Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP complaint to Central Election Commission Chief Commissioner
‘సడలింపు’ని సరిదిద్దండి

సాక్షి, అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను ఏపీలో సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్‌ మీనా ఈనెల 25న జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అటెస్టింగ్‌ అధికారుల స్పెసిమెన్‌ సం­తకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్ని­కల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేసింది. ఇది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్‌. నిరంజన్‌రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా నిబంధనలను సడలిస్తూ జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా..నిజానికి.. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం చేసి, స్టాంప్‌ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు (స్పెసిమెన్‌) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్‌ అధికారి సంతకం (స్పెసిమెన్‌)తో సరిపోల్చుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇచ్చారు.గోప్యతకు.. శాంతిభద్రతలకు విఘాతం..ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు సమయంలో స్పెసిమెన్‌ సంతకంపై రాజకీయ పక్షాల ఏజెంట్ల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఇది చినికిచినికి పెను వివాదంగా మారి శాంతిభద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ నిబంధనలవల్ల ఓటు గోప్యత ఉండదని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో టీడీపీ నేతలు విజ్ఞప్తి చేయగానే.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుపై నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా ఉత్తర్వులు జారీచేయడంపై నివ్వెరపోతున్నారు.నిబంధనల సడలింపుపై న్యాయపోరాటం..ఇదిలా ఉంటే.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా జారీచేసిన ఉత్తర్వులపై దుమారం రేగుతోంది. వాటిని సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సముచిత నిర్ణయం తీసుకోని పక్షంలో.. మీనా సడలింపు ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది.

Fiver Years For YS Jagan Mohan Reddy Welfare Govt in Andhra Pradesh
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు సీఎం వైఎస్‌ జగన్‌ నాంది పలికి నేటికి సరిగ్గా ఐదేళ్లు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం సాధించింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచి్చన హామీల్లో 95 శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అమలుచేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలు అమలుచేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సువర్ణాక్షరాలతో లిఖించేలా గత ఐదేళ్లుగా సంస్కరణలు, వికేంద్రీకరణ, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సీఎం జగన్‌ సుపరిపాలన అందించారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమచేశారు. నాన్‌ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో ఐదేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ రూపంలో రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు ఎక్కడాలేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ఇంటిగుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు.మంచి చేసిన ప్రభుత్వానికి దన్నుగా..ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ.. ఏటా అమ్మఒడి పథకం కింద ఇస్తున్న సొమ్మును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని.. రైతుభరోసా కింద ఇస్తున్న రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామంటూ కొత్తగా హామీలిచ్చిన సీఎం జగన్‌.. మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్‌ గుర్తుపై రెండు బట­న్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలని ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్‌ వినతికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు.. రాష్ట్రం రూపురేఖలను మరింతగా గొప్పగా మార్చేందుకు వైఎస్సార్‌సీపీకి ప్రజలు దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు చేజిక్కించుకుని వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు.

దశాబ్ది ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, అందెశ్రీ, కీరవాణితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
తెలంగాణ పదేళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల హడావుడి 'దశాబ్ది దంగల్‌'!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ రగడ ప్రారంభమైంది. దశాబ్ది ఉత్సవాలపై తమ ముద్ర వేసుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ హడావుడి చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పూర్తిగా తమ మార్క్‌ కనిపించేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తోంది. మరోవైపు అధికారంలో ఉండగానే (గత ఏడాది జూన్‌లోనే) దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వపరంగా నిర్వహించిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు పార్టీపరంగా దశాబ్ది ముగింపు ఉత్సవాలకు సిద్ధమవుతోంది. మరోవైపు దశాబ్ది ఉత్సవాలకు కొనసాగింపుగా పలు అంశాలపై కసరత్తు చేపట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. తెలంగాణ అధికారిక గేయాన్ని ఖరారు చేశారు. అధికారిక చిహ్నంలోనూ మార్పులపై దృష్టిపెట్టారు. ఈ మార్పులను బీఆర్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. గన్‌ పార్క్‌ నుంచి మొదలు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదికగా నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సోనియా గాం«దీని ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా ఆమెను సత్కరించాలని నిర్ణయించింది. 2న అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అరి్పంచడంతో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి నుంచి పరేడ్‌ గ్రౌండ్‌కు వెళ్లి ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కారి్నవాల్, లేజర్‌ షో, శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అధికారిక గేయమైన ‘జయజయహే తెలంగాణ’కు జాతీయ జెండాలతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది జూన్‌లోనే ఉత్సవాలు చేపట్టి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంలోనే అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశాబ్ది ప్రారంభ ఉత్సవాలను చేపట్టింది. 2023 జూన్‌ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు గ్రామగ్రామాన ఈ వేడుకలను నిర్వహించింది. కేసీఆర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ పోరాటంతోనే రాష్ట్ర సాధన జరిగిందని చెప్పుకోవడంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడేలా కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడు దశాబ్ది ముగింపు ఉత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. జూన్‌ 1వ తేదీనే గన్‌ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అమరజ్యోతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2న కేసీఆర్‌ అధ్యక్షతన సభ నిర్వహించనున్నారు. 3వ తేదీన జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ జెండా, జాతీయ పతాకం ఆవిష్కరణ, హాస్పిటళ్లు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. అధికార చిహ్నం మార్పులపై విమర్శలు దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది. తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రం ఇచ్చిన దేవతగా సోనియా ఈ కార్యక్రమానికి వస్తారంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రతిస్పందిస్తుండటంతో.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికారిక గేయంగా ప్రకటించిన ప్రభుత్వం.. దానికి తుదిరూపునిచ్చే క్రమంలో ఏపీకి చెందిన సంగీత దర్శకుడు కీరవాణిని ఎంచుకోవడంపై బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కళాకారులకు ప్రాంతీయ హద్దులేమిటని.. అయినా బీఆర్‌ఎస్‌ హయాంలో ఆంధ్రా ప్రాంతానికి చెందినవారికి లభించిన గౌరవం మాటేమిటంటూ కాంగ్రెస్‌ నేతలు నిలదీస్తున్నారు. మొత్తంగా దశాబ్ది ఉత్సవాలతో రాష్ట్రంలో రాజకీయ దంగల్‌ జరుగుతోంది.

Lok Sabha Election 2024: bjp vs bjp tough fight in Odisha lok sabha and assembly polls
Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ

బీజేపీ, అధికార బీజేడీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతున్న ఒడిశాలో ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుతోంది. 15 లోక్‌సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ ఇప్పటికే ముగిసింది. చివరి దశలో భాగంగా మిగతా 6 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరగనుంది. వీటిలో 4 బీజేడీ, 2 బీజేపీ సిట్టింగ్‌ స్థానాలు. వాటిపై ఫోకస్‌...జగత్‌సింగ్‌పూర్‌ ఇక్కడ రెండు దశాబ్దాలుగా బీజేడీ చక్రం తిప్పుతోంది. బీజేపీ ఖాతా తెరవలేదు. 2019లో భారీ మెజారిటీతో నెగ్గిన రాజశ్రీ మల్లిక్‌ బీజేడీ నుంచి, ఆయన చేతిలో ఓడిన బిబూ ప్రసాద్‌ తరాయ్‌ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. తరాయ్‌ 2009లో ïసీపీఐ నుంచి, 2014లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. ఆయన ఓటు బ్యాంకును చూసి బీజేపీ మరోసారి చాన్సిచి్చనట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి రవీంద్ర కుమార్‌ సేథీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నేతలు బీజేడీలోకి చేరడం ఆ పారీ్టకి అనుకూలించే అంశం.కేంద్రపర ఇదీ బీజేడీ కంచుకోటే. ఈసారి మాత్రం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. 2009, 2014ల్లో బీజేడీ నుంచి గెలిచిన బైజయంత్‌ పాండా గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి బీజేడీ నేత, సినీ నటుడు అనుభవ్‌ మహంతి చేతిలో ఓటమి చవిచూశారు. ఒకప్పుడు సీఎం నవీన్‌ పట్నాయక్‌కు అత్యంత సన్నిహితుడైన బైజయంత్‌ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుని హోదాలో మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీ అనుభవ్‌ మహంతి కూడా బీజేపీలో చేరడంతో బీజేడీ సంకట స్థితిలో పడింది. అన్షుమన్‌ మహంతిని పోటీకి దింపింది. మయూర్‌భంజ్‌ సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు స్థానంలో ఎమ్మెల్యే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సన్నిహితుడు నాబా చరణ్‌ మఝికి ఈసారి బీజేపీ టికెటిచ్చింది. ద్రౌపది ముర్ము 2009లో ఈ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన విద్యా శాఖ మంత్రి సుదమ్‌ మరాండీని బీజేడీ బరిలో దింపింది. జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సోదరి అంజని సోరెన్‌ జేఎంఎం తరఫున పోటీలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.భద్రక్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్‌ సమల్‌ భద్రక్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని చాంద్‌బలి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. దాంతో భద్రక్‌లో గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ చరణ్‌ సేథీ కుమారుడు అవిమన్యు సేథీ పోటీ చేస్తున్నారు. బీజేడీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ మంజులతా మండల్, కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ అనంత ప్రసాద్‌ సేథీ బరిలో ఉన్నారు.జజ్‌పూర్‌ బీజేడీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ శరి్మష్ఠ సేథీ మళ్లీ బరిలో ఉన్నారు. రవీంద్ర నారాయణ బెహరాకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ ఆంచల్‌ దాస్‌ పోటీ చేస్తున్నారు. ఆయన 1996లో ఇక్కడ జనతాదళ్‌ నుంచి గెలిచారు. గత ఐదేళ్లలో బీజేపీ ఓటు బ్యాంక్‌ బాగా పెరిగిందన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థి బెహరా స్థానికులకు పరిచయస్తుడే అయినా రాజకీయాలకు కొత్త.బాలాసోర్‌ బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ ప్రతాప్‌ చంద్ర సారంగి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మాజీ బీజేపీ నేత లేఖశ్రీ సమంత సింగార్‌ పోటీ చేస్తున్నారు. పార్టీని అస్తమానం విమర్శించే లేఖశ్రీకి టికెటివ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి కందమాల్‌ నుంచి బీజేపీ తరఫున పోటీకి లేఖశ్రీ ఆసక్తి చూపారు. నీలగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్టానం సూచించడంతో బీజేడీలో చేరారు. కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్‌ కుమార్‌ జెనా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన కరబేల స్వైన్‌ స్వతంత్ర అభ్యర్థిగా రెండు పారీ్టలకూ సవాలు విసురుతున్నారు.బరిలో కోటీశ్వరులు ఒడిశాలో తుది విడత బరిలో ఉన్న 66 మంది అభ్యర్థుల్లో 20 మంది కోటీశ్వరులే. కేంద్రపర బీజేపీ అభ్యర్థి బైజయంత్‌ పాండాకు అత్యధికంగా రూ.148 కోట్లున్నాయి. తర్వాత స్వతంత్ర అభ్యర్థి శ్రీరామ్‌ పాండే రూ.18.23 కోట్లు, భద్రక్‌ బీజేపీ ఎంపీ మంజులత మండల్‌కు రూ.14.86 కోట్ల ఆస్తులున్నాయి. 15 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. వీరిలో 10 మంది తీవ్ర కేసుల్లో నిందితులని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) పేర్కొంది.

Baby sales in code language
‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్‌’అంటే బాబు

సాక్షి, న్యూఢిల్లీ: పసికందుల విక్రయానికి అంతర్రాష్ట్రముఠా కోడ్‌ భాష వినియోగించినట్టు రాచకొండ పోలీసులు గుర్తించారు. పాపను ‘స్కూటీ’గా, బాబును ‘బైక్‌’గా పిలుస్తూ ఇలా కోడ్‌ భాష ఎంచుకున్నట్లు స్పష్టమైంది. చిన్నారులను రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్న అంతర్రాష్ట్రముఠా గుట్టును రాచకొండ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో పోలీసులు మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. బుధవారం ఢిల్లీతోపాటు పుణే, యూపీ, నోయిడా, హరియాణాల్లోని పలు సిటీల్లో రాచకొండ పోలీసులు బృందాలుగా తనిఖీలు చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది.వాట్సాప్‌లో మెసేజ్‌లు పాప కావాలి అంటే ‘స్కూటీ’ కావాలా?, బాబు కావాలి అంటే మీకు ‘బైక్‌’ కావాలా అని ముఠా సభ్యులు వాట్సాప్‌లో పిల్లలు లేని దంపతులకు మెసేజ్‌లు పంపేవారు. డైరెక్టుగా పాప కావాలా లేదా బాబు కావాలా అని మెసేజ్‌లు చేస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముఠాసభ్యులు ఈ కోడ్‌ భాషను వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.ఎవరైనా తెలియక పాప లేదా బాబు కావాలి అని మెసేజ్‌ చేస్తే వారికి వాట్సాప్‌ కాల్‌ చేసి మరీ ఈ కోడ్‌ భాష గురించి చెప్పేవారని, అనంతరం పిల్లలు లేని దంపతులు కూడా కోడ్‌ భాషను వినియోగించే వారని తెలిసింది. ఈరకంగా పలు ప్రాంతాల్లో పసికందులను విక్రయించినట్టు సమాచారం. ప్రస్తుతం రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన వారి వివరాలతోపాటు వీరికి సంబంధించిన ప్రతి ఒక్క కదలికలపై నిఘా పెంచారు. కొంతకాలంగా వీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను తెలుసుకున్నారు. వీటితో పాటు వాట్సాప్‌/టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికగా చాట్‌ చేసిన వివరాలు సేకరించారు. ఈ చాటింగ్‌లలో పోలీసులకు క్లూ లభించినట్టు తెలుస్తోంది. ఈ క్లూతోనే ఢిల్లీ, ఫుణే, హర్యానా వంటి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు కొందరికి నోటీసులు కూడా జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.ఆ చిన్నారులు మా వద్ద క్షేమంగా ఉన్నారు.పెంపుడు తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేది లేదు: కాంతి వెస్లీవెంగళరావునగర్‌(హైదరాబాద్‌): రాచకొండ పోలీసులు 11 మంది చిన్నారులను శిశువిహార్‌కు అప్పగించారని, వారంతా తమ వద్ద క్షేమంగా ఉన్నారని మహిళ,శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కాంతి వెస్లీ చెప్పారు. బుధవారం కొందరు తల్లిదండ్రులు, మీడియా మహిళ, శిశు సంక్షేమశాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూసినా ఎవరినీ లోపలకు అనుమతించలేదు. ఆ తర్వాత కాంతి వెస్లీ బయటకు వచ్చి మీడియాకు పలు విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులను విక్రయించడం, కొనడం చట్టరీత్యా నేరం.. వారికి కఠినశిక్షలు పడతాయని హెచ్చరించారు. ఆ విధంగా తీసుకొని పెంచుకోవడం కూడా తప్పేనన్నారు. చిన్నారులను కొని పెంచిన వారు ఇప్పుడు వచ్చి మా పిల్లలను మాకివ్వండి అని అడుగుతున్నారని, వారికి పిల్లలను ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని తేల్చిచెప్పారు. అలాంటి తల్లిదండ్రులు ఎవరూ ఇక్కడకు రావొద్దని పేర్కొన్నారు. సంతానం లేనివారు ఎవరైనా పిల్లలు కావాలంటే మా వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకుంటే విచారణ అనంతరం దత్తత ఇస్తామన్నారు. పెంపుడు తల్లిదండ్రులు దత్తత కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ పిల్లలను మ్యాచ్‌ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

AP Election results Declaration of all constituencies by 9 pm June 4th
మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి

సాక్షి, అమరావతి: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్‌ కుమార్‌ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయన్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6.00 గంటల్లోపు వీటి ఫలితాలు రావొచ్చని వివరించారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ బుధవారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కౌంటింగ్‌కు చేపట్టిన ఏర్పాట్లను సీఈవో మీనా వివరించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్‌ అమలుతో పాటు ఆ జిల్లాల్లో సీనియర్‌ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిజీపీతో పాటు తాను కూడా పల్నాడు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపులో లోపాలు జరగకూడదు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎటువంటి లోపాలు, జాప్యం జరగడానికి వీల్లేదని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌ రాష్ట్ర అధికారులకు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21 సీ, 21ఈలను అదే రోజు ఫ్లైట్‌లో ఈసీకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా లెక్కింపు ప్రక్రియపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూముల్లో కూలీల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని చెప్పారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగినందున, ఈ జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టేట్‌ పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్, అడిషనల్‌ డీజీ ఎస్‌ బాగ్చీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు చేపడుతున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు నితీష్‌ వ్యాస్‌కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో హరేంధిర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు తదితరులు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Key points in DSP Praneet Rao testimony 1000 to 1200 phones tapping done
డీఎస్పీ ప్రణీత్‌రావు వాంగ్మూలం.. 1,000 నుంచి 1,200 ఫోన్లు ట్యాపింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఐబీ కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్‌రావు నేతృత్వంలోని బృందం 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తమ కస్టడీలో ప్రణీత్‌రావు అనేక కీలకాంశాలు వెల్లడించినట్లు కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలకు నిధులు ఇస్తున్న సంస్థల డబ్బును స్వాదీనం చేసుకోవడం కోసం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నాంపల్లి కోర్టుకు నేరాంగీకార వాంగ్మూలాన్ని సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రణీత్‌ ప్రవర్తనపై ఫిర్యాదులు వరంగల్‌ జిల్లా మేడేపల్లికి చెందిన ప్రణీత్‌ 2008లో శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ చేశారు. ఐపీఎస్‌ అధికారి రాజేష్‌ కుమార్‌ నల్లగొండ ఎస్పీగా ఉండగా ప్రణీత్‌రావు ప్రవర్తన సరిగ్గా లేదంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా ఆయన ప్రణీత్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు నల్లగొండ ఎస్పీగా బదిలీపై రావడంతో ప్రణీత్‌రావు ఆయనతో పరిచయం పెంచుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో ప్రణీత్‌ను బీబీనగర్‌ ఎస్సైగా ప్రభాకర్‌రావు నియమించారు. 2016లో ప్రభాకర్‌రావు నిఘా విభాగానికి బదిలీ అయ్యారు. దీంతో ఆయన్ను సంప్రదించిన ప్రణీత్‌ కూడా అందులోకే వచ్చారు. ప్రణీత్‌కు సీనియారిటీ ప్రాతిపదికన 2017లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి వచ్చింది. అదే సమయంలో ప్రభాకర్‌రావు సైతం డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొంది ఎస్‌ఐబీ చీఫ్‌గా మారారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ వేణుగోపాల్‌ రావు వద్ద పని చేయాలని ప్రణీత్‌కు ప్రభాకర్‌రావు సూచించారు. అప్పటి నుంచి ప్రణీత్‌ నేరుగా వీరిద్దరికి మాత్రమే రిపోర్ట్‌ చేసేవారు. ఎవరిపై నిఘా ఉంచాలి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్‌ చేయాలనే వివరాలు వీరిద్దరి నుంచి ప్రణీత్‌కు అందేవి. అక్రమ ట్యాపింగే ప్రధాన విధిగా... ప్రభాకర్‌రావు చొరవతోనే ప్రణీత్‌కు 2023లో యాక్సిలేటరీ పదోన్నతి వచ్చింది. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌కు ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, మరో ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లను కేటాయించారు. ఎస్‌ఐబీ కార్యాలయం మొదటి అంతస్తులో వీరి కోసం రెండు గదులు కేటాయించారు. వాటిలోనే లాగర్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసుకున్న ప్రణీత్‌ 17 కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌తో అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ల కథ నడిపారు. బీఆర్‌ఎస్‌లోని అసమ్మతి నేతలు, అసంతృప్తులతో పాటు ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం కోసం అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడటమే ఎస్‌ఓటీ ప్రధాన విధిగా పని చేసింది. ప్రభాకర్‌రావు ఆదేశాలతో చేసిన అనేక ఆపరేషన్ల వివరాలు దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించడానికి నిరాకరించిన ప్రణీత్‌ 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాపింగ్‌ చేశామని బయటపెట్టారు. వారి వివరాలను సైతం బయటకు చెప్పనంటూ పోలీసులకు స్పష్టం చేశారు. ప్రణీత్‌ వద్ద 8 ఫోన్లు ఎస్‌ఓటీ పనిని పర్యవేక్షించడానికి, టీమ్‌లోని వారితో సంప్రదింపులు జరపడానికి ప్రణీత్‌రావు 8 ఫోన్లు నిర్వహించారు. వీటిలో 3 అధికారిక నంబర్లు కాగా, మిగిలినవి వ్యక్తిగతమైనవి. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో అనేక మంది ఫోన్లు ట్యాప్‌ చేసిన ప్రణీత్‌ టీమ్‌ ప్రధానంగా నగదు రవాణాపై దృష్టి పెట్టింది. ఎస్‌ఓటీ నిఘాలో ఉన్న వారిలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వ్యాపారులు, ఫైనాన్షియర్లు కూడా ఉన్నారు. వీరి ఫోన్లు ట్యాప్‌ చేయడంతోపాటు కదలికల్ని పసిగట్టిన ప్రణీత్‌ బృందం ఆ సమాచారాన్ని ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు అందించేది. ఆ బృందాలు వాళ్లు రవాణా చేస్తున్న నగదును స్వా«దీనం చేసుకునేవి. అయితే ప్రతిపక్షాలతోపాటు ఎన్నికల సంఘాన్నీ తప్పుదోవ పట్టించిన ప్రణీత్‌ టీమ్‌ ఈ నగదుకు హవాలా రంగు పూసింది. ట్యాపింగ్, నిఘాకు వినియోగించిన ఉపకరణాల్లో కొన్నింటిని నగరానికి చెందిన కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్స్‌ ల్యాబ్‌ అనే సంస్థ నుంచి సమీకరించుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఓడిపోతోందని రావడంతో... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతోందని గత నవంబర్‌ 30న ఎగ్జిట్‌ పోల్స్‌లో రావడంతో ఆ రోజు నుంచి ట్యాపింగ్‌ కార్యకలాపాలు ఆపేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించారు. డిసెంబర్‌ 4న ఫలితాలు వెలువడటంతోనే తన పోస్టుకు రాజీనామా చేసిన ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయాలని ప్రణీత్‌కు సూచించారు. దీంతో ప్రణీత్‌ అదే రోజు రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్స్‌ ల్యాబ్‌ సంస్థకు చెందిన శ్రీనివాస్, అనంత్‌ సహకారంతో హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు బయటకు తీశారు. సర్వర్లు తదితరాలను వారిద్దరికీ అప్పగించి... 50 హార్డ్‌డిస్క్‌ల్ని ఆర్‌ఎస్సై హరికృష్ణతో కలిసి ధ్వంసం చేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ కె.కృష్ణ ద్వారా ఈ హార్డ్‌లిస్క్‌ల్ని ఎలక్ట్రిక్‌ కట్టర్‌తో ముక్కలు చేయించారు. కంప్యూటర్లను ఫార్మాట్‌ చేసి, పత్రాలను ఎస్‌ఐబీ కార్యాలయం ఆవరణలోనే కాల్చేసిన ప్రణీత్‌రావు హార్డ్‌డిస్క్‌ ముక్కల్ని మాత్రం నాగోల్, మూసారాంబాగ్‌ వద్ద మూసీ నదిలో పారేశారు. ఫార్మాట్‌ చేసిన సెల్‌ఫోన్లు, పెన్‌డ్రైవ్స్‌ని బేగంపేట నాలాలో విసిరేశారు. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో పంజగుట్టలో కేసు నమోదై అరెస్టులు చోటు చేసుకున్నాయి.

