ని రాష్ట్రంగా ప్రకటించాలని హైదరాబాద్-కర్ణాటక జనపర సంఘర్షణ సమితి డిమాండ్ చేస్తోంది. -
రాజకీయ లబ్ధి కోసమే ‘తెలంగాణ’: బుద్ధదేవ్ భట్టాచార్య
కోల్‌కతా: స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సానుకూలత ప్రకటించిందని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య సోమవారం ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తాము తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నామని అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ‘తెలంగాణపై కాంగ్రెస్ ఇవాళ పార్లమెంటులో సైతం తీవ్ర వ్యతిరేకత చవి చూసింది. దీనంతటికీ అంత అవసరమేమొచ్చిందన్నదే మా ప్రశ్న’ అని అన్నారు. తెలంగాణ కారణంగా డార్జిలింగ్ పర్వత ప్రాంతంలోనూ గూర్ఖాలాండ్ ఉద్యమం మళ్లీ భగ్గుమంటోందని, తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదేనని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చాక భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సూత్రాన్నే పాటించామని, కాంగ్రెస్ అందుకు భిన్నంగా కొత్తగా రాష్ట్రాలను విభజిస్తోందని విమర్శించారు. పార్లమెంటులో ‘తెలంగాణ’ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే తీవ్ర వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా విభజన ఉద్యమాలు జోరందుకుంటాయన్నారు. డార్జిలింగ్ ప్రస్తుత పరిస్థితికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారు బాధ్యత వహించాలన్నారు. కాగా, అవినీతిపరులకు, పెత్తందార్లకు తమ పార్టీలో ఎలాంటి చోటు లేదని బుద్ధదేవ్ అన్నారు. -
చైనా చొరబాట్లపై నిర్లక్ష్యమెందుకు?
న్యూఢిల్లీ: మన భూభాగంలోకి చైనా చొరబడుతున్నా.. కేంద్రం ఆ సమస్యను తగ్గించి చూపేందుకు యత్నిస్తోందని లోక్‌సభలో ఎంపీలు మండిపడ్డారు. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా 29 మంది ఎంపీలు సంధించిన ప్రశ్నలకు.. రక్షణమంత్రి ఆంటోనీ సోమవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. 2010 నుంచి వివిధ దేశాలు భారత గగనతలాన్ని 28 సార్లు ఉల్లంఘించాయని వెల్లడిం చారు. కానీ భారత భూభాగంలోకి చైనా చొరబాట్ల అంశంపై సరైన వివరణ ఇవ్వలేదు. చైనా, భారత్ మధ్య వాస్తవాధీన రేఖపై ఇరుదేశాల మధ్య పలు విభేదాలున్నాయని.. అందువల్ల పలుమార్లు సరిహద్దుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయన్నారు. దీనిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వికలాంగుల రిజర్వేషన్ పెంపు: వికలాంగులకు ప్రస్తుతం ఉన్న 3 శాతం రిజర్వేషన్ 5 శాతానికి పెరగనుంది. ఈ మేరకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్రం ఓకే చెప్పింది. పర్సన్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్-1995 చట్టం ప్రకారం ఇప్పుడు 3 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉందని, అయితే వారికి మరింత తోడ్పాటును అందించే ఉద్దేశంతో రిజర్వేషన్‌ను 5 శాతానికి పెంచుతున్నట్లు సాధికార త, సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి బలరాం నాయక్ రాజ్యసభలో చెప్పారు. తగ్గిపోతున్న ప్రభుత్వ ఉద్యోగాలు: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. 2008లో ప్రభుత్వ ఉద్యోగాలు 1,76,74,000గా ఉండగా... 2011 నాటికి 1,75,48,000కు తగ్గిపోయాయని, ప్రైవే టు ఉద్యోగాలు మాత్రం 98,75,000 నుంచి 1,14,52,000కు పెరిగాయని కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి సురేష్ లోక్‌సభలో చెప్పారు. -
ఐఏఎస్లందర్నీ తీసుకుపోండి!
న్యూఢిల్లీ/లక్నో: యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాయడం, సస్పెన్షన్‌పై కేంద్రం నివేదిక కోరడం, సస్పెన్షన్‌ను ఎత్తేయాలని డిమాండ్లు రావడంతో ఉత్తరప్రదేశ్ పాలకపక్షం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వింది. తమ రాష్ట్రం నుంచి ఐఏఎస్ అధికారులందర్నీ ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాన్ని సొంతంగా పాలించుకుంటామని చె ప్పింది. నాగ్‌పాల్ సస్పెన్షన్ సరైందనేనని, దాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ‘మాకు ఐఏఎస్‌ల అవసరం లేదు. కేంద్రం యూపీ నుంచి వారిని ఉపసంహరించుకోవాలి. యూపీ తన సొంత అధికారులతో పాలన సాగిస్తుంది’ అని ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ సోమవారం ఢిల్లీలో అన్నారు. సస్పెన్షన్ సరైందేనని, అది తుది నిర్ణయమని పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. మత ఘర్షణలను నివారించేందుకే నాగ్పాల్పై చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా తమ ప్రభుత్వ చర్యను మరోసారి సమర్థించుకున్నారు. ‘తప్పు చేసిన ఎంతోమంది సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్లపై గతంలో చర్యలు తీసుకున్నారు. నాగ్‌పాల్ ఉదంతంపై మీడియా గగ్గోలుపెడుతోంది’ అని ఆరోపించారు. ఆయన సోమవారం లక్నోలో ఓ పాఠశాలలో మాట్లాడుతూ, ‘ఇక్కడున్న పిల్లలు తప్పులు చేసినందుకు టీచర్లతో, తల్లిదండ్రులతో దెబ్బలు తిని ఉంటారు. ప్రభుత్వం కూడా ఏ అధికారైనా తప్పు చేస్తే శిక్షిస్తుంది’ అని అన్నారు. నాగ్పాల్కు అప్పీలు చేసుకునే హక్కు ఉంది: కేంద్రం ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందిస్తూ ‘ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి యూపీ అధికారులను సంప్రదిస్తున్నాం. నిర్దేశిత నిబంధనలు ఉన్నాయి. వాటిని పాటించాలి’ అని అన్నారు. నాగ్పాల్కు అప్పీలు చేసుకునే హక్కు ఉందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామి చెప్పారు. ‘ఆమె మమ్మల్ని సంప్రదించలేదు. మేం సొంతంగా ముందుకెళ్లం. ఆమె మాకు అప్పీలు అందజేస్తే, దాని కాపీని యూపీ ప్రభుత్వానికి పంపి, స్పందన కోరతాం. తదుపరి చర్య తీసుకుంటాం’ అని చెప్పారు. కాగా, కడల్పూర్ గ్రామంలోని మసీదు గోడ కూల్చివేత జేవార్ ప్రాంత ఎస్డీఎం సమక్షంలో జరిగిందని ఆ సమయంలో నాగ్‌పాల్ అక్కడ లేరని యూపీ ప్రభుత్వం తన నివేదికలో తెలిపింది. ఈ నివేదికను కేంద్ర సిబ్బంది శాఖ పరిశీలిస్తోందని అధికారులు చెప్పారు. యూపీలోని గౌతమబుద్ధ నగర్లో ఇసుక మాఫియాపై కొరడా ఝళిపించిన నాగ్‌పాల్ చట్ట ప్రక్రియ పాటించకుండా నిర్మాణంలో ఉన్న మసీదు గోడ కూల్చివేతకు ఆదేశాలిచ్చారని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేయడం తెలిసిందే. -
అంతా ఒకే మాటపై ఉండాలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే విషయంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఒకేమాటపై నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గొల్ల బాబూరావు సూచించారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ తరహా రాష్ట్ర విభజనను తాము వ్యతిరేకిస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు విభజన అంశంపై ఒక్కొక్కరూ ఒక్కొక్క వైఖరితో మాట్లాడటం సమంజసంగా లేదన్నారు. ‘‘తమ గుండెలను చీల్చేసినట్లు రాష్ట్రాన్ని విభజించారనే బాధతో ఉద్యోగులు, విద్యార్థులు, యువజనులు, రైతులు, కార్మికులంతా రోడ్లెక్కి ఉద్యమిస్తున్నారు. కొందరు గుండె ఆగి మృతి చెందారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే వాంఛ ప్రజల్లో ఇంత బలీయంగా ఉంటే దానిని కాంగ్రెస్ నేతలు గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి.. ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం పెట్టి సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పకుండా, తీర్మానం చేశాం, సంతకాలు చేశామంటున్నారు’’ అని విమర్శించారు. ‘‘రాష్టాన్ని మూడుగా విభజించి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయాలని ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్అంటున్నారు. హైదరాబాద్‌లో తనకు ఆస్తులున్నాయి కనుక చిరంజీవి దాని గురించే మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు దేనికోసం పోరాడుతున్నారు? వారి మనోభావాలేమిటి? ఎందుకు ఇంతమంది మరణిస్తున్నారు? సీమాంధ్ర ప్రాంతం ఎందుకు అట్టుడుకుతోంది? అని తెలుసుకునే ఇంగిత జ్ఞానం కూడా ఈ నేతలకు లేకపోవడం దురదృష్టకరం’’ అని మండిపడ్డారు. ప్రజలు కోరుతున్న అంశాన్ని డిమాండ్ చేయకుండా నాయకులు తాము సొంతంగా చేసే ఆలోచనలను ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానం వద్ద గట్టిగా వాదించిన కేంద్ర మంత్రి కావూరి ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం బాధాకరమని అన్నారు. ఉద్యోగులకు రక్షణగా ఉంటాం విభజన పేరుతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏ ఉద్యోగికైనా ఇబ్బందులు కలగజేసినా, అవమానించినా తాము అక్కడకు వెళ్లి వారికి రక్షణగా నిలబతామని శ్రీకాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రం రావణకాష్టం కావడానికి సోనియాగాంధీ, చంద్రబాబులే కారణమని ఆరోపించారు. హైదరాబాద్, సాగునీటి జల విధానం, మౌలిక సదుపాయాలు వంటివాటిపై ఏమీ మాట్లాడకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న 30, 40 లక్షల మంది సీమాంధ్రులకు ఇక్కడ జీవించే హక్కు లేదా? అని నిలదీశారు. ఒక తండ్రిలాగా అన్ని ప్రాంతాలకు సమాన న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోలేదు కనుకనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. విభజన నిర్ణయం రాజకీయ లబ్ధి కోసమే తీసుకున్నారని కొరుముట్ల శ్రీనివాసులు విమర్శించారు. -
26 వివాదాస్పద జీవోలపై స్పెషల్ లీవ్ పిటిషన్ తిరస్కరణ
సాక్షి లీగల్ ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐ కేసులో వివాదాస్పదమైన 26 ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధించి వాటిని జారీ చేసిన ఆరుగురు మంత్రులపై దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. న్యాయవాది పి.సుధాకరరెడ్డి దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎం.వై.ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ విషయంలో సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. సీబీఐ దర్యాప్తు తీరుపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే విచారణ కోర్టును ఆశ్రయించాల్సిందిగా సుప్రీంకోర్టు పిటిషనర్‌కు సూచించింది. వివాదాస్పద జీవోలకు సంబంధించి సుప్రీంకోర్టు గత ఏడాది మార్చిలో ఆరుగురు మంత్రులకు - జె.గీతారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, మోపిదేవి వెంకటరమణలకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయా జీవోలు జారీ అయినపుడు వీరంతా దివంగత వైఎస్ మంత్రివర్గంలో కీలక శాఖలకు మంత్రులుగా ఉన్నారు. ‘సుప్రీం’ నోటీసులకు వారు సమాధానం ఇస్తూ.. ఆ 26 వివాదాస్పద జీవోల జారీకి మొత్తం మంత్రివర్గానిదే ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. తాము ఎలాంటి విధివిధానాలనూ ఉల్లంఘించలేదని చెప్పారు. ఆయా ఉత్తర్వులను జారీ చేసేముందుగా మంత్రివర్గంలో చర్చించామని.. కాబట్టి ఆ ఉత్తర్వుల జారీకి ఏ ఒక్క మంత్రినీ వ్యక్తిగతంగా తప్పుపట్టజాలరని వాదించారు. ఈ ఆరుగురు మంత్రులతో పాటు.. రెవెన్యూ, పురపాలక, పెట్టుబడులు - మౌలికవసతులు, పరిశ్రమలు - వాణిజ్యం, సాగునీటి శాఖల కార్యదర్శులుగా పనిచేసిన 8 మంది ఐఏఎస్ అధికారులు ఎస్.వి.ప్రసాద్ (ప్రస్తుతం పదవీ విరమణ చేశారు), సి.వి.ఎస్.కె.శర్మ, ఎం.శామ్యూల్, వై.శ్రీలక్ష్మి, ఆదిత్యనాథ్‌దాస్, కె.రత్నప్రభ, బి.శ్యాంబాబ్, మన్మోహన్‌సింగ్‌లకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించి.. పలువురు ఇతరులపై అనేక కేసులు నమోదు చేసిన సీబీఐ.. తన ఎఫ్ఐఆర్లో ఈ 14 మంది మంత్రులు, అధికారుల్లో ఎవరి పేరూ చేర్చలేదని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం - వివిధ సంస్థల మధ్య కుదిరిన 26 ఒప్పందాలకు బాధ్యులు వీరేనన్నారు. వీరిపై దర్యాప్తు జరపాల్సిందిగా సీబీఐని ఆదేశించాలంటూ పిటిషనర్ సుధాకర్‌రెడ్డి తొలుత సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దానిని ఆ కోర్టు తిరస్కరించటంతో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా పిటిషన్ కొట్టివేయటంతో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించి.. సీబీఐ దర్యాప్తు తీరుపై ఫిర్యాదులు ఉన్నట్లయితే విచారణ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. -
విభజన వివాదం రోజుకో కొత్త మలుపు
ఢిల్లీ: రాష్ట్ర విభజన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన వెంటనే సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. రాయల్-తెలంగాణ అంశం వెనక్కు వెళ్లిపోయింది. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం - మరో పక్క హైదరాబాద్ అంశంపై చర్చ - ఇంకోవైపు సీమాంధ్ర కావాలన్న వాదం ... ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లా నేతలు తమ జిల్లాను తెలంగాణలో కలపమని కోరుతున్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, ఎంపి ఎస్పివై రెడ్డి, రాభూపాల్ రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి, మురళీ కృష్ణ, లబ్బి వెంకటస్వామి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారు పార్టీ రాష్ట్ర వ్యవహరాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపాలని వారు కోరారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా వారు కోరారు. తమ జిల్లాను తెలంగాణలో కలపమని ఆమెను కూడా వారు కోరనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తమ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి రేపు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఇది ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం అని సమైక్యాంధ్రవాదులు విమర్శిస్తున్నారు. ఒక పక్క సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చిన సమయంలో ఒక్క కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపమని కోరడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తీరును వారు తప్పుపడుతున్నారు. -
తెలంగాణపై కాంగ్రెస్ డ్రామాలు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: పార్టీలో మాట్లాడుకోకుండా తెలంగాణపై కాంగ్రెస్ డ్రామాలాడుతోందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఒకే రోజు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. కాంగ్రెసే తెలంగాణ ఇచ్చిందని సంబరాలు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణ రావడానికి టీడీపీ, బీజేపీలే కారణమని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజలకు కావాల్సింది కాంగ్రెస్ కమిటీ కాదని, ప్రభుత్వం తరఫున కమిటీ వేసి సమాధానం చెప్పాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. వారి అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. రాష్ట్రాన్ని విభజించే విషయంలో కాంగ్రెస్ వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. విభజన తీరును కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో సీమాంధ్రులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు సీమాంధ్ర ఉద్యోగులకు సంబంధించి టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలు దుమారంలేపాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ వైఖరిని వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. -
డీజీపీకి కరుణానిధి సంఘీబావం
తమ రాష్ట్ర డీజీపీ కె రామానుజానికి జరిగిన అవమానంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందించారు. డీజీపీకి సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన సందర్భంగా డీజీపీ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఎస్పీజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'ప్రధానమంత్రి భద్రత ముఖ్యమే. అయితే డీజీపీని అవమానించడం మంచి పద్దతి కాదు' అని డీఎంకే పత్రిక 'మురసోలి'లో కరుణానిధి పేర్కొన్నారు. ఇది తమ రాష్ట్రానికి, పోలీసు విభాగానికి జరిగిన అవమానమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. పుదుకోట్టై జిల్లా తిరుమయంలో భెల్ అనుబంధ పైపుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవ నిమిత్తం తమిళనాడుకు వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసేందుకు వెళ్లిన రామానుజాన్ని ఎస్పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. పాస్ లేదనే కారణంతో ఆయనను అడ్డగించారు. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనకు ఆయన దూరంగా ఉండిపోయారు. డీజీపీకి అవమానం ఎదురు కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రధాని రాసిన లేఖలో జయలలిత కోరారు. ఈ ఘటనపై విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. -
పచ్ఛి అబద్దాలు మాట్లాడుతున్న దిగ్విజయ్: అంబటి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో ఒక్క తీర్మానం కూడా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం ఇంత నీచ రాజకీయాలు చేయడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తన వైఖరిపై సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అసలు రూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు. కాంగ్రెస్ పది తలల రాక్షసి అని విమర్శించారు. ప్రజలందరినీ సర్వనాశనం చేసే వైఖరి కాంగ్రెస్ పార్టీదని ఆయన దుయ్యబట్టారు. విభజనపై వైఎస్ఆర్ సిపి అభిప్రాయం అనేక సార్లు స్పష్టం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ వైఖరిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం అవడం పట్ల అంబటి సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సిపి తరఫున షర్మిలకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. -
పచ్చి అబద్దాలు మాట్లాడుతున్న దిగ్విజయ్: అంబటి
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి శాసనసభలో ఒక్క తీర్మానం కూడా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓట్లు, సీట్లు కోసం ఇంత నీచ రాజకీయాలు చేయడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తన వైఖరిపై సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అసలు రూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు. కాంగ్రెస్ పది తలల రాక్షసి అని విమర్శించారు. ప్రజలందరినీ సర్వనాశనం చేసే వైఖరి కాంగ్రెస్ పార్టీదని ఆయన దుయ్యబట్టారు. విభజనపై వైఎస్ఆర్ సిపి అభిప్రాయం అనేక సార్లు స్పష్టం చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ వైఖరిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం అవడం పట్ల అంబటి సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సిపి తరఫున షర్మిలకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. -
18 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న పతనానికి అడ్డుకట్ట పడింది. మార్కెట్ సూచిలు సోమవారం స్వల్ప లాభాలు నమోదు చేసింది. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 18 పాయింట్లు లాభపడి 19182 వద్ద స్థిరపడింది. గత 8 సెషన్స్‌లో సెన్సెక్స్ 1139 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 7 పాయింట్లు లాభపడి 5685 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ వాతావరణ నెలకొనడంతో మార్కెట్ స్వల్ప లాభాలకే పరిమితమయింది. బీఎస్ఈ సూచిలో 18 షేర్లు లాభాలు ఆర్జించగా, 12 షేర్లు నష్టాలు చవిచూశాయి. ఐటీసీ, కోల్ ఇండియా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హీరో మోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ లీవర్ వాటాలు లాభాలు ఆర్జించాయి. -
కేరళలో భారీ వర్షాలు: 16 మంది మృతి
కేరళలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఇడుక్కి జిల్లాలో 14 మంది వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఎర్నాకుళం జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఇడుక్కి జిల్లాపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని రెవెన్యూ మంత్రి అదూర్ ప్రకాశ్ తెలిపారు. ఆయన స్వయంగా ఆ జిల్లాకు వెళ్లి ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యకలాపాలను పరిశీలించారు. మున్నార్ సమీపంలోని చీయపర ప్రాంతంలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డుపక్కనే వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న సమయంలో ఇది పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీన్ని తీసిన తర్వాత గానీ కింద ఎన్ని వాహనాలున్నాయో చెప్పలేమన్నారు. భారత నావికా దళానికి చెందిన సిబ్బంది ఇప్పటికే సహాయ కార్యక్రమాల కోసం అక్కడకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం పరిస్థితి తీవ్రత గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటుచేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఇడుక్కి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపారు. కొచ్చిలో 40 విమాన సర్వీసులు రద్దు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ ప్రాంతంతో పాటు టాక్సీ మార్గంలోకి కూడా నీళ్లు ప్రవేశించడంతో దాదాపు 40 విమాన సర్వీసులు రద్దుచేశారు. ఈ విమానాశ్రయం 1999లో ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారని విమానాశ్రయ డైరెక్టర్ ఏసీకే నాయర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా డ్యాం షట్టర్లు తెరవాల్సి రావడంతో విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుకుందని, లోపలకు కూడా నీళ్లు రావడంతో ఉదయం పదిన్నర గంటలకు మొత్తం ఆపరేషన్లన్నింటినీ సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. సాయంత్రానికి మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని నాయర్ చెప్పారు. గడిచిన రెండు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. -
అభ్యంతరాలు తెలుసుకోనున్న హైలెవల్ కమిటీ
ఢిల్లీ: కాంగ్రెస్ హైలెవల్ కమిటీ సమావేశమైంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో మంత్రులు సమావేశమైయ్యారు. రాష్ట్ర విభజన, హైదరాబాద్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీమాంధ్ర ప్రాంత నేతల అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకుంటారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపిలు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన వెంటనే సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం ఊపందుకున్న విషయం తెలిసిందే. బంద్‌లు - రాస్తారోకోలు - వాహనాలు తగులబెట్టటం - దిష్టి బొమ్మల దగ్ధం - జవర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసం ........ ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేయని వారిని ప్రజలు నిలదీస్తున్నారు. వారి ఇళ్లపై దాడులు కూడా చేస్తున్నారు. రాజీనామాలు చేయని వారు తమతమ ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సీమాంధ్రలో ఉద్యమ పరిస్థితి కేంద్రం దృష్టికి వెళ్లింది. దానికి తోడు ఈరోజు పార్లమెంటులో సీమాంధ్ర ఎంపిలు ఆందోళన చేశారు. దాంతో కేంద్ర మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో మంత్రుల బృందం సీమాంధ్ర ప్రాంత నేతల భయాలు, అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుసుకోనుంది. ఇదిలా ఉండగా, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియ మొదలైందని రాజ్యసభలో ఈరోజు కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం: చిదంబరం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో స్పష్టమైన విధివిధానాలున్నాయని ఆయన తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అనేక సమస్యలు పరిష్కరించాల్సివుంటుందని చెప్పారు. ఈ అంశాలన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ సమగ్ర విధాన పత్రాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువస్తుందని చిదంబరం తెలిపారు. ఇందులో జలవనరులు, విద్యుత్ పంపిణీ, పంపిణీ, ప్రజల భద్రత, ప్రాథమిక హక్కుల రక్షణ, ఇతర అంశాలు కూడా ఉంటాయని చెప్పారు. కేబినెట్ నిర్ణయం తర్వాత ఈ అంశాలన్నిటిపై సభలో నిర్మాణాత్మక చర్చ జరుగుతుందన్నారు. తగిన సమయంలో చర్చకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రకటన చేయాలని సీమాంధ్ర ఎంపీలు డిమాండ్ చేస్తూ సీమాంధ్ర ఎంపీలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో చిదంబరం ప్రకటన చేశారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు ద్విసభ్య సంఘంతో సమావేశమయ్యారు. -
పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో తొలిరోజే తేలిపోయింది. సమైక్య నినాదాలు మిన్నంటడం, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు పదేపదే వెల్‌లోకి దూసుకెళ్లి కార్యకలాపాలకు అడ్డు తగలడంతో పార్లమెంటు ఉభయసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని, విభజన తగదని సీమాంధ్ర ఎంపీలు ఒకవైపు నినదించగా, మరోవైపు బోడోలాండ్ సహా పలు కొత్త రాష్ట్రాల ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా తమ వాణిని గట్టిగా వినిపించడంతో సభా కార్యకలాపాలకు పదే పదే ఆటంకం కలిగింది. రాష్ట్ర విభజన సెగ పార్లమెంట్లో పెను ప్రకంపనలు రేపుతోంది. వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత తెలంగాణ, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు హోరెత్తాయి. సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా కూర్చున్నారు. సభ్యులు శాంతించకపోవడంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభమైనా పరిస్థితిలో తేడా కనిపించలేదు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ప్రాంతానికి న్యాయం చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. వెల్‌లోకి వెళ్లి నినాదాలతో హోరెత్తించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు వెనక్కు వెళ్లాలని సోనియా వేలు చూపి మరీ ఆదేశించినా వారు పట్టించుకోలేదు. మరోవైపు బోడోల్యాండ్ ప్రాంత ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఆందోళనకు దిగారు. సభ్యుల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రం కొనసాగింది. ఐతే సభ్యులు ఎంతకూ వెనక్కు తగ్గకపోవడంతో స్పీకర్ సభను తర్వత మధ్యాహ్నం 2 గంటలకు, మళ్లీ 3 గంటల వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ ఇవే పరిస్థితి కనిపించింది. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు అక్కడకు వెళ్లిపోవాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్లకార్డులను కొందరు ఎంపీలు ప్రదర్శించారు. ఓ సమయంలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీల వద్దకు టీడీపీ సభ్యుడు ఎన్. శివప్రసాద్ ఆగ్రహంగా వెళ్లబోగా.. సహచరులు ఆయనను వారించారు. సభ్యులను శాంతపరిచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ ప్రయత్నించినా, ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. రాజ్యసభలో టీడీపీ సభ్యులు వైఎస్ఆర్ చౌదరి (సుజనా చౌదరి), సీఎం రమేశ్ సభలో గందరగోళం సృష్టిస్తున్నారంటూ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వ్యాఖ్యానించారు. ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని టీడీపీ సభ్యులు రాజ్యసభలో ఆందోళన చేస్తుండగా.. తెలంగాణ ఇచ్చినప్పుడు బోడోలాండ్ ఎందుకు ఇవ్వరని ఆ ప్రాంత సభ్యుడు బిశ్వజిత్ దైమరి ప్రశ్నిస్తూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు. ఎన్నిసార్లు సమావేశమైనప్పటికీ పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాకపోవడం, సభా కార్యకలాపాలు జరిగేలా లేకపోవడంతో పార్లమెంటు ఉభయ సభలను మంగళవారానికి వాయిదా వేశారు. అయితే, అంతకుముందు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ విధివిధానాలపై కేబినెట్ నోట్ రూపొందుతోందని రాజ్యసభలో కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటన చేశారు. ఒకవైపు సీమాంధ్రలో ఆందోళనలు జోరుగా సాగుతున్నా.. కేంద్రం ఈ ప్రకటన చేయడంతో ఎంపీలతో పాటు అటు ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నవారు కూడా రగిలిపోయారు. మరోవైపు.. రక్షణమంత్రి ఏకే ఆంటోనీతో సీమాంధ్ర మంత్రులు ఈ రోజు భేటీ కానున్నారు. సీమాంధ్రలో ఆందళోనలపై ఆంటోనీ నేతృత్వంలో కమిటీ వేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. -
'మెజార్టీ పార్టీల అభిప్రాయం మేరకే విభజన'
హైదరాబాద్: రాష్ట్రంలోని మెజార్టీ పార్టీల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూపాలిని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలను కూల్చితే ఊరుకోం అని హెచ్చరించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాలను కూల్చితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో తమ పదవులకు రాజీనామాలు చేసే ప్రసక్తి లేదని బొత్స తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. రాజీనామాలు చేస్తే శాసనసభలో సమైక్యవాణి ఎవరు వినిపిస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిందేనని సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశంలో రూపొందించిన తీర్మానంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, తాను కూడా సంతకాలు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని 5 కోట్ల మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఉద్యోగ, ఉపాధి, విద్యావకాశాల సమస్యలను ఎలా అధిగమిస్తామనేది ఆలోచిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోనే అన్ని అత్యున్నత సంస్థలను ఏర్పాటు చేసినందున ఈ సమస్య ఏర్పడిందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజకీయ లబ్ధి కోసం జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇకపై కాంగ్రెస్‌పై నిందలు వేసినా, విగ్రహాలను విధ్వంసం చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలంతా వెంటనే ప్రతిఘటించాలని బొత్స పిలుపునిచ్చారు. -
అబూసలేం పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : మాఫీయా డాన్ అబూసలేం పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత చట్టాల ప్రకారం విచారణ ఎదుర్కోవల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోర్చుగల్ కోర్టు ఆదేశాలు ఇక్కడ వర్తించవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత దేశంలో తనపై వివిధ కేసుల్లో జరుగుతున్న విచారణలను కొట్టివేయాలంటూ అబూ సలేం సుప్రీంకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల న్యాయ పోరాటం తర్వాత సలేం, సినీ నటి మోనికా బేడీని 2005, నవంబర్ 11న పోర్చుగల్ నుంచి భారత్‌కు తరలించారు. సలేం ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు. ఒక వేళ నేరం రుజువయిన పక్షంలో సలేంకు మరణ శిక్ష విధించడం కానీ, 25 ఏళ్లకన్నా ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడం కానీ చేయబోమని అతడి అప్పగింత సమయంలో పోర్చుగల్ ప్రభుత్వానికి భారత్ హామీ ఇచ్చింది. పోర్చుగల్ కోర్టుకు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అటార్నీ జనరల్ జిఇ వాహనవతి చెప్తూ,ట్రయల్ కోర్టు సలేంపై మోపిన అదనపు అభియోగాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిని కూడా కోరారు. -
సోదరుడికి ప్రజల కష్టాలు వివరించిన షర్మిల
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల... ఆ వివరాలన్నింటినీ చంచల్‌గూడ జైల్లో తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి వివరించారు. విమానాశ్రయం నుంచి నేరుగా జైలు వద్దకు చేరుకున్న ఆమె, ములాఖత్ ద్వారా ఆయనను కలుసుకున్నారు. అశేష ప్రజాభిమానం ఎలా ఉందో వివరించారు. కొద్దిసేపటి తర్వాత ఆమె చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. పాదయాత్ర సాగిన తీరు పట్ల జగన్ మోహన రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, తామందరినీ ఆయన అభినందించారని జైలు బయట విలేకరులకు చెప్పారు. తమను ఆశీర్వదించి, సహకరించి, తమ సహకారం అందించిన ప్రజలకు, పాదయాత్రను ఆశీర్వదించిన దేవుడికి షర్మిల కృతజ్ఞతలు తెరలిపారు. అంతకుముందు పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న షర్మిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖపట్నం నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో షర్మిలకు పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజన్న బిడ్డకు స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. షర్మిల.. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగింది. సుదీర్ఘ పాదయత్ర చేసిన మహిళగా వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 2012 అక్టోబర్ 18న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో షర్మిల మోకాలుకు గాయం కావడంతో కొంతకాలం పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజులలో ఆమె పూర్తి చేశారు. రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 అసెంబ్లీ నియోజక వర్గాలు, తొమ్మిది కార్పొరేషన్లు, 45 మున్సిపాల్టీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు. -
రాజ్యసభలో అందరి కళ్లూ సచిన్ మీదే
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలిరోజే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉభయ సభల్లో తమ వాణి గట్టిగా వినిపించడంతో పదే పదే వాయిదా పడ్డాయి. అయితే, ఇన్ని సంఘటనల మధ్య కూడా రాజ్యసభలో అందరి కళ్లు ఒక వ్యక్తి మీదే ఉన్నాయి. ఆయనెవరో కాదు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తెలుపు, నీలం చారల చొక్కా, నల్ల ప్యాంటు వేసుకుని.. కుడిచేతికి కడియం, రెండు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు, ఎడమచేతికి వాచీ పెట్టుకున్న టెండూల్కర్.. సోమవారం నాటి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యాడు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజీవ్ శుక్లాతో కలిసి సభ ప్రారంభం కావడానికి చాలా ముందుగానే వచ్చేశాడు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో బాలీవుడ్ నటి రేఖ, వ్యాపారవేత్త అను ఆగాలతో కలిసి రాజ్యసభకు నామినేట్ అయిన టెండూల్కర్.. తన సీటులో కూర్చునే ముందు పలువురు ఎంపీలతో కరచాలనం చేశాడు. తర్వాత తన పక్కనే కూర్చున్న ప్రముఖ గేయ రచయిత జావేద్ అఖ్తర్‌తో మాటల్లోకి దిగాడు. సచిన్ భార్య అంజలి కూడా పార్లమెంటుకు వచ్చి, సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నారు. భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నందుకు రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అభినందనలు తెలియజేయగా, సచిన్ బల్లమీద చరిచి తన హర్షం వ్యక్తం చేశాడు. సీమాంధ్ర ఎంపీల ఆందోళనతో సభ పది నిమిషాలు వాయిదా పడగా, చాలామంది ఎంపీలు సచిన్ వద్దకు వచ్చి, చేతులు కలిపారు. తర్వాత టెండూల్కర్ లేచి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్దకు వెళ్లి.. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. -
రెడ్‌లైట్ నుంచి న్యూయార్క్.. ఓ శ్వేత పయనం
కష్టాలు, కన్నీళ్లు ఆమెను నిరంతరం వెన్నంటి ఉండే నేస్తాలు. ఉండేది ప్రతినిత్యం రక్తమాంసాలతో వ్యాపారం సాగే నీచాతి నీచమైన ప్రాంతం. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై మహానగరంలోని రెడ్‌లైట్ ప్రాంతంలో పెరిగి, పలుమార్లు లైంగిక అఘాయిత్యాలకు గురైన ఆ యువతి.. న్యూయార్క్ నగరంలో చదువుకోడానికి అమెరికా వెళ్లిపోయింది. పేదరికాన్ని, కష్టాలను అధిగమించి మరీ ఆమె ఈ విజయం సాధించింది. ఆమె పేరు శ్వేతా కత్తి (18). ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఉండే అనేక మంది అభాగినులలో ఆమె పేరు ఉన్నా.. పెద్దగా ఎవరికీ తెలియదు. న్యూయార్క్ లోని బార్డ్ కాలేజిలో సైకాలజీ డిగ్రీ చదివేందుకు ఆమెకు స్కాలర్షిప్ లభించింది. ఆ చదువు పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగొచ్చి, తనలాంటి అభాగినులకు సాయం చేయాలని శ్వేత భావిస్తోంది. చిన్నప్పటి నుంచే తాను అలా కలలు కన్నానని, కానీ ఆ కల సాకారం అవుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. శ్వేత పట్టుదల కారణంగా ఆమె ప్రపంచ ప్రఖ్యాత పత్రిక న్యూస్ వీక్ 'యంగ్ వుమెన్ టు వాచ్' పేరిట ఎంపిక చేసిన 25 మంది బాలికల్లో ఒకరిగా నిలిచింది. తాలిబన్ల దాడిలో గాయపడి, కోలుకున్న పాకిస్థానీ బాలిక మలాలా పేరు కూడా ఈ జాబితాలోనే ఉంది. చిన్ననాటి నుంచి ఆమె అనేక కష్టనష్టాలకు గురైంది. ముంబైలోని కామాటిపుర ప్రాంతంలో ఆమె చూసిన నరకం అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు వచ్చి, ఎవరో ఒక మహిళను కొడుతుండేవాళ్లని, పోలీసులు ఎపు్పడు పడితే అప్పుడు వస్తుండేవారని, ఏమాత్రం ఇష్టం లేకపోయినా.. సంతోషంగా లేకపోయినా కూడా తప్పనిసరిగా అక్కడున్నవాళ్లంతా వ్యభిచారం చేయాల్సి వచ్చేదని శ్వేత వివరించింది. తమ పక్కన పడుకొమ్మని మగవాళ్లు వచ్చి అడిగినప్పుడు చాలా బాధగా అనిపించేదని, కానీ తప్పేది కాదని తెలిపింది. తండ్రితో పాటు చాలామంది తనను తిట్టి, కొట్టేవారు గానీ, తన తల్లి మాత్రం.. నువ్వు ఏమైనా చేయగలవంటూ ప్రోత్సహించేదని చెప్పింది. తాను చాలా మొండిదాన్నని, పాఠశాలలో తన పేదరికం, తక్కువ జాతి కారణంగా అన్నివైపుల నుంచి వివక్ష ఎదుర్కొన్నానని వివరించింది. ఫ్యాక్టరీ కార్మికురాలిగా పనిచేసే తన తల్లి తనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చినట్లు చెప్పింది. శ్వేత కన్న కలలు సాకారం కావడంలో 'క్రాంతి' అనే స్వచ్ఛంద సంస్థ తన వంతు పాత్ర పోషించింది. ముంబై రెడ్‌లైట్ ప్రాంతంలోని అమ్మాయిలు సామాజిక మార్పు తీసుకురావడానికి సాధకులుగా ముందుకు రావాలన్నదే ఈ సంస్థ ధ్యేయం. క్రాంతి సంస్థ రెండేళ్ల క్రితం శ్వేతను రెడ్‌లైట్ ప్రాంతం నుంచి తీసుకెళ్లి తమ సంరక్షణలో ఉంచుకుంది. అక్కడే ఆమె తన ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని విస్తరించుకుని, క్రమంగా సైకాలజీ అంశంలో కూడా ఆసక్తి పెంచుకుంది. చివరకు అమెరికాలో చదువుకునే అవకాశం లభించడంతో అమితానందానికి గురైంది. ఇతరుల జీవితాలను కూడా ఇది మారుస్తుందని, తన నేపథ్యాన్ని కూడా తాను గౌరవిస్తానని ఆమె తెలిపింది. ఇటీవలే ముంబైలో విమానం ఎక్కి.. అమెరికాకు వెళ్లిపోయింది. -
దుర్గాశక్తి.. యూపీ సర్కారు - ఓ దుమారం
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ ప్రాంతంలో ఇసుక మాఫియాకు ముచ్చెమటలు పోయించి, అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురై చివరకు సస్పెండైన యువ ఐఏఎస్ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్ ఉదంతంపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఈ విషయంలో కలగజేసుకుని, ఆమెకు సరైన న్యాయం జరిగేలా చూడాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఓ లేఖ రాయడంతో ప్రధాని రంగంలోకి దిగారు. ఈ విషయమై తాము ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని తాము నిరంతరం సంప్రదిస్తున్నామని, వాళ్లు కూడా నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారని తెలిపారు. అసలు ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నామని పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులకు చెప్పారు. ఐఏఎస్ అధికారుల విషయంలో కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలున్నాయని, వాటిని అక్కడ కూడా పాటిస్తారని ఆయన చెప్పారు. దుర్గాశక్తి వ్యవహారంపై వెనువెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. జూలై 27వ తేదీన దుర్గాశక్తి సస్పెండ్ కాగా, అప్పటినుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి లేఖలు రాసినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.నారాయణస్వామి తెలిపారు. అయితే యూపీ ప్రభుత్వం మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన దారిలో తాను పోతోంది. దుర్గాశక్తికి పది పేజీల చార్జిషీటు కూడా పంపింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన యువ ఐఏఎస్ అధికారిణి, ఓ మసీదు గోడను తగిన పద్ధతి పాటించకుండా కూల్చేశారంటూ ఆమెను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. చార్జిషీటుకు స్పందించేందుకు ఆమెకు 15 రోజుల గడువు ఇచ్చినట్లు సమాచారం. -
పార్లమెంటును తాకిన సమైక్య సెగ
అనుకున్నంతా అయ్యింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు తమ గళం విప్పారు. ఉభయ సభల్లోనూ వారు నిరసన తెలియజేయడంతో రాజ్యసభ, లోక్ సభ రెండూ వాయిదా పడ్డాయి. రాజ్యసభ అయితే రెండుసార్లు వాయిదా పడింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా నినదించారు. విభజనను వారు గట్టిగా వ్యతిరేకించారు. సమైక్య సెగ పార్లమెంట్‌ను పూర్తిస్థాయిలో తాకింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజే ఉభయసభలు రాష్ట్ర విభజన అంశంపై హోరెత్తాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభమైన తర్వాత సభలో ఒకవైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు హోరెత్తాయి. సీమాంధ్ర ఎంపీలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. అయితే అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం మౌనంగా కూర్చున్నారు. రాజ్యసభలో కూడా ఇవే పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమైక్యాంధ్ర నినాదాలు హోరెత్తడంతో ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు... ఇటీవల రాజ్యసభ, లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ప్రమాణస్వీకారం చేయించారు. అదేవిధంగా ఇటీవలే కొత్త మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులను ప్రధాని మన్మోహన్ సభకు పరిచయం చేశారు. ఇటీవల నక్సల్స్ దాడిలో మృతిచెందిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నేత మహేంద్రకర్మ తదితర నాయకులకు ఉభయసభలు సంతాపం తెలిపాయి. -
రాజ్యసభ సభ్యురాలిగా కనిమొళి ప్రమాణం
న్యూఢిల్లీ : డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి సోమవారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నకైన వారితో రాజ్యసభ సభ్యుడు హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ ప్రమాణ స్వీకారాలు చేయించారు. అదేవిధంగా ఇటీవలే కొత్తగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిని సభకు పరిచయం చేశారు. అలాగే ఇటీవలే మావోయిస్టుల దాడిలో మృతి చెందిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ తదితర నాయకులకు ఉభయ సభలు సంతాపం తెలిపాయి. పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు 16 రోజుల పాటు జరగనున్నాయి. -
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి.ముందుగా ఉప ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈ సందర్భంలో తన ప్రమాణ స్వీకార పత్రం హిందీలో రాసి ఉందంటూ ఓ సభ్యుడు ప్రస్తావించడం సభలో నవ్వులు పూయించింది. ఇక ఆహారభద్రత లాంటి కీలక బిల్లులు ఆమోదం కోసం వేచి చూస్తుండగా.. తెలంగాణ చిచ్చు రేపిన కేంద్ర ప్రభుత్వానికి అసోం, నాగాలాండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల నుంచి కూడా విభజన వాదాలు చెలరేగి షాక్ తినిపిస్తున్నాయి. మరోవైపు ముందస్తు ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు సజావుగా నడిచేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం ఉదయం విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. గడిచిన రెండు మూడు సమావేశాల్లో చాలా సమయం వృథా అయ్యిందని, ఈసారి అలా జరగకుండా చూడాలని ఆయన కోరారు. సీమాంధ్ర ఎంపీల ఆందోళన? సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నిరసనల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ఎంపీలు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. ఈ ఆందోళనలు ఉభయసభలపైనా ప్రభావం చూపనుంది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా చేసినా, లోక్ సభ స్పీకర్ గానీ, రాజ్యసభ చైర్మన్ గానీ వీరి రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి, ఆమోదించాలని పట్టుపట్టటం ద్వారా కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ భావిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పట్టు.. తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తీరుపై సమగ్ర చర్చతో పాటు.. ఇకపై దేశంలో మరే రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమనే విస్పష్ట ప్రకటన కోసం పశ్చిమబెంగాల్లో గూర్ఖాలాండ్ ఉద్యమ సెగను ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పట్టుపట్టే అవకాశాలున్నాయి. త్వరలో ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని భావిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రతిపక్షానికి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ విజ్ఞప్తిచేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపైనా చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయినా బొగ్గు కుంభకోణం, రైల్ గేట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అన్ని రంగాల్లో ద్వారాలు తెరవడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై ప్రతిపక్షాల నుంచి సర్కారుపై ముప్పేట దాడి తప్పకపోవచ్చు. రూపాయి విలువ పడిపోవడం, డాలర్‌కు ఏకంగా 61 రూపాయల వరకు వెళ్లడంతో ఆ విషంయపైనా ఇటు ప్రధానిని, అటు ఆర్థిక మంత్రిని ప్రతిపక్షాలు దులిపేయడానికి సిద్ధపడ్డాయి. బిల్లులకు సహకరించండి బీమా, పెన్షన్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన కీలకమైన సంస్కరణల బిల్లులపై సహకరించాలని ప్రతిపక్ష బీజేపీకి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం విజ్ఞప్తిచేశారు. ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రానున్న ఆర్థిక బిల్లులపై బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, యశ్వంత్‌సిన్హాలతో చిదంబరం చర్చలు జరిపారు. సాధారణ, ఆర్థిక కార్యక్రమాలపై తమ పార్టీ మద్దతు ఇస్తుందని.. అయితే బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని బీజేపీ సంకేతాలిచ్చింది. పెన్షన్ రంగంలోనూ ఎఫ్‌డీఐని పెంచే ప్రతిపాదనను కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఆహార భద్రత బిల్లుకు సూత్రప్రాయంగా అనుకూలమే అయినా తాము ప్రతిపాదించిన అనేక సవరణలను ఆమోదిస్తేనే సహకరిస్తామని బీజేపీ వ్యూహకర్తల బృందం స్పష్టం చేసింది. మొత్తం మీద ఈసారి పార్లమెంట్ సమావేశాలు గతంతో పోల్చితే వాడివేడిగా సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. -
పోలీసులు - మావోయిస్టుల ఎదురుకాల్పులు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూంబింగ్ కోసం వెళ్లిన పోలీసులకు దారిలో మావోయిస్టులు ఎదురు కావడంతో ఇరువర్గాల మధ్య చాలాసేపు ఎదురు కాల్పులు జరిగాయి. దీనిలో చివరకు పోలీసులదే పైచేయి అయ్యింది. ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేసిన పోలీసులు.. భారీ మొత్తంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం ఆ ప్రాంతంలో కూంబింగ్ కార్యకలాపాలను మరింత ఉధృతం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కూడా ఈ సంఘటనతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. -
రూపాయి, ఫలితాలే దిక్సూచి
న్యూఢిల్లీ: ఇకపై వచ్చే కంపెనీల ఆర్థిక ఫలితాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల పరిస్థితి, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్లను నడకను నిర్దేశిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. వీటితోపాటు అంతర్జాతీయ సంకేతాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని చెప్పారు. వచ్చే శుక్రవారం(9న) రంజాన్(ఈద్) సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవుకావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ వారం టాటా మోటార్స్, సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ, టాటా పవర్ వంటి బ్లూచిప్ కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. సోమవారం(5న) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. ఈ నెల 30న ముగియనున్న సమావేశాల్లో భాగంగా ఆహార భద్రత బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఇక సోమవారమే అమెరికా ఉద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. జూలై నెలకు వెల్లడైన ఉద్యోగ గణాంకాలు ఆర్థిక సంక్షోభ ప్రభావం నుంచి అమెరికా బయటపడుతున్న సంకేతాలను అందించాయి. 2008 డిసెంబర్ తరువాత నిరుద్యోగిత 7.4%కు తగ్గింది. ఈ అంశం కూడా సోమవారం మార్కెట్లను ప్రభావితం చేయవచ్చునని విశ్లేషకులు పేర్కొన్నారు. నిఫ్టీకి 5,750 కీలకం అంతర్జాతీయ అంశాలతోపాటు, కంపెనీల ఫలితాలను ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. సమీప కాలంలో ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీకి 5,750 స్థాయి కీలకంగా నిలవనుందని తెలిపారు. ఈ స్థాయికిపైన కొనుగోళ్ల మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. కాగా, గడిచిన శుక్రవారం డాలరుతో మారకంలో రూపాయి విలువ కొత్త కనిష్ట స్థాయి 61.10 వద్ద ముగిసింది. అయితే గత కొన్ని వారాలుగా ప్రభుత్వంతోపాటు, రిజర్వ్ బ్యాంకు సైతం కరెన్సీ బలపడేందుకు వీలుగా పలు చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఫలితమివ్వకపోవడం గమనార్హం. ఈ బాటలో రిజర్వ్ బ్యాంకు గత వారం రూపాయికి మద్దతుగా మరిన్ని చర్యలను ప్రకటించింది. హెడ్జింగ్‌ను చేపట్టేముందు ఎఫ్ఐఐలు తప్పనిసరిగా పార్టిసిపేటరీ నోట్ల జారీదారుల వద్ద నుంచి అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఇదే విధంగా అంతక్రితం ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టడం, బ్యాంకుల లిక్విడిటీని కట్టడి చేస్తూ బ్యాంకు రేటును భారీగా పెంచడం వంటి చర్యలను తీసుకున్న విషయం విదితమే. -
దీర్ఘకాలానికి... ‘డైనమిక్’ ఫండ్స్
ఈ ఏడాది జూన్‌లో ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్‌లో రూ.50,000 పెట్టుబడులు పెట్టాను. ఆర్బీఐ చర్యల తర్వాత ఈ ఫండ్ ఎన్ఏవీ బాగా తగ్గిపోయింది. తక్కువ ఎన్ఏవీ వద్ద మరో 50,000 పెట్టుబడులు పెట్టమంటారా? ఏడాది పాటు నా పెట్టుబడులను కొనసాగించాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. - నందిని, హైదరాబాద్ గత రెండు వారాల్లో భారత ఫైనాన్షియల్ మార్కెట్లలో ఊహించని సంఘటనలు జరిగాయి. డెట్ మార్కెట్ల నుంచి భారీ స్థాయిలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నిధులు ఉపసంహరించుకున్నారు. ఆర్బీఐ హఠాత్తుగా వడ్డీరేట్లను పెంచింది. దీంతో డెట్ఫండ్స్కు నష్టాలొచ్చాయి. మామూలుగానైతే డెట్‌ఫండ్స్ సురక్షితమైనవని చెప్పుకోవచ్చు. కానీ ఎవరూ అంచనా వేయలేని పరిస్థితుల కారణంగా తాజాగా డెట్‌ఫండ్స్ నష్టాలపాలయ్యాయి. పెంచిన వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గిస్తుంది. అయితే ఎప్పుడనేదే ఎవరూ అంచనా వేయలేరు. వడ్డీరేట్లు ఎప్పుడు తగ్గితే అప్పుడు డెట్ఫండ్స్కు లాభాలొస్తాయి. ఎస్బీఐ డైనమిక్ బాండ్ ఫండ్ మంచి పనితీరు కనబరుస్తున్న ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్. గత మూడేళ్లుగా ఈ ఫండ్ వార్షిక రాబడి 9.88 శాతంగా ఉంది. ఈ కేటగిరీ ఫండ్స్ సగటు రాబడి 7.82 శాతమే. ఈ ఫండ్‌లో మీ పెట్టుబడులను కొనసాగించండి. షార్ట్‌టర్మ్ బాండ్ ఫండ్స్ ఆకర్షణీయమైన రాబడులనిస్తున్నాయి. మీకు డబ్బులు అవసరం లేకపోతే 1-2 సంవత్సరాలు ఈ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు కొనసాగించవచ్చు. కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్‌పై లిక్విడిటీ మీకు సమస్య కాకపోతే డైనమిక్ బాండ్ ఫండ్స్‌కు బదులుగా ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్(ఎఫ్ఎంపీ)ను పరిశీలించవచ్చు. ఫండ్ మెచ్యూరిటీ కాలం ఎంత ఉందో అంతే కాలానికి మెచ్యూరయ్యే రుణ పత్రాల్లో ఎఫ్ఎంపీలు పెట్టుబడులు పెడతాయి. డైనమిక్ ఫండ్స్ దీర్ఘకాలానికి మంచి రాబడులనిస్తాయి. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమాప్లస్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ స్కీమ్‌లో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆదే స్కీమ్ డెరైక్ట్ ఆప్షన్‌కు మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్‌లో 10సంవత్సరాల నుంచి పెట్టుబడులు పెడుతూ ఉన్నాను. ఒకేసారి రెగ్యులర్ స్కీమ్నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారమంటారా? లేదా 3-4 దఫాల్లో మారమంటారా? అధిక ఎన్ఏవీ లేదా తక్కువ ఎన్ఏవీ వద్ద మారితే ఏమైనా తేడా ఉంటుందా? - ఫణీంద్ర, అనంతపురం ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్‌కు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది. మంచి పనితీరు కనబరుస్తున్న ఈ ఫండ్‌కు మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఈ ఫండ్ పనితీరు బాగా ఉండదు. కానీ, మార్కెట్లు పతనమవుతున్నప్పుడు మరీ అంత అధ్వానంగా కూడా ఏమీ ఉండదు. గత పదేళ్లలో ఈ ఫండ్ వార్షిక రాబడి 23 శాతంగా ఉంది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ కేటగిరీ ఫండ్స్‌ల్లో ఉన్న 19 ఫండ్స్‌ల్లో ఇది ఐదవ ఉత్తమ ఫండ్. ఈ ఫండ్ రెగ్యులర్ స్కీమ్ నుంచి డెరైక్ట్ స్కీమ్‌కు మారాలనుకుంటే, 3-4 దఫాలుగా కాకుండా ఒకేసారి మారడం మంచిది. ఒకేసారి మారుతున్నందున ఎన్ఏవీ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. పెట్టుబడిపై రాబడులను ఏడాది వరకూ అయితే పూర్తిగానూ, ఏడాది దాటితే వార్షికంగానూ పేర్కొంటారు. రెండింటికీ తేడా ఏమిటి? - గోపీనాథ్, మహబూబ్ నగర్ ఈ రెండింటికి తేడాను ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. రూ. 1,000 ని ఐదేళ్ల క్రితం పెట్టుబడి పెట్టామనుకోండి. ఇప్పుడు దాని విలువ రూ. 1,300 అయిందనుకుందాం. అప్పుడు పూర్తి లాభం రూ.300గా పరిగణిస్తాం. ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడి 30 శాతం చొప్పున వృద్ధి చెందింది. ఇక మన పెట్టుబడి ప్రతీ ఏడాది ఎంత రాబడిని సాధించిందో వార్షిక రాబడి వెల్లడిస్తుంది. అంటే ఐదేళ్ల కాలంలో మన పెట్టుబడిపై ప్రతీ ఏడాది సగటున వచ్చిన రాబడి అని అర్థం. ప్రతి ఏడాది వచ్చిన లాభాన్ని అసలు మొత్తంతో కలిపి మరలా పెట్టుబడి పెట్టడం. పై ఉదాహరణలో పెట్టుబడిపై వచ్చిన వార్షిక లాభం 5.38 శాతం. అంటే రూ. 1,000 పెట్టుబడిపై ఏడాది కాలానికి వచ్చిన లాభం రూ.53.8. దీనిని అసలు(రూ.1,000)తో కలిపి పెట్టుబడిగా (రూ.1053.80)గా పెట్టుబడి పెట్టాలి. రెండో ఏడాది దీని విలువ రూ.1,150.50 అవుతుంది. ఇదీ పూర్తి రాబడికి, వార్షిక రాబడికి ఉన్న తేడా. సాధారణంగా వాల్యూ రీసెర్చ్‌లో ఏడాదిలోపు పెట్టుబడులపై రాబడులను పూర్తి రాబడులుగానూ, ఏడాది దాటిన తర్వాత వచ్చే రాబడులను వార్షిక రాబడులుగానూ పరిగణిస్తాం. -
అవరోధ శ్రేణి 19,337-19,525
అధికశాతం షేర్లు నిలువునా పతనం అవుతున్నా, కొద్ది నెలల నుంచి స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో స్థిరపడేందుకు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు సహకరిస్తూ వచ్చాయి. క్రితం వారం ఐటీ మినహా ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు కూడా కరెక్షన్ బాట పట్టడంతో స్టాక్ సూచీల్లో కూడా పతనవేగం పెరిగింది. రూపాయి క్షీణతను అదుపుచేయడానికి రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలేవీ ఫలితాల్ని ఇవ్వకపోవడంతో బ్యాంకింగ్, రియల్టీ, ఇన్ఫ్రా రంగాల షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లు ఆఫ్‌లోడ్ చేస్తున్నారు. 1998లో ఆగ్నేయాసియా దేశాల్లో సంభవించిన కరెన్సీ సంక్షోభ(కరెన్సీ విలువలు నిలువునా పతనంకావడం) ఛాయలు, ప్రస్తుతం భారత కరెన్సీ మార్కెట్లో కన్పిస్తున్నాయి. అప్పట్లో ఆయా దేశాలతో పాటు మన స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో కీలక రంగాలకు చెందిన పెద్ద షేర్లు పెన్నీ(కారు చౌకగా లభించే) షేర్లుగా మారిపోయాయి. అదేతరహాలో ఇప్పటి మార్కెట్ పతనం కొనసాగుతోంది. -
‘జనం చెక్కిన శిల్పం వైఎస్’
ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: ‘కదలిక’ సంపాదకుడు ఇమామ్ రచించిన ‘జనం చెక్కిన శిల్పం వైఎస్’ పుస్తకాన్ని షర్మిల ఆదివారం పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని విడుదల చేసి ఫోరం ప్రతినిధులకు, రచయిత ఇమామ్‌కు అందించారు. ఇమామ్‌ను అభినందించారు. అక్కడికక్కడే సుమారు 300 కాపీలు పంపిణీ చేశారు. మార్చి నెలలో ఈ పుస్తకాన్ని మొదటిసారి ప్రచురించామని, 60 పేజీలు అదనంగా చేర్చి రెండోసారి ప్రచురించామని ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు శాంతమూర్తి, సువర్ణరాజు తెలిపారు. అది సానుభూతి కాదు.. వైఎస్‌పై ప్రేమ ‘‘షర్మిలను చూడ్డానికి, కరచాలనం చేయడానికి, ఆమె మాటలు వినడానికి, కష్టాలు చెప్పుకోడానికి లక్షలాది మంది పాదయాత్రకు తరలివచ్చారు. రాజకీయ నాయకులు అంటున్నారు ఇది సానుభూతి గాలి అని.. అది సానుభూతి కాదు, వాళ్లలో నాకు కనిపించింది కృతజ్ఞత. ఆ మహానాయకుడి కుటుంబం మీద ఉన్న ప్రేమ, అభిమానం. ఆరోజు వైఎస్సార్ పాదయాత్ర చేసి వాళ్ల కష్టాల కన్నీళ్లు తుడిచారు.. ఆ అభిమానంతోనే ఈ రోజు ప్రజలు షర్మిల వస్తున్నారని తెలుసుకొని పరుగుపరున వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొనటం నిజంగా నా అదృష్టం.’’ - కాపు భారతి, రాయదుర్గం, అనంతపురం -
కెన్యా రియల్టీలోకి రిలయన్స్
కెన్యా రియల్టీ మార్కెట్లోకి ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రవేశించింది. డెల్టా కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్, డెల్టా కార్ప్ ఈస్ట్ ఆఫ్రికా లిమిటెడ్(డీసీఈఏఎల్-ఈ జేవీలో రిలయన్స్‌కు 58.8 శాతం వాటాలున్నాయి) ద్వారా హౌసింగ్, ఆఫీస్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తోంది. కెన్యాలో రూ.200 కోట్ల విలువైన భూములను ఈ కంపెనీ కొనుగోలు చేసిందని డెల్టా కార్ప్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే చౌక ధరల రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ఒక ఆఫీస్ బ్లాక్ ప్రాజెక్ట్‌ను ఈ జేవీ పూర్తి చేసింది. నైరోబీలోని 10 ప్రైమ్ ప్లాట్లను కొనుగోలు చేసిన డీసీఈఏఎల్ 12 లక్షల చదరపుటడుగుల కమర్షియల్, రెసిడెన్షియల్ అసెట్స్‌ను డెవలప్ చేయనున్నది. జయదేవ్ మోడీ నేతృత్వంలోని డెల్టా కార్ప్ భారత్, శ్రీలంక, కెన్యాల్లో గేమింగ్, ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీ, రియల్టీ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డెల్టా కార్ప్ అధినేత మోడీ, ముకేష్ అంబానీలు మంచి స్నేహితులు. -
మరో ప్రజాప్రస్థానంలో... షర్మిల వెంట నేతల అడుగులు
ఆదివారం పాదయాత్రలో షర్మిల వెంట నడిచిన వారిలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు-ధర్మాన కృష్ణదాసు, శోభానాగిరెడ్డి, గొల్ల బాబూరావు, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గురునాథరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోడుమూరి శ్రీనివాసులు, భూమన కరుణాకరరెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు- జూపూడి ప్రభాకర్‌రావు, దేవగుడి నారాయణరెడ్డి ఉన్నారు. పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, దాడి వీరభద్రరావు, ధర్మాన పద్మప్రియ, మాజీ మంత్రులు-పిల్లి సుభాష్ చంద్రబోస్, పెన్మత్స సాంబశివరాజు, బలిరెడ్డి సత్యారావు, హరిరామజోగయ్య, మూలింటి మారెప్ప, తాజా మాజీ ఎమ్మెల్యేలు-పిరియా సాయిరాజు, సుజయ కృష్ణ రంగారావు, జోగి రమేష్, మద్దాల రాజేశ్, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణరావు, గండి బాబ్జి, పూడి మంగపతిరావు, మర్రి రాజశేఖర్, ముదునూరి ప్రసాదరాజు, జంగాకృష్ణమూర్తి, కుంభా రవిబాబు, జ్యోతుల నెహ్రూ, సామినేని ఉదయభాను, ఎంవీ కృష్ణారావు, కంబాల జోగులు, చెంగల వెంకట్రావు, రంగనాథరాజు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇంకా నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చొక్కాకుల వెంకట్రావు, నల్ల సూర్యప్రకాశరావు, కొల్లి నిర్మలాకుమారి, చల్లా మధుసూదన్‌రెడ్డి, వంశీకృష్ణయాదవ్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెలమలశెట్టి సునీల్, కొయ్యా ప్రసాదరెడ్డి, తిప్పల నాగిరెడ్డి, జీవీ రవిరాజు, ప్రగడ నాగేశ్వరరావు, వనజంగి కాంతమ్మ, విశ్వాసరాయి కళావతి, కిడారి సర్వేశ్వరరావు, పాలవలస రాజశేఖర్, విక్రాంత్, కిలపర్తి జానకి, దాడి రత్నాకర్, పీవీఎస్ఎన్ రాజు, సత్తి రామకృష్ణారెడ్డి, కర్రి పాపారావు, భూపతి శ్రీనివాసరాజు, దాడిశెట్టి రాజా, ప్రసన్న కుమార్, వజ్జ బాబూరావు, కల్మట వెంకటరమణ, గొర్లె కిరణ్, దువ్వాడ శ్రీనివాసు, వరుదు కళ్యాణి, గురాన అయ్యలు, పీఎంజీ బాబు, పెట్ల ఉమాశంకర్ గణేష్, చినరామనాయుడు, మందపాటి కిరణ్‌కుమార్, కోల గురువులు, స్థానిక నాయకులు దుప్పల రవీంద్ర, హన్మంతు కిరణ్‌కుమార్, బొడ్డేపల్లి పద్మజ, ధవళ వెంకట గిరిబాబు, డాక్టర్లు జహీర్ అహ్మద్, సీఎస్ రెడ్డి, హరికృష్ణ షర్మిల వెంట నడిచారు. ప్రతిరోజూ షర్మిల వెన్నంటే ఉంటున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డిపద్మ, ఆర్కే, కాపు భారతి, వైఎస్ రాయల్‌రెడ్డి, అందూరి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
రెండు నెలల్లో రూ. 62,000 కోట్లు వెనక్కి
గత రెండు నెలల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి 10.5 బిలియన్ డాలర్ల(రూ. 62,000 కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. రూపాయి పతనం నేపథ్యంలో ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగవచ్చునని విశ్లేషకులు అంచనా వేశారు. జూన్‌లో రూ. 44,162 కోట్లు(7.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్ఐఐలు జూలైలోనూ డెట్, ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 18,124 కోట్లు(3 బిలియన్ డాలర్లు) విలువైన అమ్మకాలను నిర్వహించారు. ఈ రెండు నెలల్లోనూ డెట్ మార్కెట్ల నుంచి మొత్తంగా రూ. 45,000 కోట్లను(7.7 బిలియన్ డాలర్లు) వెనక్కి తీసుకోగా, రూ. 17,000 కోట్ల(2.8 బిలియన్ డాలర్లు) విలువైన ఈక్విటీలను విక్రయించారు. -
మీ అభిమానమే నడిపించింది
‘‘వైఎస్... ఈ పదం రాష్ట్ర గతిని మార్చింది.. రాజకీయాలకు కొత్త అర్థం చెప్పింది.. రైతులను సగర్వంగా నిలబెట్టగలిగింది..’’ అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సభలో ఆమె మాట్లాడారు. ఇచ్ఛాపురానికి రాగానే తన మనసు వైఎస్సార్‌ను గుర్తుచేసుకుంటోం దంటూ ఉద్వేగానికి గురయ్యారు. వైఎస్ మరణం తర్వాత తన కుటుంబంపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలను తలచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా.. ‘‘ఇచ్ఛాపురంలోకి ప్రవేశించినప్పటి నుంచి నా మనసు పదేపదే వైఎస్సార్‌ను గుర్తు చేసుకుంటోంది. ఆయన పాదయాత్ర అనుభూతులను గుర్తుకు తెచ్చుకుంటోంది. పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై అధికారంలోకి రాగానే దృష్టి సారించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపారు. ఇడుపులపాయలో చెప్పాను.. వైఎస్సార్ మన మధ్య లేరు. ఉన్న ఇద్దరు బిడ్డల్లో ఈ కాంగ్రెస్ పాలకులు చేస్తున్న అన్యాయాలకు, అక్రమాలకు ఒక బిడ్డ అన్యాయంగా జైల్లో ఉన్నాడు. ఇంకో బిడ్డ రోడ్డు మీదకు వస్తోంది.. ఆ బిడ్డను ఆదరించి, అక్కున చేర్చుకోవాలని అడిగాను. మీ మనవరాలిగా, మీ కూతురిగా, మీ చెల్లిగా ఈ బిడ్డను ఆదరించమని చెప్పి మీ చేతుల్లో పెట్టాను. ఈ మరో ప్రజాప్రస్థానంలో మీరు చూపిన ఆదరాభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అపురూపంగా పెరిగిన బిడ్డ ఎండలో నడుస్తుంటే చూశాను. వానలో నడుస్తుంటే చూశాను. చలి పెట్టినప్పుడు ఆలోచించాను. టెంట్‌లోకి పాములు, తేళ్లు వచ్చాయని చెప్పినప్పుడు, ఆమెకు గాయాలు అయ్యాయని చెప్పినప్పుడు, ఆ గాయాలను రాజకీయం చేసినపుడు నా మనసుకు చాలా బాధనిపించింది. మీ ప్రేమ, అభిమానం ఆ బిడ్డను ముందుకు తీసుకువెళ్తుందనే నమ్మకంతోనే పాదయాత్రకు పంపించడం జరిగింది. మా కష్టాలను మీ కష్టాలుగా భావించి షర్మిలమ్మతో కలిసి అడుగు వేసిన ప్రతి ఒక్కరికీ, ఆదరించిన ప్రజలందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. షర్మిల మీద మీరు చూపిన అభిమానికి చేతులెత్తి మొక్కుతున్నా. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని బయల్దేరారు.. వైఎస్సార్ ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు మండుటెండలు. ఆరోజు నేను ఆయనకు ఒక మాట చెప్పాను ‘ఇంత ఎండలున్నాయి, కొంచెం ఎండలు తగ్గిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో’ అని చెప్పాను. ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పారు. ‘ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.. కష్టాల్లో ఉన్నారు. చంద్రబాబు పరిపాలన చీకటి పాలన. రైతులు, పేదలు, మహిళలు, రైతుకూలీలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఓదార్చాల్సిన అవసరం ఉంది’ అని చెప్పి ఆరోజు ప్రజాప్రస్థానానికి బయలుదేరారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఆనాడు చంద్రబాబు పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో... ఈరోజు కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో ప్రజలు అలాంటి కష్టాలే పడుతున్నారు. మళ్లీ మరో ప్రజాప్రస్థానం పేరుతో ప్రజల్లోకి వచ్చి వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని ఆరోజు జగన్ భావించారు. అక్టోబర్ 5న బెయిల్ వస్తే పాదయాత్ర చేయాలని రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నాడు. కానీ విధిలేని పరిస్థితుల్లో రాలేకపోయాడు. ఆయన స్థానంలో షర్మిలమ్మ ఈ మరో ప్రజాప్రస్థానం చేయడం జరిగింది. కొంత మంది ఇది ప్రపంచ రికార్డు అని చెప్తున్నారు. ఇది రికార్డుల కోసం చేసిన పాదయాత్ర కాదు. జగన్‌ను అక్రమంగా 15 నెలలుగా జైల్లో నిర్బంధించినందుకు, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఈ పాదయాత్ర కొనసాగింది. చర్చ లేకుండా విభజన తప్పు.. తెలంగాణ అంశంపై మొదటిసారి చర్చలు జరిగినప్పుడు, శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు అప్పటికి ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు. షిండే ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్షంలో మాత్రమే వైఎస్సార్సీపీ పాల్గొంది. వైఎస్సార్ అనుకున్నట్టుగా అభివృద్ధి జరిగి ఉంటే ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు. విభజనకు ముందు మిత్రపక్షాలతో మాట్లాడినట్టుగానే పార్టీలను పిలిచి ఇదిగో ఇలా చేస్తాం.. అని చెప్పి చేస్తే బాగుండేది. ఎలాంటి చర్చలు లేకుండా అధికారం ఉంది కదా అని ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజిస్తామనడం చాలా తప్పు. సాగునీరు ఎలా కేటాయిస్తారు? కరెంటు ఎలా ఇస్తారు? హైదరాబాద్ ఉమ్మడి రాజ దాని అని చెప్పి ప్రజల్లో చిచ్చులు పెడుతున్నారు. ఒకరోజు గుంటూరు అంటారు, మరోరోజు ఒంగోలు అంటున్నారు. వీటన్నిటికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది’’ ముందు ఒక మహిళ మూడు వేలకు పైగా కిలోమీటర్లు నడిచే సాహసం చేయడానికి సిద్ధపడటం చాలా గొప్ప విషయం. మండే ఎండల్లో సైతం చెదరని చిరునవ్వులతో ఆమె ప్రజలతో మమేకమైన తీరు అద్భుతం. అది ప్రజల మీద నిజమైన ప్రేమ ఉన్న వాళ్లకే సాధ్యపడుతుంది. యాత్రలో అడుగడుగునా తనను కలిసిన వికలాంగులను, వృద్ధులను, వ్యాధి పీడితులను ఆమె ప్రేమగా గుండెలకు హత్తుకొన్నారు. ‘భయపడొద్దు.. జగనన్న ఉన్నాడు’ అనే నమ్మకాన్ని, భరోసాను కలిగించారు. కష్టాలు ఎన్ని ఉన్నా, జగన్మోహన్రెడ్డి జైల్లో ఉన్నా వైఎస్సార్ కుటుంబం తమకు అండగానే నిలబడుతుందనే నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వగలిగారు. జగన్మోహన్రెడ్డికి బెయిల్ నిరాకరించిన తరువాత కార్యకర్తలు కొంత నిరాశకు లోనయ్యారు.. వారిలో షర్మిల పాదయాత్ర కొత్త ఆశలు నింపింది. రాజకీయాలకు అతీతంగా అందరు కూడా షర్మిలను అభినందిస్తున్నారు.’’ - వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఒక మహిళ ఇన్ని వేల కిలోమీటర్లు నడవడం చరిత్రాత్మకం. జగనన్న వదిలిన బాణం గురి చూసి గమ్యాన్ని చేరింది. పీడిత, తాడిత ప్రజలకు భవిష్యత్తుపై భరోసా ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్సార్ 35 ఏళ్లు కష్టపడితే.. ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆయన కుటుంబానికీ తీరని ద్రోహం చేసింది. ముఖానికి నాలుగు రంగులు పూసుకున్న చిరంజీవికి.. సోనియాగాంధీ అడగగానే అపాయింట్మెంటు ఇచ్చారు. కానీ విజయమ్మ నెల రోజులు ప్రయత్నించినా అపాయింట్మెంటు ఇవ్వలేదు. అన్ని ప్రాంతాల్లో ప్రజలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్న తీరు చూసి వైఎస్సార్ జలయజ్ఞం పథకం తెచ్చారు. దీంతో ప్రజలు వైఎస్సార్‌ను మరో కాటన్దొరగా చూశారు. ఈ ప్రభుత్వం చేతగాక జలయజ్ఞం పథకానికి తూట్లు పొడుస్తోంది. అన్ని సంక్షేమ పథకాలు మళ్లీ అమలుకావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందే.’’ - ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), మంగళగిరి, గుంటూరు జిల్లా విభజనకు నిరసనగా రాజీనామా చేస్తా.. రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు న్యాయం చేయాలి. కానీ ఉన్న పళంగా విభజించడం బాధగా ఉంది. అందుకే రేపే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నా. గతేడాది అక్టోబర్‌లో మొదలుపెట్టి విజయవంతంగా ముగిసిన షర్మిల పాదయాత్ర దేశచరిత్రలో నిలిచిపోతుంది. వైఎస్ చనిపోయిన తరువాత ఆయన ఆశయాలను నెరవేర్చడానికి జగన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక కేసులు పెట్టారు. 14 నెలల నుంచి జైల్లో ఉంచారు. కాంగ్రెస్ కుట్రలను జనమే భగ్నం చేస్తారు. - మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ ఇటలీ రాణికి బుద్ధి చెప్పాలి వైఎస్ స్ఫూర్తితో షర్మిల చేసిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రపంచ ప్రజాప్రస్థాన పాదయాత్ర అనాలి. 230 రోజుల అలుపెరుగని యాత్రలో వివిధ వర్గాల ప్రజల పట్ల షర్మిల చూపిన అభిమానం, ఆప్యాయత అద్భుతం. రాష్ట్రాలను ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని ఇందిర, రాజీవ్‌లు కోరుకున్నారు. కానీ వారి ఆశయాలకు భిన్నంగా ఇటలీ కోడలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని విడగొట్టింది. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ నుంచి నాయకులు వైదొలగాలి. ఇటలీ రాణికి ప్రజలు బుద్ధిచెప్పాలి. - ధర్మాన కృష్ణదాస్, నరసన్నపేట ఎమ్మెల్యే చంద్రబాబుది పాతాళ యాత్ర.. పేదలకు భరోసా, ధైర్యం చెప్పడానికి షర్మిల పాదయాత్ర చేశారు. కానీ చంద్రబాబు చేసింది పాదయాత్ర కాదు. అది పాతాళ యాత్ర. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ కుటుంబం పాటుపడుతోంది. జగన్ జైల్లో ఉన్నా పేదలకు సాంత్వన చేకూర్చే ప్రక్రియ ఆగకూడదనే తన కుటుంబాన్ని జనంలోకి పంపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో మూలనపడిన సంక్షేమ పథకాలు తిరిగి తెచ్చుకుందాం. అందుకోసం వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి. రాష్ట్రాన్ని చీల్చిన సోనియా అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. - గొల్ల బాబురావు, పాయకరావుపేట ఎమ్మెల్యే సమస్యలను జగన్ తీరుస్తారు రాజశేఖరరెడ్డి పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను సీఎం అయ్యాక పరిష్కరించారు. ఇప్పుడు షర్మిల తన యాత్రలో ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను రాసుకున్నారు. జగన్ సీఎం అయ్యాక వాటిని తీరుస్తారు. ఆనాడు నిర్వీర్యమైన కాంగ్రెస్ పార్టీని రాజశేఖరరెడ్డి కాపాడితే.. ఆయన రెక్కల కష్టంతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐతో ఆయన కుటుంబాన్నే వేధిస్తోంది. - కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే ఇది చారిత్రక సందర్భం.. షర్మిలమ్మ చేపట్టిన మరో ప్రజాప్రస్థానం చారిత్రక సందర్భం. వైఎస్సార్ పాదయాత్ర ముగించిన పదేళ్ల తర్వాత షర్మిలమ్మ పాదయాత్ర చేపట్టి ఇచ్ఛాపురంలోనే ముగించడం కాకతాళీయం కాదు. అది చారిత్రక సందర్భం. సాహసంతో ఆమె చేసిన పాదయాత్ర ప్రతి గుండెను తట్టింది. సోనియా గాంధీ రాష్ట్రాన్ని కేకులా కోస్తే, చంద్రబాబు చాకుగా మారాడు. విభజించి పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చారు. - భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్యెల్యే ఎక్కడా చదవని చరిత్ర ఇది.. ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ కనపడని, చదవని చరిత్ర మరో ప్రజాప్రస్థానం. మహానేత వైఎస్సార్ మృతితో రాష్ట్రం గందరగోళంగా మారితే ప్రజలకు అండగా ఉండటానికి ఆ మహానేత కుటుంబం మేమున్నామని ముందుకొచ్చింది. సీబీఐని అడ్డం పెట్టుకుని జగన్‌ను జైల్లో పెడితే వైఎస్సార్ పార్టీ ఆగిపోతుందని భావించారు. అది జరుగదని ప్రజలు నిరూపించారు. రాష్ట్ర విభజన చారిత్రక తప్పిదం. - జూపూడి ప్రభాకర్‌రావు, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు -
ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔట్?
ముంబై: ఇటీవల వరుసగా పతనమవుతున్న షేర్ల ధరల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల విలువ మార్క్‌ను కోల్పోయే ప్రమాదంలో పడ్డాయ్. ఇందుకు డాలరుతో మారకంలో రూపాయి పతనంకూడా ప్రభావం చూపుతోంది. నిజానికి ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా 14 ఉన్నాయి. వీటిలో ఇండియాకు సైతం సభ్యత్వం ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశీయ మార్కెట్ల విలువ 1.004 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి ఇకపై షేర్ల ధరలు లేదా రూపాయి విలువ పతనమైతే తృటిలో ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను కోల్పోయే అవకాశముంది. గత వారం అటు స్టాక్ మార్కెట్లు క్షీణించడంతోపాటు, ఇటు రూపాయి విలువ కొత్త కనిష్టానికి పతనమైన నేపథ్యంలో మార్కెట్ల విలువ రూ. 61,36,641 కోట్లకు(ఒక ట్రిలియన్ డాలర్లు) పరిమితమైంది. ఈ ఏడాది ఏప్రిల్ మొదలు స్టాక్ మార్కెట్లు 4% క్షీణించగా, రూపాయి విలువ 12% పడిపోయింది. అమెరికా టాప్: ప్రస్తుతం ఇండియాసహా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల క్లబ్లో నమోదయ్యాయి. 20 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అమెరికా టాప్ ర్యాంక్‌లో నిలవగా, తదుపరి స్థానాల్లో యూకే, జపాన్, చైనా, కెనడా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా తదితరాలున్నాయి. 2007లో తొలిసారి ఇండియా ఈ క్లబ్లో సభ్యత్వాన్ని పొందింది. ఆపై 2008 సెప్టెంబర్‌లో ర్యాంక్‌ను కోల్పోయినప్పటికీ తిరిగి 2009 మే నుంచీ క్లబ్లో కొనసాగుతోంది. -
సివిల్స్ మెయిన్స్ దరఖాస్తు తేదీల ప్రకటన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 1న జరిగే మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం తెలిపింది. ఈనెల 20 నుంచి సెప్టెంబర్ 10 వరకూ అభ్యర్థులు తమ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్(డీఏఎఫ్)లను ఆన్లైన్లో సమర్పించాలి. ఇలా సమర్పించిన డీఏఎఫ్ను ప్రింట్ తీసుకోవాలని, ఆ నకలుపై అభ్యర్థి సంతకం చేసి, సంబంధిత డాక్యుమెంట్లు, ఫీజును జత చేసి సెప్టెంబర్ 18లోగా కమిషన్‌కు పంపాలని సూచించింది. అదనంగా 100 ఐఆర్ఎస్ పోస్టులు: ఆదాయపన్ను శాఖను మరింత పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని కేడర్లలోనూ భారీ సంఖ్యలో కొత్త పోస్టులు భర్తీ చేయనున్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అదనంగా 100 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) పోస్టులను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాబోయే యూపీఎస్సీ నోటిఫికేషన్లో వీటిని అదనంగా కలుపుతారు. అలాగే ఆదాయపన్ను శాఖలో దిగువ స్థాయి వివిధ కేడర్లలో 20,751 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. -
అట్టుడుకుతున్న అస్సాం
దిఫు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఆదివారం ఉధృత రూపం దాల్చాయి. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్లో ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ నేతల ఆస్తులను ధ్వంసం చేశారు. దిఫులోని నీటిపారుదల ఇంజనీర్ కార్యాలయం, ఖాదీ బోర్డు, ప్రజా పనులు, భూమి రికార్డుల కార్యాలయాలకు నిప్పుపెట్టారు. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూను పొడిగించింది. మరోపక్క.. కర్బీ అంగ్లాంగ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కర్బీ అంగ్లాంగ్ స్వతంత్ర ప్రాదేశిక మండలికిచెందిన అఖిలపక్ష నేతలు సోమవారం ప్రధాని మన్మోహన్, యూపీఏ అధినేత్రి సోనియా, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేలను కలవనున్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, కేంద్రం సానుకూల ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని అఖిలపక్ష ప్రతినిధి డేనియల్ టెరోన్ హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సోమవారం నుంచి చేయాలనుకున్న100 గంటల బంద్‌ను వాయిదా వేస్తున్నామన్నారు. పశ్చిమ బెంగాల్లో గూర్ఖాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గూర్ఖా జనముక్తి మోర్చా డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో చేపట్టిన నిరవధిక బంద్ ఆదివారం రెండో రోజూ తీవ్ర ప్రభావం చూపింది. -
కేంద్ర ఉద్యోగులకు త్వరలో 10 % డీఏ పెంపు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం సెప్టెంబర్‌లో కరువు భత్యాన్ని (డీఏ) ప్రస్తుతమున్న 80 శాతం నుంచి 90 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఈ ఏడాది జూలై 1 నుంచి దీన్ని వర్తింపజేయనుంది. దీనివల్ల సుమారు 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 30 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంపు 10-11 శాతం మధ్య ఉండొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో డీఏను 72 శాతం నుంచి 80 శాతానికి పెంచింది. దీన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేసింది. 2010 సెప్టెంబర్‌లో చివరిసారిగా డీఏ 10 శాతం పెరిగింది. మరోవైపు డీఏను 90 శాతానికి పెంచడంతోపాటు అందులో 50 శాతాన్ని మూలవేతనంలో కలపాలని కేంద్ర ప్రభుత్వోద్యోగుల సమాఖ్య సెక్రటరీ జనరల్ కె.కె.ఎన్. కుట్టీ డిమాండ్ చేశారు. డీఏను మూల వేతనంలో కలపడం వల్ల దాని నిష్పత్తిలో ఉండే ఇతర అలవెన్సులు ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తాయన్నారు. 2011 జనవరి 1 నుంచి జీవన వ్యయం వాస్తవ పెరుగుదల 171 శాతంగా ఉండటం వల్ల ప్రతిపాదిత డీఏ పెంపు వల్ల ఉద్యోగులకు పెద్దగా ఉపయోగం ఉండదన్నారు. -
జల వివాదాలపై ఒకే శాశ్వత ట్రిబ్యునల్!
న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను సత్వరమే సమన్యాయంతో పరిష్కరించేందుకు దేశంలో ఒక్కటే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇప్పుడున్న 5 అంతర్రాష్ట్ర జలవివాదాల ట్రిబ్యునళ్లను రద్దు చేసి వాటి స్థానంలో జాతీయ స్థాయిలో ఒక్కటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా నలుగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ జల విధానం ముసాయిదా 2012 కూడా శాశ్వత ట్రిబ్యునల్‌నే సూచిం చింది. ఈ మేరకు అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం-1956ను సవరించేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఒక కేబినెట్ నోట్‌ను రూపొందించింది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లను రద్దు చేసి జాతీ య స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి తొలుత 2011లో అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ చొరవ తీసుకున్నారు. పలువురు సభ్యులతో కూడిన శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం యోచి స్తోంది. ఈ ట్రిబ్యునల్‌లో ముగ్గురేసి సభ్యులతో కొన్ని ధర్మాసనాలను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటుచేసిన ట్రిబ్యునళ్లు తీర్పు ఇచ్చేసరికి ఏళ్ల తరబడి సమయం పట్టడం, ఒకవేళ తీర్పు ఇచ్చినా వాటిపై బాధిత రాష్ట్రాలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం తదితర పరిణామాలను కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది. -
మళ్లీ పుత్తడి కళకళ
గత కొన్నాళ్లుగా మెరుపు కోల్పోయిన బంగారం మళ్లీ తళుక్కుమంటోంది. సమీప కాలంలో పుత్తడి ధరలు మరింత పుంజుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రూపాయి తీవ్ర పతనం కారణంగా ఆర్బీఐ చేపట్టిన చికిత్స చర్యలే దీనికి కారణంగా నిలుస్తున్నాయి. ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) కట్టడి కారణంగా అటు స్టాక్ మార్కెట్, ఇటు బాండ్ మార్కెట్ కూడా ‘బేర్’మంటోంది. దీంతో షేర్లు, బాండ్ల నుంచి ఇన్వెస్టర్లు తమ రూట్‌ను మార్చుకుంటున్నారు. మళ్లీ బంగారంలో పెట్టుబడులకు మక్కువ చూపుతున్నారనేది నిపుణుల అభిప్రాయం. పుత్తడికి ‘పండుగే’... నెల రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో ఘోరంగా కుప్పకూలిన బంగారం ధర మళ్లీ శరవేగంగా పుంజుకుంది. ఒకానొక దశలో ఔన్స్ పసిడి 1,120 డాలర్లదాకా పడిపోయి... తిరిగి ప్రస్తుతం 1,310 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీలను ఈ ఏడాది నుంచే తగ్గించడం మొదలుపెడుతుందనే అంచనాలతో డాలరు బలం పుంజుకొని.. బంగారం పెట్టుబడుల్లో అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. అయితే, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకున్న సంకేతాలు అందాకే ప్యాకేజీల కోత ఉంటుందని ఫెడ్ చైర్మన్ బెర్నాంకీ ఇచ్చిన వివరణతో బంగారం మళ్లీ కొంత రికవరీ అయింది. అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే దేశీయంగానూ పసిడి ధర కోలుకుంటోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల ధర(10 గ్రాములు) గత శుక్రవారం రూ.435 ఎగబాకి రూ.28,665 వద్ద స్థిరపడింది. ఇక ఢిల్లీలో కూడా రూ.28,800కు చేరింది. పెళ్లిళ్లు, పండుగల సీజన్ ఈ నెలనుంచే మొదలవనుండటం కూడా పసిడికి మళ్లీ గిరాకీ పెరిగేందుకు దోహదం చేయనుంది. ఈ నేపథ్యంలో ధర త్వరలోనే మళ్లీ కీలకమైన రూ.30,000 స్థాయికి చేరడం ఖాయమంటున్నారు బులియన్ డీలర్లు. దేశీ మార్కెట్లో బంగారానికి భారీ డిమాండ్ కొనసాగుతుందని జియోజిత్ కామ్‌ట్రేడ్ హోల్‌టైమ్ డెరైక్టర్ సీపీ కృష్ణన్ అన్నారు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం రేటు 1,340 డాలర్ల పైన కొనసాగితే... మళ్లీ 1,500 డాలర్ల స్థాయిని అందుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రూపాయి ఎఫెక్ట్ కూడా... డాలరుతో రూపాయి మారకం విలువ పాతాళానికి పడిపోవడం కూడా బంగారం ధరల కదలికపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో అంతర్జాతీయంగా పసిడి ధరలు ఘోరంగా పడిన సమయంలో రూపాయి బలహీనత కారణంగా దేశీ మార్కెట్లో మరీ అంత వేగంగా దిగజారలేదు. ఇప్పుడు విదేశీ మార్కెట్లో పసిడి జోరందుకుంటుండటం... మరోపక్క, రూపాయి విలువ సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టాలకు జారిపోవడంతో దేశీయంగా బంగారం మెరుపులు మెరిపిస్తోంది. పుత్తడి దిగుమతి కోసం గతంతో పోలిస్తే ఎక్కువ రూపాయిలను చెల్లించాల్సిరావడమే దీనికి కారణం. శుక్రవారం రూపాయి ముగింపులో కొత్త ఆల్‌టైమ్ కనిష్టాన్ని(61.10) నమోదు చేసింది. గత నెల ఇంట్రాడేలో నమోదైన కనిష్టస్థాయి 61.21కి చేరువైంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి అటు ఆర్బీఐ లిక్విడిటీ కట్టడి చర్యలు, ఇటు ప్రభుత్వం ఎఫ్‌డీఐల ఆకర్షణపై దృష్టిపెట్టినప్పటికీ పెద్దగా ఫలితం చేకూరడంలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో స్టాక్స్, బాండ్ల కంటే ఇప్పుడు బంగారమే మళ్లీ సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారని చెబుతున్నారు. స్టాక్మార్కెట్లకూ రూపాయి సెగ... ‘ఒకపక్క ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతుండటం... రూపాయి పతనం నేపథ్యంలో బంగారంవైపు దృష్టి పెరుగుతోంది. రూపాయి క్షీణత ఇలాగే కొనసాగితే భారతీయులు సురక్షిత పెట్టుబడి సాధనంగా ఇక పసిడిని మాత్రమే ఎంచుకుంటారు’ అని ఇన్వెస్ట్కేర్ డెరైక్టర్ సమర్ విజయ్ వ్యాఖ్యానించారు. గత వారంలో అంతర్జాతీయ మార్కెట్లు జోరుగానే ఉన్నప్పటికీ.. దేశీ స్టాక్మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగింది. శుక్రవారం సెన్సెక్స్ మరో 154 పాయింట్లు కోల్పోయి 19,164 వద్ద స్థిరపడింది. ఎనిమిది రోజుల్లో ఏకంగా 1,138 పాయింట్లు(5.61%) సెన్సెక్స్ నష్టపోయింది. రూపాయి విలువ అడ్డూఅదుపూలేకుండా కొత్త కనిష్టాలకు పడిపోతుండటమే స్టాక్‌మార్కెట్లను కుదిపేస్తోంది. దీనికి అడ్డుకట్టవేయడం కోసం ఆర్బీఐ తీసుకున్న చర్యలు మార్కెట్లను మరింత దెబ్బతీశాయి. దీనికితోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాల బాటలోనే కొనసాగుతుండటం కూడా షేర్లకు శరాఘాతంగా మారుతోంది. ఎఫ్ఐఐలు స్టాక్స్, బాండ్లలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో మళ్లీ బంగారమే మంచి రాబడులందిస్తుందన్న భరోసాతో ఇన్వెస్టర్లు అటువైపు దృష్టిపెడుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ప్రత్యేక డిమాండ్లు అంగీకరిస్తే దేశంలో ఉండే రాష్ట్రాలు 50
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లకు కేంద్రం ఓకే చెబితే.. భవిష్యత్తులో మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయో తెలుసా? కనీసం 50. ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ 20కి పైగా ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు అందాయని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో మణిపూర్‌లో కుకీలాండ్, తమిళనాడులో కొంగునాడు, బెంగాల్లో కామ్తాపుర్, కర్ణాటకలో తుళునాడు, గుజరాత్లో సౌరాష్ట్ర వంటివి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో గుర్ఖాలాండ్, బోడోలాండ్, కర్బీ ఆంగ్లాంగ్, విదర్భ వంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇంకా భోజ్‌పూర్, కోసల, కూర్గ్, కొంకణ్, గారోలాండ్, మిథిలాంచల్, దిమాలాండ్ ప్రతిపాదనలూ ఉన్నాయి. అయితే యూపీ ప్రభుత్వం తప్ప మరే రాష్ట్ర ప్రభుత్వమూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలివ్వలేదు. మిగిలిన ‘ప్రత్యేక’ ప్రతిపాదనలన్నీ వివిధ సంస్థలు లేదా వ్యక్తుల నుంచి వచ్చినవే. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ, కాంగ్రెస్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఎక్కడెక్కడ ప్రత్యేక డిమాండ్లు..? యూపీలో నాలుగు రాష్ట్రాలు: యూపీని పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్‌ప్రదేశ్, పశ్చిమాంచల్ లేదా హరితప్రదేశ్‌గా విభజించాలనే డిమాండ్ ఉంది. మాయావతి సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపారు. గూర్ఖాలాండ్: పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ పరిసర ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ప్రస్తుతం ఊపందుకుంది. బోడోలాండ్, కర్బీ ఆంగ్లాంగ్: పశ్చిమ అస్సాంలో బోడో ప్రాబల్య ప్రాంతాలను కలిపి బోడోలాండ్గా ఏర్పాటు చేయాలని తీవ్రస్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. అలాగే అస్సాంలోని స్వతంత్ర ప్రతిపత్తి గల కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా పరిధిలో కర్బీ గిరిజన ప్రజలు నివసించే ప్రాంతాలను కలిపి కర్బీ ఆంగ్లాంగ్ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా ఊపందుకుంది. బ్రజ్ ప్రదేశ్: యూపీలోని ఆగ్రా, అలీగఢ్ డివిజన్లను, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని భరత్పూర్, గ్వాలియర్ జిల్లాలను కలిపి బ్రజ్ ప్రదేశ్‌ను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విదర్భ: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది. భోజ్‌పూర్: యూపీలోని తూర్పు ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి భోజ్పూర్ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనా ఉంది. మిథిలాంచల్: బీహార్, జార్ఖండ్‌లలో మైథిలీ భాష మాట్లాడే ప్రాంతాలను మిథిలాంచల్‌గా ఏర్పాటుచేయాలని అక్కడివారు కోరుతున్నారు. దిమాలాండ్: అస్సాం, నాగాలాండ్‌లలో దిమాసా ప్రజలు నివసించే ప్రాంతాలను వేరుచేసి దిమాలాండ్ లేదా దిమారాజి రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. కామ్తాపూర్: పశ్చిమ బెంగాల్లో కూచ్ బేహార్, జల్పాయ్గురిలతోపాటు కొన్ని జిల్లాలను కలిపి కామ్తాపూర్ రాష్ట్రం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. కోసల్: ఒడిశాలోని కొన్ని జిల్లాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి కోసల్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు. కుకీలాండ్: మణిపూర్‌లోని కుకీ గిరిజనులు నివసించే ప్రాంతాలను ప్రత్యేక కుకీలాండ్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. గారోలాండ్: మేఘాలయలోని గారో ప్రాంతాలను కలిపి గారోలాండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సౌరాష్ట్ర: గుజరాత్ నుంచి సౌరాష్ట్రను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని కూడా కోరుతున్నారు. కొంగునాడు: కర్ణాటకలోని ఆగ్నేయ ప్రాంతం, తమిళనాడులోని నైరుతి ప్రాంతం, కేరళలోని తూర్పు ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కొంగునాడు రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్ వినిపిస్తోంది. కూర్గ్: కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఉంది. తుళునాడు: కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతాన్ని తుళు నాడుగా వేరు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కొంకణ్: పశ్చిమ భారత్‌లో అరేబియా సముద్రం తీరప్రాంతం వెంబడి కొంకణి భాష మాట్లాడే ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కొంకణ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లడఖ్: జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. తూర్పు నాగాలాండ్: పై ప్రత్యేక డిమాండ్లే కాకుండా.. నాగాలాండ్‌ను కొన్ని ప్రాంతాలను వేరుచేసి తూర్పు నాగాలాండ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. -
తలసరి ఆదాయంలో హైదరాబాదే తలమానికం
సాక్షి, హైదరాబాద్: తలసరి ఆదాయమే ప్రజల స్థితిగతులకు, ఆయా ప్రాంతాల అభివృద్ధి తీరుకూ నిదర్శనం. ఈ విషయంలో రాజధాని హైదరాబాద్ దేశానికే తలమానికంగా నిలుస్తోంది. తలసరి ఆదాయాన్ని ప్రస్తుత ధరల ఆధారంగా కాకుండా కనీసం 5, 6 ఏళ్ల క్రితం నిర్ధారిత సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుంటే గణాంకాల్లో మరింత స్పష్టత ఉంటుందని, అభివృద్ధిని కచ్చితంగా లెక్కగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా 1999-2000 ఆధారంగా తీసుకొని 2007-08కి లెక్కగట్టిన గణాంకాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.26,310. హైదరాబాద్‌లో దీనికంటే 50 % అధికంగా, అంటే రూ.39,145 నమోదైంది. ప్రాంతాలవారీగా చూస్తే రూ.26,665 తలసరి ఆదాయంతో కోస్తా తొలి స్థానం లో ఉంది. తెలంగాణ తలసరి హైదరాబాద్‌తో కలిపితే రూ.27,000, విడిగా లెక్కిస్తే రూ.25,237 ఉంది. ఇక సీమలో అతి తక్కువగా రూ.23,860 తలసరి ఆదాయం నమోదైంది. 1993-94లో హైదరాబాద్ తలసరి ఆదాయం రాష్ట్ర సరాసరితో దాదాపు సమానంగానే ఉండేది. ప్రాంతాలవారీగా అప్పట్లో తెలంగాణదే ఆఖరు స్థానం. కోస్తా, సీమ తొలి, రెండో స్థానాల్లోనిలిచాయి. తలసరి ఆదాయ వృద్ధిలో ఆఖరున కోస్తా.. 2000-01 నుంచి 2007-08 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎనిమిదేళ్లలో రాష్ట్ర సరాసరి తలసరి ఆదాయం 58 శాతం, హైదరాబాద్‌లో తలసరి ఆదాయం 77 శాతం పెరిగాయి. హైదరాబాద్ ఆదాయాన్ని కలపకుండా తెలంగాణలో తలసరి ఆదాయం 60 శాతం పెరిగితే సీమలో 58 శాతం పెరిగింది. 54 శాతం వృద్ధితో కోస్తా ఆఖరు స్థానంలో నిలిచింది. ఇదీ ప్రామాణిక విధానం.. దేశంలో అభివృద్ధికి కొలమానంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)నే సూచికగా తీసుకుంటారు. జీడీపీకి మూలం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ). జీఎస్డీపీని లెక్కగట్టడానికి జిల్లా స్థూల ఉత్పత్తి (డీడీపీ)ని ఆధారంగా తీసుకుంటారు. డీడీపీ ఆధారంగా జిల్లాలు, ప్రాంతాల ఆర్థికస్థితిని, అభివృద్ధిని అంచనా వేయవచ్చు. డీడీపీ ఆధారంగా తలసరి ఆదాయాన్ని లెక్కించవచ్చు. తలసరి ఆదాయాన్ని బట్టి ఆయా ప్రాంతాల అభివృద్ధి తీరును తెలుసుకోవచ్చు. కాలపరీక్షకు నిలిచిన ఈ విధానాన్నే ఆర్థికాభివృద్ధిని లెక్కగట్టడానికి ప్రామాణికంగా తీసుకుంటున్నారు. -
పోలీస్ బాస్ ఆఫీసెక్కడ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం లభించిన నేపథ్యంలో.. పోలీసుశాఖ ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలనేది చర్చనీయాంశంగా మారింది. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో సచివాలయం తరువాత పోలీసు ప్రధాన కార్యాలయమే కీలకం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తరువాత మాత్రమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో వేర్వేరుగా పోలీసు శాఖలు ఏర్పాటయ్యే అవకాశముంది. అప్పటివరకూ ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగనుంది. అయితే.. అధికారిక ఉత్తర్వులకు ముందుగానే పోలీసు శాఖలో అందుకు సంబంధించిన పరిశీలన అనధికారికంగా సాగుతోంది. హైదరాబాద్ పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకూ రాజధానిగా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో.. ఇరు రాష్ట్రాల డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కార్యాలయాలను ఇక్కడే కొనసాగించే అవకాశముంది. కానీ, వాటిని వేర్వేరు చోట్ల ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ మేరకు ప్రస్తుతం పోలీసు ప్రధాన కార్యాలయం కొనసాగుతున్న భవనాలు తెలంగాణ రాష్ట్ర డీజీపీకే కేటాయించే అవకాశం ఉంది. లక్డీకాపూల్‌లో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఇంటెలిజెన్స్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంగా కేటాయించే అవకాశాలున్నాయి. అదే ప్రాంగణంలో ఎస్ఐబీ కోసం కొత్త భవనాల నిర్మాణం కూడా మొదలైంది. దీంతో అక్కడ డీజీపీ కార్యాలయం ఏర్పాటు సులభమవుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దాంతోపాటు ఇంటెలిజెన్స్ కార్యాలయం పక్కనే నూతనంగా నిర్మించిన రాష్ట్ర నేర పరిశోధన విభాగం(సీఐడీ) కార్యాలయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయంగా పరిశీలించే అవకాశాలున్నాయి. ఆ భవనం పక్కనే ఉన్న హైదరాబాద్ రీజియన్ ఐజీ కార్యాలయాన్ని కూడా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఐపీఎస్‌ల కేటాయింపు.. రెండు రాష్ట్రాల పోలీసు శాఖలకు ఐపీఎస్‌ల కేటాయింపు ఎలా ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో 180 మంది డెరైక్ట్ ఐపీఎస్‌లు, 30 మంది పదోన్నతి పొందిన ఐపీఎస్‌లు ఉన్నారు. మొత్తంగా కేంద్రం కేటాయించిన 258 పోస్టుల్లో వంద నుంచి 120 వరకూ తెలంగాణకు కేటాయించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఐపీఎస్‌లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్యాడర్లకు ఏ ప్రాతిపదికన కేటాయిస్తారనే అంశంపై చర్చ సాగుతోంది. ఐపీఎస్‌కు ఎంపికైన సమయంలో వారు ఇచ్చిన స్థానికతకు అనుగుణంగా మొదట వేరుచేయనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రాంతంలో పుట్టినవారిని తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టినవారిని ఆ రాష్ట్రానికి కేటాయిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ఐపీఎస్‌లను రెండింటిలో ఏ రాష్ట్రానికి వెళతారనే అభిప్రాయం కోరే అవకాశం ఉంది. ఏదో ఒక రాష్ట్రం వైపే ఎక్కువమంది మొగ్గుచూపితే.. రోస్టర్ పద్ధతిలో వారిని కేంద్ర హోంశాఖే కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏ విధానాన్ని అనుసరిస్తారనేదానిని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుందని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రస్తుతం ఎక్కువ మంది సీనియర్ ఐపీఎస్‌లు హైదరాబాద్‌లో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. తెలంగాణకు 120 మంది ఐపీఎస్‌లు.. తెలంగాణ రాష్ట్రానికి వంద నుంచి 120 మంది వరకూ ఐపీఎస్‌లు అవసరమవుతారని అధికారుల అంచనా. ఐపీఎస్ నియామకం సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ ప్రాంతానికి చెందిన డెరైక్ట్ ఐపీఎస్‌లు పదిమందిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్, విశాఖపట్నం సీపీ బి.శివధర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి(డీఐజీ) ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ప్రకాశ్‌రెడ్డి, నవీన్‌కుమార్ తదితరులున్నారు. వీరితో పాటు.. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఇతర ప్రాంతాలకు చెందిన వారిలో సీఆర్పీఎఫ్ స్పెషల్ డెరైక్టర్ జనరల్ అరుణా బహుగుణ, తేజ్‌దీప్‌కౌర్ మీనన్, అవినాష్ మహంతి ఉన్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఐపీఎస్‌కు ఎంపికైన వారిని కూడా తెలంగాణ ప్రాంతం వారిగానే పరిగణిస్తారు. -
పరిశోధనల్లో ప్రైవేటుకూ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలో శాస్త్ర పరిశోధనలకు మరింత ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో రెండు శాతం నిధులను పరిశోధనలకు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నామని, పరిశోధనల్లో ప్రైవే టు రంగానికీ భాగస్వామ్యం కల్పించేందుకు పలు పథకాలను రూపొందించామని తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 70వ వార్షికోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన జైపాల్‌రెడ్డి ప్రసంగిస్తూ... శాస్త్రీయ దృక్పథం కేవలం పరిశోధన శాలలకే పరిమితం కారాదని, సామాన్యుడి జీవితంలోని అన్ని పార్శ్వాలనూ స్పృశించాలని ఆకాంక్షించారు. ఐఐసీటీ తన పరిశోధనల ద్వారా సామాన్యుడికి చేరువయ్యే యత్నం చేస్తూనే ఉందని కొనియాడారు. ఓజోన్ పొర విచ్ఛిన్నాన్ని తగ్గించే ‘హెచ్ఎఫ్సీ 134’ రసాయనాన్ని అభివృద్ధి చేసినా, లీటర్‌కు ఏడు పైసల వ్యయంతోనే మంచినీరు అందించే మెంబ్రైన్ సాంకేతికతను సిద్ధం చేసినా, కేన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులకు చవకైన చికిత్సలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. అదంతా ఐఐసీటీకే చెల్లిందని ప్రశంసించారు. సీఎస్ఐఆర్ పరిశోధనశాలలు అభివృద్ధి చేసిన, చేస్తున్న టెక్నాలజీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తోడ్పడుతుందని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐసీటీ సంచాలకులు లక్ష్మీకాంతం, శాస్త్రవేత్తలు అహ్మద్ కమాల్, ఆర్.బి.ఎన్.ప్రసాద్, సంస్థ మాజీ సంచాలకులు పుష్పా ఎం.భార్గవ, కె.వి.రాఘవన్ తదితరులు హాజరయ్యారు. కేన్సర్ పరిశోధనలకు ప్రత్యేక కేంద్రం: ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల్లో భాగంగా సంస్థ ఆవరణలో ఏర్పాటుకానున్న మూడు కొత్త విభాగాలను జైపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. కేన్సర్ చికిత్సకు ఉపయోగపడే సరికొత్త రసాయన మూలకాలను గుర్తించేందుకు కేన్సర్ థెరప్యూటిక్ రీసెర్చ్ సెంటర్ అందులో ఒకటి. దాంతోపాటు.. వ్యాధికారక కీటకాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేసేందుకు, తద్వారా సాంక్రమిక వ్యాధులను నియంత్రించేందుకు ఐఐసీటీ ‘మెటిరిలాజికల్ టవర్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ ఆన్ వెక్టార్ కంట్రోల్ ప్రోగ్రామ్’ను ప్రారంభించింది. సామాన్యుడి కోసం కృషిచేస్తాం.. ‘‘పర్యావరణ అనుకూల ఇంధన వనరుల అభివృద్ధి, వేర్వేరు వ్యాధుల చికిత్సకు అవసరమైన మందుల ధరలను అందరికీ అందుబాటులోకి తేవడం, రసాయన పరిశ్రమల్లో కాలుష్యాన్ని తగ్గించి వాటిని సుస్థిర అభివృద్ధి వైపు నడిపించడం ప్రస్తుతం మా ముందున్న లక్ష్యాలు, వీటితోపాటు అత్యాధునిక పదార్థాల అభివృద్ధి, వ్యవసాయ సంబంధిత పరిశోధనలూ కొనసాగిస్తాం. సామాన్యుడికి అవసరమైన పరిశోధనలు చేసేందుకు పునరంకితమవుతాము’’ - లక్ష్మీకాంతం, ఐఐసీటీ హైదరాబాద్ సంచాలకులు -
హైకోర్టు సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయవాది, క్రిమినల్ కేసుల వాదనలో దక్షిణభారతదేశంలోనే దిట్టగా పేరొందిన సి.పద్మనాభరెడ్డి(82) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. పద్మనాభరెడ్డి స్వగ్రామం అనంతపురం జిల్లా యాడికి. ఆయనకు భార్య ఇందిరమ్మ, కుమారుడు ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. పద్మనాభరెడ్డి సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చిన్నపరెడ్డికి తోడల్లుడు. గ్యాస్ట్రిక్ సమస్యతో పద్మనాభరెడ్డి పది రోజులుగా సోమాజిగూడలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వైద్యులు అత్యవసర వైద్యం ప్రారంభించారు. అయితే ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో గుండెపోటు రావడంతో పద్మనాభరెడ్డి తుదిశ్వాస విడిచా రు. ఈ సమాచారంతో రాష్ట్రంలోని న్యాయవాదులంతా దిగ్భ్రాంతి కి గురయ్యారు. పద్మనాభరెడ్డి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ రోడ్డు నం.10సీలోనున్న ఆయన స్వగృహానికి తరలించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ నౌషద్ అలీ, జస్టిస్ రోహిణి, సాక్షి మీడియా గ్రూపు చైర్పర్సన్ వైఎస్ భారతి, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు కె.నారాయణ, బీవీ రాఘవులు, పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రముఖులు పద్మనాభరెడ్డికి నివాళులర్పించారు. న్యాయవాద వృత్తిలో విశేషమైన రాణింపుతో ఓ గురువులా బాసిల్లిన పద్మనాభరెడ్డికి నివాళులర్పించేందుకు న్యాయమూర్తులు, భారీ సంఖ్యలో న్యాయవాదులు ఆయన నివాసానికి వచ్చారు. పద్మనాభరెడ్డి అంత్యక్రియలు సోమవారం ఉదయం ఎర్రగడ్డలోని హిందూ శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వృత్తిలో ఓ శిఖరం... పద్మనాభరెడ్డి 1931, మార్చి 18న అనంతపురం జిల్లా యాడికిలో ఓబుల్‌రెడ్డి, సోమక్క దంపతులకు జన్మించారు. ఓబుల్‌రెడ్డి కడప జిల్లా చామలూరు నుంచి యాడికి వచ్చి స్థిరపడ్డారు. యాడికి, తాడిపత్రిలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన పద్మనాభరెడ్డి ఇంటర్మీడియెట్ గుంటూరులో, డిగ్రీ అనంతపురంలో చదివారు. మద్రాస్‌లో న్యాయవిద్యను అభ్యసించిన ఆయన మద్రాస్ హైకోర్టులోనే 1953 జూలై 27న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. అక్కడ వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఆంధ్ర రాష్ట్రం అవతరణలో గుంటూరులో ఏర్పాటైన హైకోర్టులోనూ ప్రాక్టీస్ చేశారు. తరువాత 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణతో హైకోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటు కావడంతో పద్మనాభరెడ్డి కూడా ఇక్కడే న్యాయవాదిగా సేవలందించారు. తనకు సమీప బంధువైన ప్రముఖ న్యాయకోవిదులు, సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఈ ప్రస్థానంలో ఎన్నో క్రిమినల్ కేసుల్లో వాదనలు వినిపించారు. హైకోర్టుకొచ్చే ఈ కేసుల్లో దాదాపు సగం వరకు ఆయనే హాజరయ్యేవారంటే అతిశయోక్తి కాదు. సంచలన పార్వతీపురం కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసులు తప్పుడువని నిరూపించి నిందితులను నిర్దోషులుగా విడిపించిన ఘనత ఆయనదే. పద్మనాభరెడ్డికి ప్రముఖుల నివాళి ‘‘ న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కల్గించిన వ్యక్తుల్లో పద్మనాభరెడ్డి ఒకరు. ఏ కేసైనా వాదనల్లో ఆయనకు ఆయనే సాటి. ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పే ఆయనంటే న్యాయవాదులకే కాదు న్యాయమూర్తులకూ ప్రత్యేక గౌరవం. కేసులో నిందితుడు పేదవాడా, ధనికుడా అనేది కాకుండా న్యాయాన్ని గెలవాలనే తపనతోనే వాదనలు వినిపించేవారు.’’ - జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి ‘‘దాదాపు ఆరు దశాబ్దాల వృత్తి జీవితంలో పద్మనాభరెడ్డి తన గొప్పతనాన్ని రుజువు చేసుకొన్న సందర్భాలెన్నో ఉన్నాయి. వృత్తి పట్ల నిబద్ధతే ఆయన్ను అగ్రస్థానంలో నిలబెట్టింది. అంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా సాధారణ వ్యక్తిలా మసలుకోవడం ఆయనకే సాధ్యమైంది. విలువలకు ప్రాముఖ్యతనిచ్చిన గొప్ప మానవతావాది.’’ - జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి ‘‘పద్మనాభరెడ్డి మరణం న్యాయవ్యవస్థకు, రాష్ట్ర హైకోర్టుకు తీరని లోటు. న్యాయవ్యవస్థకు ఆయన సేవలు అజరామరం. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా తనను ఆశ్రయించిన క్షక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి తపనపడటం ఆయనకే చెల్లింది.’’ - జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి ‘‘క్రిమినల్ కేసుల వాదనలో అపారమైన అనుభవమున్న ప్రముఖ న్యాయవాదే అయినా పద్మనాభరెడ్డిలో ఎప్పుడూ ఆ గర్వం కనిపించేదికాదు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చినవారికి ఆయనో మార్గదర్శి. వారి సందేహాలు నివృత్తి చేయడమే కాదు ఏ సహాయం అడిగినా కాదనేవారు కాదు.’’ -సీవీ మోహన్‌రెడ్డి, మాజీ అడ్వొకేట్ జనరల్ ‘‘పౌర, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం జస్టిస్ జీవన్‌రెడ్డి, పత్తిపాటి వెంకటేశ్వర్లు, పద్మనాభరెడ్డితో కలిసి పనిచేశా. హక్కుల ఉద్యమకారులపై పెట్టిన కేసుల్లో పద్మనాభరెడ్డి వారికి అండగా నిలిచేవారు. ఆయన మరణం అట్టడుగు వర్గాలకు తీరని లోటు.’’ - బొజ్జా తారకం, హైకోర్టు సీనియర్ న్యాయవాది ‘‘అత్యంత వివాదాస్పదమైన, క్లిష్టమైన కేసుల్లో తలెత్తే ఎన్నో సందేహాలను పద్మనాభరెడ్డి న్యాయవాదులకు నివృత్తి చేసేవారు. అయినా ఆయన ఏ న్యాయవాదినీ చిన్నచూపు చూసిన సందర్భం ఒక్కటీ లేదు. అదీ ఆయన గొప్పదనం.’’ - సి.నాగేశ్వర్రావు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు ‘‘పద్మనాభరెడ్డి ప్రజాస్వామ్య ఉద్యమాలకు పునాదిగా ఉన్నారు. పేదలకు ఉచిత న్యాయసహాయం అందించడమేకాక వారికి మనోధైర్యాన్ని ఇచ్చేవారు. సహాయం కోసం ఎవ్వరు, ఏ సమయంలో వచ్చినా అండగా నిలిచేవారు.’’ - సావిత్రి, పద్మనాభరెడ్డి జూనియర్ లాయర్ -
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: శరద్‌పవార్
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయకుడదని నిర్ణయించుకున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరత్ పవార్ వెల్లడించారు. ఇంకా ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఎలా ఉంటాను అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం సీఎన్ఎన్-ఐబీఎన్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉన్నారా అని ఆ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు శరత్ పవార్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుడదని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అయితే రాజ్యసభకు వెళ్లవచ్చు అని ఆయన ఈ సందర్భంగా చమత్కరించారు. అది ఒక్కటే ఉన్న ఎకైక మార్గమని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా నిడివి లేకుండా పార్లమెంట్ లేదా లోక్‌సభ సభ్యునిగా 46 ఏళ్లుగా కొనసాగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాన మంత్రి పదవి రేసులో ఎందుకు లేరు అన్న ప్రశ్నకు శరద్‌పవార్ స్పందిస్తూ... సమాజంలో అన్ని వర్గాల నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే వారితో మంచి స్నేహం కూడా ఉందని ఆయన చెప్పారు. ఆ అత్యున్నత పదవిని ఆశించడం లేదన్నారు. తాను వాస్తవిక రాజకీయవాదినని శరద్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 1967లో మహారాష్ట అసెంబ్లీకి సభ్యునిగా ఎన్నికై శరద్‌పవార్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాగే కేంద్రంలో రక్షణ, ఆహార మంత్రిత్వశాఖలను నిర్వహించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ సర్కార్‌లో ఆయన వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజీవ్‌గాంధీకి అత్యంత సన్నిహితుల్లో శరద్ పవార్ ఒకరు. అయితే 1991లో రాజీవ్‌గాంధీ హత్యానంతరం ఆయన ప్రధాన పదవికి రేసులో ఉన్నారు. అయితే ఆ పదవి పీ.వీ.నరసింహరావును వరించింది. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ క్రమంలో మాజీ లోక్‌సభ స్పీకర్ పీ.ఏ.సంగ్మా, తారీఖ్ అన్వర్లతో కలసి ఎన్సీపీని స్థాపించారు. 1999లో కాంగ్రెస్‌పార్టీ,ఎన్సీపీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే.