Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Mohan Reddy on aarogyasri scheme1
ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష?

సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇందులో భాగంగానే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టింది. నిర్వీర్యం చేసే ఉద్దేశం లేకపోతే ఆస్పత్రులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదు? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోన్‌రెడ్డి మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై ఎందుకింత కక్ష? అని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా గత ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి ఈ పథకాన్ని దెబ్బ కొడుతున్నారని ధ్వజమెత్తారు. కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌లో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..అధికారంలోకి రాగానే ఒక ప్లాన్‌ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా? ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి, దాదాపు రూ.3 వేల కోట్లు బకాయిలు పెట్టారు. ఆస్పత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ లేదనే మాట వినిపిస్తున్నా, ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రజలు అప్పులు చేసో, ఆస్తులు తాకట్టు పెట్టో వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? బకాయిలు ఇవ్వకపోతే సేవలన్నీ నిలిపేస్తామని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు? ప్రజల ఆస్తిగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సృష్టించిన 17 వైద్య కళాశాలలపై స్కామ్‌లు చేస్తూ చంద్రబాబు మనుషులకు అమ్మేస్తున్న పద్ధతిలోనే ఇప్పుడు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతూ ఆరోగ్యశ్రీ సేవలను కూడా ప్రైవేటుకు అప్పగించడం నిజం కాదా?చంద్రబాబూ.. ప్రైవేటు బీమా కంపెనీలు వేసే కొర్రీలతో పాలసీ­దారులు పడుతున్న అవస్థలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా.. అలాంటి కంపెనీలకే ఆరోగ్యశ్రీని అప్పగిస్తే వారు వేసే కొర్రీలతో జనం ఇబ్బంది పడరా? లాభార్జనే కంపెనీల ధ్యేయం అయినప్పుడు ప్రజా ప్రయోజనాలు ఎంత వరకు మనుగడలో ఉంటాయి? కోవిడ్‌ వంటి కొత్త రోగాలు, అరుదైన వ్యాధులు, ప్రమాదాల సమయంలో గత ప్రభుత్వం విచక్షణాధికారాన్ని వాడుకుని బాధితులకు ఆరోగ్యశ్రీని అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఈ పథకం కింద ప్రొసీజర్ల సంఖ్యను పెంచి మానవతా దృక్పథంతో స్పందించి అనేక మార్లు ఎంతో మందిని ఆదుకున్నాం. ఈ పని ప్రైవేటు కంపెనీలు చేయగలవా? మీ ప్రభుత్వం చేయించగలదా? విజయవాడ వరద బాధితులకు బీమా విషయంలో మీరు (చంద్ర­బాబు) ఇచ్చిన హామీ ఎండమావేనని తేలిపోవడం వాస్తవం. ఇంత మంది ప్రజలు నష్టపోయినా మీరు చేసిన మేలు ఏమిటి?నాలుగు సార్లు సీఎం అయ్యానని చంద్రబాబు గొప్పలు చెబుతుంటారు. అయితే పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఏనాడైనా అనుకున్నారా? కనీసం ఏరోజైనా ఆ ప్రయత్నం చేశారా? దివంగత మహానేత వైఎస్సార్‌ దేశంలో తొలిసారిగా ఆరోగ్యశ్రీ రూపంలో ఒక గొప్ప పథకాన్ని తీసుకు వస్తే దాన్ని బలోపేతం చేసేలా ఒక్కపనైనా చేశారా? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చికిత్సలు అందించే ప్రొసీజర్లను 1,000 నుంచి 3,257కి పెంచింది. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్టుగా వార్షికాదాయం రూ.5 లక్షల లోపు కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చి మధ్యతరగతి వారికీ మేలు చేశాం. రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యాన్ని తీసుకుపోయి పేదవాడికి మంచి చేస్తూ, ఐదేళ్లలో 45.1 లక్షల మందికి రూ.13,421 కోట్లతో ఉచితంగా వైద్యాన్ని అందించాం. చికిత్స తర్వాత కోలుకునేందుకు దేశంలోనే ఎక్కడాలేని విధంగా, విశ్రాంతి సమయంలో రోగులకు తోడుగా నిలుస్తూ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టాం. దీని కింద 24.59 లక్షల మందికి మరో రూ.1,465 కోట్లు అందించాం. మేం కల్పించిన ఈ ఆసరాను, భరోసాను ఇప్పుడు పూర్తిగా తీసేస్తున్నారు. కొత్త అంబులెన్స్‌లతో 104, 108 సేవలను మెరుగుపరిస్తే, చంద్రబాబు నెలల తరబడి బకాయిలుపెట్టి అంబులెన్స్‌ సేవలను సైతం నిర్వీర్యం చేశారు.బాబు ష్యూరిటీ– భవిష్యత్తుకు గ్యారంటీ.. అని చంద్రబాబు ఎన్నికల్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలను దుర్మార్గంగా ఎగరగొడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలనూ రద్దు చేస్తున్నారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా.. ఉన్న గ్యారంటీనీ తీసేశారు. ప్రజలకు నష్టంచేసే ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించాలని ప్రజల తరఫున డిమాండ్‌ చేస్తున్నా.

Daily Horoscope On 08 January 2025 In Telugu2
ఈ రాశి వారికి ఇతరుల నుండి ధనలాభం. వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు.

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.నవమి ప.2.13 వరకు, తదుపరి దశమి,నక్షత్రం: అశ్విని సా.4.45 వరకు, తదుపరి భరణి,వర్జ్యం: ప.12.58 నుండి 2.30 వరకు, తిరిగి రా.1.41 నుండి 3.11 వరకు, దుర్ముహూర్తం: ప.11.45 నుండి 12.29 వరకు,అమృతఘడియలు: ఉ.10.02 నుండి 11.28 వరకు.సూర్యోదయం : 6.36సూర్యాస్తమయం : 5.37రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం...ఇతరుల నుండి ధనలాభం. వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ప్రముఖుల పరిచయం. వృత్తి, వ్యాపారాలు మరింత సమర్థంగా నిర్వహిస్తారు.వృషభం....వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. రుణాల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.మిథునం....పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తీరతాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.కర్కాటకం....ఉద్యోగాన్వేషణలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. కీలక నిర్ణయాలు. వస్తులాభాలు. పనులు మరింత వేగంగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.సింహం... వ్యవహారాలు ముందుకు సాగని పరిస్థితి. దూరప్రయాణాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు ఎదురవుతాయి.కన్య....ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు రావచ్చు. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.తుల....పరపతి పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. కార్యజయం. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు తీరతాయి.వృశ్చికం...పరిచయాలు పెంచుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.ధనుస్సు...రుణభారాలు తప్పదు. వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.మకరం...కష్టానికి ఫలితం ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బా«ధ్యతలు పెరుగుతాయి.. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.కుంభం....పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.మీనం....అనుకున్న కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. మానసిక ఆందోళన. ఇంటాబయటా సమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

Public health avoidance in Chandrababu series of Super Six promises3
‘బీమా’కు నైవేద్యం.. ఆరోగ్యం హరీ!

సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. సూపర్‌–6, సూపర్‌ సెవన్‌ హామీల ఎగవేతల పరంపరలో భాగంగా ఈసారి ప్రజారోగ్యానికి ఎసరు పెట్టింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. కేవలం రూ.2.5 లక్షలతో బీమా పథకాన్ని అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోని కుటుంబాలకే వర్తింపజేస్తామని చావు కబురు చల్లగా చెప్పారు! ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి ఇప్పటికే ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ట్రస్టు పరిధిలో అమలు చేసి 95 శాతం కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కాపీ కొట్టి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో ప్రైవేట్‌ బీమా కంపెనీని తెరపైకి తెచ్చి ప్రజారోగ్యాన్ని దళారీల చేతికి అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆరోగ్య బీమాను వర్తింపజేస్తే ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ చెబుతుండటం గమనార్హం. పదో వంతుతో సరి.. రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రజలను నమ్మించి గద్దెకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అందులో పది శాతానికి తగ్గించి రూ.2.5 లక్షలకు బీమాను పరిమితం చేసింది. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తించేలా మెలిక పెడుతోంది. దీన్ని ‘యూనివర్సల్‌ ఇన్సూరెన్స్‌’ అంటూ గొప్పలు చెబుతోంది. వాస్తవానికి రూ.25 లక్షల వరకూ పరిమితితో ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసింది. ప్రైవేట్‌ వ్యక్తులు, సంస్థల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా 95 శాతం కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు కల్పిస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎగవేతలు, కోతలే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్య భరోసాకు తూట్లు పొడుస్తున్నారు. దేశంలో ఇప్పటికే బీమా విధానాన్ని అమలు చేసిన పలు రాష్ట్రాలు పెదవి విరిచాయి. మహారాష్ట్ర, కేరళ బీమా విధానాన్ని విడనాడి తిరిగి ఆరోగ్యశ్రీ తరహా ట్రస్ట్‌ విధానం బాట పట్టాయి. దీన్ని పెడచెవిన పెట్టిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని బలి పెడుతోంది. అంతా అస్తవ్యస్థం.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా పథకం నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. ఎన్టీఆర్‌ వైద్య సేవ అని పథకం పేరు మార్చడం మినహా కనీసం శాశ్వత సీఈవోను సైతం నియమించలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. దీంతో ఏడాది తిరగకుండానే ఆస్పత్రులు ఏకంగా నాలుగు సార్లు కూటమి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. అయినప్పటికీ సర్కారులో చలనం లేకపోవడంతో గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ సేవలను ఆస్పత్రులు నిలిపివేశాయి. చికిత్స కోసం వచ్చిన రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఇక ఆరోగ్య ఆసరా కింద ఇప్పటికే రూ.నాలుగు కోట్లకు పైగా ప్రభుత్వం రోగులకు బకాయి పడింది. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న బీమా విధానంలో ఆసరా సాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజ్‌లు, ఐవీ సెట్‌లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్‌ ట్యూబ్స్, డిస్పోజబుల్‌ బెడ్‌షీట్స్, బెటాడిన్‌ సొల్యూషన్‌ కొరత నెలకొంది. విశాఖ కేజీహెచ్‌లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో లేవు. దీంతో చేసేది లేక మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ బయట కొనుగోలు చేయాలని వైద్యులు రోగులకు చీటీలు రాసిస్తున్నారు. ఇక వైద్య పరికరాలు పాడైతే పట్టించుకునే వారే లేరు. ఆదుకున్న ఆరోగ్య ఆసరా.. ఒకవైపు ప్రజలకు సంపూర్ణ వైద్య భరోసా కల్పించిన వైఎస్‌ జగన్‌ మరోవైపు చికిత్స అనంతరం రోగులు కోలుకునే వరకూ ఆ కుటుంబం జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా ఆదుకున్నారు. వైద్యులు సూచించిన మేరకు నెలకు రూ.5 వేల వరకూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన రోజే రోగుల ఖాతాల్లో జమ చేశారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారుల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఆస్పత్రి పాలైతే పోషణ కష్టతరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం అందించిన ఆరోగ్య ఆసరా సాయం కష్ట కాలంలో వారు ఆర్ధిక ఇబ్బందుల పాలు కాకుండా ఆదుకుంది. ఇలా వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభించింది. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ హయాంలో పథకం అమలైన తీరు, లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అరకొర ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీకి రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 2019–24 వరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.13 వేల కోట్లకుపైగా వెచ్చించి 45 లక్షల మందికిపైగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించింది. మరో 24.59 లక్షల మంది రోగులకు డిశ్చార్జీ అనంతరం జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లు చెల్లించారు. నాడు కోటిన్నర కుటుంబాలకు భరోసాదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా రూ.25 లక్షల వరకూ వైద్య పరిమితితో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసింది. చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, పేదలు వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో కేవలం తెల్ల రేషన్‌ కార్డు కుటుంబాలకే పరిమితం అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ఆపద్భాందవిలా అండగా నిలిచింది. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పథకాన్ని విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. ఏకంగా 3,257 ప్రొసీజర్‌లలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అన్ని రకాల క్యాన్సర్‌ చికిత్సలతో పాటు బైలాట్రల్‌ కాక్లియర్‌ ఇంప్లాంటేషన్, గుండె మార్పిడి లాంటి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సలు సైతం గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా లభించాయి. 54 వేలకు పైగా పోస్టుల భర్తీ..ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా వైద్యశాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేసింది. ముఖ్యంగా ప్రభు­త్వాస్పత్రుల్లో ప్రధాన సమస్య మానవ వనరుల కొరతను నివారించేందుకు మునుపెన్నడూ లేని విధంగా 2019–24 మధ్య ఏకంగా 54 వేలకుపైగా వైద్య పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. ప్రివెంటివ్‌ కేర్‌లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 41,931 మంది మెడికల్‌ ఆఫీసర్లకు (ఎంవో) గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని, 22.30 శాతం ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్రమే ఉన్నట్లు స్పష్టమైంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలు చేసింది. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్‌సీ వైద్యులు తమ పరిధిలోని గ్రామాలను నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా సందర్శించి.. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందించేవారు. పట్టణ పీహెచ్‌సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్‌ వేదికగా వెల్లడైంది. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల గత సర్కారు తీసుకున్న శ్రద్ధకు నిదర్శనం.జీరో వేకెన్సీ పాలసీ..2019–24 మధ్య వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఉద్యోగ విరమణ, వీఆర్‌ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేశారు. కేవలం వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్‌ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్‌ –ఇన్‌ –ఇంటర్వ్యూలు నిర్వహించారు. నాడు జాతీయ స్థాయిలో గైనిక్‌ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్‌ పోస్టులు దేశవ్యాప్తంగా 61 శాతం కొరత ఉండగా రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతను అధిమించడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో అభినందించింది. ఏపీ విధానాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్‌లు ఇస్తూ మిగిలిన రాష్ట్రాలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడిచింది. ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ కాకపోవడంతో వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది.రెండో రోజు నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు సాక్షి, అమరావతి: నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) సేవలు రెండో రోజు మంగళవారం నిలిచిపోయాయి. రూ.3 వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించలేదు. దీంతో సోమ­వారం నుంచి ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సేవలు అందించడం లేదు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ లబ్ధిదారులు చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్తున్నా నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేది లేక జేబులో డబ్బులు పెట్టి ప్రజలు, ఉద్యోగులు చికిత్సలు చేయించుకుంటున్నారు. మరోవైపు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చర్చలు నిర్వహించారు. నిలిపి వేసిన సేవలను పునఃప్రారంభించాలని కోరారు. పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు అందించలేమని ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. రెండు గంటల పాటు సాగిన చర్చల్లో త్వరలోనే రూ.500 కోట్లు బిల్లులు విడుదల చేస్తామని ఆస్పత్రులకు హామీ ఇచ్చినట్టు వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి వచ్చిన హామీపై అసోసియేషన్‌ సభ్యులతో చర్చించి, బుధవారం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆశా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

Sakshi Editorial On China HMPV Virus4
భయం వద్దు... జాగ్రత్త ముద్దు!

మాస్కులు... చేతుల పరిశుభ్రత... తదితర జాగ్రత్తలు మళ్ళీ బలంగా వినిపిస్తున్నాయి. హ్యూమన్‌ మెటా న్యూమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ) వల్ల చైనాలో వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మన దేశంలోనూ కేసులు కొన్ని బయటపడడంతో జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా పాత కరోనా జ్ఞాపకాలు ముప్పిరిగొంటున్నాయి. చైనా వార్తలతో సోమవారం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) సెన్సెక్స్‌ 1.5 శాతం పైగా పడిపోవడం గగ్గోలు రేపుతోంది. ఉత్తరాన చైనాకు సమీపంలో ఉన్నందున ప్రజా సంబంధాలు, ఆర్థిక సంబంధాల రీత్యా స్వైన్‌ఫ్లూ, ఏవియన్‌ ఫ్లూ, కోవిడ్‌ల లానే ఇది కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ అనారోగ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, వేయికళ్ళతో పరిస్థితిని కనిపెట్టాలనీ, ఒకరి నుంచి మరొకరికి హెచ్‌ఎంపీవీ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు ప్రజల్లో చైతన్యం తేవాలనీ రాష్ట్రాలకు కేంద్ర సర్కార్‌ తాజాగా సూచనలు జారీ చేయడం గమనార్హం. హెచ్‌ఎంపీవీ సహా అలాంటి అనేక ఇతర వైరస్‌ల వల్ల చైనాలో ఇప్పటికే భారీ సంఖ్యలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. ఆ దేశంలో జనం మాస్కులు ధరించి ఆస్పత్రుల్లో, బయట సంచ రిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌ సహా ప్రపంచమంతటా ఈ కేసులపై దృష్టి పెరిగింది. హెచ్‌ఎంపీవీ వైరస్‌ వ్యవహారం చర్చనీయాంశమైంది. కోవిడ్‌ సృష్టించిన భయోత్పాతం రీత్యా, వైరస్‌లు, మహమ్మారుల పేరు చెప్పగానే జనం సహజంగానే బెంబేలెత్తిపోతున్నారు. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఈ భయాందోళనలు అర్థం చేసుకోదగినవే. నిజానికి, హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్‌ ఏమీ కాదు. శాస్త్రవేత్తలు 2001లోనే తొలిసారి దీని జాడ గుర్తించారు. వైరస్‌ స్వభావం, అది సోకినప్పటి లక్షణాల గురించి అవగాహన కూడా వచ్చింది. అయిదేళ్ళ లోపు చిన్నారులకూ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికీ, వృద్ధులకూ ఈ వైరస్‌ సోకే ప్రమాదం అధికం. అందువల్లే, హెచ్‌ఎంపీవీతో తంటా చాలాకాలంగా ఉన్నదేననీ ఓ వాదన. అసలు మన దగ్గర తాజాగా ఈ కేసులు చాలా గమ్మత్తుగా బయటపడ్డాయి. అంతకంతకూ చలి ముదురుతున్న ఈ శీతకాలంలో శ్వాసకోశ అనారోగ్యాలను పసిగట్టి, వాటిపై నిఘా ఉంచేందుకు ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ (ఐసీఎంఆర్‌) ఎప్పటిలానే చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో ఈ వైరస్‌ బాధిత కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, దేశంలో శ్వాసకోశ వ్యాధి పీడితుల్లో అనూహ్యమైన పెరుగుదల ఏదీ ఇప్పటికీ కనిపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేయడం ఒకింత ఊరటనిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమై ఉన్నామన్నది ఆ శాఖ ఆశ్వాసన. ఆ మాటకొస్తే, దేశంలో శ్వాసకోశ, సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా కేసులను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండడం ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం చేసేదే. ఇప్పుడు హెచ్‌ఎంపీవీ పరిస్థితిపై ఒక్క సారిగా గగ్గోలు రేగడంతో అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రతిస్తున్నట్టు అధికారిక కథనం. కరోనా మొదలు నేటి హెచ్‌ఎంపీవీ దాకా అన్నీ చైనా కేంద్రంగా వార్తల్లోకి రావడంతో అనేక అనుమానాలు, భయాలు తలెత్తుతున్నాయి. చైనా సర్కార్‌ మాత్రం పౌరులతో పాటు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకుల ఆరోగ్యాన్ని సైతం కాపాడతామంటూ భరోసా ఇస్తోంది. బీజింగ్‌ ఎన్ని మాటలు చెప్పినా, గత చరిత్ర కారణంగా ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. చిత్రమేమిటంటే, ప్రస్తుత ఇన్‌ఫెక్షన్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఎలాంటి ప్రకటన, మార్గదర్శకాలు విడుదల చేయనేలేదు. విదేశీ ప్రయాణాలు చేయనివారికి సైతం హెచ్‌ఎంపీవీ సోకినట్టు వార్తలు రావడంతో, ఇది సీజనల్‌ సమస్యే తప్ప మరేమీ కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది. చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు సాధారణమే. అయితే, సరైన సమాచారం లేనప్పుడు పుకార్లు షికార్లు చేసి, లేనిపోని భయాలు సృష్టించి, ఆర్థిక, సామాజిక నష్టానికి దారి తీసే ముప్పుంది. జనవరి 13 నుంచి 45 రోజులు ప్రయాగలోని కుంభమేళాకు 40 కోట్ల పైగా భక్తులు హాజరవు తారని అంచనాలున్న వేళ అప్రమత్తత అవసరం. వైరస్‌ల విహారానికి ముకుతాడు వేయడం ముఖ్యం. కోవిడ్‌–19 కాలంలో లానే తరచూ చేతులను సబ్బునీళ్ళతో కడుక్కోవడం, చేతులు కడుక్కోకుండా కళ్ళు–ముక్కు–నోటిని తాకకపోవడం, వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలగక పోవడం, దగ్గు – తుమ్ములు వచ్చినప్పుడు ముక్కు – నోటికి అడ్డు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం ఉత్తమం. అసలు కరోనా, హెచ్‌ఎంపీవీ లాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఖర్చులేని సర్వసాధారణ జాగ్రత్తలను మన నిత్యజీవితంలో భాగం చేసుకోవడం ఆరోగ్య పరిరక్షణకు మరీ ఉత్తమం. కోవిడ్‌ అనుభవం ప్రపంచానికి నేర్పిన పాఠం – అప్రమత్తత. దేన్నీ తేలిగ్గా తీసుకోవద్దనీ, ఎట్టి çపరిస్థితుల్లోనూ స్వీయరక్షణ చర్యలను వదిలిపెట్టవద్దనీ తేల్చిచెప్పింది. దేశంలో 78 శాతం మేర చొచ్చుకుపోయిన మొబైల్‌ ఫోన్లనూ, 65 కోట్ల మందికి పైగా వీక్షకులున్న దూరదర్శన్‌నూ ప్రజాహిత సమాచార ప్రచారానికి వినియోగించాలి. అంతేకాక, ఇలాంటి వివిధ రకాల వైరస్‌లు, వ్యాధులకు దేశంలో టెస్టింగ్‌ సౌకర్యాలను విస్తరించాలి. ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను పటిష్ఠం చేసుకుంటేనే అవాంఛనీయ పరిస్థితుల్ని ఎదుర్కొనే సామర్థ్యం సిద్ధిస్తుంది. వైరస్‌ల తీవ్రత తక్కువ, ఎక్కువలతో సంబంధం లేకుండా పాలకులు పారిశుద్ధ్యం, స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంపై శ్రద్ధ పెట్టడం అవసరం. వ్యాధులు ప్రబలాక చికిత్సకు శ్రమించే కన్నా, వైరస్‌లను ముందే పసిగట్టి, వాటి విజృంభణను నివారించేందుకు సర్వసన్నద్ధం కావడం అన్ని విధాలా ఉపయుక్తం, శ్రేయస్కరం.

AAP vs BJP in Delhi Elections 20255
పోరాడేది ముగ్గురైనా.. పోటీ ఇద్దరి మధ్యే!

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఢిల్లీ ఎన్నికలకు శంఖారావం మోగడంతో మూడు ప్రధాన పార్టీలు తాడోపేడో తేల్చకునేందుకు సిధ్దమవుతున్నాయి. ఎన్నికల పోరులో ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తలపడుతున్నా ప్రధాన పోటీ మాత్రం ఆప్, కాషాయ పార్టీల మధ్యే ఉండనుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు రెండు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కదనరంగంలోకి కాలుదువ్విన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే ప్రచారపర్వంలో దూసుకుపోతుండగా, పరివర్తన్‌ యాత్రల పేరిట ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ, తన ప్రభావం చూపేందుకు సమాయత్తమయ్యారు. ఇక ప్రచార పర్వంలో కాస్త వెనుకబడ్డ కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం ముందుంది. తన గత వైభావాన్ని పొందే పరిస్థతి లేకున్నా, అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు తంటాలు పడుతోంది.జాతీయ పార్టీలను ఊడ్చేసిన ఆప్‌..సామాన్యడినంటూ 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీని స్థాపించిన కేజ్రీవాల్‌ అసమాన్య రీతిలో జాతీయ పార్టీలను తన చీపురుతో ఊడ్చేశారు. 2013లో కాంగ్రెస్‌ పొత్తుతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన కేజ్రీవాల్‌ జన్‌ లోక్‌పాల్‌ బిల్లు విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ప్రభుత్వంలోంచి దిగిపోయారు. అనంతరం 2015లో జరిగిన ఎన్నికల్లో అసమాన్య రీతితో 70 స్థానాలకు గానూ ఏకంగా తన ఛరిష్మాతో 67 స్థానాలు సాధించిన బీజేపీ, కాంగ్రెస్‌లను మట్టి కరిపించారు. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్ల శాతాన్ని పొందిన ఆప్, ఆ తర్వాత 2020లోనూ రెండు పార్టీలకు చుక్కలు చూపించింది.2020 ఎన్నికల్లో ఆప్‌ ఏకంగా 53.57% ఓట్లతో 62 స్థానాలు సాధించింది. 38.51% ఓట్లు సాధించిన బీజేపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా... షీలాదీక్షిత్‌ హయాంలో వరుసగా 15 ఏళ్ళపాటు అధికార హవాను కొనసాగించిన కాంగ్రెస్‌ పార్టీ కేవలం 4.26% ఓట్లకు పడిపోయి కనీసం ఖాతా కూడా తెరవలేదు. కాగా ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించే వ్యూహంతో... ఎన్నికలకు నాలుగు నెలల ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్‌ మరోమారు జాతీయపార్టీలకు సవాల్‌ విసురుతున్నారు. మళ్లీ కొత్త పంథాలో ఆమ్‌ ఆద్మీప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఏకఛత్రాధిపత్యాన్ని నిరూపించుకొనేందుకు సిద్ధమైన ఆమ్‌ ఆద్మీ పార్టీ కొత్త పంథాలో దూసుకెళ్తోంది. లిక్కర్‌ స్కాం ఆరోపణల నేపథ్యంలో అప్రతిష్టపాలైన కేజ్రీవాల్‌ ఆరు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆప్‌ అధినేతగా ప్రచార బాధ్యతలను భుజస్కందాలపై ఎత్తుకున్న కేజ్రీవాల్‌... పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌ పథకాలతో ప్రజలకు చేరువైన ఆయన కొత్త తరహా హామీలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షలకు బీమా, ఆటో డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.1 లక్ష సహాయం, మహిళా సమ్మాన్‌ యోజనలో భాగంగా మహిళలకు నెలకు రూ.2,100 ప్రత్యేక సహాయం, ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులందరికీ ఉచిత వైద్యం, హిందు, సిక్కు పూజారులకు నెలకు రూ.18 వేలు సహాయం, విదేశీ విద్యను అభ్యసించే దళిత విద్యార్థుల పూర్తి ఖర్చులను భరించేటువంటి హామీలను ఇచ్చారు. వీటితో పాటు అక్రమంగా పెంచిన నీటి బిల్లులను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని ప్రకటించారు.ఆప్‌ హామీల ప్రకటన ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కైలాష్‌ గెహ్లోత్‌ రాజీనామా, సీఎం అధికార నివాసం శీష్‌ మహల్‌పై రగులుతున్న వివాదం ఆమ్‌ ఆద్మీ పార్టీని ఇక్కట్లకు గురిచేస్తోంది. అంతేగాక ఆప్‌ అధినేతకు పోటీగా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు బరిలో దిగారు. షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌తో పాటు బీజేపీ నేత పర్వేష్‌ వర్మను ఎదుర్కోవడం కేజ్రీవాల్‌కు సవాలుగా మారింది.పీఠం దక్కించుకోవాలన్న కాంక్షతో కమలంఆమ్‌ ఆద్మీ పార్టీని అప్రతిష్టాపాలు చేసి అధికార పీఠాన్ని దక్కించుకొనేందుకు బీజేపీ ప్రణాళికలను అమలు చేస్తోంది. లిక్కర్‌ స్కాం విషయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీని బజారుకీడ్చడంలో సక్సెస్‌ సాధించింది. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలకే పరిమితం అయిన బీజేపీ... లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆప్, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేసినప్పటికీ బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 54.35% ఓట్లను రాబట్టుకుంది. ఇదే పంథాను కొనసాగించాలన్న బలమైన లక్ష్యంతో ఉన్న బీజేపీ... యమునా కాలుష్యం, శీష్‌ మహల్‌లో విలాస జీవితం, లిక్కర్‌ స్కాం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఆప్‌ను ఇరుకునపెడుతోంది. సామాన్యుడు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌... అవినీతి సొమ్ముతో అద్దాల మేడలో విలాసంగా జీవించారంటూ బీజేపీ ప్రముఖంగా విమర్శిస్తోంది. ఈ నెల 3, 5 తేదీల్లో పరివర్తన యాత్రలో భాగంగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ శీష్‌ మహల్‌ కేంద్రంగానే కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. పార్టీ సీనియర్‌ నేతలు మనోజ్‌ తివారీ, బాన్సురీ స్వరాజ్, ప్రదీప్‌ ఖండేల్వాల్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వంటి నేతలు బీజేపీ గెలుపు కోసం పరిశ్రమిస్తున్నారు. ఒంటరి పోరులో కాంగ్రెస్‌ 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌ ప్రస్తుత ఎన్నికల్లో పరువు నిలుపుకొనేందుకు పోటీ పడుతోంది. గత రెండు అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కనీస ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్‌ , ఆస్థిత్వాన్ని చాటుకునేందుకు కష్టపడుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోరాడి 18.19% ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ... ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పెరిగిన ఓట్ల శాతంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అంశాన్ని పార్టీ బలంగా విశ్వసిస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ దేవేందర్‌ యాదవ్, అల్కా లాంబ, అజయ్‌ మాకెన్, సందీప్‌ దీక్షిత్‌ వంటి పార్టీ సీనియర్‌ నేతలు ఆప్‌కు పోటీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు.

Sakshi Guest Column On Artificial intelligence, wars, climate crisis6
ఈ ఏడాది మన ముందున్న సవాళ్లు

గత సంవత్సరం రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో 11,973 మంది పౌరులు మరణించారు; ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధంలో పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు. మానవ జాతి చరిత్రలోనే 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. రికార్డు స్థాయిలో చలికాలం కూడా మొదలైంది. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పగలదనీ, కాబట్టి అది ప్రాణాంతకమనీ యువల్‌ నోవా హరారీ లాంటి మేధావులు నొక్కి చెబుతున్నారు. మానవ జాతి అంతం కోసం సైన్స్‌ సృష్టించిన రాక్షసి ఏఐ కానుందనే భయాందోళనలు కలుగుతున్నాయి. ఈ కొత్త సంవత్సరం ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాళ్లు ఇవే. యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ విపరిణామం నుంచి ఎదురయ్యే సమస్యలను ప్రపంచ నాయకులు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.నూతన సంవత్సరం రోజున కొన్ని పతాక శీర్షికలను చూద్దాం. అమెరికాలోని న్యూ ఓర్లి యన్స్‌లో సంబరాల్లో మునిగి తేలుతున్న వారిమీదికి ఓ ఉగ్రవాది బండిని నడిపించి 15 మంది చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్‌ షంషుద్దీన్‌ జబ్బార్‌ ఆ గుంపుపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడిని హతమార్చారు. ఒకప్పుడు జబ్బార్‌ అమెరికన్‌ సైన్యంలో పనిచేశాడు. జరగనున్న ఉపద్రవ సంకేతాలను పసిగట్టడంలో ఇది అమెరికన్‌ నిఘా ఏజెన్సీల వైఫల్యమేనని చెప్పాలి. అతడికి నేరమయమైన గతం ఉంది. అయినా కఠినమైన భద్రతా తనిఖీ నుంచి తప్పించుకున్నాడు. ఈ నిర్లక్ష్యానికి అమాయకులైన అమెరికన్‌ పౌరులు మూల్యం చెల్లించారు.ఈ విషాదం అక్కడితో ముగిసిపోలేదు. న్యూ ఓర్లియన్స్‌ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే లాస్‌ వెగాస్‌లోని ట్రంప్‌ హోటల్‌ ముందు ఒక ట్రక్కు పేలింది. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, ఒక పాదచారి మరణానికి కారణమైన ఆ ట్రక్కు, అమెరికన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహత సహచరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన టెస్లా ఫ్యాక్టరీలో తయారైనది. ఇక మూడో ఘటన న్యూయార్క్‌లోని క్వీన్స్‌ బరోలో చోటుచేసుకుంది. అక్కడ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యాసాన్ని రాసే సమయానికి అమెరికన్‌ పోలీసులు వాటిని స్పష్టమైన ఉగ్రవాద చర్యలుగా పేర్కొనలేదు. కానైతే ఈ వరుస ఘటనలు అమెరికన్‌ సమాజంలో పెరుగుతున్న అశాంతిని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.ఈ మూడు ఘటనలే కాకుండా, ఇతర ప్రాంతాలలో జరిగిన మరో రెండు, మన ప్రపంచంలో దీర్ఘకాలిక ప్రతికూల పరిణామాలు జరగనున్నట్లు చెబుతున్నాయి. అవేమిటంటే, నూతన సంవత్సరం రాత్రి పూట, గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి చేసి 12 మందిని చంపేసింది. రెండవ ఘటనలో, గ్యాస్‌ పైప్‌లైన్‌ను స్వాధీనం చేసు కున్న ఉక్రెయిన్, రష్యా నుండి మిగిలిన యూరప్‌కు గ్యాస్‌ సరఫరాను నిలిపివేసింది. ఇది రష్యన్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. ఈ సమయంలో ఎముకలు కొరికే చలిని ఎదుర్కొనే యూరప్‌పై దాని ప్రభావం మాటేమిటి?ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్న డోనాల్డ్‌ ట్రంప్‌ కోసం ముళ్ల కిరీటం ఎదురుచూస్తోంది. ట్రంప్‌ అంతర్జాతీయంగానే కాకుండా, దేశీయ రంగాలలో కూడా సవాళ్లతో పోరాడవలసి ఉంటుంది. న్యూ ఓర్లియన్స్‌, న్యూయార్క్, లాస్‌ వెగాస్‌ ఘటనలు మరోసారి అమెరికా అజేయం అనే భావనను దాని లోపలి నుండే ఛేదించవచ్చని స్పష్టంగా చెప్పాయి. అలాంటి పరిస్థితుల్లో, ఇజ్రాయెల్‌–హమాస్, రష్యా–ఉక్రెయిన్‌ వివాదాన్ని ట్రంప్‌ సంతృప్తికరంగా ఎలా పరిష్కరించగలరు?నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న రష్యా–ఉక్రె యిన్‌ సైనిక ఘర్షణ రష్యా సైనిక శక్తిపై, దాని ఆధిపత్యంపై సందేహా లను రేకెత్తిస్తోంది. బలమైన నాయకుడైన వ్లాదిమిర్‌ పుతిన్‌ సైనిక శక్తిలో కూడా బలహీనతలు ఉన్నాయని గత మూడేళ్ల పరిణామాలు చూపిస్తున్నాయి. ఆయన పెంచుకున్న ప్రతిష్ఠకూ, సంవత్సరాలుగా ఆయన శ్రద్ధగా నిర్మించుకున్న ఖ్యాతికీ బీటలు వారుతున్నాయి. పతనమవుతున్న ఏకఛత్రాధిపతి ఇతరులను నాశనం చేయడానికి ఉన్న ప్రతి కిటుకునూ ఉపయోగిస్తాడనే వాస్తవానికి చరిత్ర సాక్ష్యంగా ఉంది. గ్యాస్‌ పైప్‌లైన్‌ స్వాధీన ఘటన జరిగినప్పటి నుండి, పుతిన్‌ తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం గురించి ఆందోళన కలుగుతోంది.అంటే 2025 సంవత్సరానికి ఉన్న ముఖ్యమైన ప్రాధాన్యత యుద్ధాలను ఆపడమేనా? ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన మానవ హక్కుల గణాంకా లను చూస్తే, యుద్ధాలు మానవాళిని ఎలా రక్తమోడిస్తున్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ఆ డేటా ప్రకారం, 2024 జనవరి నుండి అక్టోబర్‌ 21 వరకు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో 622 మంది పిల్లలతో సహా కనీసం 11,973 మంది పౌరులు మరణించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనల ప్రకారం, ఇజ్రా యెల్‌–హమాస్‌ యుద్ధంలో గత 14 నెలల్లో 17,000 మంది పిల్లలతో సహా 45,000 మంది చనిపోయారు.ఇప్పుడు మానవ జాతి ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య అయిన వాతావరణ సంక్షోభాన్ని చూద్దాం. మానవ జాతి చరిత్రలో 2024 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. వాతా వరణ సదస్సు విఫలమైనప్పటి నుండి, వాతావరణ చర్యలపై ఏకాభిప్రాయానికి రాబోయే సంవత్సరాల్లో సవాళ్లు తీవ్రమవుతా యనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో చలి కాలం ప్రారంభమవడం కూడా దీనికి సూచన. ఈ సవాలును మరింతగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని ట్రంప్‌ గెలుపు బలహీనపరుస్తుంది. వాతా వరణ సంక్షోభంపై ఆయనకున్న తీవ్రమైన అభిప్రాయాలు అందరికీ తెలిసినవే.మన దృష్టిని ఆకర్షించిన మరో సమస్య ఆర్టిఫిషియల్‌ ఇంటె లిజెన్స్‌. కృత్రిమ మేధ బలాలు, నష్టాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ రచయిత, జెరూసలేం హీబ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ యువల్‌ నోవా హరారీ కొన్ని సందర్భోచి తమైన ప్రశ్నలను లేవనెత్తారు. కృత్రిమ మేధ అబద్ధం చెప్పగలదని ఆయన నొక్కి చెప్పారు. చాట్‌జీపీటీ4ని ఓపెన్‌ ఏఐ ప్రారంభించి నప్పుడు, దాని సామర్థ్యాన్ని పరీక్షించడానికి ‘కాప్చా’ను పరిష్కరించమని వారు కోరినట్లు హరారీ సోదాహరణ పూర్వకంగా తెలిపారు. అయితే చాట్‌జీపీటీ4, ఆ కాప్చాను పరిష్కరించలేక పోయింది. తర్వాత దాన్ని టాస్క్‌రాబిట్‌ అనే వెబ్‌ పేజీకి యాక్సెస్‌ ఇచ్చారు. కాప్చాను ఛేదించే పనిని చాట్‌జీపీటీ4 ఔట్‌సోర్స్‌ చేసి, సర్వీస్‌ ప్రొవైడర్‌కు తనకు సరిగ్గా కళ్లు కనబడవనీ(మనిషి లాగే), తనకోసం చేసిపెట్టమనీ అడిగింది. దాంతో అల్గోరిథమ్‌ను రూపొందించిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. కృత్రిమ మేధ అబద్ధాలు చెప్పడం ఎలా నేర్చుకుందో వారు అర్థం చేసుకోలేకపోయారు.హరారీ, ఇతర ప్రజా మేధావులు కృత్రిమ మేధ పాత్రను ప్రశ్నించడానికి ఇదే కారణం. ఇది మానవులు రూపొందించిన స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల మొదటి సాధనం. కాబట్టి కృత్రిమ మేధ ప్రాణాంతకం అని వారు నొక్కిచెబుతున్నారు.దురుద్దేశాలు ఉన్న వ్యక్తులు కృత్రిమ మేధను దుర్వినియోగం చేస్తారనడంలో సందేహమే లేదు. 2024 సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి 21న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వరాన్ని క్లోన్‌ చేయడానికి కృత్రిమ మేధను ఉపయోగించారు. దానిద్వారా న్యూ హాంప్‌షైర్‌ రాష్ట్రంలోని ఓటర్లకు వేలకొద్దీ ఆటోమేటెడ్‌ కాల్స్‌ చేశారు. ఈ ఆపరేషన్‌ను చేపట్టిన లింగో టెలికాం కంపెనీకి తర్వాత 1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల జరిమానా పడింది. భారతదేశంలో కూడా, నటి రష్మిక మందాన ఫొటోను మార్ఫింగ్‌ చేసిన ఉదంతాన్ని చూశాం. ప్రశ్న ఏమిటంటే, మానవ జాతి అంతం కోసం సైన్స్‌ ఒక రాక్షసిని సృష్టించిందా?మానవాళికి ముప్పు కలిగించే యుద్ధాలు, వాతావరణ సంక్షోభం, కృత్రిమ మేధ అనే మూడు సవాళ్లపై 2025 సంవత్సరం ఒక ఏకాభిప్రాయాన్ని సాధించగలదా?శశి శేఖర్‌ వ్యాసకర్త ‘హిందుస్థాన్‌’ ప్రధాన సంపాదకుడు(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Telangana High Court verdict on ACB case in Formula E car race affair7
దర్యాప్తు అడ్డుకోలేం.. ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పు

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా–ఈ కార్‌ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావుకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. దర్యాప్తును అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా 10 రోజుల వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది. కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌లో నిర్వహించే నిమిత్తం హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం వెనుక నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పాత్ర ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 20న ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ గత నెల 20న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి డిసెంబర్‌ 31న తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం..మంగళవారం ఉదయం 35 పేజీల తీర్పు వెలువరించింది. సాక్ష్యాల సేకరణకు అవకాశం ఇవ్వాలి ‘ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.54,88,87,043 నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్‌ఎండీఏను నాటి మంత్రి కేటీఆర్‌ ఆదేశించారనేది ఆరోపణ. దురుద్దేశంతో నిధులు బదిలీ చేయమని ఆదేశించారా? తన లబ్ధి కోసం చెల్లించమన్నారా? మూడో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారా? అనేది దర్యాప్తులో తేలుతుంది. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా బదిలీ జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. విచారణ జరిపేందుకు ఇవి సరిపోతాయి. ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే దర్యాప్తు చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన మరుసటి రోజే దాన్ని కొట్టివేయాలంటూ దాఖలైన ఇలాంటి పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు చేయడానికి అధికారులకు అవకాశం ఇవ్వకుండా ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేసిన హైకోర్టు తీరును తప్పుబట్టింది. ఈ కేసులో కూడా డిసెంబర్‌ 18న ఫిర్యాదు, 19న ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయగా, 20న కోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సహేతుకమైన అవకాశం ఇవ్వాలి. అందుకే ఈ కేసు దర్యాప్తును తొందపడి అడ్డుకోవాలని ఈ కోర్టు అనుకోవడం లేదు. దురుద్దేశం, ఆరోపణలు, నిజాయితీ లేకుండా వ్యవహరించారా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. ఇప్పుడు దర్యాప్తును అడ్డుకోవడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ దశలో కోర్టుల మినీ ట్రయల్‌ సరికాదు నేరం జరిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో వెల్లడించాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా కోర్టులు మినీ ట్రయల్‌ నిర్వహించడం సరికాదు. పిటిషనర్‌పై ఐపీసీ సెక్షన్‌ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) వంటి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 528 మేరకు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు కోర్టుకున్న అధికారం పరిమితం. కేసు విచారణ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, చట్ట దుర్వినియోగానికి దారితీసే సందర్భాల్లోనే చాలా అరుదుగా కోర్టుల జోక్యానికి వీలుంది. దర్యాప్తు అధికారాలను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవు. ఈ కేసులో సెక్షన్‌ 528 కింద కోర్టు తన స్వాభావిక అధికారాన్ని వినియోగించి ఆరోపణలపై విచారణ చేపట్టబోదు. ఆలస్యం జరిగిందనే కారణంతో కొట్టివేత కుదరదు భజన్‌లాల్, నీహారిక ఇ¯న్‌ఫ్రాస్ట్రక్చర్‌ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇక్కడి కేసుకు వర్తించవు. 14 నెలలు ఆలస్యంగా కేసు నమోదు అయ్యిందని చెప్పి ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరడానికి వీల్లేదు. మంత్రిగా చేసిన వాళ్లపై కేసు నమోదుకు వీల్లేదన్న పిటిషనర్‌ వాదన ఆమోదయోగ్యంగా లేదు. ఏసీబీ కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోరడం చట్ట వ్యతిరేకం. ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయడానికి అర్హమైనదా, కాదా అనే అంశంలోకి వెళ్లే ముందు పిటిషనర్‌పై ఉన్న అభియోగాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. హెచ్‌ఎండీఏ అనేది ప్రత్యేక సంస్థ. ఆస్తులు ఉండటమే కాకుండా అభివృద్ధిలో భాగంగా పలు ఒప్పందాలు చేసుకోవడానికి అధికారమున్న సంస్థ. పురపాలక శాఖ పరిధిలోనే ఇది పని చేస్తుంది. ఆ శాఖ అప్పటి మంత్రిగా పిటిషనర్‌ అదీనంలోనే హెచ్‌ఎండీఏ విధులు నిర్వహించింది.. ఆదేశాలు పాటించింది. ఈ కేసులో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థ ఆర్థికంగా లబ్ధి పొందినా, ఆ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పిటిషనర్‌ వాదించారు. అయితే ఇది ఏసీబీ దర్యాప్తులో తేలే అంశం. మొత్తంగా చూస్తే ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయలేం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పది రోజులపాటు పొడిగించాలన్న కేటీఆర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అభ్యర్థనను తోసిపుచ్చింది. క్రిమినల్‌ కేసుల్లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నేరుగా సుప్రీంకోర్టులోనే సవాల్‌ చేయాల్సి ఉంటుంది. విచారణ జరిపే అధికారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఉండదు.

Consecutive defeats for the Indian team8
పరిస్థితి గంభీరం!

శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్‌లో ఓటమి... 36 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో ఒక టెస్టులో పరాజయం... భారత టెస్టు చరిత్రలో స్వదేశంలో తొలిసారి 0–3తో క్లీన్‌స్వీప్‌... ఇన్నింగ్స్‌లో 46కే ఆలౌట్‌... ఇప్పుడు బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీని కోల్పోవడంతో పాటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌ చేరే అవకాశం చేజార్చుకున్న పరిస్థితి... హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియాకు ఎదురైన నిరాశాజనక ఫలితాలు ఇవి. ఒక్క బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ విజయం మినహా హెడ్‌ కోచ్‌గా అతను చెప్పుకోదగ్గ ఘనమైన ప్రదర్శన ఏదీ భారత జట్టు నుంచి రాలేదు. మైదానంలో జట్టు పరాజయాలకు ఆటగాళ్ల వైఫల్యం కారణం కావచ్చు. కానీ జట్టు కోచ్‌ కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. టీమిండియాకు ఓటములు ఎదురైనప్పుడు అప్పటి కోచ్‌లంతా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నవారే. అన్నింటికి మించి ఎంతో ఇష్టంతో బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసిన కోచ్‌... గతంలో జట్టుకు కోచ్‌గా పని చేసిన వ్యక్తులను విమర్శిస్తూ తానైతే అద్భుతాలు సాధిస్తానంటూ పదే పదే చెబుతూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు కోచ్‌గా ఫలితాలు రాబట్టలేకపోతే కచ్చితంగా తప్పు పట్టాల్సిందే. గంభీర్‌ వాటికి అతీతుడేమీ కాదు! –సాక్షి క్రీడా విభాగంభారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఎంపిక కాకముందు గంభీర్‌ ఏ స్థాయిలో కూడా కోచ్‌గా పని చేయలేదు. ఏ జట్టు సహాయక సిబ్బందిలోనూ అతను భాగంగా లేడు. 2018లో ఆట నుంచి రిటైర్‌ అయిన తర్వాత మూడు ఐపీఎల్‌ సీజన్లలో లక్నో సూపర్‌ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్‌లకు మెంటార్‌గా పని చేశాడు. ఇందులో 2024లో అతను మెంటార్‌గా వ్యవహరించినప్పుడు కోల్‌కతా జట్టు ఐపీఎల్‌ టైటిల్‌ గెలుచుకుంది. సాధారణంగా ఏ జట్టు కోచ్‌లైనా చేసే పనులు అతనేవీ చేయలేదు. ప్రాక్టీస్‌ సెషన్లలో నేరుగా భాగమై ప్రణాళికలు రూపొందించడం, త్రోడౌన్స్‌ ఇవ్వడం, ఆటగాళ్ల టెక్నిక్‌లను చక్కదిద్దే పని చేయడం... ఇవన్నీ గంభీర్‌ చూపించలేదు. ఒక టి20క్లబ్‌ టీమ్‌కు మెంటార్‌గా పని చేస్తూ అప్పుడప్పుడు మార్గనిర్దేశనం ఇవ్వడంతో పోలిస్తే ఒక జాతీయ జట్టుగా కోచ్‌ అనేది పూర్తిగా భిన్నమైన బాధ్యత. అయితే ఆటగాడిగా గంభీర్‌ రికార్డు, జట్టు పట్ల అతని అంకితభావం చూసిన వారు కోచ్‌గా కొత్త తరహాలో జట్టును తీర్చిదిద్దగలడని నమ్మారు. అయితే అతను రాక ముందు వరకు వరుస విజయాల్లో శిఖరాన ఉన్న టీమ్‌ మరింత పైకి లేవడం సంగతేమో కానీ ఇంకా కిందకు పడిపోయింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భారత జట్టు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ చేరడంపై ఎలాంటి సందేహాలు లేవు. కానీ 8 టెస్టుల్లో 6 పరాజయాలతో దానికి జట్టు దూరమైంది. ఆ ముగ్గురు ఏం పని చేశారో?నిజానికి తాను పూర్తి స్థాయిలో కోచ్‌గా పని చేయలేదనే విషయం గంభీర్‌కూ తెలుసు. అందుకే అతను సహాయక సిబ్బందిని ఎంచుకునే విషయంలో తనకు సన్నిహితులైన వారిని తీసుకున్నాడు. ఐపీఎల్‌లో తనతో కలిసి పని చేసిన మోర్నీ మోర్కెల్‌ (దక్షిణాఫ్రికా), అభిషేక్‌ నాయర్‌ (భారత్‌), టెన్‌ డస్కటే (నెదర్లాండ్స్‌) బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ కోచ్‌లుగా వచ్చారు. వీరిని స్వయంగా ఎంచుకునేందుకు బీసీసీఐ గంభీర్‌కు అవకాశం ఇచ్చింది. అయితే ఆటగాడిగా మోర్కెల్‌కు మంచి రికార్డు ఉన్నా... మిగతా ఇద్దరికి పెద్దగా పేరు లేదు. అసలు గంభీర్‌ కోచ్‌గా వచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఏం పని చేశారో, ఎలాంటి ప్రభావం చూపించారో కూడా తెలీదు. కొన్నేళ్లు వెనక్కి వెళితే ఇంగ్లండ్‌ సిరీస్‌లో వరుసగా ఘోరమైన ప్రదర్శన తర్వాత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ సూచనలతో తనను తాను మార్చుకొని మంచి ఫలితాలు సాధించానని, అందుకు కృతజ్ఞుడినని కోహ్లి స్వయంగా చాలాసార్లు చెప్పుకున్నాడు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఒకే తరహాలో కోహ్లి అవుటవుతున్న సమయంలో కనీసం అతని ఆటలో స్టాన్స్‌ మొదలు ఆడే షాట్‌ విషయంలో మార్పు గురించి చర్చ అయినా జరిగిందా అనేది సందేహమే. ఐదు టెస్టుల పాటు భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్లను గమనిస్తే ఒక్కసారి కూడా గంభీర్‌ మైదానంలో చురుగ్గా ఆటలో భాగమైనట్లు ఎక్కడా కనిపించలేదు. అసలు కోచ్‌గా అతని ముద్ర ఎక్కడా కనిపించనే లేదు. దిగితే కానీ లోతు తెలీదు... కొంత కాలం క్రితం వరకు కామెంటేటర్‌గా పని చేసినప్పుడు, టీవీ షోలలో మాజీ ఆటగాళ్లను విమర్శించడంలో గంభీర్‌ అందరికంటే ముందు ఉండేవాడు. అప్పటి వరకు పని చేసిన వారిని తక్కువ చేసి మాట్లాడుతూ జట్టులో మార్పులపై సూచనలు చేసేవాడు. ముఖ్యంగా ‘ఇది భారత అత్యుత్తమ టెస్టు జట్టు’ అని చెప్పుకున్న కోచ్‌ రవిశాస్త్రిని అతను బాగా తప్పు పట్టాడు. కెరీర్‌లో ఆయన ఏం సాధించాడని, ఇలాంటి వారే అలాంటి మాటలు మాట్లాడతారని కూడా గంభీర్‌ వ్యాఖ్యానించాడు. అయితే శాస్త్రి కోచ్‌గా ఉన్నప్పుడే భారత్‌ వరుసగా రెండుసార్లు ఆ్రస్టేలియా గడ్డపై సిరీస్‌ గెలిచిందనే విషయాన్ని అతను మర్చిపోయాడు. రవిశా్రస్తికి కూడా కోచ్‌గా అనుభవం లేకున్నా జట్టులో స్ఫూర్తి నింపడంలో అతని తర్వాతే ఎవరైనా. ప్లేయర్లకు స్నేహితుడి తరహాలో అండగా నిలిచి మైదానంలో సత్తా చాటేలా చేయడం అతనికి బాగా వచ్చు. ‘అడిలైడ్‌ 36 ఆలౌట్‌’ తర్వాత టీమ్‌ అంతా కుంగిపోయి ఉన్న దశలో శాస్త్రి ‘మోటివేషన్‌ స్పీచ్‌’ వల్లే తాము కొత్త ఉత్సాహంతో మళ్లీ బరిలోకి దిగి సిరీస్‌ గెలిచే వరకు వెళ్లగలిగామని ఆటగాళ్లంతా ఏదో ఒక సందర్భంలో చెప్పుకున్నారు. గంభీర్‌ ఇలాంటి పని కూడా చేయలేకపోయాడు.కోచ్‌గా ఎంత వరకు! గంభీర్‌ బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచి భారీ వ్యాఖ్యలైతే చాలా చేశాడు. బంగ్లాదేశ్‌పై గెలిచిన తర్వాత ‘ఒకే రోజు 400 పరుగులు చేయగలిగే, అవసరమైతే రెండు రోజులు నిలిబడి ‘డ్రా’ చేయగలిగే జట్టును తీర్చిదిద్దుతా’ అని అతను అన్నాడు. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్‌లలో ఇందులో ఏదీ జరగలేదు. ఈ రెండు సిరీస్‌లలో కలిపి రెండుసార్లు మాత్రమే స్కోరు 400 దాటింది. తన మాటలకు, వ్యాఖ్యలకు దేశభక్తి రంగు పులమడం గంభీర్‌కు అలవాటుగా మారింది. కోచ్‌గా ఎంపికైన సమయంలోనూ ‘దేశానికి సేవ చేయబోతున్నా. 140 కోట్ల భారతీయుల దీవెనలు ఉన్నాయి’ తదితర మాటలతో ముందుకు వచ్చిన అతను సిడ్నీ టెస్టులో పరాజయం తర్వాత జట్టు ముఖ్యం అనే వ్యాఖ్యతో ఆగిపోకుండా ‘దేశం అన్నింటికంటే ముఖ్యం’ అంటూ ఎక్కడికో వెళ్లిపోయాడు. సాధారణంగా ఇలాంటి వరుస పరాజయాల తర్వాత సహజంగానే కోచ్‌పై తప్పుకోవాలనే ఒత్తిడి కూడా వస్తుంది. అయితే బీసీసీఐ పెద్దల అండ ఉన్న గంభీర్‌పై ఇప్పటికిప్పుడు వేటు పడకపోవచ్చు. కాంట్రాక్ట్‌ 2027 వరల్డ్‌కప్‌ వరకు ఉన్నా... ఆలోగా ఎలాంటి ఫలితాలు అందిస్తాడనేది చూడాలి. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగబోయే సిరీస్‌ను పక్కన పెడితే చాంపియన్స్‌ ట్రోఫీ కోచ్‌గా గంభీర్‌కు పెద్ద పరీక్ష. ఇక్కడా విఫలమైతే ఇక తన వల్ల కాదంటూ తప్పుకునే అవకాశామూ

Government has the opportunity to take back the property9
పిల్లలకు రాసిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు..

సాక్షి, అమరావతి: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకుంటే వారికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ చేసిన గిఫ్ట్, సెటిల్‌మెంట్‌ డీడ్లను నిబంధనల ప్రకారం రద్దు చేసుకునే వెసులుబాటునిచ్చింది. నిబంధనల ప్రకా­రం ట్రిబ్యునల్‌ అధికారిగా ఉన్న ఆర్డీవో నుంచి వీటికి సంబంధించి వచ్చిన ఆదేశాలను పాటించి సంబంధిత డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్‌ రిజిస్ట్రార్లకు ఆదేశాలిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ శేషగిరిబాబు మంగళవారం ఒక సర్క్యులర్‌ జారీ చేశారు.తల్లితండ్రుల నుంచి ఆస్తిని రాయించుకున్నాక వారి పిల్లలు పట్టించుకోకపోవడం, వారి రోజువారీ జీవనం, నిర్వహణ బాధ్యత కూడా తీసుకోకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడు­తున్న ఘటనలు అనేక చోట్ల జరుగుతున్నాయి. అలాంటి వారికి రక్షణ ఇచ్చేందుకు 2007 సీనియర్‌ సిటిజన్‌ చ­ట్టం వచ్చింది. దీని ప్రకారం తల్లితండ్రులు తమను పి­ల్లలు పట్టించుకోవడంలేదని సీనియర్‌ సిటిజన్‌ ట్రి­బ్యు­నల్‌ అధికారిగా ఉన్న ఆర్డీవోకు ఫిర్యాదు చే­యొచ్చు. విచారణలో తల్లితండ్రులను వారి పిల్లలు చూ­డడం లేదని ఆర్డీవో నిర్ధారించి ఆర్డర్‌ ఇవ్వడానికి అ­వకాశం ఉంది. అలా ఆర్డర్‌ ఇస్తూ వారి ఆస్తిని వెనక్కి ఇ­వ్వాలని సూచించినా రిజిస్ట్రేషన్ల చట్టంలో ఉన్న అ­స్పష్టత కారణంగా అది అమలయ్యేది కాదు. ఇ­ప్పుడు దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సర్క్యులర్‌లో స్ప­ష్టత ఇచ్చారు. ట్రిబ్యునల్‌ ఆర్డర్‌ ప్రకారం ఆ ఆస్తిని గ­తంలో పిల్లలకు రాసిస్తూ తల్లితండ్రులు చేసిన సెటిల్‌మెంట్, గిఫ్ట్‌ డీడ్‌లను రద్దు చేయాలని స్పష్టం చే­శా­రు. ఒకవేళ అలాంటి ఆర్డర్‌ను నేరుగా తల్లితండ్రు­లు తీసు­కువచ్చి­నా తీసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకో­వాలని సూచించారు. తల్లితండ్రులు ఆస్తిని వెనక్కి తీసుకునే నిమిత్తం ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఎలాంటి ఆదేశా­లనైనా రిజిస్ట్రేషన్‌ అధికారులు పాటించాలని ఆదేశించారు.

Letter from network hospital owners to Aarogyasri CEO10
10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం!

సాక్షి, హైదరాబాద్‌: పేరుకుపోయిన ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈ నెల 10వ తేదీ నుంచి వైద్య సేవలను నిలిపివేస్తామని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు భారీగా ఉండటంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలి పాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (తెన్హా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వద్దిరాజు రాకేశ్‌ నేతృత్వంలోని ప్రతినిధులు ఆరోగ్య శ్రీ సీఈవోకు మెయిల్‌ ద్వారా లేఖ పంపారు. 12 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 368 నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కింద రాష్ట్రంలో 368 నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్యం అందించే ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌ పథకాలను కూడా చేర్చారు. ఈ పథకాల కింద చేసే చికిత్సలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చెల్లిస్తుంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.672 కోట్లు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు అధిక ప్రచారంతో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరిగాయి. రేవంత్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద ఇప్పటివరకు రూ.920 కోట్లు చెల్లించింది. ఇందులో పాత బకాయి రూ.672 కోట్లు పోను సుమారు రూ. 250 కోట్లు మాత్రమే కొత్తగా ఈ ఏడాది కాలంలో చెల్లించిందన్న మాట. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 368 ఆసుపత్రులకు కలిపి సుమారు రూ.1000 కోట్లకు పైగా రీయింబర్స్‌మెంట్‌ రావలసి ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. ఒక్కో ఆసుపత్రికి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. కొన్ని ఆసుపత్రులకు గత సంవత్సరం జనవరి బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో 10వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఆ తేదీ నుంచే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెన్హా అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్‌ స్పష్టం చేశారు. బకాయిలు రూ.500 కోట్లే: అధికారులు ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1000 కోట్లు ఉన్నాయన్న వాదనను ఆరోగ్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. రూ.500 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఏడాది కాలంలో రూ.920 కోట్లు చెల్లించామని, డిసెంబర్‌ చివరి వారంలో కూడా రూ.40 కోట్ల బిల్లులను విడుదల చేశామని చెప్పారు. 2014– 2023 మధ్య ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు సగటున రూ.52 కోట్ల చొప్పున గత సర్కారు చెల్లిస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్‌ నుంచి 2024 డిసెంబర్‌ మధ్య ప్రతి నెలా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు సగటున రూ.72 కోట్లు చొప్పున చెల్లించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement