Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

AP CID Sketch to down fall Chandrababu corruption cases1
చంద్రబాబే సుప్రీం.. రెడ్‌బుక్కే రాజ్యాంగం!

సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగమే ప్రామాణికం.. సుప్రీంకోర్టు తీర్పులే మార్గ నిర్దేశం.. అన్నది దేశంలో పరిపాలన వ్యవస్థకు దిక్సూచి. పాలకులు, అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు అందరూ పాటించాల్సిన విధివిధానాలవి. కానీ రాష్ట్ర సీఐడీ విభాగం అందుకు పూర్తి విరుద్ధంగా బరితెగిస్తోంది. ‘చంద్రబాబే మాకు సుప్రీం.. టీడీపీ రెడ్‌బుక్కే మాకు రాజ్యాంగం.. చంద్రబాబు అవినీతి కేసులు నీరుగార్చడమే ఏకైక లక్ష్యం’ అని చెలరేగిపోతోంది. అందుకోసం ఏకంగా న్యాయస్థానాల్లో సీఆర్‌పీసీ 164 కింద నమోదు చేసిన వాంగ్మూలం పవిత్రత, ప్రమాణికతనే దెబ్బ తీసేలా కుట్రలకు పదును పెడుతోంది. ఓసారి సీఆర్‌పీసీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బరితెగించి మరీ ఉల్లంఘిస్తోంది. చంద్రబాబు సూత్రధారి, పాత్రధారిగా సాగిన కుంభకోణాల గురించి గతంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలాలకు భిన్నంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయించేందుకు సీఐడీ సన్నాహాలు వేగవంతం చేస్తోంది. డీజీపీ పోస్టు ఇస్తానని ముఖ్య నేత ఎర వేయగానే సుప్రీంకోర్టు మార్గరద్శకాలను కూడా తోసిరాజంటూ సీఐడీ ఉన్నతాధికారి చెలరేగిపోతుండటం విస్మయ పరుస్తోంది. ఈ వ్యవహారం యావత్‌ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది.కుంభకోణాల కుట్రదారు చంద్రబాబే..2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కుంభకోణం, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాల కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణం, స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం.. ఇలా వివిధ కుంభకోణాలతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాటిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతోసహా ఆ భారీ దోపిడీని బట్టబయలు చేసింది. ఆ వ్యవహారాల్లో కీలక పాత్రధారులగా ఉన్న ఐఏఎస్‌ అధికారులను విచారించింది. నిబంధనలకు విరద్ధమని తాము అభ్యంతరం తెలిపినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని వారు చెప్పారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూముల బదలాయింపు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు, కాంట్రాక్టుల కేటాయింపు, నిధుల విడుదల.. ఇలా అన్ని వ్యవహారాలు సాగాయని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వంలో సీఆర్‌డీఏ కమిషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్, ఫైబర్‌నెట్‌ ఎండీగా వ్యవహరించిన అజయ్‌ జైన్, గుంటూరు కలెక్టర్‌గా చేసిన కాంతిలాల్‌ దండే తదితరులు ఆ వాస్తవాలను ‘సిట్‌’కు తెలిపారు. అంతే కాకుండా ఆ విషయాలను న్యాయస్థానంలోనూ వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఆర్‌పీసీ 164 కింద వారు ఇచ్చిన వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసింది. అందుకే ఆ కేసుల్లో చంద్రబాబును ప్రధాన నిందితుడు(ఏ1)గా పేర్కొంటూ సిట్‌ కేసులు నమోదు చేసింది. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్‌ చేయగా, ఆయన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులు రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.తప్పుడు వాంగ్మూలాల నమోదుకు ప్రభుత్వ కుట్రగత ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు అవినీతి కేసులను నీరుగార్చేందుకు కుట్రకు తెరతీసింది. అందుకోసం డీజీపీ, సీఐడీ అధికారులు ఆ కేసుల దర్యాప్తు వివరాలను చంద్రబాబుకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అంటే ప్రధాన నిందితుడే ఆ కేసులను సమీక్షించారు. ఆ కేసులను ఎలా నీరుగార్చాలనే కుట్రకు అప్పుడే బీజం పడింది. అనంతరం చంద్రబాబు తరఫున గతంలో వాదించిన ఢిల్లీ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా రంగ ప్రవేశం చేశారు. డీజీపీ, సీఐడీ అధికారులతో సమావేశమై చంద్రబాబుపై కేసులను నీరుగార్చే కుట్రకు కార్యాచరణ రూపొందించారు. గతంలో చంద్రబాబే కుట్రదారు.. కుంభకోణాలకు ఆయనే సూత్రధారి.. అని న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన వారితో తాజాగా తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించాలని పన్నాగం పన్నారు. ఆ బాధ్యతను సీఐడీకి అప్పగించారు. గతంలో సిట్‌లో సభ్యులుగా ఉన్న కింది స్థాయి అధికారులను డీజీపీ, సీఐడీ చీఫ్‌ పిలిపించుకుని మరీ తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను వివరించారు. బాధిత రైతులు, సాధారణ సాక్షులను కింది స్థాయి అధికారులు బెదిరిస్తుండగా, ఐఏఎస్‌ అధికారులతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే బాధ్యతను సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ భుజానికెత్తుకున్నారు.బెదిరించి.. భయపెట్టి..కుట్రలో భాగంగా ఐఏఎస్‌ అధికారులు చెరుకూరి శ్రీధర్, అజయ్‌ జైన్‌లతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించేందుకు సీఐడీ బరితెగించింది. గతంలో న్యాయస్థానంలో 164 సీఆర్‌పీసీ కింద తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరద్ధుంగా వాంగ్మూలం ఇవ్వాలని వారిపై సీఐడి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చింది. బెదిరింపులకు పాల్పడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తామని హెచ్చరించింది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వడం సాధ్యం కాదని, అది నేరమని కూడా ఆ అధికారులు, న్యాయ నిపుణులు చెప్పినా సరే సీఐడీ చీఫ్‌ రవి శంకర్‌ అయ్యన్నార్‌ ఏమాత్రం వినిపించుకోలేదని సమాచారం. ఇలా సీఐడీ సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించి చెరుకూరి శ్రీధర్, అజయ్‌ జైన్‌లను బెంబేలెత్తించారు. దాంతో వారు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు సమ్మతించినట్టుగా సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. వారిద్దరితో గుంటూరులోని న్యాయస్థానంలో శుక్రవారం తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించేందుకు సీఐడీ అధికారులు తీసుకువచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే న్యాయాధికారి సెలవులో ఉండటంతో ఆ ప్రయత్నాన్ని శనివారానికి వాయిదా వేశారు. తీరా శనివారం చెరుకూరి శ్రీధర్‌ ఒక్కరినే తీసుకెళ్లారు. కోర్టు బయట కొద్ది సేపు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కోర్టు హాలు లోపలికి వెళ్లకుండానే శ్రీధర్‌ వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 8వ తేదీన ఆయన్ను న్యాయస్థానానికి తీసుకొచ్చి వాంగ్మూలం నమోదు చేయించాలని సీఐడీ నిర్ణయించినట్లు తెలిసింది.నాడు గూండాల బెదిరింపులు.. నేడు సర్కారు వేధింపులు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధానిలో అసైన్డ్‌ భూములు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కుంభకోణాల గురించి న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌.. తనను ఆ కేసుల్లో సాక్షిగా పరిగణించాలని కోరారు. దాంతో ఆయన అంతు చూస్తామని టీడీపీ గూండాలు బెదిరించారు. తీవ్ర ఆందోళన చెందిన ఆయన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శికి ఫిర్యాదు చేశారు. టీడీపీ గూండాల నుంచి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా పోలీసు శాఖను కోరారు. దాంతో ఆయనకు పోలీసు శాఖ ప్రత్యేకంగా గన్‌మెన్‌ను కేటాయించింది. అప్పటి నుంచి ఆయనకు గన్‌మెన్‌ భద్రత కొనసాగుతోంది. అప్పట్లో టీడీపీ గుండాలు బెదిరింపులకు పాల్పడగా, ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఆయన్ను బెదిరిస్తోంది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వకపోతే అంతు తేలుస్తామని సీఐడీ ద్వారా వేధిస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తీరుపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌సీపీ 164 వాంగ్మూలాల గురించి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతోపాటు గతంలో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తున్నారు.మొదటి వాంగ్మూలానికి విరుద్ధంగా ఉండకూడదు సీఆర్‌సీపీ 164 కింద ఓసారి న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలం అత్యంత విశ్వసనీయమైనదిగా పరిగణిస్తాం. ఎందుకంటే న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా నమోదు చేసిన వాంగ్మూలమది. ఆ వాంగ్మూలాన్ని మార్చేందుకు వీల్లేదు. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షులు ప్రయత్నిస్తే వారిని సంబంధిత న్యాయస్థానం ప్రశ్నించాలి. మొదట ఇచ్చిన వాంగ్మూలాన్నే సాక్షంగా పరిగణలోకి తీసుకోవాలి.– 2024 నవంబరు 25న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు. ఈ మేరకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఓ కేసులో జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విస్పష్టమైన తీర్పునిచ్చింది.విరుద్ధంగా ఇస్తే కఠిన చర్యలు ఓసారి సీఆర్‌సీపీ 164 కింద ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరోసారి వాంగ్మూలం ఇస్తే అది నేరంగా పరిగణిస్తాం. ఎందుకంటే ప్రమాణ పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి చదవి వినిపించిన తర్వాత సమ్మతించి, మరీ సంతకం చేసి ఇచ్చిన వాంగ్మూలమది. మొదటిసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇవ్వడమంటే.. మొదట ఇచ్చింది తప్పుడు వాంగ్మూలమని అంగీకరించినట్టే. అత్యంత విశ్వసనీయమైన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట ప్రమాణం చేసి మరీ తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్టు అవుతుంది. అంటే అబద్ధపు వాంగ్మూలం ఇచ్చినందుకు నేరంగా పరిగణిస్తాం. ఆ విధంగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వారిపై ఐపీసీ 193, సీఆర్‌సీపీ 340 కింద కఠిన చర్యలు తీసుకుంటాం. – వినోద కుమారి వర్సస్‌ మధ్యప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఎదుర్కోవాల్సిన పరిణామాలను న్యాయమూర్తి వివరించాలి సీఆర్‌పీసీ 164 కింద ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మరో వాంగ్మూలం ఇచ్చేందుకు సాక్షి ప్రయత్నిస్తే.. దాని వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, ఎదుర్కోవాల్సి వచ్చే పరిణామాల గురించి న్యాయమూర్తి ఆ సాక్షికి వివరించాలి.– అలహాబాద్‌ హైకోర్టు తీర్పుఏడేళ్ల వరకూ జైలు శిక్ష న్యాయస్థానాల్లో కేసుల విచారణ ప్రక్రియలో ఏ సందర్భంలో అయినా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం తీవ్రమైన నేరం అని సెక్షన్‌ 229 (1) స్పష్టం చేస్తోంది. అటువంటి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తోంది. అంటే సీఆర్‌పీసీ 164 కింద న్యాయమూర్తి ఎదుట ప్రమాణ పూర్వకంగా రెండు విరుద్ధ వాంగ్మూలాలు ఇస్తే అందులో ఒకటి అబద్ధపు వాంగ్మూలమే అవుతుంది. మొదటి వాంగ్మూలం గానీ రెండో వాంగ్మూలం గానీ ఏది అబద్ధపు వాంగ్మూలం అయినా శిక్షార్హమే. దాన్ని నేరంగా పరిగణించి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

Sakshi Editorial On Chandrababu Govt Irrigation Water2
సాగునీళ్లూ షాక్‌ కొడతాయా?

‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్‌–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్‌ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్‌ ‘ఏక్‌ నంబర్‌ స్టేటస్‌’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్‌ నంబర్‌ స్టేటస్‌’ వస్తున్నప్పుడు స్పెషల్‌ స్టేటస్‌ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్‌లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్‌ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్‌ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్‌ డాక్యుమెంట్‌ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్‌ డాక్యుమెంట్‌’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్‌ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్‌)ను జగన్‌ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్‌కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్‌ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్‌ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్‌ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్‌ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్‌ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్‌ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్‌సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్‌ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్‌ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్‌ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్‌ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్‌ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్‌ ఛేంజర్‌ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్‌ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్‌ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్‌ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్‌ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్‌ సర్కార్‌ డీపీఆర్‌ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్‌ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్‌ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్‌కు కొనసాగింపే ‘విజన్‌ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్‌ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్‌ భారత్‌–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్‌ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్‌ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్‌–ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌లో పీపుల్‌ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్‌ రంగ ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్‌ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్‌లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్‌వారు ‘కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్‌ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Weekly Horoscope Telugu 05-01-2025 To 11-01-20253
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు ఆటంకాలు లేకుండా చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు చికాకులు, ఇబ్బందులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు అభివృద్ధి పథంలో సాగుతారు. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, గాయత్రీ ధ్యానం మంచిది.వృషభం...దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ధనప్రాప్తి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. వ్యాపారాలు పుంజుకుని లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలించి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలకు మరింత పురోగతి కనిపిస్తుంది. . వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. గులాబీ, ఎరుపు రంగులు. వారాహీ స్తోత్రం పఠించండి.మిథునం....ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు సజావుగా కొనసాగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలతో ముందుకు సాగి విజయాలు సా«ధిస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. దూరప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు, మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.కర్కాటకం...మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. నిరుద్యోగులు, విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. కళారంగం వారు పురస్కారాలు పొందుతారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, పంచాక్షరి మంత్రం పఠించండి.సింహం.....ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఉన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, గులాబీ రంగులు, నారాయణ అష్టాక్షరి మంత్రం పఠించండి.కన్య.....ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు, శ్రీ భువనేశ్వరి మంత్రం పఠించండి.తుల....దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక వ్యక్తి ద్వారా కొంత సాయం అందే సూచనలు. నూతన విద్య,ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపారాలలో విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా చేస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. తెలుపు, గులాబీ రంగులు, శ్రీహయగ్రీవస్తుతి మంచిది.వృశ్చికం....వీరికి పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతస్థితి లభించే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు. ప్రయాణాలలో అవాంతరాలు. ఎరుపు, పసుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.ధనుస్సు....ముఖ్యమైన పనులు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహన, కుటుంబసౌఖ్యం. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో మరిత విస్తరించే అవకాశం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి సమస్యల నుండి విముక్తి. వారం చివరిలో ధనవ్యయం. ఆప్తులతో కలహాలు. దూరప్రయాణాలు. గులాబీ, తెలుపు రంగులు, శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.మకరం....వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. పనుల్లో కొంత జాప్యం తప్పదు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఇబ్బందిగా మారతాయి.. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. నీలం, నేరేడు రంగులు, హయగ్రీవస్తోత్రాలు పఠించండి.కుంభం...ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, మంచి గుర్తింపు రాగలవు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, గులాబీ రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మీనం...బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. గులాబీ, మెరూన్‌ రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

CM Revanth Reddy Annual assistance of Rs 12,000 to farming families4
సాగు యోగ్యతతోనే ‘భరోసా’!: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ.12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఈ కొత్త పథకానికి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’అని పేరుపెట్టినట్టు తెలిపారు. ఇక రాష్ట్రంలో రేషన్‌కార్డు లేని పేద కుటుంబాలన్నింటికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి జనవరి 26తో 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూడు పథకాల అమలును ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలసి రేవంత్‌ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. వారికి రైతు భరోసా వర్తించదు.. రైతుభరోసా విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములంటే.. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్‌ భూములు, నాలా కన్వర్షన్‌ పొందిన భూములు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారులు గ్రామాల వారీగా (లబ్ధిదారుల) సమాచారం సేకరించి గ్రామసభల ద్వారా ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల వద్ద ఉన్న సమాచారం ఆధారంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను వర్తింపజేస్తామని వెల్లడించారు. రెవెన్యూ రికార్డుల్లో, ధరణిలో లోపాలతో గతంలో వ్యవసాయానికి యోగ్యంకాని భూములకూ రైతుబంధు వచ్చిందని.. వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థిక పరిస్థితి, వెసులుబాటు మేరకు.. రైతు భరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు రూ.10 వేలు ఇస్తే తాము రూ.12 వేలకు పెంచామని సీఎం రేవంత్‌ బదులిచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వెసులుబాటును బట్టి భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సైతం రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఎంత వెసులుబాటు ఉంటే అంతగా రైతులకు మేలు చేయాలన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. భూమి లేని వారి ఆవేదన తీర్చడానికి.. ‘‘తమకు భూములు లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం పట్టించుకోకపోవడం మరో శాపమని గతంలో నేను, భట్టి విక్రమార్క, ఇతర సహచరులు నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా తండాల్లో, మారుమూల ప్రాంతాల్లోని భూమి లేని వ్యవసాయ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వాళ్లు కూడా సమాజంలో, మనలో భాగమని గుర్తించి ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని తీసుకొచ్చాం. చాలా ఏళ్ల నుంచి రేషన్‌కార్డుల సమస్య పేదవాళ్లను పట్టి పీడిస్తోంది. రేషన్‌కార్డులు లేని వారందరికీ జనవరి 26 నుంచి కొత్త కార్డులు ఇస్తాం’’ అని సీఎం రేవంత్‌ చెప్పారు. కేసీఆర్‌ కుటుంబం వెయ్యేళ్లు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది రైతుబంధు కింద అనర్హులకు చెల్లించిన రూ.వేల కోట్లను తిరిగి వసూలు చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళితే కేసీఆర్‌ కుటుంబం వెయ్యేళ్లు జైలు శిక్షకు వెళ్లాల్సి ఉంటుంది. రైతు భరోసాకు సంబంధించి విపక్షాలు శాయశక్తులా ఊహాగానాలు రేపాయి. ఉన్నవి లేనివి ప్రభుత్వ నిర్ణయాలంటూ ప్రచారం చేసి రైతుల్లో గందరగోళం సృష్టించాయి. రైతులకు మేం శుభవార్త వినిపించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం’’ అని సీఎం రేవంత్‌ చెప్పారు. కొత్త సంవత్సరంలో మొదటిసారి పత్రికా సమావేశం నిర్వహిస్తున్నామని.. రాష్ట్ర రైతాంగానికి మంచి జరగాలని, ఈ ప్రభుత్వం వాళ్లను అన్నిరకాలుగా ఆదుకోవాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఈ పథకాలను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, కొండా సురేఖ, సీఎస్‌ శాంతికుమారి పాల్గొన్నారు.కేబినెట్‌ తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలివే..పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయంసింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, మాజీ మంత్రి రాజనర్సింహ పేరు పెట్టేందుకు ఆమోదం.జూరాల జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్తగా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాల పరిశీలన కోసం టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ నియామకం. ఎంత నీటి లభ్యత ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడి నుంచి ఎంతెంత నీటిని తీసుకునే వీలుంది? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలనే అంశాలతోపాటు ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా మరింత నీటిని తీసుకునేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీతో అధ్యయనం చేయించాలని నిర్ణయం.మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రతిపాదించిన గోదా వరి డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై స్కీమ్‌ ఫేజ్‌–2,3లకు ఆమోదం. గతంలో 15 టీఎంసీల తరలింపునకు ఈ ప్రాజెక్టు ప్రతిపాదించగా.. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు నిర్ణయం. కొత్తగూడెం మున్సిపాలిటీకి మున్సిపల్‌ కార్పొరేషన్‌గా హోదా పెంపు.

Russia lost 430000 soldiers in 20245
యుద్ధభూమిలో రక్తమోడుతున్న రష్యా 

గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్‌పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది. రష్యా సేనలు రక్తమోడుతున్నా పుతిన్‌ పటాలానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని యుద్ధ విశ్లేషకులు తాజాగా ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా దళాలు 2024 సంవత్సరంలో భారీ మూల్యం చెల్లించుకున్నాయని, ఏకంగా 4,30,790 మంది రష్యా సైనికులు అంటే రోజుకు 1,180 మంది సైనికులు రణక్షేత్రంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని వాషింగ్టన్‌ కేంద్రంగా పనిచేసే యుద్ధరంగ మేథోసంస్థ ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ వార్‌’తాజాగా వెల్లడించింది. యుద్ధం మొదలవడానికి ముందు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని వీడియో ఫుటేజీలు, భౌగోళిక మార్పులకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విశ్లేషించి సంస్థ ఈ అంచనాకు వచ్చింది. గత ఏడాది ఒక్క నవంబర్‌ నెలలోనే 45,720 మంది రష్యా సైనికులు చనిపోయారు. డిసెంబర్‌లో ఏకంగా 48,670 మంది మృతిచెందారని సంస్థ పేర్కొంది. ‘‘యుద్ధం మొదలైననాటి నుంచి చూస్తే దురాక్రమణకు గతేడాది రష్యా సైన్యం భారీ మూల్యం చెల్లించుకుంది. రష్యా ఆయుధాలు, డ్రోన్లు, యుద్ధట్యాంక్‌లు, సైనికులను అంతంచేశాం’’అని ఉక్రెయిన్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఒలెస్కాండర్‌ సిరిస్కీ చెప్పారు. కొన్ని గ్రామాల నుంచి తిరుగుముఖం గత ఏడాది తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్‌ ప్రాంతంలోని 4,168 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని రష్యా ఆక్రమించు కుంది. అయితే ఉక్రెయిన్‌ బలగాల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవడంతో కొన్ని గ్రామాల నుంచి రష్యా సేనలు వెనుతిరిగాయి. ఈ గ్రామాల విస్తీర్ణం ఉక్రెయిన్‌ మొత్తం విస్తీర్ణంలో 0.69 శాతం ఉండటం గమనార్హం. 31,000 జనాభా ఉన్న కురకోవ్‌తోపాటు అవ్‌దీవ్కా, సెలిడోవ్, వులేదార్‌లు రష్యా వశమయ్యాయి. అవ్‌దీవ్కాను ఆక్రమించడానికి రష్యా చెమటోడ్చింది. అవ్‌దీవ్కా ఆక్రమణకు రష్యాకు నాలుగు నెలలు, సెలిడోవ్, కురకోవ్‌ల ఆక్రమణకు రెండు నెలల సమయం పట్టింది. ఇంతచేసినా వీటి గుండా మరింతగా ఉక్రెయిన్‌ భూభాగంలోకి చొచ్చు కుపోయే అవకాశం రష్యాకు దక్కలేదు. ఇంత నెమ్మదిగా ముందుకు సాగుతున్న రష్యాకు ఒక్క డోనెట్‌స్క్‌ ఆక్రమణకే మరో రెండు సంవత్సరాల సమయం పట్టొచ్చు. ఈ లెక్కన మొత్తం ఉక్రేయిన్‌పై ఆధిపత్యం సాధించాలంటే ఇంకెంత కాలంపడుతుందో మరి. రోజుకు 28 చదరపు కి.మీ.ల ఆక్రమణ గత ఏడాది నవంబర్‌లో అధిక సైన్యంతో రష్యా ఆక్రమణ స్థాయిని పెంచింది. దీంతో అక్టోబర్‌లో రోజుకు 14 చదరపు కి.మీ.లుగా ఉన్న ఆక్రమణ స్థాయి నవంబర్‌కొచ్చేసరికి రెట్టింపైంది. అంటే రోజుకు 28 చదరపు కి.మీ.లకు పెరిగింది. అయితే డిసెంబర్‌లో ఉక్రెయిన్‌ సేనల ప్రతిఘటన పెరగడంతో రష్యా బలగాలు కాస్తంత నెమ్మదించి రోజుకు 18 చదరపు కి.మీ.ల స్థాయిలోనే ఆక్రమించుకోవడడం మొదలెట్టాయి. అయినాసరే డిసెంబర్‌ 29వ నాటికి లెక్కేస్తే ఏకంగా 2,100 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్‌ పేర్కొంది. డిసెంబర్‌ 19వ తేదీన 191 చోట్ల భీకర యుద్ధం జరిగిందని ఒలెక్సాండర్‌ చెప్పారు. వేల సైనిక వాహనాలు ధ్వంసం రష్యాకు చెందిన వేల సైనిక వాహనాలను ఉక్రెయిన్‌ ధ్వంసంచేసింది. 3,689 యుద్ధట్యాంక్‌లను పేల్చేసింది. 13,000 యుద్ధట్యాంక్‌ మందుగుండును నాశనంచేసింది. ‘‘సముద్రజలాల్లో ఐదు రష్యా యుద్ధనౌకలను దాడిచేసి ముంచేశాం. 458 చిన్నపాటి యుద్ధ పడవలను పేల్చేశాం’’అని ఉక్రెయిన్‌ నేవీ విభాగం తెలిపింది. ‘‘మిత్రదేశం ఉత్తరకొరియా నుంచి రప్పించిన సైనికులను రణరంగంలోకి పంపినా లాభంలేకుండా పోయింది. ఉ.కొరియా సైనికుల్లో పావు శాతం మంది ప్రాణంతీశాం. ఒక్క కురŠస్క్‌ రీజియన్‌లో 3,000 మందిని మట్టుబెట్టాం. వారిని సజీవంగా పట్టుకోవడం కుదరట్లేదు. చిక్కే అవకాశమున్న వాళ్లను తోటి రష్యన్లే ముఖాలు కాల్చేసి చంపేస్తున్నారు’’అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల ప్రకటించారు. సైన్యంలోకి మరింతగా జనం ఉపాధి, మెరుగైన జీవనం కోసం అనధికారికంగా రష్యాలోకి చొరబడుతున్న శరణార్థులు, వలసదారులను ఈ ఏడాది ఏప్రిల్‌కల్లా పంపేస్తానని పుతిన్‌ చెప్పారు. అయితే రష్యా సైన్యంలో చేరితే మాత్రం వారికి చట్టబద్ధంగా ఇక్కడే ఉండనిస్తామని పుతిన్‌ ప్రభుత్వం చెబుతోంది. దీంతో సైన్యంలోకి ఎక్కువ మంది చేరుతారని, వాళ్లందర్నీ ఉక్రెయిన్‌ యుద్దక్షేత్రంలోకి తరలించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. చమురు అమ్మకాలతో వస్తున్న అధిక లాభాలను యుద్దం కోసం రష్యా ఖర్చుచేస్తోంటే, పశ్చిమదేశాలు అందిస్తున్న ఆయుధాలు, ఆర్థికసాయంతో ఉక్రెయిన్‌ యుద్ధంలో పోరాడుతోంది. లక్షలాది శ్రామికశక్తి లోటుతో రష్యా ఆర్థికవ్యవస్థ పలచబారుతుంటే, ప్రాణభయంతో కోట్లాది మంది ఉక్రేనియన్లు పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు వలసపోతూ దేశాన్ని ‘తక్కువజనాభాగల దేశం’గా మార్చేస్తున్నారు. ఇలాంటి యుద్ధం ఇంకెంతకాలం కొనసాగుతుందో మరి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Cowpea seeds sent to space germinated under microgravity conditions says Isro6
అంతరిక్షంలో జీవం  ‘పురుడు’ పోసుకుంది! 

న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్‌ మిషన్‌లో భాగంగా పీఎస్‌ఎల్‌వీ–సి60 ఆర్బిటాల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ మాడ్యూల్‌ (పోయెమ్‌–4) ద్వారా డిసెంబర్‌ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్‌ రీసెర్చ్‌ మాడ్యూల్‌ ఫర్‌ ఆర్బిటాల్‌ ప్లాంట్‌ స్టడీస్‌ (సీఆర్‌ఓపీఎస్‌) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్‌ వ్యవస్థ అయిన సీఆర్‌ఓపీఎస్‌ పేలోడ్‌ను విక్రం సారాబాయ్‌ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు. విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.స్పేడెక్స్‌ నుంచి పుడమి ఫొటోలు స్పేడెక్స్‌ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్‌ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్‌ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్‌ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్‌ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్‌ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్‌ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ సగర్వంగా చేరుతుంది. గగన్‌యాన్‌ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్‌ పరిజ్ఞానం కీలకం కానుంది.

YS Jagan fires on Chandrababu Govt7
మరీ ఇంత ద్రోహమా? ఇంత బరితెగింపా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేతపై కూటమి సర్కార్‌ను నిలదీ­శారు. లక్షలాది మంది తల్లులు, పిల్లలు.. అన్నదాతలంటే మీకు అలుసా.. అని ప్రశ్నించారు. మేనిఫె­స్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దా­నాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయిందని నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.⇒ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?⇒ అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడా­దికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అధి­కారంలోకి రాగానే అంతకు ముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్‌ సమావేశాలు జరుగుతు­న్నాయి కానీ, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వం అని కేబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉం­టుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?⇒ చంద్రబాబు గారూ.. ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30 వేలు ఇస్తామన్నారు. ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయి.వైఎస్సార్‌సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు రూ.26,067 కోట్లను మేము అం­దించి, అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఏడెనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది.⇒ ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ, ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే.. అంటే 2019 అక్టోబర్‌లో ప్రారంభించి నప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్స­రం రూ.13,500 చొప్పున 53.58 లక్షల మంది రైతుల చేతిలో, రూ.34,378 కోట్లు పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.ఇప్పుడు ఖరీఫ్‌ అయిపోయిందీ, రబీ కూడా అయిపోయింది. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్‌ మీటింగ్‌లు పెట్టుకున్నాం ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు.. కనీస మద్దతు ధరా అందడం లేదు.. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు.. ఆర్బీకేలను సైతం నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు కదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు. ⇒ ప్రతి పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ ఇస్తామన్న తల్లికి వందనం మోసమే. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామన్నదీ మోసమే. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18 వేలు ఇస్తామన్నదీ మోసమే. నిరుద్యోగ భృతి కింద యువతీ యువకులకు రూ.36 వేలు చొప్పున ఇస్తామన్నది కూడా మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48 వేలు అయినా మోసమే. ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వలంటీర్లకూ మీరు చేసింది మోసమే. ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కామ్‌లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్నీ వదలడం లేదు. ⇒ చంద్రబాబూ గారూ.. రోజులు గడుస్తున్న కొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తోంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుంది.

Webster started his career as a spinner later became a pace all rounder8
ఆఫ్‌స్పిన్‌ను పక్కనపెట్టి... పేస్‌ ఆల్‌రౌండర్‌గా

అచ్చొచ్చిన సొంత మైదానంలో స్టీవ్‌ స్మిత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... టీమిండియాపై దంచి కొట్టే హెడ్‌ 4 పరుగులకే పెవిలియన్‌ చేరాడు! టీనేజ్‌ కుర్రాడు కొన్‌స్టాస్‌ మెరుపులు 3 బౌండరీలకే పరిమితం కాగా... మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖ్వాజా వైఫల్యాన్ని కొనసాగించాడు! ఆదుకుంటాడనుకున్న లబుషేన్‌ ఆరంభంలోనే చేతులెత్తేయగా... అలెక్స్‌ కేరీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు!అయినా ఆ్రస్టేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ స్కోరు చేయగలిగింది అంటే అదంతా అరంగేట్ర ఆటగాడు బ్యూ వెబ్‌స్టర్‌ చలవే. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్న మిషెల్‌ మార్ష్ ను తప్పించి... చివరి టెస్టులో వెబ్‌స్టర్‌కు అవకాశం ఇవ్వగా... అతడు భారత జట్టుకు ప్రధాన అడ్డంకిగా నిలిచి భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. ఆఫ్‌స్పిన్నర్‌గా కెరీర్‌ ఆరంభించి... ఆ తర్వాత పేస్‌ ఆల్‌రౌండర్‌గా మారిన ఆ్రస్టేలియా నయా తార వెబ్‌స్టర్‌పై ప్రత్యేక కథనం... – సాక్షి, క్రీడావిభాగం సుదీర్ఘ దేశవాళీ అనుభవం... వేలకొద్దీ ఫస్ట్‌క్లాస్‌ పరుగులు... బౌలింగ్‌లోనూ తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉన్నా... ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయిన వెబ్‌స్టర్‌... ఎట్టకేలకు జాతీయ జట్టు తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల ధాటికి ప్రధాన ఆటగాళ్లే నిలవలేకపోతున్న చోట... చక్కటి సంయమనంతో ఆడుతూ విలువైన పరుగులు చేశాడు. గత మ్యాచ్‌ ద్వారానే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్యామ్‌ కొన్‌స్టాస్‌ తన బ్యాటింగ్‌ విన్యాసాలతో పాటు నోటి దురుసుతో వార్తల్లోకెక్కగా... వెబ్‌స్టర్‌ మాత్రం నింపాదిగా ఆడి తనదైన ముద్ర వేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లపాటు బౌలింగ్‌ చేసిన అతడు... 2.23 ఎకానమీతో 29 పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు. బౌలింగ్‌లో వికెట్‌ తీయలేకపోయినా... స్టార్క్, కమిన్స్‌ వంటి స్టార్‌ బౌలర్ల కంటే తక్కువ పరుగులు ఇచ్చుకొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ జట్టు 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులో అడుగుపెట్టిన వెబ్‌స్టర్‌... తనలో మంచి బ్యాటర్‌ ఉన్నాడని నిరూపించుకున్నాడు. మరో ఎండ్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఉండటంతో ఆరంభంలో నెమ్మదిగా ఆడుతూ అతడికే ఎక్కువ స్ట్రయిక్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఐదో వికెట్‌కు 57 పరుగులు జోడించిన అనంతరం స్మిత్‌ అవుట్‌ కాగా... ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యత భూజానెత్తుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నది తొలి మ్యాచే అయినా... దేశవాళీల్లో వందల మ్యాచ్‌ల అనుభవం ఉండటంతో లోయర్‌ ఆర్డర్‌తో కలిసి జట్టును నడిపించాడు. అతడు ఒక్కో పరుగు జోడిస్తుంటే... టీమిండియా ఆధిక్యం కరుగుతూ పోయింది. ఆరో వికెట్‌కు అలెక్స్‌ కెరీతో 41 పరుగులు, ఏడో వికెట్‌కు కెపె్టన్‌ కమిన్స్‌తో కలిసి 25 పరుగులు జోడించాడు. ఇక కింది వరుస బ్యాటర్ల అండతో పరుగులు చేయడం కష్టమని భావించి భారీ షాట్లకు యత్నించిన వెబ్‌స్టర్‌... చివరకు తొమ్మిదో వికెట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. గత నాలుగు టెస్టుల్లో పేస్‌ ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న మిషెల్‌ మార్‌‡్ష ఒక్క మ్యాచ్‌లోనూ అటు బ్యాట్‌తో కానీ, ఇటు బంతితో కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా... తొలి మ్యాచ్‌లోనే వెబ్‌స్టర్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనూహ్య బౌన్స్, అస్థిర పేస్‌ కనిపించిన సిడ్నీ పిచ్‌పై వెబ్‌స్టర్‌ గొప్ప సంయమనం చూపాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు ఒక్కరు కూడా 40 పరుగులు దాటి చేయలేకపోయిన చోట ఈ మ్యాచ్‌లో తొలి అర్ధ శతకం నమోదు చేసిన వెబ్‌స్టర్‌... ఆ తర్వాత బంతితోనూ ఆకట్టుకున్నాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు వేసిన వెబ్‌స్టర్‌ అందులో కీలకమైన శుబ్‌మన్‌ గిల్‌ వికెట్‌ పడగొట్టి టీమిండియాను దెబ్బకొట్టాడు. కామెరూన్‌ గ్రీన్‌ వంటి ప్రధాన ఆల్‌రౌండర్‌ అందుబాటులో లేకపోవడంతో మిషెల్‌ మార్ష్ జట్టులోకి రాగా... ఇప్పుడు వెబ్‌స్టర్‌ ప్రదర్శన చూస్తుంటే ఇక మార్ష్ జట్టులో చోటుపై ఆశలు వదులుకోవడమే మేలనిపిస్తోంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం... స్పిన్నర్‌గా కెరీర్‌ ఆరంభించిన 31 ఏళ్ల వెబ్‌స్టర్‌... ఆ తర్వాత పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 6 అడుగుల 7 అంగుళాలున్న వెబ్‌స్టర్‌కు బంతిని స్పిన్‌ చేయడం కంటే... వేగంగా విసరడం సులువు అని కోచ్‌లు సూచించడంతో తన దిశ మార్చుకున్నాడు. ఏజ్‌ గ్రూప్‌ క్రికెట్‌ నుంచే నిలకడ కొనసాగించిన వెబ్‌స్టర్‌... 2014లో తన 20 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్‌ అరంగేట్రం చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ భారీగా పరుగులు రాబట్టినా... జాతీయ జట్టులో పోటీ కారణంగా అతడికి ఆసీస్‌ తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా దేశవాళీల్లో రాణించిన వెబ్‌స్టర్‌ ‘బోర్డర్‌–గావస్కర్‌’ ట్రోఫీ ప్రారంభానికి ముందు భారత్‌ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ తరఫున బరిలోకి దిగి అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించాడు. 2023–24 షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీలో వెబ్‌స్టర్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. సీజన్‌ ఆసాంతం ఒకే తీవ్రత కొనసాగించిన అతడు... 58.62 సగటుతో 938 పరుగులు చేయడంతో పాటు... 30.80 సగటుతో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీ చరిత్రలో గ్యారీ సోబర్స్‌ తర్వాత ఒకే సీజన్‌లో రెండు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాకిస్తాన్‌తో జరిగిన ప్రైమ్‌మినిస్టర్స్‌ ఎలెవన్‌ జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ కూడా రాణించిన వెబ్‌స్టర్‌ తనను పక్కన పెట్టలేని పరిస్థితి కల్పించాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 93 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన వెబ్‌స్టర్‌ 5297 పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 24 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 148 వికెట్లు పడగొట్టాడు.

Telangana Govt Study on Polavaram Floods9
పోలవరం ముంపుపై అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల గరిష్ట నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) మేరకు నీళ్లను నిల్వ చేస్తే తెలంగాణ భూభాగంలో ఏర్పడనున్న ముంపు ప్రభావంపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్‌ నిపుణుల బృందంతో సర్వే చేయించి నెల రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పోలవరం ముంపు అంశంపై శనివారం సీఎం రేవంత్‌ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. గోదావరికి 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైందని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం వల్ల భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపైనా అధ్యయనం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర అనుమతుల్లేకుండానే కొత్తగా గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీ సీఎస్‌కు అభ్యంతరం తెలపాని సీఎం రేవంత్‌ ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి బోర్డుతోపాటు కేంద్ర జలశక్తి శాఖకు సైతం లేఖలు రాయాలని కోరారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్‌దాస్, కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పరిమితంగానే ఉమ్మడి సర్వే అంటున్న ఏపీ పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో 950 ఎకరాలు ముంపునకు గురవుతాయని, దీనిపై సైతం జాయింట్‌ సర్వే చేయాల్సిందేనని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. కిన్నెరసాని, ముర్రెడువాగులతో పాటే మరో ఐదు వాగులకు ఉండనున్న ప్రభావంపై సైతం సర్వే నిర్వహించాలని కోరుతుండగా ఏపీ అంగీకరించడం లేదు. ఎన్జీటీ ఆదేశాల మేరకు ముర్రెడువాగు, కిన్నెరసానిలకే సర్వేను పరిమితం చేస్తామని ఏపీ అంటోంది. ఏపీ వాదనను తెలంగాణ అంగీకరించి కేవలం రెండు వాగులకే జాయింట్‌ సర్వే నిర్వహిస్తే మిగిలిన 5 వాగులకు ఉండనున్న ముంపుతో తెలంగాణ నష్టపోవాల్సి వస్తుందని విమర్శలు వచ్చాయి. సీఎం రేవంత్‌ శనివారం అధికారులతో సమీక్షలో ఈ అంశంపై వివరణ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం రెండు వాగులకు ముంపుపై సర్వే నిర్వహించాలని, మిగిలిన వాగులకు ముంపుపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల సంఘం గతేడాది సాంకేతిక కమిటీ సమావేశంలో ఇరు రాష్ట్రాలను చెప్పిందని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. 18 తర్వాత ఉమ్మడి సర్వేకు సిద్ధం పోలవరంలో గరిష్ట నీటిమట్టం దాకా నీటిని నిల్వ చేస్తే కిన్నెరసాని, ముర్రేడువాగులు ఉప్పొంగి తెలంగాణ భూభాగంలో ముంపునకు గురికానున్న ప్రాంతాలను గుర్తించి డీమార్కింగ్‌ చేసేందుకు వీలుగా ఈ నెల 18 తర్వాత ఉమ్మడి సర్వేకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖకు లేఖ రాసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉమ్మడి సర్వే నిర్వహించగా తదుపరి క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాన్ని గుర్తిస్తూ డీమార్కింగ్‌ చేయాల్సి ఉంది.

Sakshi Guest Column On Indian Parliament10
పాతాళాన్ని తాకిన పార్లమెంట్‌ ప్రతిష్ఠ

మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను చర్చించి సమీక్షించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు దఖలు పర్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడం కోసమే ప్రతి యేటా భారత పార్లమెంట్‌ మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించడం అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో దేశ ప్రజలకు బాధ్యత వహించడమేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.ఇంత ఘనమైన రాజ్యాంగ బాధ్యత ఉన్నది కనుకనే భారత పార్లమెంట్‌ను దేశ ప్రజల భవిష్యత్తును రూపొందించే కార్య శాలగా పేర్కొంటారు. కానీ, గత రెండు దశాబ్దాల పైబడి భారత పార్లమెంట్‌ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో గతంలో కూడా అప్పుడప్పుడు సభ్యులు నిగ్రహం కోల్పోయి అరుపులు, కేకలు పెట్టడం వంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినా, తాజాగా డిసెంబర్‌ 20తో ముగిసిన 18వ లోక్‌సభ శీతాకాల సమావేశాలలో అన్ని హద్దులు దాటి సభ్యులు బాహాబాహీకి దిగిన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం తోపులాట లకు దిగిన హీనస్థితికి లోక్‌సభ వేదిక కావడం దిగజారిన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతుంది.తగ్గిపోయిన ప్రశ్నోత్తరాల సమయందశాబ్ద కాలంగా పార్లమెంట్‌ సమావేశాల పని గంటలు తగ్గి పోతున్నాయి. 16వ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం నిర్దేశిత వ్యవధిలో 77 శాతం, అదేవిధంగా రాజ్యసభలో 44 శాతం మాత్రమే నమోదైంది. కారణం– పార్లమెంట్‌ ఉభయ సభల్లో అవాంతరాలు ఏర్పడి సభలు తరచుగా వాయిదా పడటమే. పార్లమెంట్‌ బిజినెస్‌లో ఇతర అంశాల కోసం అదనపు గంటలు పనిచేసే వెసులుబాటు ఉంది గానీ, ప్రశ్నోత్తరాలు వాయిదా పడితే... ఆ సమయాన్ని పొడిగించరు. వాటికి కేవలం రాతపూర్వక జవాబుల్ని మాత్రమే సభ్యులకు పంపుతారు. సామాన్యంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొత్తగా ఎన్నికయిన సభ్యులు ఎక్కువగా సద్వినియోగ పర్చుకొంటారు. సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రశ్నలు వేసి వాటికి జవాబులు ఆశిస్తారు. ప్రశ్నోత్తరాల సమయం రద్ద యితే... సభ్యులు తమ విలువైన అవకాశాన్ని కోల్పోవడమేగాక, వారు ఆశించి ఎదురు చూస్తున్న అంశాలపై సమాధానం పొంద లేకపోతారు.పార్లమెంట్‌ సమావేశాలు సవ్యంగా సాగకపోవడానికి ప్రతి సారీ ఒక్కో విధమైన కారణాలు దోహదం చేస్తున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాలలో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్‌ పార్టీతో సహా మరికొన్ని విపక్ష పార్టీలు గట్టిగా పట్టుబట్టి ఉభయ సభల కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. ఈ సమావేశాలలోనే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కడ్‌పై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇచ్చిన నోటీసును డిప్యూటీ చైర్మన్‌ తిరస్కరించడంతో గందరగోళం నెలకొని పలుమార్లు రాజ్యసభ వాయిదా పడింది. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ను ఆయన అవమానించారంటూ విపక్ష సభ్యులు గందరగోళాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లడంతో... అదికాస్తా అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, ముష్టిఘాతాలకు దారితీసింది. సభల్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత గలిగిన అధికార ఎన్డీఏ సైతం పార్లమెంట్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిందంటూ ఆరోపణలు చేయడంతో ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యులు వాకౌట్‌ చేశారు. కారణాలు ఏవైనా, ఈ శీతాకాల సమావేశాలలో లోక్‌సభ నిర్ణీత వ్యవధిలో 54.5 శాతం, అదేవిధంగా రాజ్యసభ 40 శాతం మాత్రమే పనిచేశాయి. శీతాకాల సమావేశాలు అతి తక్కువ వ్యవధిలో పని చేయడం ఇదే ప్రథమం అని రికార్డులు వెల్లడిస్తున్నాయి.ఆమోదం పొందిన బిల్లు ఒక్కటే!నిజానికి, ఈ శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలకు విలువైన పెద్ద ఎజెండానే సిద్ధం చేశారు. మొత్తం 16 బిల్లుల్ని ప్రవేశపెట్టిఅందులో మెజారిటీ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని అధికార కూటమి భావించింది. కానీ, విమానయాన రంగానికి సంబంధించిన ‘భారతీయ వాయుయాన్‌ విధేయక్, 2024’ బిల్లు ఒక్కటే ఉభయ సభల ఆమోదం పొందగలిగింది. ఆర్థిక రంగానికి సంబంధించి మొదటి విడత సప్లిమెంటరీ గ్రాంట్స్‌ కూడా ఆమోదం పొందవలసి ఉన్నాయి. అయితే కొన్ని బిల్లులు లోక్‌సభలో, మరి కొన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి దానిని జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. దేశ ప్రయోజనాల రీత్యా అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి రావా ల్సిన కీలక అంశాలపై కూడా అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రాలేని అవమానకర దు:స్థితి నెలకొంది.చట్టసభలు క్రియాశీలంగా లేకపోవడం అంటే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే. ‘చర్చల ద్వారా పాలన సాగించడమే ప్రజా స్వామ్యం’ అని పలువురు రాజనీతిజ్ఞులు చెప్పిన మాట మన దేశంలో క్రమేపి నవ్వులాటగా మారుతోంది. పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి పురుడుపోసిన ఇంగ్లాండ్‌ పార్లమెంట్‌ భారత్‌తో సహా అనేక దేశాలకు ఆదర్శప్రాయం. వెస్ట్‌మినిస్టర్‌ తరహా పాలనను అనుసరిస్తున్నామని చెప్పుకోవడమే తప్ప... నిజానికి మన పార్ల మెంటరీ పద్ధతులు, విధానాలు ఇంగ్లాండ్‌కు భిన్నంగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌ పార్లమెంట్‌లో ప్రతిపక్షాల చర్చలకు ప్రత్యేకంగా 20 రోజులు కేటాయించే అవకాశాన్ని వారి రాజ్యాంగం కల్పించింది. ప్రధాన ప్రతిపక్షానికి 17 రోజులు, ఇతర విపక్ష పార్టీలకు 3 రోజులు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా, 40 మంది సభ్యుల మద్దతు కూడగడితే వారు కోరిన అంశాన్ని అనివార్యంగా సభ చర్చకు స్వీకరించాల్సిందే. మన పార్లమెంట్‌లో అటువంటి నిబంధనగానీ, ఆనవాయితీగానీ లేవు. నిజానికి మన రాజ్యాంగ కర్తలు భవిష్యత్తులో చట్టసభలలో విపరీత పరిణా మాలు చోటుచేసుకొంటాయని ఆనాడు ఊహించలేదు. విపక్షాలు నిరసన తెలపడం, వాకౌట్‌ చేయడం వారి హక్కుగా, ప్రజాస్వామ్యంలో ఓ భాగంగానే భావించారు గానీ... రోజుల తరబడి చట్టసభలు వాయిదా పడతాయనీ, బిల్లులు చర్చకు నోచుకోకుండా గిలెటిన్‌ అవుతాయనిగానీ వారు అంచనా వేయలేకపోయారు.కారణాలు ఏవైనా పార్లమెంట్‌ ఔన్నత్యం, ప్రతిష్ఠ నానాటికి తగ్గడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాప్రతినిధులు సభల నుంచి వాకౌట్‌ చేసి క్యాంటీన్లలో, లాబీల్లో కాలక్షేపం చేయడం సహించరానిది. చర్చకు నోచుకోకుండా బిల్లులు చట్టాలైతే అవి ప్రజలకు గుదిబండలుగా మారతాయి. అందువల్ల పార్లమెంట్‌ క్రియాశీలకంగా మారాలి. చట్టసభలు క్రియాశీలంగా పని చేయ డానికి, సభ్యుల చురుకైన భాగస్వామ్యానికి అవసరమైన సంస్కరణలు తక్షణం చేపట్టాలి. అందుకు అన్ని పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించాలి. లా కమిషన్‌కు కూడా బాధ్యత అప్పగించాలి. ఆ విధంగా పాతాళానికి పడిపోయిన పార్లమెంట్‌ ప్రతిష్ఠను పున రుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. చట్ట సభలు అలంకార ప్రాయంగా మారిపోవడాన్ని ప్రజలు ఇకపై ఎంత మాత్రం సహించరని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసనమండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
అమెరికా దిగువసభలో నలుగురు హిందువులు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలతోపాటు జరిగిన పార్లమెంట్

title
యుద్ధభూమిలో రక్తమోడుతున్న రష్యా 

గుడ్లురిమి చూస్తూ పొరుగుదేశం ఉక్రెయిన్‌పైకి దురాక్రమణ జెండాతో దూసుకొచ్చిన రష్యా ఇప్పుడు యుద్ధభూమిలో నెత్తురోడుతోంది.

title
విమానంలోనూ వైఫై

దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్‌ ఫోన్లో ఫ్లైట్‌ మోడ్‌ ఆన

title
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..

మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్‌ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని..

title
తడబడ్డ కమలాహారిస్‌..వీడియో వైరల్‌

వాషింగ్టన్‌:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ తడబడ్డారు.

NRI View all
title
భావ వైవిధ్యం.. అన్నమయ్య సంకీర్తనా గానంపై నాట్స్ వెబినార్

title
అమెరికాలోనూ ‘చాయ్‌.. సమోసా’

‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేం

title
న్యూ ఇయర్‌ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్,  రాస్ అల్ ఖైమాలో  జరిగిన చిన్న ప్రైవేట్  విమాన ప్రమ

title
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్‌ఆర్‌ఐకు జైలు, జరిమానా

మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన  27 ఏళ్ల వ్యక్తికి  సింగపూర్‌  కోర్టు జైలు

title
సుచీర్‌ బాలాజీ కేసులో షాకింగ్ ‌ట్విస్ట్‌!

ఓపెన్‌ఏఐ విజిల్‌బ్లోయర్‌

Advertisement

వీడియోలు

Advertisement