New anthem for Telangana
రాష్ట్ర గేయం.. 2.30 నిమిషాలు!

సాక్షి, హైదరాబాద్‌: రెండున్నర నిమిషాల నిడివికి కుదించిన ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక గేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘జయజయహే తెలంగాణ’ గేయం ఒరిజినల్‌ వెర్షన్‌లోని ఒకట్రెండు పదాలను తొలగించి.. స్వల్ప మార్పులు, చేర్పులు చేసి పదమూడున్నర నిమిషాల పూర్తి నిడివితో మరో వెర్షన్‌ను ఖరారు చేసింది. గేయ రచయిత అందెశ్రీ మార్గదర్శకత్వంలో, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా.. ప్రముఖ గాయ నీ గాయకులతో రికార్డు చేసిన రెండు వెర్షన్ల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో గాయనీగాయ కులు ఈ రెండు వెర్షన్ల గేయాన్ని లైవ్‌గా పాడి వినిపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గేయాన్ని సరికొత్త స్వరాలు, సంగీత బాణీలతో అద్భుతంగా తీర్చిదిద్దారని, మరోసారి ప్రజలను ఉర్రూతలూగించడం ఖాయమని ఆ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఇందులో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీజేఎస్‌ అధినేత కోదండరాం, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కె.రఘు, తెలంగాణ అధికారిక చిహ్నం రూపొందిస్తున్న చిత్రకారుడు రుద్ర రాజేశం, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.అధికారిక చిహ్నంలో మార్పులపైనా..తెలంగాణ తొలిదశ ఉద్యమం, అశోక చక్రం, వ్యవ సాయం, రాజ్యాంగాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఈ భేటీలో సూచించారు. చిత్రకారుడు రుద్ర రాజేశం రూపొందించిన పలు నమూనా చిహ్నాలను పరిశీలించి వాటిలో ఒకదానిని ఎంపిక చేశారని.. అందులో కొన్ని మార్పులను సూచించారని తెలిసింది.అయితే ఇదే అధికారిక చిహ్నమంటూ.. మూడు నమూనా చిహ్నాలు బుధవారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో దేనిని కూడా ఎంపిక చేయలేదని సీఎంఓ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర గేయం, తెలంగాణ అధికారిక చిహ్నాన్ని జూన్‌ 2న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభలో ఆవిష్కరించనున్నారు.అమరవీరులు, ఉద్యమకారులకు అండగత బీఆర్‌ఎస్‌ సర్కారు తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి సమావేశంలో పేర్కొన్నారు. అమరవీ రుల కుటుంబాలు, ఉద్యమకారులకు తమ ప్రభు త్వం అండగా ఉంటుందన్నారు. వారి విషయంలో స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పా రు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులు, అమరవీ రుల కుటుంబాలకు ఇచ్చిన హామీ అమలుకు చర్య లు చేపట్టామని వెల్లడించారు. జూన్‌ 2న ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించే దశాబ్ది వేడుకలకు తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమకారులను ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు.నేడు మిత్రపక్షాలతో సమావేశంతెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, రాష్ట్ర గేయం, అధికారిక చిహ్నం రూపకల్పన అంశాలపై చర్చించేందుకు గురువారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మిత్రపక్షాలు సీపీఐ, సీపీఎం, టీజేఎస్‌ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమా వేశం కానున్నారు. మిత్రపక్షాల నేతల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణ యాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలను ఆహ్వానించలేదు.

The Indian cricket team pays special attention to fitness
కసరత్తులు షురూ!

న్యూయార్క్‌: టి20 ప్రపంచకప్‌ వేటలో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన భారత క్రికెట్‌ బృందం మొదటి రోజు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. కోహ్లి ఇంకా న్యూయార్క్‌ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయ్‌ ఈ ట్రయినింగ్‌ సెషన్‌ను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారత్‌తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన యూఎస్‌ వాతావరణానికి అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించారు.ఐపీఎల్‌ కారణంగా మన క్రికెటర్లంతా 90 శాతంకి పైగా డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌లే ఆడారు. కానీ వరల్డ్‌ కప్‌ లీగ్‌ దశలో అమెరికా వేదికపై జట్టు 25–27 డిగ్రీల వాతావరణంలో అన్నీ డే మ్యాచ్‌లే (ఉదయం గం. 10:30 నుంచి) ఆడబోతోంది. ట్రయినింగ్‌ సెషన్‌లో క్రికెటర్లు స్వల్ప జాగింగ్, రన్నింగ్‌తో పాటు కొద్దిసేపు ఫుట్‌బాల్‌ ఆడారు.‘టైమ్‌ జోన్‌కు అలవాటు పడటం అన్నింటికంటే ముఖ్యం. జట్టు సభ్యులంతా కూడా దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఒక్క చోటికి చేరారు. వారి ఫిట్‌నెస్‌ స్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మున్ముందు రోజుల కోసం ప్రణాళికలు రూపొందిస్తాను’ అని దేశాయ్‌ చెప్పారు. వాతావరణం చాలా బాగుందని హార్దిక్‌ పాండ్యా అభిప్రాయపడగా... న్యూయార్క్‌లో తొలిసారి ఆడనుండటం పట్ల రవీంద్ర జడేజా ఉత్సాహంగా ఉన్నాడు. నగర శివార్లలోని నాసా కౌంటీ స్టేడియంలో జూన్‌ 1న బంగ్లాదేశ్‌తో భారత్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌ వరకైనా కోహ్లి జట్టుతో చేరతాడా లేదా అనే విషయంలో బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. జూన్‌ 5న అసలు పోరులో ఐర్లాండ్‌తో భారత్‌ ఆడుతుంది. ‘నంబర్‌వన్‌’ ర్యాంక్‌తో ప్రపంచకప్‌లోకి... టి20 ప్రపంచకప్‌ టోర్నీలో టీమిండియా నంబర్‌వన్‌ ర్యాంకర్‌గా బరిలోకి దిగనుంది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ టి20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ 264 రేటింగ్‌ పాయింట్లతో తమ టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.రెండుసార్లు టి20 వరల్డ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను వెస్టిండీస్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేయడంతో ఆ జట్టు ర్యాంక్‌ మెరుగైంది. దక్షిణాఫ్రికా నాలుగు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్‌లో నిలిచింది.

Record Temperatures In Delhi Mageshpuri On May 29th 2024
మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత

సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్‌వేవ్‌ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్‌పూర్‌ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్‌ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్‌లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్‌ ఫీల్‌ పరిస్థితులు నెలకొన్నాయి.అంతలోనే వర్షం...ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement