Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Victory In AP Assembly Elections says Majority Exit Polls 2024
వైఎస్సార్‌సీపీదే ఏపీ.. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తూ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సింహభాగం మీడియా, సర్వే సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచి్చన విప్లవాత్మక మార్పులకు జనం జై కొట్టారని స్పష్టం చేశాయి. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి కంటే మహిళలు 12 శాతం అధికంగా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసి, ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టించడానికి దోహదం చేశారని ఆరా (మస్తాన్‌), చాణక్య (పార్థదాస్‌) తేల్చాయి. జాతీ­య, రాష్ట్ర మీడియా, సర్వే సంస్థలు, సెఫాలజిస్టు­లు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేలను క్రోడీకరించి శనివారం ఫలితాలను వెల్లడించా­యి. తెలుగు రాష్ట్రాల్లో ఆరా సంస్థ అధినేత మస్తాన్‌ నిర్వహించే సర్వే, ఎగ్జిట్‌ పోల్స్‌కు అత్యంత విశ్వసనీయత ఉంది. గతేడాది ఆఖర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని.. కామారెడ్డిలో అప్పటి సీఎం కేసీఆర్, ఇప్పటి సీఎం రేవంతరెడ్డిలు ఇద్దరూ ఓడిపోతారని.. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణారెడ్డి విజయం సాధిస్తారని ఎగ్జిట్‌ పోల్, పోస్ట్‌ పోల్‌ సర్వేలో బల్లగుద్ది చెప్పారు. ఎన్నికల ఫలితాల్లో అదే వెల్లడైంది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్స్‌ సర్వేను ఆరా మస్తాన్‌ విస్తృత స్థాయిలో నిర్వహించారు. 49.41 శాతం (మహిళలు 54.76 శాతం, పురుషులు 45.35 శాతం) ఓట్లతో 94 నుంచి 104 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్, పోస్ట్‌ పోల్‌ సర్వేల్లో వెల్లడైందని ఆరా మస్తాన్‌ వెల్లడించారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి 47.55 శాతం ఓట్లతో 71–81 శాసనసభ స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చి చెప్పారు. లోక్‌సభ స్థానాల్లో 13–15 సీట్లలో వైఎస్సార్‌సీపీ, 10–12 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించారు. సీఎం జగన్‌ సంక్షేమాభివృద్ధి పథకాలు.. వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దకే ప్రజలకు అందించడం వైఎస్సార్‌సీపీ ఘన విజయానికి దోహదం చేశాయని ఆరా మస్తాన్‌ స్పష్టం చేశారు. మహిళలు సీఎం జగన్‌ నాయకత్వానికి బ్రహ్మరథం పట్టడం వల్ల ఫ్యాన్‌ ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చి చెప్పారు. ప్రతిష్టాత్మక చాణక్య సంస్థ అధినేత పార్థదాస్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ అదే వెల్లడైంది. 50 శాతం ఓట్లతో 110–120 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించి, అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పా­రు. ఎన్‌డీఏ కూటమి 55–65 స్థానాలకే పరిమితమవు­తుందని స్పష్టం చేశారు. ఆత్మసాక్షి, రేస్, ఆపరేషన్‌ చాణక్య, పోల్‌ స్ట్రాటజీ, అగి్నవీర్, పోల్‌ లాబొరేటరీ, జన్మత్‌ పోల్, సీపీఎస్‌ తదితర సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీ విజ­యం సాధించడం ఖాయమని వెల్లడైంది. కాగా, టైమ్స్‌ నౌ ఈటీజీ సంస్థ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ 11 సీట్లలో కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 120కి పైగా అసెంబ్లీ స్థానాలు కైవసం చేసు­కుని మరోమారు అధికారం చేపట్టడం ఖాయ­మ­ని క్యూ మెగా అమేజీ పొలిటికల్‌ సొల్యూషన్స్‌ సీఈవో ఖాదర్‌ ఖాన్‌ పఠాన్‌ తెలిపారు. 22 పార్లమెంట్‌ స్థానాలు పక్కాగా కైవసం చేసుకుంటుందని.. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉందని.. అవి కూడా వ­చ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శనివా­­రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే 2024 రిపోర్టును ఆయన వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పిన జాతీయ మీడియా లెక్కలు గతేడాది నవంబర్‌లో ఛత్తీస్‌గఢ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు పూర్తిగా తప్పాయి. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా, ఎన్‌డీటీవీ, ఈటీజీ, జన్‌కీ భాత్, పోల్‌స్టార్, టుడేస్‌ చాణక్య, మ్యాట్రిజ్, సీ ఓటర్, సీఎన్‌ఎక్స్, దైనిక్‌ భాస్కర్‌ తదితర సంస్థలు తేల్చి చెప్పాయి. కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అధికారంలోకి వచ్చింది. జాతీయ మీడియా సంస్థలు రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నది ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాలతో నిరూపితమైంది. ఫలితాలు వెల్లడించొద్దంటూ సెఫాలజిస్ట్‌లపై ఒత్తిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఏ పార్టీ బలం పుంజుకుంది.. ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది కచి్చతంగా అంచనా వేయగలిగే సెఫాలజిస్ట్‌లు పదుల సంఖ్యలో ఉన్నారు. వారు తమ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించి, శనివారం ఫలితాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. ఆ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైందని తెలుసుకున్న టీడీపీ నేతలు.. వాటిని వెల్లడించవద్దంటూ సెఫాలజిస్ట్‌లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ సెఫాలజిస్టు ఫలితాలను తారుమారు చేసి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ 93 స్థానాల్లో, టీడీపీ కూటమి 80 స్థానాల్లో, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధిస్తారని తాము నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైతే.. టీడీపీ నేతల ఒత్తిడి తాళలేక వాటిని తారుమారు చేసి చెప్పాల్సి వచ్చిందని వాపోయినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కౌంటింగ్‌ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడైనా సరే దొడ్డిదారిన విజయం సాధించడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని మరోసారి నిరూపితమైంది.బీజేపీ వాణి విన్పించిన జాతీయ మీడియా దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ స్థానాల్లో జాతీయ మీడియా బీజేపీ వాణి వినిపించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సింహభాగం స్థానాల్లో విజయం సాధిస్తుందని.. మోదీ మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పాయి. ఇండియా టుడే, ఎన్‌డీటీవీ, న్యూస్‌–18 వంటి జాతీ­య మీడియా సంస్థలు ఎన్‌డీఏకే పట్టం కడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించాయి. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎన్‌డీఏకు 400 లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తే.. ఒకట్రెండు జాతీయ మీడియా సంస్థలు ఎన్‌డీఏకు 401 స్థానాలు వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడించడం గమనార్హం.

Sakshi Editorial On Exit polls 2024
విజయం సరే... విలువలు?

ఈ నేల మీద భగవంతుడి ప్రస్థానమే రాజ్యం. సుప్రసిద్ధ జర్మన్‌ తత్త్వవేత్త హెగెల్‌ చేసిన సూత్రీకరణ ఇది. హెగెల్‌ నుంచి స్ఫూర్తి పొందిన వారిలో కార్ల్‌ మార్క్స్‌ వంటి తత్త్వవేత్తలే కాదు, మన ప్రధాని మోదీ వంటి వారు కూడా ఉన్నారు. ఇది నిన్న మొన్ననే నిగ్గుతేలినటువంటి ఒక నగ్నసత్యం. హెగెల్‌ సూత్రీకరణను మోదీ మరింత విప్లవీకరించారు.ఒక ప్రత్యేక కార్యం కోసం దేవుడు పంపగా వచ్చిన దూతను తానని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ దేవుని తరఫున ఈ భూమ్మీద తన ప్రస్థానమే రాజ్యమని ఆయన భావన కావచ్చు. ఇందుకోసం ఆయన ఫ్రాన్స్‌ చక్రవర్తి పద్నాలుగో లూయీని అరువు తెచ్చుకున్నారు. ‘ఐయామ్‌ ది స్టేట్‌’ (నేనే రాజ్యం) అనే కొటేషన్‌తో పద్నాలుగో లూయీ చరిత్రలో నిలబడిపోయిన సంగతి తెలిసిందే.హెగెల్‌ గతితర్కాన్ని, లూయీ నిరంకుశత్వాన్ని గ్రైండర్‌లో వేయగా వచ్చిన సింథసిస్‌నే మోదీ తన దేవదూత కార్యంగా ప్రకటించారనుకోవాలి. తాను పొలిటికల్‌ సైన్స్‌తో ఎమ్మే చదివానని ఏదో సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. కనుక థామస్‌ హాబ్స్‌ తత్త్వధారను కూడా ఆయన అనివార్యంగా చదివుండాలి. హాబ్స్‌ ప్రతిపాదించిన సంపూర్ణ సార్వభౌమాధికార ప్రతిపాదన మోదీ మనసును రంజింపజేసి ఉండవచ్చు.‘‘నేను అందరిలానే పుట్టానని అమ్మ చనిపోయేంతవరకు అనుకునేవాడిని. కానీ, ఆ తర్వాత అర్థమైంది నాకు. దేవుడు ఏదో ప్రత్యేక కార్యం కోసం నన్ను పంపించాడు. నా ద్వారా ఆయన అమలు చేయానుకుంటున్న పథకం సమగ్ర స్వరూపం నాక్కూడా తెలియదు. ఆయన ఆదేశిస్తాడు, నేను అమలు చేస్తాన’’ని ప్రధానమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బహుశా దేవుడు ఆశిస్తున్న సమగ్ర పథకాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్‌లో బీజేపీకి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలేమో! అంతవరకే దేవుడు చెప్పి ఉంటాడు. అందుకోసమే ఈ ఎన్నికల్లో ‘అబ్‌ కీ బార్‌... చార్‌ సౌ పార్‌’ అనే నినాదాన్ని మోదీ ఎత్తుకున్నారు. ఆ నినాదం కేవలం దైవ సంకల్పం!అధికారంలోకి రావడానికి సాధారణ మెజారిటీ (272) చాలు. మరి ‘చార్‌ సౌ పార్‌’ కోసం ఎందుకింత ధ్యాస. ఎందుకిన్ని ధ్యానాలు, ఎందుకిన్ని దండాలు? ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా రాజ్యాంగాన్ని మార్చడానికేనా? రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను ఎత్తివేయడానికా? బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షించిన రాజ్యాంగ ఆదేశాలను తుంగలో తొక్కడానికా? రిజర్వేషన్లు ఎత్తివేయడానికా?... అవి ప్రతిపక్షాలు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ఆరోపణలు చేస్తాయని కూడా అనుకోవచ్చు.భారీ మెజారిటీ ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉండవచ్చన్నది బీజేపీ నేతల తలపోత కావచ్చు. ఇప్పటికే పట్టుబిగించిన ప్రజాస్వామ్య వ్యవస్థలపై మరింత బిగువుగా పెత్తనం కొనసాగించవచ్చు. ప్రతిపక్షాలను నలిపేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థల స్థాయికి దిగజార్చి కేంద్ర సార్వభౌమాధికారాన్ని పటిష్ఠం చేయవచ్చు. ఏమో... దేవుడు ఆదేశిస్తే పార్లమెంటరీ వ్యవస్థ కొమ్మలు నరికి అధ్యక్ష పాలనను అంటుకట్టవచ్చు. ఈ రకమైన బృహత్కార్యాలను అమలు చేయాలంటే ఎన్డీఏ కూటమికి ఆ మాత్రం మెజారిటీ అవసరమవుతుంది.కానీ, ఎన్డీఏ 400 మార్కును దాటే అవకాశం కనిపించడం లేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్కల ప్రకారం గతంలో ఉన్న బలాన్నే యధాతథంగా కాపాడుకునే అవకాశం కనిపిస్తున్నది. ఇది మూడింట రెండొంతుల మెజారిటీకి ఓ రెండడుగుల దూరం. జాతీయ మీడియా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ఇచ్చిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రచార ఘట్టంలో ఎన్డీఏ నాయకత్వంలో కనిపించిన అసహనం, ప్రతిపక్షాలపై వారు అవధులు దాటి చేసిన ఆరోపణలు, మైనారిటీ మతాన్ని టార్గెట్‌గా చేసుకొని సాగించిన అనైతిక ప్రచారం వగైరాలు మారుతున్న రాజకీయ వాతావరణానికి సంకేతాలుగా చాలామంది భావించారు.ప్రతిపక్షాలను నిందించడం కోసం మహాత్మాగాంధీ పేరును మోదీ వాడుకున్న తీరు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ‘గాంధీ సినిమా (1982) వచ్చేవరకూ ఆయన గురించి ప్రపంచంలో పెద్దగా తెలియదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ప్రమోట్‌ చేయలేదు. మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలా కంటే గాంధీ ఏం తక్కువ? వాళ్లకొచ్చినంత పేరు గాంధీకి రాలేదంటే అప్పటి ప్రభుత్వాలే కారణమ’ని ఆయన ఏబీపీ ఇంటర్వ్యూలో ఆక్షేపించారు.ప్రతిపక్షాల మీద ప్రధాని విచక్షణా రహితంగా చేసిన దాడుల్లో భాగంగానే దీన్ని పరిగణించాలేమో! ఎందుకంటే గాంధీకి దేశదేశాల్లో ఉన్న ప్రాచుర్యం గురించి ప్రధానికి తెలియదనుకోవడం నమ్మశక్యంగా లేదు. గాంధీ మరణాన్ని ఆ రోజుల్లోనే సకల దేశాల్లోని వార్తా పత్రికలు బ్యానర్‌ వార్తగా ప్రకటించాయి. మోదీ ఉదాహరించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్, నెల్సన్‌ మండేలాలే స్వయంగా తాము గాంధీ నుంచి స్ఫూర్తి పొందామని పలుమార్లు ప్రకటించారు. గాంధీ ప్రవచించిన అహింసాయుత ఆందోళనా పద్ధతులనే మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అమెరికాలో ఆచరణలో పెట్టారు.గాంధీ పుట్టిన భారతదేశాన్ని సందర్శించాలన్న ఆకాంక్షను కూడా ఆ రోజుల్లో కింగ్‌ వెల్లడించారు. పండిత్‌ నెహ్రూ ఆహ్వానంపై 1956లో ఆయన ఇండియాలో దిగిన వెంటనే చెప్పిన మాట ఎన్నటికీ మరపునకు రాదు. ‘నేను విదేశాలకు పర్యాటకునిగా వెళ్తుంటాను. కానీ, ఈ దేశానికి ఒక యాత్రికునిగా వచ్చాన’న్నారు. అన్యాయానికి, వివక్షకు గురయ్యే సకల దేశాల ప్రజానీకానికి సత్యాగ్రహమనే దివ్యాస్త్రాన్ని ప్రసాదించిన మహాత్మాగాంధీ పుట్టిన దేశం ఆనాటి మహోన్నతుల దృష్టిలో ఒక యాత్రాస్థలమే. నల్ల సూర్యుడు మండేలా కూడా తన స్ఫూర్తిప్రదాతగా గాంధీని పేర్కొన్నారు. ‘గాంధీ ఆఫ్‌ సౌతాఫ్రికా’గా తనను పరిగణించడాన్ని గర్వంగా భావించారు.రిచర్డ్‌ అటెన్‌బరో తీసిన సినిమా చూసేవరకూ ప్రపంచానికి గాంధీ తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీపై ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ లాంటి సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, విజ్ఞానులు, దేశాధినేతలు చేసిన వ్యాఖ్యానాలను వారు ఉటంకిస్తున్నారు. ‘ఇటువంటి వ్యక్తి (గాంధీ) ఒకరు ఈ నేల మీద రక్తమాంసాలతో నడయాడాడంటే భవిష్యత్తు తరాలు నమ్మకపోవచ్చ’ని ఐన్‌స్టీన్‌ చెప్పిన మాటలు మనకు సుపరిచితమైనవే. ప్రపంచంలోనే ఆల్‌టైమ్‌ అగ్రశ్రేణి నవలాకారుడు, రష్యన్‌ రచయిత లియో టాల్‌స్టాయ్‌ – గాంధీల మధ్యనున్న స్నేహబంధం, నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కూడా ప్రపంచానికి తెలుసు.విఐ లెనిన్, విన్‌స్టన్‌ చర్చిల్, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్, మార్టిన్‌ లూథర్‌కింగ్, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్, అడాల్ఫ్‌ హిట్లర్, మావో జెడాంగ్, నెల్సన్‌ మండేలా, పండిత్‌ నెహ్రూ, మదర్‌ థెరిసా, మార్గరెట్‌ థాచర్‌ తదితర శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులు ఇరవయ్యో శతాబ్దాన్ని శాసించారు. వీరందరిలోకి అత్యంత శక్తిమంతుడిగా మహాత్మాగాంధీ గుర్తింపుపొందడమే కాకుండా ఈ జాబితాలోని పలువురి అభిమానాన్ని, గౌరవాన్ని కూడా ఆయన చూరగొన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరవయ్యో శతాబ్దం – గాంధీ శతాబ్దం!అటువంటి గాంధీ మహాత్ముడిని సరిగ్గా ప్రమోట్‌ చేయలేకపోయారని ప్రధాని వాపోవడం ఒక ప్రకృతి వైచిత్రి. కార్పొరేట్‌ శక్తులన్నీ కలిసి ప్రమోట్‌ చేసి గద్దెనెక్కించడానికి ఆయనేమన్నా గుజరాత్‌ మోడలా? గాంధీ పుట్టింది గుజరాతే. కానీ ఆయన భారతీయ ఆత్మకు ప్రతీక. భారతీయ సహజీవనానికి ప్రతీక. భారతీయ సంస్కృతికి, భారతీయ సమైక్యతకు ప్రతీక. పల్లె స్వరాజ్యాన్ని ప్రేమించినవాడు. ఈశ్వరుడూ – అల్లా ఒకరేనని భజనలు చేసినవాడు. విద్వేషాన్ని ప్రేమతో జయించినవాడాయన. ఆయనే ఒక మూర్తీభవించిన భారతీయత. ఆయనను ప్రభుత్వాలు ప్రమోట్‌ చేయడమేమిటి? ఇన్నేళ్ల తర్వాత ఈ విషయంలో ప్రధాని వ్యాకులత చెందడం ప్రజలకు అసహజంగా అనిపించింది.మోదీజీ తీసిన ‘గాంధీ బాణం’ ఎన్నికల కోసమేనన్నది అందరికీ అర్థమవుతూనే ఉన్నది. ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన ఊహించని కొత్త పుంతలు తొక్కారు. ఫైవ్‌ ట్రిలియన్‌ ఎకానమీ ఊసే లేదు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌పై చర్చే లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని అటకపై నుంచి మళ్లీ కిందికి దించలేదు. విదేశాల నుంచి బ్లాక్‌ మనీని తీసుకొస్తానన్న పదేళ్ల కిందటి హామీని పొరపాటున కూడా మళ్లీ ప్రస్తావించలేదు. రైతులకు గిట్టుబాటు ధరలపై స్వామినా«థన్‌ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని పదేళ్ల కింద ఇచ్చిన హామీకి చెదలు పట్టాయి. కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనకు సమయం సరిపోలేదు.జనజీవన స్రవంతి నుంచి ముస్లిం మతస్థులను వేరు చేసే ప్రయత్నం ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు ముమ్మరంగా చేశారు. ఈ విధ్వంసకర ధోరణికి సాక్షాత్తు ప్రధానే నాయకత్వం వహించారు. ప్రతిపక్షాలను ‘ముజ్రా’ డ్యాన్సర్లుగా అభివర్ణించారు. బీజేపీ గెలవకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ముస్లింలు లాగేసుకుంటారని రెచ్చగొట్టారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల మంగళ సూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతారని దారుణమైన ఆరోపణలు చేశారు. సమాజాన్ని విభజించే విత్తన బంతులను య«థేచ్ఛగా వెదజల్లారు. ఈ పని చేసినందుకు యావత్తు భారతదేశం చింతించవలసిన రోజు రావచ్చు. ఇదంతా చేసింది ‘చార్‌ సౌ పార్‌’ కోసమేనా?ఒకవేళ ఎన్డీఏ కూటమి 400 సీట్ల మార్కు దాటినా, అందుకు కారణం ఈ విద్వేష ప్రచారం కాబోదు. ప్రత్యామ్నాయ కూటమి సమర్ధతపై జనానికి నమ్మకం కుదరకపోవడం కావచ్చు. ఈసారి కూడా గెలిస్తే నెహ్రూ తర్వాత వరసగా మూడు ఎన్నికల్లో గెలిచిన ప్రధానిగా ఆయన రికార్డును మోదీ సమం చేస్తారు. కానీ, జనంలో నాటిన విద్వేష బీజాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయన్నదే బుద్ధిజీవుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Exit Poll 2024: Narendra Modi-led NDA set for hattrick with 355-370 seats
Exit Poll 2024: భారీ మెజార్టీతో ఎన్డీఏ హ్యాట్రిక్‌

ఎన్డీఏ హ్యాట్రిక్‌ ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజా రిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. బీజేపీ యూపీలో స్థానాలను పెంచుకోవడంతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తుందని కర్ణాటకలో హవా కొనసాగించడమే గాక బెంగాల్లో చొచ్చుకుపోతుందని చెప్పాయి. కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి 150 మార్కు దాటొచ్చని తెలిపాయి. న్యూఢిల్లీ: కేంద్రంలో పాలక ఎన్డీఏ కూటమిదే మళ్లీ అధికారమని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. భారీ మెజారిటీతో కూటమి హ్యాట్రిక్‌ కొట్టడం, నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అభిప్రాయపడ్డాయి. శనివారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్‌ ముగుస్తూనే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లువెత్తాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లో మరోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని వాటిలో చాలావరకు పేర్కొన్నాయి. కర్నాటకలో కూడా బీజేపీ హవాయే కొనసాగుతుందని, పశ్చిమబెంగాల్లో మరింతగా చొచ్చుకుపోతుందని వెల్లడించడం విశేషం. బిహార్, రాజస్తాన్, హరియాణాల్లో మాత్రం ఎన్డీఏకు సీట్లు కాస్త తగ్గుతాయని అంచనా వేశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విపక్షాల అవకాశవాద రాజకీయాలను జనం పూర్తి గా తిరస్కరించారన్నారు. వాస్తవ ఫలితాల్లో తమకు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను మించి వస్తాయని ధీమా వెలిబుచ్చారు. కాంగ్రెస్‌ మాత్రం ఎగ్జిట్‌ పోల్స్‌ను మోదీ ప్రభావితం చేశారని ఆరోపించింది. వాస్తవ ఫలితాలు చాలా భిన్నంగా రాను న్నాయని విశ్వాసం వెలిబుచి్చంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో ఇప్పుడిక అందరి కళ్లూ జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపు జరిగాక రాబోయే అసలు ఫలితాలపైనే కేంద్రీకృతమయ్యాయి. ఏ సర్వే ఏం చెప్పింది...? ఇండియాటుడే–మై యాక్సిస్‌ ఎగ్జిట్‌ పోల్‌ ఎన్డీఏకు 361 నుంచి 401 స్థానాలిచి్చంది. ఇండియా కూటమికి 131 నుంచి గరిష్టంగా 166 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 368 దాకా వస్తాయని రిపబ్లిక్‌ భారత్‌–మారై్టజ్‌ సర్వే పేర్కొంది. ఇండియా కూటమికి 133, ఇతరులకు 48 రావచ్చని తెలిపింది. ఎన్డీఏకు 392 దాకా, ఇండియాకు 161, ఇతరులకు 20 దాకా రావచ్చని జన్‌ కీ బాత్‌ అభిప్రాయపడింది. ఎన్డీఏకు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న మేరకు 401 స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్‌ అంచనా వేయడం విశేషం. ఇండియా కూటమికి 139, ఇతరులకు 38 స్థానాలు రావచ్చని తెలిపింది. టుడేస్‌ చాణక్య కూడా కూడా ఎన్డీఏకు 385 నుంచి ఏకంగా 415 సీట్లిచి్చంది! ఇండియా కూటమి 96 నుంచి 118 మధ్య సాధిస్తుందని పేర్కొంది. న్యూస్‌ నేషన్‌ ఎన్డీఏకు 378, ఇండియా కూటమికి 169 స్థానాలిచి్చంది. దైనిక్‌ భాస్కర్‌ ఎన్డీఏ కూటమికి 350 దాకా, ఇండియా కూటమికి గరిష్టంగా 201, ఇతరులకు 49 సీట్లిచి్చంది. రిపబ్లిక్‌ టీవీ సర్వేలో ఎన్డీఏకు 359, ఇండియాకు 154, ఇతరులకు 30 స్థానాలొచ్చాయి. ఏబీపీ న్యూస్‌–సీ వోటర్‌ ఎన్డీఏకు 353–383, ఇండియాకు 152 నుంచి 182 సీట్లిచ్చింది. ఎన్డీఏకు 371, ఇండియాకు 125 రావచ్చని ఇండియా న్యూస్‌ పేర్కొంది. టైమ్స్‌ నౌ–ఈటీజీ సర్వే ఎన్డీఏకు 358, ఇండియా కూటమికి 152 స్థానాలిచ్చింది. రాష్ట్రాల్లో ఇలా... కేంద్రంలో అధికార సాధనకు అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పై బీజేపీ మరోసారి పట్టు నిలుపుకుంటోందని సర్వేలన్నీ తెలిపాయి. బీజేపీకి యూపీలో ఏకంగా 67 సీట్ల దాకా రావచ్చని ఇండియాటుడే వెల్లడించింది. సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ సింగిల్‌ డిజిట్లకే పరిమితమవుతాయని తెలిపింది. కర్నాటకలో ఈసారి కూడా బీజేపీకి 23, భాగస్వామి జేడీ(యూ)కు 3 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక పశి్చమబెంగాల్లోనైతే పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ను తోసిరాజని 23 నుంచి 27 స్థానాలతో బీజేపీ తొలిసారిగా రాష్ట్రంలో అతి పెద్ద పారీ్టగా అవతరించనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. ఇండియాటుడే అయితే బెంగాల్లో బీజేపీకి 30 పై చిలుకు, తృణమూల్‌కు 11 నుంచి 12 స్థానాలివ్వడం విశేషం. కీలకమైన మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి సీట్లు 2019తో పోలిస్తే కాస్త తగ్గి 30 నుంచి 32 దాకా రావచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఒడిశాలోనైతే 21 సీట్లకు గాను ఎన్డీఏకు ఏకంగా 18 నుంచి 20 వస్తాయని, అధికార బిజూ జనతాదళ్‌ ఒకట్రెండు సీట్లకు మించబోదని ఇండియాటుడే పేర్కొనడం విశేషం. దక్షిణాదిన కేరళలోనూ తొలిసారి కమలవికాసం ఖాయమని ఎగ్జిట్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. అక్కడ బీజేపీకి 3 సీట్ల దాకా ఖాయమని పేర్కొన్నాయి. లెఫ్ట్‌ ఫ్రంట్‌ కుదేలవుతుందని, కాంగ్రెస్‌కే మెజారిటీ సీట్లు వస్తాయని తెలిపాయి. రాజస్తాన్, బిహార్లలో ఎన్డీఏకు ఐదారు స్థానాలు తగ్గి ఆ మేరకు ఇండియా కూటమికి పెరగవచ్చని పేర్కొన్నాయి. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడమే గాక మెజారిటీ లోక్‌సభ స్థానాలూ నెగ్గుతుందని కొన్ని ఎగ్జిట్‌ పోల్స్, ఎన్డీఏ కూటమిదే విజయమని మరికొన్ని పేర్కొన్నాయి. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ లోక్‌సభ స్థానాలొస్తాయని తెలిపాయి.2019లో ఏం జరిగింది?2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీఏ గెలుస్తుందనే జోస్యం చెప్పాయి. మొత్తం 13 ఎగ్జిట్‌ పోల్స్‌ సగటును చూస్తే ఎన్డీఏకు 306, యూపీఏకు 120 సీట్లొస్తాయని పేర్కొన్నాయి. చివరికి ఎన్డీఏకు 353 స్థానాలు రాగా యూపీఏ కేవలం 93 సీట్లతో సరిపెట్టుకుంది. బీజేపీకి సొంతంగానే 303 స్థానాలు రాగా కాంగ్రెస్‌ కేవలం 53 సీట్లు నెగ్గింది.

Sajjala Ramakrishna Says YSRCP is also positive in exit polls
ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ వైఎస్సార్‌సీపీకి సానుకూలత : సజ్జల

సాక్షి, అమరావతి: ఎగ్జిట్‌ పోల్స్‌లో వైఎస్సార్‌ సీపీ పట్ల పాజిటివ్‌ ట్రెండ్‌ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జూన్‌ 4న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళా ఓటర్లు తమవైపే నిలిచారనే విషయం ఎగ్జిట్‌ పోల్స్‌లో తేలిందన్నారు. శనివారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళలను సమాజంలో ఆత్మగౌరవంతో నిలబెట్టారని, సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు కుటుంబాన్ని నడిపించగల శక్తిని అందించారన్నారు. సీఎం జగన్‌ వల్లే తమకు మేలు జరుగుతుందనే విశ్వాసంతో మహిళలు వారి కుటుంబాలు పోలింగ్‌కు పెద్ద ఎత్తున తరలి వచ్చాయన్నారు. ఐదేళ్లలో తమ కుటుంబాల స్థితిగతుల్లో వచ్చిన మార్పులను గమనించడంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేశారన్నారు. ఎక్కువ సైలెంట్‌ ఓటింగ్‌ జరగడంతో కొన్ని సర్వే సంస్థలకు వైఎస్సార్‌ సీపీపై క్షేత్ర స్థాయిలో ఉన్న సానుకూలత కనిపించలేదన్నారు. పాజిటివ్‌ అజెండా పని చేసింది.. వైఎస్సార్‌ సీపీ ఎన్నికల ప్రచారం మొత్తం పాజిటివ్‌ కోణంలో నిర్వహించాం. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగాం. చంద్రబాబు మరోసారి అసాధ్యమైన హామీలను గుప్పిస్తూ 2014లో మాదిరిగా మోసం చేసేందుకు వస్తున్నాడని గుర్తు చేశాం. టీడీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడారు. సీఎం జగన్‌ అంతు చూస్తామని, అధికారంలోకి వచ్చేశామంటూ విర్రవీగారు. సొంతంగా పోటీ చేయలేక కూటమి కట్టారు. మా నాయకుడు మాత్రం పాజిటివ్‌ అజెండాతో ప్రజలను ఓట్లు అడిగారు. పాజిటివ్‌ అజెండా పని చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈసీ ఒత్తిడికి తలొగ్గితే ఎలా? ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. గతంలో చంద్రబాబు ఏపీ సీఈవోపైకి దండయాత్రలా వెళ్లి బెదిరించలేదా? ఆ తర్వాత ఈవీఎంలు మోసం చేశాయంటూ దు్రష్పచారం నడిపారు. అలాంటి పార్టీకి చెందిన వాళ్లు ఈ రోజు మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయలో టీడీపీ గందరగోళం సృష్టించాలని యత్నించింది. ఏ రూల్స్‌ అవసరం లేకుండా నేరుగా పోస్టల్‌ బ్యాలెట్లు తీసుకోవాలన్న టీడీపీ ఒత్తిడికి తలొగ్గి ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మేం కోర్టుకెళ్లాం. కౌంటింగ్‌ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మా ఏజెంట్లకు చెప్పాం. తిరస్కరించాల్సిన ఓటును చెల్లుబాట­య్యేలా టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని చెప్పాం. దీనికే నాపై కేసులు మో­పడం హాస్యాస్పదం. సుప్రీం కోర్టుకు వెళ్తాం.. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం. జూలై 2023లో ఈసీ స్పష్టమైన గైడ్‌లైన్స్‌ ఇచ్చింది. అందులో పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటు, తిరస్కరణ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌లో అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీల్‌ లేకుంటే కనీసం హోదా వివరాలైనా రాయాలని ఉంది. పోలింగ్‌ అయ్యాక అది అవసరం లేదని ఈసీ చెప్పడం అనైతికం. వాళ్లిచ్చిన నిబంధనలను వాళ్లే తుంగలో తొక్కితే ఎలా? చంద్రబాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు. అందుకే చంద్రబాబు కుట్రలు.. గత ఐదేళ్లలో పౌర సేవలు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ప్రజలపై ఉండదనుకుంటే అది భ్రమే. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్‌ సీపీకి వస్తాయనే భయంతో పవన్, బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. లోపాయికారీగా కాంగ్రెస్‌తోనూ కలసి ఎన్నికలకు వెళ్లారు. వైఎస్సార్‌ సీపీ ఓట్లను చీల్చి లాభపడాలని నానా గడ్డి కరిచి విష ప్రచారం చేశారు. ఆయన ఇన్ని చేసినా మాపట్ల ప్రజల్లో పాజిటివ్‌ ట్రెండ్‌ కొనసాగింది. ఇటీవల ఎన్నికల రిగ్గింగ్‌ మాదిరిగానే ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా రిగ్గింగ్‌ జరుగుతున్నట్టుంది. బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు బాగా తగ్గుతుండటంతో దక్షిణాదిలో పెరుగుతున్నట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వారికి నచ్చిన లెక్కలేసి చెబుతున్నారు. మాకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహిళల ఓటింగ్‌ పర్సంటేజ్‌ పెరగడం వైఎస్సార్‌ సీపీకి కచ్చితంగా అనుకూలించింది. ఐదేళ్లలో మేం ప్రజలకు మంచి చేశాం. టీడీపీకి ఎందుకు అనుకూలంగా సర్వేలు వచ్చాయో వాళ్లు చెప్పగలరా? మరో రెండు రోజులు వారికి నచ్చిన అంకెలు చెప్పుకుంటూ ఆనందం పొందాలంటే పొందొచ్చు.

Exit Poll 2024: INDIA bloc winning over 295 seats in LS polls says Congress chief Mallikarjun Kharge
Exit polls 2024: దేశ రాజధానిలో... బీజేపీకి సవాలే

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా స్థానాలు కచి్చతంగా లభిస్తాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలు తెలుసున్న తర్వాతే ఈ సంఖ్య చెబుతున్నామని వెల్లడించారు. తమది ప్రజల సర్వే అని, బీజేపీది ప్రభుత్వ సర్వే అని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫలితాల సరళి, ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై రెండున్నర గంటలపాటు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్‌ నాయకులు సోనియా గాం«దీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కె.సి.వేణుగోపాల్‌ పాల్గొన్నారు. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, ఆర్జేడీ ముఖ్య నాయకుడు తేజస్వీ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్‌ కేజ్రీవాల్, భగవంత్‌ మాన్, రాఘవ్‌ చద్ధా, జేఎంఎం నాయకులు చంపయ్‌ సోరెన్, కల్పనా సోరెన్, డీఎంకే నేత టి.ఆర్‌.బాలు, జమ్మూకశీ్మర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా, సీపీఐ నాయకుడు డి.రాజా, సీపీఐ(ఎంఎల్‌) నేత దీపాంకర్‌ భట్టాచార్య తదితరులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ హాజరు కాలేదు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. ఫలితాల పేరిట బీజేపీ మీడియా మిత్రులు తప్పుడు అంకెలను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తయ్యేదాకా కౌంటింగ్‌ హాళ్లనుంచి బయటకు వెళ్లొద్దంటూ తమ పార్టీ కార్యకర్తలను ఆదేశించామని ఖర్గే తెలిపారు. ఇండియా కూటమిలో తామంతా ఐక్యంగా ఉన్నామని, తమను విభజించే ప్రయత్నం చేయవద్దని మీడియాను కోరారు. బీజేపీ 220 సీట్లకే పరిమితం: కేజ్రీవాల్‌ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 295కుపైగా, బీజేపీకి 220 సీట్లు వస్తాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మొత్తం 235 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వ ఏర్పాటు దిశగా తమ కూటమి ముందుకు సాగుతోందని తెలిపారు.

BRS chief KCR letter to CM Revanth Reddy
ఉద్యమాన్ని అవమానిస్తూ.. ఉత్సవాలా?.. సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణ రాష్ట్ర అవత­రణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజక­రమైన సందర్భమే. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకువెళ్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్‌ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్‌ఎస్‌ సహా ఉద్యమకారులు, తెలంగాణవాదులు అభి­ప్రా యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వా న్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలను నిర సిస్తూ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవా ల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పాల్గొనడం లేదు..’’ అని భారత్‌ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ దశా బ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ రేవంత్‌రెడ్డి రాసిన లేఖకు ప్రతిగా కేసీఆర్‌ శని వారం సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. అందులో కేసీఆర్‌ పేర్కొన్న అంశాలివే..‘‘రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై మీ (కాంగ్రెస్‌) ప్రభుత్వం ఇటీవల నిర్వహించి న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష­మై న బీఆర్‌ఎస్‌ను ఆహ్వానించక పోవడం అప్రజా స్వామిక వైఖరికి నిదర్శనం. బీఆర్‌ఎస్‌ను కావాలని విస్మరించి మీ సంకుచితత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు.. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది. ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని విజయతీరానికి చేర్చిన న న్ను ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉంది. తెలంగాణ ప్రజాపోరాటానికి నాయ కత్వ స్థానంలో నిలిచిన నాకు వేదికపై స్థానం కల్పించలేదు.రాష్ట్ర సాధనలో నాకున్న అనుభ వాలు పంచుకునేలా ప్రసంగించే అవకాశం క ల్పించక పోవడం మీ అహంకార ఆధిపత్య ధో రణికి పరాకాష్ట. నన్ను ఆహ్వానించి అవమానించాలనే మీ దురుద్దేశాన్ని ప్రజలు గ్రహిస్తు­న్నా రు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసే లా ఉత్సవాలు జరుగుతున్న తీరును ఉద్యమ కారులు ఇప్పటికే నిరసిస్తున్నారు.జై తెలంగాణ అని నినదించరెందుకు?తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ప్రాణప్రదమైన ‘జై తెలంగాణ’ నినాదాన్ని ఇప్ప­టివరకు నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీ నుంచి కోరుకుంటున్నది. సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతున్నా.. ఇప్పటివరకూ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించక, శ్రద్ధాంజలి ఘటించక పోవడం ద్వారా ప్రజల మనోభావాలను గాయపరిచారు. అమరుల త్యాగాలతో అవత­రించిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ దయా­భిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్య్రాన్ని నేను నిరసిస్తున్నాను. 1969 నుంచి ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చరిత్ర పొడుగునా కాంగ్రెస్‌ రక్తసిక్తం చేసిందనేది దాచేస్తే దాగని సత్యం. 1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టు­కోవడం మొదలు కాంగ్రెస్‌ క్రూర చరిత్ర కొన­సాగింది. తెలంగాణ ప్రజల అభీష్టానికి విరు­ద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసి తెలంగాణ­లో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నా­భిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది.మీ దమన నీతికి సాక్ష్యం.. అమరుల స్తూపంతెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్‌ దమన నీతికి సాక్ష్యమే గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం. ఆ స్తూపాన్ని కూడా ఆవిష్కరించ నీయకుండా అడ్డుపడిన కాంగ్రెస్‌ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణా­లను బలిగొన్న పాపం కాంగ్రెస్‌ పార్టీదే.తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని సరిది­ద్దడానికి జరిగిన చరిత్రాత్మక ప్రయత్నంలో భాగంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ ఉద్యమా­నికి రాజకీయ వ్యక్తీకరణను ఇచ్చింది. తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచి ఎన్నికలు, సభలు, సమావేశాలతో రాజ­కీయ ఒత్తిడి పెంచింది. దేశంలో ఉన్న పార్టీల మద్దతును లిఖిత పూర్వకంగా సాధించింది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచే అనైతిక కుట్రలకు కాంగ్రెస్‌ పాల్పడింది.తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండినా ప్రాణాలను పణంగా పెట్టి ‘తెలంగాణ వ చ్చుడో, కేసీఆర్‌ సచ్చుడో’ అని ఆమరణ నిరా హార దీక్షకు దిగడంతో కాంగ్రెస్‌ ‘డిసెంబర్‌ 9’ ప్రకటన చేసింది. కానీ సమైక్య పాలకుల ఒత్తి డితో వెనక్కితగ్గి మోసం చేసింది. దాంతో వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చే శారు. దీనిపై కాంగ్రెస్‌ ఎన్నడూ పశ్చా­త్తాపాన్ని ప్రకటించలేదు, క్షమాపణ కోరలేదు. పైగా ద యతో మేమే తెలంగాణ ఇచ్చామనే ఆధిపత్య, అహంభావ ధోరణి ప్రదర్శిస్తూ.. ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమాని­స్తున్నారు. ఈ రకమైన వైఖరిని మార్చుకో­నప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? ఇప్పటికైనా తెలగా>ణ సమాజానికి క్షమాపణ చెప్పండి. రాజకీయ అవసరాల కోసం కాకుండా మనస్ఫూర్తిగా తెలంగాణ సమాజానికి క్షమాపణలు కాంగ్రెస్‌ చెప్పినప్పుడే పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుంది.మీకు తెలంగాణ రాజకీయ అవకాశమే..కాంగ్రెస్‌కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప మనఃపూర్వక ఆమోదం కాదు. కాంగ్రెస్‌ ఎన్నటికీ మారదని మీ ప్రవర్తన, మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమ వు తోంది. నాడు, నేడు ఎన్నడూ అంతే. తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనం. ప్రజాపా లన పేరిట అధికారంలోకి వచ్చిన మిమ్మ ల్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులతో వేధింపులు, నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. తెలంగాణకు గర్వకార ణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కు తూ.. అధికార ముద్ర నుంచి తొలగిస్తామ ని అవమానిస్తున్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమా ని స్తూ.. కుతుబ్‌ షాహీల కాలంలో నిర్మించిన చార్మినార్‌కు మలినాన్ని ఆపాదిస్తున్న మీ సంకుచితత్వం తెలంగాణకు హానికరం.

One rupee that took life
ప్రాణం తీసిన ఒక్క రూపాయి

ఖిలా వరంగల్‌: వరంగల్‌లో దారుణం జరిగింది. ‘ఆ్రఫ్టాల్‌ నువ్వు ఒక ఆటోడ్రైవర్‌వు. ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివా’..? అంటూ ఇద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ చివరికి ఒకరి ప్రాణం తీసింది. శనివారం వరంగల్‌ క్రిస్టియన్‌ కాలనీ గాం«దీనగర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ మిల్స్‌కాలనీ గరీబ్‌నగర్‌ గొర్రెకుంటకు చెందిన ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్‌ (38) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేమ్‌సాగర్‌ గాందీనగర్‌లోని ‘నబీ రూ.59కే చికెన్‌ బిర్యానీ’సెంటర్‌కు వెళ్లాడు. ఆదే సమయంలో గాందీనగర్‌కు చెందిన జన్ను అరవింద్‌ అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు స్నేహితులే. ఈ క్రమంలో ప్రేమ్‌సాగర్‌ బిర్యానీ తీసుకుని రూ.59కి బదులు రూ.60 ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. పక్కనే ఉన్న అరవింద్‌ దీనిపై స్పందించి.. ‘ఒక్క రూపాయి ఎక్కువ కొట్టే మొగోడివి అయ్యావా’అంటూ ప్రేమ్‌సాగర్‌ను హేళన చేస్తూ మాట్లాడాడు. దీంతో ప్రేమ్‌సాగర్‌ ఒక్కసారిగా ఆవేశానికిలోనై ‘నేను ఏమైనా అడుక్కు తింటున్నానా.. ఏం మాట్లాడుతున్నావు’అంటూ అరవింద్‌ను నిలదీశాడు. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. తోపులాటలో అరవింద్, బలంగా ప్రేమ్‌సాగర్‌ను నెట్టివేయగా రోడ్డుపై పడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయమై చిన్నమెదడు చిట్లి ముక్కు, చెవుల్లోనుంచి రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ప్రేమ్‌సాగర్‌ తమ్ముడు విద్యాసాగర్‌తోపాటు అరవింద్‌ కలసి ఆటోలో ప్రేమ్‌సాగర్‌ను ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 1 గంట సమయంలో ప్రేమ్‌సాగర్‌ మృతిచెందాడు. వెంటనే అరవింద్‌ ఎంజీఎం నుంచి నేరుగా మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు లొంగిపోయాడు. మృతుడి సోదరుడు విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు శనివారం అరవింద్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ మల్లయ్య తెలిపారు.

Directors and Producer Hit Combination Repeat in Tollywood
లెక్క కుదిరింది

కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ (డైరెక్టర్‌)కి, షిప్‌ ఓనర్‌ (ప్రోడ్యూసర్‌)కి మధ్య మంచి రిలేషన్‌ ఉండాలి. షిప్‌ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్‌ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్‌ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్‌ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌ గురించి తెలుసుకుందాం. ‘దిల్‌’ రాజు, అనిల్‌ రావిపూడిమూడోసారి ‘దిల్‌’ కలిసిందికుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్‌’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్‌ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్‌లో సుప్రీమ్‌ (2016), ‘రాజా ది గ్రేట్‌’ (2017), ‘ఎఫ్‌ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్‌ 3’ (2022) వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్‌–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్‌ హీరో. హిట్‌ చిత్రాలు ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తర్వాత వెంకటేశ్‌–అనిల్‌ రావిపూడి–‘దిల్‌’ రాజు కాంబినేషన్‌లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్‌ అనుకుంటున్నారట. రవిశంకర్, నవీన్, సుకుమార్‌గురు–శిష్యులతో మైత్రీడైరెక్టర్‌ సుకుమార్‌–మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్‌–మైత్రీ కాంబినేషన్‌లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్‌–నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2: ది రూల్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.∙సుకుమార్‌ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్‌ హీరోగా నవీన్, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. సునీల్, రామ్మోహన్‌ రావు, శేఖర్‌ కమ్ములశేఖర్‌తో మరో సినిమాప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ (ఏషియన్‌ గ్రూప్‌), అమిగోస్‌ క్రియేషన్స్ పై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్‌ నారంగ్, రామ్మోహన్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్‌లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్‌ స్టోరీ’ (2021) సూపర్‌ హిట్టయింది. నాగ్‌ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్నహోమ్‌ బేనర్‌లో నాగ్‌ అశ్విన్‌ఇంట్లోనే ఒక పెద్ద బేనర్‌ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కి రెండు హోమ్‌ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్‌ ఉన్నాయి. అశ్వినీదత్‌ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్‌ అశ్విన్‌ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్‌ అశ్విన్‌. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఈ నెల 27న రిలీజ్‌ కానుంది. నాగవంశీ, వెంకీసార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...డైరెక్టర్‌ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘సార్‌’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్‌ జంటగా సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్‌లో తాజాగా ‘లక్కీ భాస్కర్‌’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్‌ కానుంది. శ్రీకాంత్‌ చెరుకూరి, శ్రీకాంత్‌ ఓదెలహీరో కూడా రిపీట్‌శ్రీకాంత్‌ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్‌ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్‌లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్‌లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తారు. టీజీ విశ్వప్రసాద్, కార్తీక్‌ రెండోసారి రెండు భాగాలతో... ‘ఈగల్‌’ చిత్రం తర్వాత డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని–పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్‌ హీరో, హీరోయిన్లుగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ‘ఈగల్‌’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్‌–విశ్వప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘మిరాయ్‌’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్‌ జంటగా నటిస్తున్న ‘మిరాయ్‌’లో మంచు మనోజ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్‌ 18న రిలీజ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్‌ కానుంది. ప్రశాంత్‌ వర్మ, నిరంజన్‌ రెడ్డిఈసారి ‘జై హనుమాన్‌’తో...సంక్రాంతి అంటే స్టార్‌ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రం ‘హనుమాన్‌’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అయింది. ఇక ‘హనుమాన్‌’కి సీక్వెల్‌గా ప్రశాంత్‌ వర్మ–చైతన్య–నిరంజన్‌ రెడ్డి కాంబినేషన్‌లో ‘జై హనుమాన్‌’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్‌ కూడా రిపీట్‌ అవుతున్నాయి.

Telangana Lok Sabha Elections Exit Poll 2024 Live Updates
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌: ఊహించని ఫలితాలు

తెలంగాణ లోక్‌సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీగా సీట్లు సాధించే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైంది. బీఆర్‌ఎస్‌ కు నెగిటివ్‌ ఫలితాలు వచ్చాయి. ఆరా మస్తాన్‌ సర్వేఆరా మస్తాన్‌ సర్వే ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీ, కాంగ్రెస్‌లకు పోటాపోటీగా సీట్లు వస్తాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం​.. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు స్పష్టం చేసింది.పోల్‌ లాబొరేటరీపోల్‌ లాబొరేటరీ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం.. కాంగ్రెస్‌ 8-10, బీజేపీ 5-7 స్థానాలు గెలవబోతోంది. బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం దక్కించుకోబోతున్నాయి.ఇండియా టుడేఇండియా టుడే ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కి 6-8, బీజేపీకి 8-10, బీఆర్‌ఎస్‌ 0-1, ఎంఐఎం 1 స్థానం వస్తాయని పేర్కొంది.పోల్‌ స్టార్ట్‌బీజేపీకి 8-9, కాంగ్రెస్‌కు 7-8, బీఆర్‌ఎస్‌కు 0-1 స్థానాలు, ఎంఐఎంకి 1 స్థానం రాబోతున్నట్లు పోల్‌ స్టార్ట్‌ స్పష్టం చేసింది.పార్థ చాణక్యపార్థ చాణక్య ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపింది. ఈ పార్టీ అత్యధికంగా 9-11 సీట్లు, బీజేపీ 5-7, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం సాధించబోతున్నట్లు పేర్కొంది.ఆపరేషన్‌ చాణక్య ఆపరేషన్‌ చాణక్య ప్రకారం.. కాం‍గ్రెస్‌ 7, బీజేపీ 8, బీఆర్‌ఎస్‌ 0, ఎంఐఎం 1 స్థానం గెలవబోతున్నాయి.టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాటైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పింది. బీజేపీ 7-10 సీట్లు, కాంగ్రెస్‌ 5-8, బీఆర్‌ఎస్‌ 2-5, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.ఏబీపీ సీ ఓటర్‌ఏబీపీ సీ ఓటర్‌ సర్వే అయితే కాంగ్రెస్‌, బీజేపీ సమానంగా సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌కు 7-9, బీజేపీకి కూడా 7-9 సీట్లు వస్తాయని చెబుతోంది. బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవదని, ఎంఐఎం ఒక గెలుచుకుంటుందని తెలిపింది.న్యూస్‌ 24న్యూస్‌ 24 ప్రకారం కాంగ్రెస్‌కు 5, బీజేపీకి 11, బీఆర్‌ఎస్‌కి 0, ఎంఐఎంకి 1 సీటు రాబోతున్నాయి.ఎక్కడా కనిపించని కారు జోరుతెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్లో కారు జోరు పెద్గగా కనబడలేదు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులు భావించినా వారికి నిరాశే ఎదురైట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల్ని బట్టి అర్థమవుతోంది. లోక్‌సభ ఎన్నికలు కాబట్టి.. బీజేపీ, కాంగ్రెస్‌ల వైపు ప్రజలు మొగ్గుచూపిట్లు తెలుస్తోంది.

TDP is scared of defeat: Andhra pradesh
టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి

సాక్షి,అమరావతి: కౌంటింగ్‌ రోజున అల్లర్లు సృష్టించేలా తెలుగుదేశం కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొడుతున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్‌సీపీ బృందం కోరింది. ఈ మేరకు శనివారం వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ జూన్‌ 4న రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు ట్రైనింగ్‌ క్యాంపులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.వైఎస్సార్‌సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లను తరిమికొట్టాలని, కౌంటింగ్‌ ప్రాంతంలో లేకుండా చేయాలని రెచ్చగొట్టేలా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల నియమావళిపై కనీస అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ అధినేతకు ఓటమి భయం పట్టుకుందని.. కనుకనే అల్లర్లు సృష్టించి ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజా తీర్పును మార్చేందుకు ప్రయతి్నస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఎక్కడా దౌర్జన్యకాండ జరగకుండా అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, కఠినంగా వ్యవహరించాలని ముందస్తుగా ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మల్లాది విష్ణు మండిపడ్డారు. సజ్జల మాటలను తెలుగుదేశం లీగల్‌ సెల్‌ పూర్తిగా వక్రీకకరించి, ఆయనపై తప్పుడు కేసు బనాయించిందని నిప్పులు చెరిగారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదెవరో ఓటర్లకు బాగా తెలుసన్నారు. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సైకో అని, గొడ్డలి అని, ఘర్షణలు సృష్టించేలా నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, కూటమి టీడీపీ నేతలపై నేటికీ కనీస చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్‌సీపీ ఇచ్చిన దాదాపు వందకి పైగా ఫిర్యాదులు ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌ లోనే ఉన్నాయన్నారు. ముఖ్యంగా కోడ్‌ను పదేపదే ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని కోరినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్‌ డ్రా చేసుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్‌సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి ఉన్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement